వయసు 87 ఇమేజ్‌.. సినిమాస్టార్‌

14 Jun, 2020 05:18 IST|Sakshi
‘ఫొటోగ్రాఫ్‌’ సినిమాలో ఫరూక్‌ జాఫర్‌

87 ఏళ్ల వయసులో కూడా ఆమె మేకప్‌ వేసుకుంటోంది. స్టార్ట్‌ కెమెరా అనగానే డైలాగులు చెబుతోంది. కట్‌ చెప్తే తర్వాతి డైలాగ్‌ ఏంటని సీన్‌ పేపర్‌ అందుకుంటోంది. అందరూ అభిమానించే ఈ నటి పేరు ఫరూక్‌ జాఫర్‌. తాజాగా ‘గులాబో సితాబో’లో ఆమె అమితాబ్‌కు బేగంగా నటించింది.

ఇప్పుడు అరవై, డెబ్బయి ఏళ్లంటే పెద్ద విషయం కాదు. కాని 75 దాటాక పూర్తిగా విశ్రాంతిని కోరుకునేవారే ఎక్కువమంది ఉన్నారు. కాని 80 దాటాక కూడా హుషారుగా సినిమాల్లో నటిస్తూ అభిమానులను సంపాదించుకుంటోంది ఫరూక్‌ జాఫర్‌. అమ్మమ్మగా, నానమ్మగా, ముసలమ్మగా ఆమె చేస్తున్న పాత్రలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కొన్ని సినిమాలలో ఆమెను దృష్టిలో పెట్టుకునే పాత్రలు సృష్టిస్తున్నారు. తాజాగా డిజిటల్‌ రిలీజ్‌ అయిన ‘గులాబో సితాబో’లో ఆమె లక్నోకు చెందిన ఒక రాజకుటుంబీకురాలిగా నటించింది. ఆమె భర్తగా అమితాబ్‌బచ్చన్‌ నటించాడు. అంతటి దిగ్గజం ముందు కూడా బెరుకు లేకుండా డైలాగులు చెప్పి మెప్పించిందామె.

లక్నో స్టార్‌
ఫరూక్‌ జాఫర్‌ది లక్నో. అక్కడి నవాబీ ముస్లింల కుటుంబంలో పుట్టింది. వివిధ భారతి లక్నో స్టేషన్‌లో మొదటి మహిళా అనౌన్సర్‌గా 1963లో పని చేసింది. ఏ ట్రయినింగ్‌ లేకపోయినా తన ప్రతిభతో రాణించింది. ఆ తర్వాత ఢిల్లీలో ఉర్దూ అనౌన్సర్‌గా పని చేసింది. 1970లో కుటుంబ కారణాల రీత్యా ఉద్యోగం వదిలిపెట్టి తిరిగి లక్నో చేరుకుంది. ఆమె భర్త రాజకీయాలలో పనిచేశాడు. ఎం.ఎల్‌.సిగా రెండుసార్లు పదవి నిర్వహించాడు. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. వారిలో ఒకమ్మాయి– మెహ్రూ జాఫర్‌ రచయిత్రి.

ఉమ్రావ్‌జాన్‌
యాభై ఏళ్ల వరకు కుటుంబ జీవనంలో ఉన్న ఫరూక్‌ జాఫర్‌ను లక్నోకే చెందిన సినిమా దర్శకుడు ముజఫర్‌ అలీ ఒక గెట్‌ టుగెదర్‌లో చూశాడు. ఆమె మాట్లాడే పద్ధతి చూసి తాను తీయబోతున్న ‘ఉమ్రావ్‌జాన్‌’లో వేషం ఆఫర్‌ చేశాడు. అప్పటికి ఫరూక్‌ జాఫర్‌కు దాదాపు 50 ఏళ్లు. వాళ్ల ఇళ్లలో మగవాళ్లు కూడా పెద్దగా సినిమాలు చూడరు. కాని ఆమెకు వచ్చిన ఆవకాశాన్ని వారు ప్రోత్సహించారు. అలా ‘ఉమ్రావ్‌ జాన్‌’ (1981)లో రేఖకు తల్లిగా నటించింది. ఆ సినిమా ఆమెకు పేరు తెచ్చింది. కాని లక్నోలోనే ఉండిపోవడం వల్ల సినిమాల్లో కొనసాగలేదు.

పీప్లిలైవ్‌
చాలా ఏళ్ల తర్వాత మళ్లీ షారుక్‌ ఖాన్‌ నటించిన ‘స్వదేశ్‌’(2004)లో నటించిందామె. ఆ తర్వాత ‘పీప్లిలైవ్‌’, ‘సుల్తాన్‌’, ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ సినిమాల్లో నటించింది. ఇప్పుడు ‘గులాబో సితాబో’లో ముఖ్యపాత్ర పోషించింది. ‘ముగ్గురు ఖాన్‌లతో నటించాను నేను. సుల్తాన్‌లో నటించేటప్పుడు సల్మాన్‌ఖాన్‌ను తొందరగా పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడివికా అని ఆశీర్వదించాను. బాబోయ్‌ అలా ఆశీర్వదించకండి అని భయపడిపోయాడు’ అని నవ్వుతుందామె. ఫరూక్‌ జాఫర్‌ మాటలో, నవ్వులో, డైలాగ్‌ చెప్పే పద్ధతిలో ఏదో సహజత్వం, ఆకర్షణ కనిపిస్తాయి. ఆమె నవ్వు మనోహరంగా, కొంటెగా ఉంటుంది. ఆమె లోపలి సౌందర్యం ఏదో పైన మెరుస్తూ ఉంటుంది. అందుకే ఆమె పాత్ర వేస్తే ఆ పాత్రకు ఆమెదైన చేర్పు వస్తుంది.                    


‘గులాబో సితాబో’లో అమితాబ్‌ బచ్చన్‌


నవాజుద్దీన్‌ సిద్ధికీతో ఫరూక్‌ జాఫర్‌

>
మరిన్ని వార్తలు