తేట తెలుగు వనిత

2 Nov, 2019 09:50 IST|Sakshi
మాటా.. మంతీ.. ఎల్బీ శ్రీరాంతో..

భావరాజు పద్మిని

మాతృభాష విస్తృతికి విశేష కృషి  

సోషల్‌ మీడియాలో రచనల ద్వారా ప్రచారం  

మాతృభాష అనేకన్నా మదర్‌టంగ్‌ అంటేనే తొందరగా అర్థమవుతుంది.. ఇది నేటిపరిస్థితి. కెరీర్‌అవకాశాలే లక్ష్యంగా సాగుతున్న నేటిచదువుల్లో మాతృభాష అధ్యయనంపై దృష్టితగ్గుతోంది. పాఠశాల, కళాశాల విద్యార్థులు చక్కటి తెలుగు తెలిసిన వారి సంఖ్య చాలా తక్కువ. రేపటి తరాలు తెలుగు భాషకు మరింత దూరమయ్యేఅవకాశాలు లేకపోలేదు. అచ్చంగా తెలుగు ద్వారా నెట్‌లో తెలుగు రాసే వారి సంఖ్యను,
తెలుగు మాట్లాడేవారి సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నాం.– భావరాజు పద్మిని

సాక్షి,సిటీబ్యూరో: ‘కాఫీ సరస్సు లాంటిది.. నిర్ణీత పాలల్లో పాలు చక్కెర, డికాషన్‌ కలిస్తేనే దానికి రుచి. కానీ టీ సముద్రం లాంటిది. తనతో ఏ ఫ్లేవర్‌నైనా కలుపుకు పోతుంది.. ఆ పరిమళాన్ని ఆపాదించుకుని, కొత్త రుచిని సంతరించుకుంటుంది’.. ఈ మాటలు అచ్చంగా ‘తెలుగు ఆన్‌లైన్‌’ మాసపత్రిక ఎడిటర్‌ భావరాజు పద్మిని రాసినవి. నిజంగా ఆమె కూడా ఇంతే, కొత్త పరిమళాన్ని జీవితంలోకి ఆహ్వానిస్తూ, కొత్తదనాన్ని అందుకుంటూ, పంచుకుంటూ సాగుతున్నారు. ఇంట్లో ఉండి ఏం చెయ్యగలం అని డీలా పడే మహిళలెంతో మందికి మహిళలు ఎక్కడున్నా అనుకున్నది సాధించగలరని ఆదర్శంగా నిలుస్తున్నారు. వీణ వాయిద్యం, సంగీతం, సంప్రదాయ నృత్యాల్లో ప్రవేశమున్న పద్మిని లాభాపేక్షతో కాకుండా ఆసక్తితో ఏడేళ్లుగా తెలుగు భాషకు తనవంతు సేవ చేస్తున్నారు. తెలుగులో ఈ మెయిల్స్‌ రాయటం నుంచి 60 వేల సభ్యులుతో తెలుగు గ్రూపుని, తెలుగు ఆన్‌లైన్‌ మ్యాగ్‌జైన్‌ని, 10కి పైగా బ్లాగులను, యూట్యూబ్‌ చానల్స్‌ని నిర్వహిస్తున్నారు. వీలైనంత మందితో తెలుగులో రాయించటం, చదివించటం తెలుగు బిడ్డగా నా కర్తవ్యంమంటున్న పద్మిని చెప్పిన మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే.. 

మాటా.. మంతీ.. ఎల్బీ శ్రీరాంతో..
గుంటూరు దగ్గరలో చిన్న పల్లెలో పెరిగాను. నాన్న కృష్ణ ప్రసాద్‌ బ్యాంక్‌ ఉద్యోగి, అమ్మ పద్మావతి గృహిణి. అమ్మ చాలా కథలు చెప్పేది. ముగ్గులు, కుట్లు, అల్లికలతో పాటు వీణ వాయించటం కూడా నేర్పించారు. అమ్మ చెప్పిన కథలే సాహిత్యం వైపు నడిపించాయి. ప్రభుత్వ తెలుగు మీడియంలో చదువుకున్నాను. పాఠాలు బాగా చెప్పేవారు. పండగలప్పుడు పాటలు, కథలు రాయించేవారు. అది రచన వైపుకి మళ్లించింది. ఇంటర్‌ కాగానే హైదరాబాద్‌ వచ్చేశాం. డిగ్రీ చదువుతున్నప్పుడే కథ రాశాను. కొత్తగా నగరానికి వచ్చిన మాకు అన్నీ విచిత్రంగా కనిపించేవి. అప్పట్లో గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసిన తర్వాత ఇంటికి రావడానికి చాలా రోజులు పట్టేది. ఎన్నో చోట్లకి ఒకరి ఇంటి నుంచి ఇంకో ఇంటికి తిరిగి తిరిగి వచ్చేది. దీనినే  ‘చక్రభ్రమణం’ పేరుతో కథగా రాశాను. నగరంలో పూలు దొరక్కపోవటంపై ‘మహానగరంలో మందారపువ్వు’ కథ రాసాను. తర్వాత నుంచి నా రచనలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కొన్ని ఆన్‌లైన్‌లోను వచ్చాయి.

ఉద్యోగం చేయకున్నా..
చదువులో క్లాస్‌లో టాపర్‌ని. ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీతో పాటు బయో ఇన్ఫర్మేటిక్స్‌ కోర్సు పూర్తి చేశాను. పెళ్లికి ముందు లెక్చరర్‌గా పనిచేశాను. పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగం చేయడం సాధ్యం కాదని తెలిసింది. జీమెయిల్‌లో తెలుగు టైపింగ్‌ 2011లో వచ్చింది. అప్పటి నుంచి అందరికీ తెలుగులో మెయిల్స్‌ పంపించేదాన్ని. చదివిన వారు, చాలా మంది బాగుందని ప్రోత్సహించే వారు. దాంతో 2012లో ఫేస్‌బుక్‌లో అచ్చంగా తెలుగు పేజీని ప్రారంభించాను. రోజు జరిగే విషయాలను సరదాగా ఉండేలా రాసి పోస్ట్‌ చేసే దాన్ని. అలా ఫేస్‌బుక్‌ గ్రూప్‌లో 60 వేల మంది చేరారు. ఐదేళ్ల క్రితం ఆన్‌లైన్‌ పత్రికను ప్రారంభించాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లకి సాహిత్య వారధిలా పనిచేస్తోంది. ఫ్రీలాన్సర్‌గా రేడియోలో వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాను. ఏడాదిగా డిడి యాదగిరి లో ’సాహితీ సౌరభాలు’ అనే కార్యక్రమానికి యాంకరింగ్‌ చేస్తున్నాను. ‘మైండ్‌ మీడియా’ ఆన్‌లైన్‌ రేడియోకు ప్రోగ్రాం డైరెక్టర్‌గా పని చేశాను. ఈ ప్రస్థానంలో అనేకమంది సాహిత్యదిగ్గజాలను కలుసుకున్నాను. సిరివెన్నెల, రామజోగయ్య శాస్త్రి, భువనచంద్ర నా రచనలు చదివి ప్రశంసించడం మరువలేను. అప్పుడు ఒక్కదాన్నే.. ఇప్పుడు ఎంతో మంది సహకారం తోడైంది. 

మరిన్ని వార్తలు