రెండో సీసా

29 Aug, 2018 00:17 IST|Sakshi

అస్తి హత్యలు చేయిస్తుంది. ఒక్కోసారి అపరాధులు ఎవరో నిరపరాధులు ఎవరో తెలియని కన్ఫ్యూజన్‌లో కూడా పడేస్తుంది.మహబూబాబాద్‌ జిల్లా. తొర్రూర్‌.2014, అక్టోబరు 4. రాత్రి 8 గంటలు.నిజానికి అందరూ భోజనాలు ముగించి నిద్రకు ఉపక్రమించే టైమ్‌ అది. కానీ ఊరు కంగాళీగా ఉంది. సగం ఊరు ఆ ఇంటి ముందు భోజనం సంగతి మరిచి గుమికూడి ఉంది. ఆ ఇంటి ముందున్న కరెంట్‌ పోల్‌కి లైట్‌ వెలుగుతూ ఆరుతూ చికాకు పెడుతోంది.పడీ పడని వెలుతురులో ఆ ఇంటి వసారాలో పడి ఉన్న రెండు మృతదేహాలు భయం గొలిపేలా ఉన్నాయి. రెండూ పురుషులవి. కాసేపటి క్రితం ప్రాణాలతో ఉండి ఇప్పుడు చలనం లేని దేహాలు.ఇంటామె అప్పుడే షాక్‌ నుంచి బయట పడ్డట్టుంది... జరిగిన దారుణానికి కడుపు తరుక్కుపోయే లా శోకాలు పెడుతోంది. ‘ఓరి నా మొగుడో... అయ్యో నా తమ్ముడో’కాని గుంపుకు జాలి కలగడం లేదు.జవాబుగా గుంపు గుసగుసలు పోతూ ఉంది.‘చేసిందంతా చేసి ఎలా ఏడుస్తోందో చూడు.’‘కొడుకుతో కలిసే ఈ పని చేసి ఉంటుంది’ ‘ఎన్నాళ్ల నుంచి చూస్తున్నాం ఈ గొడవలు..’‘అంత మాత్రానికే ఇంత పని చేస్తారా?!’సడన్‌గా గ్రామస్తులకు కోపం పెరిగింది.

‘వీళ్లకు తగిన శాస్తి చేస్తే గాని బుద్ధి రాదు...’ముందుకు కదిలారు నలుగురు వ్యక్తులు ఆమె జుట్టు పట్టుకోవడానికి. తోడు ఇంకొందరు కదిలారు. ఇది గమనించిన ఇంటామె అక్కడే చేష్టలిడిగి నిలుచుని ఉన్న ఆమె కొడుకుతో పరిగెత్తుకెళ్లి తలుపులేసుకుంది. ఆ తలుపులు విరిగిపడతాయేమో అన్నంతగా ‘దఢేల్‌ దఢేల్‌..’మని కొడుతున్నారు గుంపులోని వాళ్లు. పోలీసులు అడ్డురాకపోతే ఆ ఊరి వాళ్ల కోపానికి ఆ ఇంటి సభ్యుల ప్రాణాలు గాల్లో కలిసేవే! కాస్తలో తప్పింది. ఆ ఇద్దరి మీద ఆ ఊరివాళ్లకు ఎందుకంత కోపం వచ్చింది? ఆ కింద పడి ఉన్న ఆ ఇద్దరిని ఎందుకు చంపి ఉంటారు?ఎవరూ చెప్పడం లేదు.

ఊరి జనాన్ని కంట్రోల్‌ చేసే పనిలో పడ్డారు పోలీసులు.అంబులెన్స్‌ సిబ్బంది కిందపడి ఉన్న ఇద్దరు వ్యక్తులను పరీక్షించి ‘వారు చనిపోయారు సార్‌’ అన్నారు ఎస్సైతో. శవాలను ఆసుపత్రికి తరలించారు. ఇంటి దగ్గర విచారణ కష్టంగా అనిపించడంతో ముందుగా ఆ ఇంట్లో వాళ్లను అక్కణ్ణుంచి తీసుకెళ్లి పంచాయితీ హాల్లో కూర్చోబెట్టారు. ఊళ్లో నలుగరు పెద్దవాళ్లను అక్కడ ఉంచి, మిగతావారిని ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోవాలని హెచ్చరించారు. పోలీసుల ప్రతాపానికి జyì సిన జనం పలచబడ్డారు. కానీ, కాసేపటికి పంచాయితీ హాల్‌ వద్దకూ జనం మెల్లగా పోగవుతున్నారు. పంచాయితీ హాల్‌కి వచ్చిన ఎస్సై ...‘ఏం జరిగింది?’ అడిగాడు ఆ ఇంటి పెద్దావిడను. ఆమె పేరు సుభద్రమ్మ (పేరు మార్చాం). వయసు అరవై పైనే ఉంటుంది.‘ఏముంది సార్‌! ఆస్తుల గొడవ! ఈళ్ల పనే ఇది’ అన్నాడు అక్కడే ఉన్న ఓ గ్రామస్తుడు.అతని వైపు కోపంగా చూసిన ఎస్సై అతన్ని బయటకు పంపించాడు.ఆమె ఏడుస్తూనే ‘సార్‌.. నేను చంపలేదు! ఊరి నుంచి మా తమ్ముడొచ్చాడు. మా ఆయనా మా తమ్ముడూ మాట్లాడుకుంట చాలా సేపు కూసున్నరు. ఇద్దర్నీ భోజనానికి రమ్మన్నాను. అప్పుడే వద్దని మా ఆయన మందుబాటిల్‌ తెచ్చి కూర్చున్నాడు. ఇద్దరూ మందు తాగారు. అరగంటసేపు బాగానే ఉన్నారయ్యా. తర్వాత ఏమైందో ఏమో! నురగలు కక్కుకంటూ నేలమీద పడిపోయారు. చూస్తుండగానే శవాలయ్యారు’ గట్టి గట్టిగా ఏడుస్తూనే ఉంది ఆమె. 

సుభద్రమ్మ కొడుకు ప్రతాప్‌ వైపు చూశాడు ఎస్సై. అతను హడలిపోయాడు.‘సార్‌! నేను టౌన్‌కు పోయి ఇందాకనే ఇంటికి వచ్చాను. అమ్మ ఏడుపు విని పరిగెత్తుకువచ్చాను. చూస్తే ఇద్దరూ పడిపోయున్నారు’ అన్నాడు ప్రతాప్‌.విషయం అంతా పోలీసులు నోట్‌ చేసుకుంటున్నారు. సుభద్రమ్మ భర్త పేరు వెంకటయ్య. డెభ్బై ఏళ్లుంటాయి. ప్రతాప్‌కి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా! తండ్రికి కొడుక్కి నాలుగేళ్లుగా ఆస్తి విషయమై పడటం లేదు. ఉన్న నాలుగెకరాల భూమిలో తన వాటా తనకు పంచమంటాడు కొడుకు. అది నా కష్టార్జితం. సెంటు భూమి కూడా ఇవ్వ అంటాడు తండ్రి. ఒక్కింటి వాళ్లయినా ఇంటికి మధ్యలో గోడ కట్టుకొని ఎవరి వంట వాళ్లు వండుకుంటున్నారు. సుభద్రమ్మ కూడా ఆ భూమిని కొడుకు పేర రాసిమ్మని గొడవ పెడుతోంది. కానీ, వెంకటయ్య వినిపించుకోవట్లేదు. ‘అది నేను సంపాదించిన భూమి. ఎవరూ లేనో ళ్లకైనా ఇస్తా కానీ, వీడికి (ప్రతాప్‌) ఇవ్వ. ఈ ఇంట్లో నుంచి కూడా వెళ్లిపొమ్మను’ అని గొడవ పెట్టుకుంటున్నాడు. ‘ఉన్నది ఒక్కడే కొడుకు కదా! వాడికి కాకపోతే ఎవరికిస్తవ్‌! ఇచ్చేయరాదు’ అని నచ్చజెప్పారు ఊళ్లో కొంతమంది. అయినా వెంకటయ్య వినిపించుకోలేదు. తన పేరన ఆస్తి రాసివ్వడం లేదని కన్నతండ్రినే చంపేశాడు ప్రతాప్, అతని తల్లి సుభద్రమ్మ అని ఊళ్లో వాళ్లు కోపంతో ఊగిపోతున్నారు. ఇలాంటోళ్లను చంపేయక ఇంకా ఎందుకు సార్‌ ఈ మాటలు అంటున్నారు బయట నుంచి. ‘మాకేం పాపం తెలియదు సార్‌! ఊళ్లో వాళ్లు చెప్పేది నిజమే అయ్యుంటే నా తమ్ముడిని ఎందుకు చంపుకుంటాను...’ తమ్ముడి కోసం ఏడుస్తూనే చెప్పింది సుభద్రమ్మ. ‘ప్రతాప్‌ ఊళ్లో కూడా లేడు. వీళ్లు గిల గిల కొట్టుకుంటున్నప్పుడే అరిచాను మా ప్రతాప్‌ని పిలుస్తూ. నా ఏడుపు విని వాడు పరిగెత్తుకొచ్చాడు. అప్పటికే ఏం చేయాలో కాలూ చేయి ఆడలేదు. చూస్తుండగానే తన్నుకులాడటం ఆగిపోయింది సార్‌!’ చెప్పిన విషయమే మళ్ళీ మళ్లీ చెబుతోంది సుభద్రమ్మ. 

పోలీసులు ఆలోచనలో పడ్డారు. సుభద్రమ్మ చెప్పిందాన్నిబట్టి చూస్తే వాళ్లు అంతకుముందు మందు తాగారు. ఆ మందు సీసాను స్వాధీనం చేసుకుని పరీక్షించారు. ప్రాబ్లమ్‌ ఏమీ లేదని నిపుణులు చెప్పారు. పోస్టుమార్టం రిపోర్ట్‌ వచ్చేవరకు టైమ్‌ పడుతుంది. ‘ఊళ్లో వాళ్లు చెప్పినట్టు వీళ్లే చంపారా? అలా అయితే, ఈమె తమ్ముణ్ణి కూడా ఎందుకు చంపుకుంటుంది?’ ఆలోచనలో పడ్డారు పోలీసులు.‘ఇంకా ఏంటి సార్‌ ఆలోచిస్తారు. ఈ ముసల్దే చంపేసి ఈ నాటకం ఆడుతోంది. నాలుగు తగిలిస్తే నిజం కక్కుతుంది’ అన్నాడు ఊరి పెద్ద. ‘అవునవును’ అన్నారు మిగతా వాళ్లు. భర్త, తమ్ముడు పోయిన దుఃఖం నుంచి సుభద్రమ్మలో భయం గూడు కట్టుకుంది తననేం చేస్తారో అని. 

పోలీసులు మళ్ళీ విచారణ మొదలుపెట్టారు. ‘సుభద్రమ్మా! మందు ఎక్కడి నుంచి తెచ్చాడు మీ ఆయన?’ అడిగారు పోలీసులు. ‘ఇంట్లనే ఓ బాటిల్‌ ఉందయ్యా! అదే తాగారు. ఆ... అది సరిపోలేదని మా కొడుకు ఇంటికి వెళ్లి ఇంకో బాటిల్‌ తెచ్చాడయ్యా’ గుర్తుకు తెచ్చుకుంటూ చెప్పింది సుభద్రమ్మ!పోలీసులు ముఖముఖాలు చూసుకున్నారు. ‘నీ కొడుకు, కోడలు టౌన్‌కెళ్లారుగా! ఇంటికి తాళం వేసి ఉంటే ఇతనెలా వెళ్లాడు’ గద్దించాడు ఎస్సై.‘నిజమే సార్‌! వాళ్లు ఎక్కడికైనా వెళితే తాళం చేతులు మా ఇంట్లనే కొయ్యకు తగిలించి వెళతారు. అది మా ఆయనకు తెలుసు. తాళం తీసే వెళ్లి తెచ్చుకున్నాడు..’సుభద్రమ్మ బలంగా చెబుతుండగా ఎస్సై ప్రతాప్‌ వైపు చూశాడు. అయోమయంగా చూశాడు ప్రతాప్‌ ఏమీ అర్థంకానట్టు. ‘వాళ్లిద్దరూ పడున్న చోట ఒకటే ఖాళీ బాటిల్‌ పడి ఉంది. రెండో బాటిల్‌ ఏమైంది?’ సుభద్రమ్మను అడిగాడు ఎస్సై‘మందు చేదుగా ఉందని తాగిన మా తమ్ముడు అన్నడు సర్‌! నీకు మందెక్కువై ఆ మాట అంటున్నావ్‌రా అని మా ఆయనా ఆ మందు తాగాడు! నిజమేన్రోయ్‌ ఈ మందు మహా చేదుగా ఉంది... దిక్కుమాలినోడు చేదు మందు తెచ్చిపెట్టిండు అని ప్రతాప్‌ను తిట్టుకొని దాన్ని బయటకు విసిరేశాడు’ అంది.ఎస్సై ఆలోచిస్తూనే తన సిబ్బందిని పురమాయించాడు. ఆ బాటిల్‌ను వెతకమని. 

పోలీసులు ఆ ఇంటి పరిసరాలను అణువణువూ గాలించారు.గుమ్మానికి ఎడమవైపున ప్రతాప్‌ ఇంటి ముందు కరివేపాకు చెట్టు పొదల్లో ఓ వైన్‌ బాటిల్‌ దొరికింది. దానిని వాసన చూసిన పోలీసుల కనుబొమ్మలు ముడిపడ్డాయి. అది పురుగుల మందు వాసన వస్తోంది. ‘క్లూ దొరికింది. ఈ మందుబాటిలే వాళ్లని చంపింది. అయితే, ఈ వైన్‌ బాటిల్‌లోకి పురుగుల మందు ఎలా వచ్చింది? ఎవరు కలిపారు? తేలాలి.’ ‘ఏంటిది?’ అడిగాడు ఎస్సై ప్రతాప్‌కి దగ్గరగా చూపుతూ. ప్రతాప్‌ ఆ మందుబాటిల్‌ను, దాని వాసన చూడగానే ‘సార్‌! ఒక్క నిమిషం. ఒక్కసారి ఇంట్లకెళ్లి చూసొస్తా. నాతో రండి’ అన్నాడు.అతనితో పాటు పోలీసు సిబ్బంది పంచాయతీ హాల్‌ నుంచి బయటకొచ్చారు. ప్రతాప్‌ ఇంట్లోకి వెళ్లి తన గదిలోని షెల్ఫ్‌లో ఓ మూలకు వెతుకుతున్నాడు. ‘దేనికోసం వెతుకుతున్నావ్‌’ గద్ధించాడు ఎస్సై.‘వారం క్రితం పొలానికి మందు కొట్టాలని మా నాయన్ని డబ్బులడిగిన. నా భూమిలో పొలం వేసుడే కాకుండా నన్నే డబ్బులు అడుగతావ్‌రా.. పురుగు పడితే పట్టనీయ్, నాశనం కానీయ్‌.. అన్నడు.మందెయ్యకపోతే పంట చేతికి రాదు. మా పొలం పక్కన ఉన్న రాములయ్యను అడిగితే ఒకటే డబ్బా ఉందని తన పొలానికి కొట్టాలని చెప్పాడు. పైసలొచ్చినంక ఇస్త.. సగం మందు ఇవ్వమని అడిగా. రాములయ్య సరే అని ఆ రోజు సాయంకాలం ఇంటికే తీసుకొచ్చాడు మందు డబ్బా! మందు పోయడానికి సీసా కోసం వెతికితే ఖాళీ వైన్‌బాటిల్‌ కనిపించింది.  సగం పురుగుల మందు వైన్‌ బాటిల్‌లో పోసి, ఈ మూలన ఎవరికంటా పడకుండా జాగ్త్రతగా పెట్టా. మా ఆవిడ పిల్లలతో కలిసి పుట్టింటికి బయల్దేరితే వాళ్లను ఆ ఊళ్లో దిగబెట్టడానికి నేనూ వెళ్లా. ఊర్నొంచి వచ్చినంక పొలానికి మందు కొడదాంలే అనుకున్న. మా అత్తగారి ఇంటి నుంచి టౌన్‌లో పనుంటే చూసుకుని ఇంటికి వచ్చేసరికి రెండ్రోజులయ్యింది. ఇప్పుడే చూశాను సార్‌! ఆ బాటిల్‌ లేదు. మా నాయిన నా దగ్గర మందుబాటిల్‌ ఉందని వెతికి ఉంటాడు. ఇది దొరికింది. తీసుకెళ్లాడు!’ ఏడుస్తున్నాడు ప్రతాప్‌. నిజం తేలడంతో ఊరివాళ్లు శాంతించారు. లేకుంటే వారి ఆవేశం వల్ల మరో రెండు ప్రాణాలు బలి అయ్యేవి. చేయని తప్పుకు శిక్షను అనుభవించాల్సి వస్తుందేమో అని భయపడిన వాళ్లకు పోలీసులు నిజ నిర్ధారణ చేసి నేరస్తులు కాదని ఊరటనిచ్చారు. 
– నిర్మలారెడ్డి

>
మరిన్ని వార్తలు