ఆలియా

20 Jun, 2018 00:45 IST|Sakshi

చెట్టు నీడ

‘తాతయ్యా... ఎవరు వీళ్లు?’ అంది మెడ చుట్టూ గట్టిగా చేతులు వేసి.‘ఏడవకు. వాళ్లంతా చెడ్డవాళ్లు’ అని చెప్పాడు తాతయ్య. ‘చనిపోయాక కూడా చెడ్డవాళ్లేనా తాతయ్యా..’ ఏడుపు ఆపుకుంటూ అడిగింది ఆలియా! ఈసారి తాతయ్య ఏడుపును ఆపుకున్నాడు. 

పైనెక్కడో స్వర్గం ఉంటే ఉండనివ్వండి. ఎవరిక్కావాలది భూమ్మీద మనకో ఇల్లుంటే! సొంతఇల్లేం కాదు. సొంత మనుషులతో ఉన్న ఇల్లు. అది చాలు. దేవుణ్ణే దిగిరమ్మని పిలిచి ఆతిథ్యం ఇవ్వొచ్చు. దేవుణ్ణి ఇల్లంతా తిప్పి చూపించవచ్చు. ‘దేవుడా ఇది హాలు. అది కిచెన్‌. ఇదిగో నీ గది. అందులో నీ పటం. తినని రోజు ఉంటుందేమో. నీ పటం ముందు నిలబడని రోజు ఉండదు మాకు’ అని ఆయనక్కూడా కాస్త కుంకుమ అద్దొచ్చు. దేవుణ్ణి కాసేపలా మొక్కల మధ్యలోకి తీసుకెళ్లొచ్చు. దేవుడు ఊరికే చూస్తుంటాడు. అతిథి కదా. అది మన ఇల్లు కదా!  ఆలియాకు కూడా ఇలాంటి ఇల్లే ఉండేది. ఆలియా ఏడేళ్ల పిల్ల. అలెప్పోలో వాళ్ల ఇల్లు. సిరియా! ఆ ప్రాంతంలోనే కొంత దూరంలో నానమ్మ, తాతయ్యల ఇల్లు. రెండు స్వర్గాలు ఆలియాకు. ఓ రోజు ఆలియాను చంకనేసుకుంది తల్లి. ‘ఎక్కడికమ్మా!’.. అడిగింది ఆలియా. ‘ఇల్లొదిలి వెళ్లిపోతున్నాం’ అంది. ఇల్లొదిలి వెళ్లిపోతున్నామనే చెప్పింది. ఊరొదిలీ, దేశం వదిలీ వెళ్లిపోతున్నాం అని చెప్పలేదు. ముందు నానమ్మ వాళ్లింట్లో వదిలిపెట్టింది. అక్కడ మళ్లీ తాతయ్య ఆలియాను చంకనేసుకున్నాడు. తాతయ్య కూడా అమ్మ చెప్పినట్లే చెప్పాడు. ‘మనం ఇల్లొది వెళ్లిపోతున్నాం’ అని! రెండిళ్లూ పోయాయి. పోయిన స్వర్గాల గురించి ఆలోచించే వయసా అది. వెళ్లిన చోట ఇంకో స్వర్గం. అంతే కదా పిల్లలు. కొత్త ప్రదేశాల కన్నా కూడా కొత్త ప్రదేశాలకు  కదలడాన్ని ఇష్టపడతారు. 

తాతయ్య భుజం ఎక్కి కూర్చుంది ఆలియా. కుటుంబం అంతా నడుస్తోంది. నడుస్తోంది. నడుస్తోంది. దారి పొడవునా తాతయ్య కాళ్లకు మనుషులు తగులుతున్నారు. మనుషులు కాదు. తునాతునకలైన మనుషులు. కాళ్లూ చేతులు లేనివి కొన్ని. తలలూ మొండేలు లేనివి కొన్ని. మనవరాలికి నేల కనిపించకుండా ఆకాశాన్ని చూపిస్తున్నాడు తాతయ్య. ఎంతసేపని ఆకాశంలోకే చూస్తుంది. ఆమె చూపు నేలను తాకింది. పెద్దగా ఏడుపందుకుంది ఆలియా. ‘తాతయ్యా... ఎవరు వీళ్లు?’ అంది  మెడ చుట్టూ గట్టిగా చేతులు వేసి. ‘ఏడవకు. వాళ్లంతా చెడ్డవాళ్లు’ అని చెప్పాడు తాతయ్య. ‘చనిపోయాక కూడా చెడ్డవాళ్లేనా తాతయ్యా..’ ఏడుపు ఆపుకుంటూ అడిగింది ఆలియా! ఈసారి తాతయ్య ఏడుపును ఆపుకున్నాడు. 

ఇప్పుడు లెబనాన్‌లోని దేమర్‌లో ఉంటోంది ఆలియా, తాతయ్య.. ఇంకా అమ్మ, నాన్న. అలెప్పోలో తన స్నేహితురాలిని వదిలొచ్చి సరిగ్గా ఏడాది అవుతోంది ఆలియా. ఆ స్నేహితురాలి పేరు రవుయా. తనను మర్చిపోలేకపోతోంది. కలిసి ఆడుకునేవారు. కలిసి స్కూలుకు వెళ్లేవారు. కొన్ని పావురాలు ఉండేవి. వాటిల్లో కొన్ని గుడ్లు కూడా పెట్టాయి. ఆ పావురాలకు ఆలియా గింజలు వేసేది. ఇప్పుడు వాటన్నిటినీ తలుచుకుని బెంగపడుతోంది. వాటి గురించి దేవుణ్ణి ప్రార్థిస్తోంది. వాటి గురించే కాదు, ఆ రోజు తాతయ్య భుజం మీద నుంచి చూసిన మృతదేహాల గురించి కూడా! ఇప్పుడు తెలుస్తోంది ఆలియాకు అలñ ప్పోలో తనకు రెండు స్వర్గాలు ఉండేవని. శరణార్థులకు అందే సహాయం ఆలియా కుటుంబానికి కూడా అందుతోంది. మంచి తిండి ఉంది. మంచి బట్టలు ఉన్నాయి. మంచి స్వర్గమే లేదు. ఆలియా ఓ పిల్లి పిల్లను పెంచుకుంటోంది. అదెప్పుడూ ఆలియా ఒంటి మీదే ఉంటుంది. ఆ పిల్లితో ఆలియా ఎప్పుడూ అంటుండే మాట.. ‘అలా మ్యామ్‌ మ్యావ్‌ మంటూ అరవకు. త్వరలోనే మన ఇంటికి మనం వెళ్లిపోతాం’ అని! ఈ రోజు ‘ప్రపంచ శరణార్థుల దినం’. ప్రపంచం మొత్తం మీద రెండు కోట్ల ఇరవై లక్షల మంది శరణార్థులు ఉన్నారు. ఆలియాకు ఉన్నట్లే.. రెండు కోట్ల ఇరవై లక్షల కథలున్నాయి.
– మాధవ్‌ శింగరాజు 

మరిన్ని వార్తలు