పండుగ స్పెషలు

7 Oct, 2019 11:41 IST|Sakshi

రేపు మా స్కూల్లో వ్యాస రచన పోటీలట. ఫస్టు సెకెండు థర్డు ఫారం పిల్లలం ‘ఎ’ గ్రూపు. హైస్కూలు పిల్లలు ‘బి’ గ్రూపు. సాయంత్రం నాలుగు నించీ అయిదు దాకా. దేని మీద రాయాలో అప్పటికప్పుడే చెప్తారట. ముందుగా తెలిస్తే నాన్నల చేత రాయించేసుకుంటాం కదా! అందులో ఎలాగైనా ప్రైజు తెచ్చుకోవాలని నా ఆశ.
దేనిమీదడుగుతారబ్బా! వార్తా పత్రికలు, గ్రంథాలయములు, విహార యాత్రలు, కత్తి గొప్పదా? కలం గొప్పదా? స్త్రీకి విద్య అవసరమా? ఇలాటివేగా! వాళ్లేదడిగినా కొన్ని వాక్యాలూ సామెతలూ రాసుకునుంచుకుంటే అప్పటికప్పుడు గబుక్కున వాడేసుకోవచ్చు. తల్లిదండ్రులను పూజింపవలెను, గురువే దైవము, విద్యలేనివాడు వింత పశువు...
ఈవేళాదివారం కదా! ఉప్మా పెసరట్లు శుబ్బరంగా మెక్కి చిన్నారీ ఇందూ బుజ్జీ నాన్నా కోవటి దివాళా ఆడుకుంటున్నారు. నేనేవో స్కూలు పాఠాలు చదువుకుంటున్నాననుకుని అమ్మ వచ్చి ‘‘అచ్చ బంగారాలే! ఇన్నోటి చదువులే!’’ అంటూ నా తలమీద తడిచేత్తో వూరికే అలా రాసేస్తూ జుట్టంతా రేపేసింది.
అసలెప్పుడోగానీ అమ్మ నన్ను ముట్టుకోదు. ఇంత గారాం ఎందుకు చేస్తోందబ్బా! ఏమోలే సవిత్తల్లి గాదుగా! మొన్న అలా అడిగానని కళ్లు ఎర్రబడేలా ఏడ్చింది కూడా!
‘‘అదయిపోయాక ఓసారి నడవలోకి రా! మంచిమాట చెప్తా’’ అంది.
‘‘ఏవిటి? బొబ్బట్లు చేస్తున్నావా?’’
‘‘అస్తమానం తిండి రంధేనా! ఆడ పిల్లలలా వుండకూడదు’’ అంటూ వెళ్లిపోయింది. ఎంచక్కా చదువులాంటిది చేద్దామని కూచుంటే ఈవిడగారొచ్చి రహస్యం చెప్తా రా అంటే ఇంక నాకు కాలేం నిలబడుతుంది.
సందులో హాయిగా మడత మంచం వాల్చుకుని మోచెయ్యి అనించుకుని వత్తిగిలి పడుకుని నాకోసం గుమ్మంకేసి చూస్తోంది. ఈవేళ ఉప్మాపెసరట్టాదివారం కదా! అమ్మకి మధ్యాహ్నం పెద్ద వంట పనుండదు. అన్నం ఒక్కటే చేస్తుంది. అందరూ ఆవకాయ పెరుగు తినాల్సిందే ఏ రెండింటికో!
‘‘నాని బంగారాలూ! మనం సినిమాకెళ్లి ఎన్నాళ్లయిందే?’’
‘‘అదా సంగతి నా తల్లీ! దొరికావు. ఎందుకా వున్నట్టుండి నన్ను పిలిచావనుకున్నా. కిందటాదివారం కాక ఆ ముందటి వారం’’ అన్నా.
‘‘కాదు పిచ్చీ! మధ్యలో రెండాదివారాలు వెళ్లి పోయాయి. నువ్వేమో కొత్త క్లాసు హడావిడిలో మర్చేపోయావు. మహాబాగు అన్నట్లు నాన్న ఆ విషయమే ఎత్తట్లేదు!’’
‘‘అవును నిజమేనే. మనందరం సినిమాకెళ్లి చాలా రోజులయింది. కానీ నాన్నతో నువ్వు మాట్లాడేందుకు నా రికమెండేషను కావాలా? నా పేరెందుకు బయటికి రావాలి? నీకు వెళ్లాలనుంటే నువ్వే అడుక్కో. నేనసలే వ్యాసరచన పోటీకి తయారవాలి కదా!’’
‘‘నీకు బోల్డు సూక్తులు సామెతలు నిమిషంలో నే చెప్తాగా! నేను గానీ సినిమా కెడదావంటే నాన్న ఇంగ్లీషు సినిమా అంటారు. దేవదాసు చూడాలనుందంటే అసలు వినరు. అది ఏడుపు సినిమాట.’’
‘‘అయినా ఏడుపు సినిమా చూడాలని నీకు సరదా ఎందుకు?’’
‘‘ఆ సినిమా బాగుంటుందే! నాన్న నొప్పించే పూచీ నీది. రాత్రి బోయినాలలోకి పాయసం చేసే పూచీ నాది. సరేనా?’’
వెంటనే బయలుదేరా.
‘‘నాన్నా! మాకిచ్చిన మాటలన్నీ మర్చిపోయి ఏవిటా పేకాట అసయ్యంగా!’’
‘‘అమ్మ చెప్పిందేవిటే నీకు? అలా మాట్లాడాలని?’’
‘‘నాకు రాదేవిటి ఎలా మాట్లాడాలో! పోనీమని మంచి నాన్నవి కదాని గొడవపెట్టకుండా వుంటే మూడాదివారాలు వెళ్లిపోయినా సినిమా పేరెత్తరు.’’
‘‘ఆల్‌రైట్‌రా బాబా. నీమాటే కానిద్దాం. ఏ సినిమా అయినా సరే దేవదాసు తప్ప!’’
‘‘మనకదే వీలు నాన్నా. మావయ్యగారి చేత ఫోను చేయిస్తే టికెట్లుంచుతారు. రిక్షా ఖర్చుండదు. పైగా అమ్మకి అదే చూడాలనుందిట.’’
సరేనని నాన్నని ఒప్పించాను. ఇంక పాపం అమ్మ మేం అన్నాలు తినడం అవగానే పాయసం చేసి నాకు చూపించి మరీ అలమార్లో పెట్టింది, ఆ గిన్నె కింద నీళ్ల కంచం పెట్టి. నాలుగవగానే ఒక్కొక్కళ్లమే జడలేసుకుని తయారవుతున్నాం. ఇంతట్లో చందర్రావొచ్చాడు సైకిలు తొక్కుకుంటూ యములాడిలా!
‘‘ఏం నాయనా అదివారం అయిదింటికి రొప్పుకుంటూ మరీ వచ్చావు. ఏదైనా సినిమాకు అఘోరించకపోయావా?’’
‘‘పాపమ్మ గోరూ! సిమెంటు లారీలొత్తాయని నన్నక్కడ కూకోబెట్టేశారు కదా! విజీవాడ్నించి రెండు లోడ్లొచ్చేసినాయ్‌. సెప్దారని వచ్చినా.’’
నే వెనక్కి తిరిగి చూసేటప్పటికే నాన్న పాంటు షర్టు మార్చేసుకుని, ‘‘చంద్రరావూ! సైకిలు నాకిచ్చేసి నువ్వు నడిచి రారా’’ అని ఇప్పుడే వచ్చేస్తానని, రయ్య్‌మని వెళ్లిపోయారు. ఇంకేవుంది! సినిమా టయం అయిపోయినా పత్తాలేరు. దేవదాసు కొండెక్కాడు. మేం సినిమా కెళ్లాక ఆ లారీలు తగలడితే ఈ వెధవ మా కోసం సినిమాహాళ్లన్నీ వెతికేవాడా! కోపంగా వెళ్లి వీధిగది కిటికీలో కూచున్నా.
‘‘అనుకోకుండా పని పడితే నాన్న మాత్రం ఏం చేస్తారే పాపం! మళ్లీ ఆదివారం వెడదాంలే. నీ వ్యాసరచన పోటీలున్నాయన్నావుగా. పాయింట్లు రాసుకో నే చెప్తా’’ అమ్మ సర్దబోయింది.
‘‘ఏం అక్కర్లా. నేనెప్పటికీ అస్సలు సినిమాలే చూడను. మీతో కలిసి అస్సలు చూడను. వార్తలు వినాలి పార్కుకెడుతున్న. నాన్నొచ్చాక కనపడమను.’’
‘‘ఎంత పొగరే నీకు? నాన్న నీకు కనబడాలా? అక్కడే పండు. నే రమ్మనే దాకా రాకు.’’
పరిగెత్తుకుంటూ పార్కుకెళ్లా. అప్పటికే వార్త లొచ్చేస్తున్నాయి రేడియో గొట్టంలో. నేనసలు వార్తలు వినను. అవి వింటూ తలెత్తి గొట్టంకేసి చూస్తూ నిలబడుంటారే పెద్దవాళ్లంతా వాళ్లని చూడ్డం నాకు సరదా. ఎవరైనా వార్తలు మొఖంతో వింటారా, మెడలు నొప్పెట్టేలా? అయినా నాకెందుకులే ఎవరి వీలు వాళ్లది. చీకటి పడిపోయింది. పిల్లలందరూ ఇళ్లకెళ్లిపోయారు. ఒక్కదాన్నే బెంచీమీద కూచున్నా. ఇంకాసేపు కూచుంటే భయం కూడా వేస్తుంది. అమ్మేమో ఇక్కడే పడుండమందిగా. నేనెళ్లిపోతే ఎంత పరువు తక్కువ. అమ్మయ్య! ప్రభువు చల్లగా చూసినట్లున్నాడు. చందర్రావొచ్చాడు.
‘‘అయగారు తమర్నింటికి తీసుకురామ్మని అంపేరండి.’’
‘‘ఆయన్నే రమ్మను. నన్నమ్మిక్కడే పడుండమంది.’’
పది నిమిషాల్లో నాన్న వచ్చారు. ‘‘ఏంట్రా నానీ. ఈ అల్లరి. మిగతావాళ్లంతా నీలా పేచీ పెడుతున్నారా? మళ్లీ ఆదివారం వెడదాంగా!’’
‘‘అందరి బదులూ పేచీలు పెట్టేదాన్నని పేరు తెచ్చుకునేందుకు నేనున్నాగా నాన్నా. ఆదివారం నాడు నేననుకున్నది జరగకపోతే వారం అంతా నాకలాగే ఉంటుంది. రేపు వ్యాసరచన పోటీలో ప్రైజేరాదు. రెండో ఆట టికెట్లు తెప్పిస్తేనే ఇంటికొస్తా.’’ నాన్నతో అయితే ఏదైనా చెప్పేయ్యచ్చు. పెద్ద ప్లానెయ్యక్కర్లా.
‘‘నీకన్నీ అమ్మ బుద్ధులేనే. ఒరే చంద్రరావ్, రెండో ఆటకి అయిదు కుర్చీ టికెట్లు తీసుకురా!’’ నాన్న డబ్బులిచ్చాక అప్పుడు లేచా.
‘‘నాన్నా మీరిద్దరూ ఎవరికి వాళ్లు తిన్నగా తిట్టుకోండి. అంతేగానీ అన్నీ నాన్న బుద్ధులే అని అమ్మా, అన్నీ అమ్మ బుద్ధులే అని మీరు అంటే నే పడేది లేదు. అసలే పెద్దదాన్ని కూడా అవుతున్నా!’’
నేనూ నాన్నా ఇంటికెళ్లేటప్పటికి అమ్మ అప్పుడే వంటిల్లు కడిగేసి వంటంతా మధ్య గదిలో పెట్టింది. మంచాలు పక్కలు రెడీగా వున్నాయి. చివరికి నాన్న మంచం కింద మంచినీళ్ల చెంబు కూడా పెట్టుంచింది. తాళం కప్పా చెవీ వీధి గుమ్మానికి తగిలించింది. నే సాధించుకొస్తానని ఈవిడకి తెలియదంటే ఎవరు నమ్ముతారు? 
- డా. సోమరాజు సుశీల
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా