పొగ పెడతాడు 

31 May, 2020 04:24 IST|Sakshi

నేడు వరల్డ్‌ నో టొబాకో డే

‘పొగ తాగి పొగచూరిపోకు... పండు తిని పండులా ఉండు’ అని అరటిపండ్లు చేతిలో పెడతాడతడు.  ‘‘మంచి మాటనైనా సరే ఊరికే చెబితే ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు. చేతిలో ఒక బిస్కట్టో, పండో పెట్టి చెబితే... నేను వెళ్లి పోయిన తర్వాత కూడా నా మాటలు గుర్తుంటాయి. కనీసం నేనిచ్చిన బిస్కెట్, పండు వాళ్ల చేతిలో ఉన్నంతసేపైనా నా మాట గుర్తుంటుంది’’ అంటాడు మాచన రఘునందన్‌. అతడు ప్రభుత్వ ఉద్యోగి. మహబూబ్‌నగర్, సివిల్‌ సప్లయిస్‌లో డిప్యూటీ తాసిల్దార్‌. ఉద్యోగం చేసుకుంటూనే ధూమపానం మానేయమని కనిపించిన వారికందరికీ చెబుతాడు. వాళ్లకై వాళ్లే చేతిలో ఉన్న సిగరెట్‌ని పారేసే వరకు చెవిలో పొగపెడతాడు.

పొగతాగని వాళ్ల నరకం 
రఘునందన్‌ది తెలంగాణ రాష్ట్రం మేడ్చల్‌ జిల్లా, కేశవరం. ఉండేది హైదరాబాద్‌లో. ఓ రోజు బోయినపల్లి నుంచి సికింద్రాబాద్‌కి సిటీబస్సులో వెళుతుండగా... బస్సు డ్రైవర్‌ సిగరెట్‌ తాగుతున్నాడు. ఆ వెనుక సీట్లో ఒక తల్లి చంటిబిడ్డతో ఉంది. సిగరెట్‌ పొగ తల్లీబిడ్డలకు వ్యాపిస్తోంది. చీర కొంగుతో బిడ్డకు విసురుతూ, మరో చేత్తో తాను ముక్కు మూసుకుందామె. అదే విషయాన్ని డ్రైవర్‌తో చెబితే సిగరెట్‌ తాగకుండా బస్సు నడపడం తన వల్ల కాదన్నాడు. బస్సు నంబరు నోట్‌ చేసుకుని డిపో మేనేజర్‌కి తెలియచేశాడు రఘునందన్‌. అంతటితో ఆగిపోకుండా బస్‌స్టేషన్లలో సిగరెట్‌ల అమ్మకాన్ని కూడా నియంత్రించాలని కోరుతూ 2010లో ఆర్టీసీ ఎండీకి ఉత్తరం రాశాడు. తన ప్రయత్నమైతే చేశాడు కానీ, ఎండీ నుంచి సానుకూలమైన స్పందన వస్తుందని ఊహించలేదతడు. ఎండీ సంతకంతో రఘునందన్‌ ప్రయత్నాన్ని అభినందిస్తూ పెద్ద సమాధానమే వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా బస్‌స్టేషన్‌లలో బహిరంగ ధూమపాన నిషేధం ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.

భార్యకు నచ్చిన గుణం 
రఘునందన్‌ ధూమపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న విషయాన్ని భార్యకు పెళ్లి చూపుల్లోనే చెప్పాడు. ‘‘నేను చెప్పినప్పుడు మా శైలజ పెద్దగా స్పందించలేదు. కానీ ఆమె తనలో తాను ‘ఇతడికి స్మోకింగ్‌ అలవాటు లేదు, భవిష్యత్తులో కూడా అలవాటు చేసుకోడని నమ్మవచ్చు’ అనుకుందట. ఇప్పుడు నేను పొగతాగే వాళ్లందరికీ మానేయమని చెప్తుంటే ‘ఆ సంగతి వాళ్లకు తెలిసిందే కదా, ఎంతమందికని చెప్తారు... అని అప్పుడప్పుడూ అంటూ ఉంటుంది కానీ గట్టిగా అడ్డు చెప్పదు. ‘స్టాప్‌ స్మోకింగ్‌... స్టార్ట్‌ లివింగ్, లివ్‌ లైఫ్‌... లీవ్‌ టొబాకో’ పేర్లతో రెండు ఫేస్‌ బుక్‌ పేజీలు, వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా కూడా ప్రచారం చేస్తున్నాను. నా ప్రయత్నం ఆగదు. నా కంటిముందు ఎవరు పొగతాగుతూ కనిపించినా చేతులెత్తి దణ్ణం పెట్టి మానేయమని అడుగుతూనే ఉంటాను’’ అన్నాడు రఘునందన్‌. – వాకా మంజులారెడ్డి; ఫొటో: అనిల్‌

మరిన్ని వార్తలు