ఏడు నడకదారులు

29 Sep, 2019 04:07 IST|Sakshi
అలిపిరి కాలిబాట మార్గం

అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారు అంజనాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, నీలాద్రి, శేషాద్రి అనే ఏడుకొండలపై వెలసి భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకోవడానికి అత్యాధునిక రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నా, గతంలో భక్తులు తిరుమల చేరుకోవడానికి నడకదారి  మాత్రమే వుండేది. ఏడుకొండలపై వెలసిన వెంకన్నను దర్శించుకోవడానికి ఏడు నడకదారులు వుండేవి. కాలక్రమేణా వీటిలో నాలుగుదారులు మరుగున పడిపోగా రెండుదారుల్లో మాత్రం భక్తులు ఇప్పటిగచ తిరుమల  చేరుకుంటున్నారు.అడపాదడపా ట్రెక్కింగ్‌కు వెళ్లే భక్తులు మాత్రం మరోమార్గమైన అన్నమయ్య మార్గంలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఏడుకొండలవాడి దర్శనం కోసం తిరుమల చేరుకునేందుకు శతాబ్దాల కిందట ఉన్న ఏడుదారుల గురించి వివరాలు తెలుసుకుందాం..

ఆపద మొక్కుల వాడు, భక్తజన ప్రియుడు, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారు దేవుడైన శ్రీనివాసుడు భక్తులకు కలియుగ దైవం. వైకుంఠంలో శ్రీవారిపై అలిగిన శ్రీమహాలక్ష్మి భూలోకానికి రావడంతో ఆమెను వెతుక్కుంటూ శ్రీహరి తన శయనపాన్పుగా ఉన్న ఆదిశేషుడితో సహా భూలోకానికి విచ్చేశారని, ఆదిశేషుడే కొండగా మారడంతో శ్రీవారు భూలోకంలో తనకు అనువైన స్థలంగా తిరుమలను ఎంచుకున్నారని పురాణ కథనం. శ్రీవారు వెలసి వున్న ఏడుకొండలు తిరుమల నుంచి శ్రీశైలం వరకు 370 కిలోమీటర్లు పొడవుతో 30 కిలోమీటర్లు వెడల్పుతో విస్తరించి ఉన్నాయి. గతంలో రోడ్డు మార్గాలు లేకపోవడం భక్తులు కాలి నడకనే తిరుమలకు చేరుకునేవారు. ఇలా కాలక్రమేణా ఏడుకొండలకు ఏడుదారులు ఏర్పడ్డాయి.

కొన్నింటికి చారిత్రాత్మక నేప«థ్యం ఉండగా, మరికొన్ని భక్తులు తమ అవసరాల దృష్ట్యా ఏర్పరచుకున్నవి. ప్రస్తుతం ప్రధానంగా వాడుకలో ఉన్న నడకదారి నిత్యం వేలాది భక్తులు శ్రీవారి దర్శనార్థం విచ్చేసే అలిపిరి నడకదారి. శ్రీకృష్ణదేవరాయులు బావ మరిదిౖయెన మట్లి కుమార అనంతరాయులు ఏర్పాటు చేసిన మార్గం ఇది. 1625వ సంవత్సరం శ్రీవారి దర్శనార్థం తమిళరాష్ట్రం నుండి అధిక సంఖ్యలో తరలి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నడకదారిని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనార్థం విచ్చేసేభక్తులు పెద్దసంఖ్యలో ఈ మార్గం గుండానే తిరుమలకు చేరుకుంటుండడంతో టీటీడీ కూడా ఈ మార్గం అభివృద్ధికి అన్ని ఏర్పాట్లూ చేసింది.

3650 మెట్లు, ఎనిమిది కిలోమీటర్లు వుండే ఈ నడకదారిలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ సన్‌షేడ్స్‌ నిర్మించడం, మార్గం పొడవునా తాగునీటి సౌకర్యం, భద్రత ఏర్పాట్లు, భక్తు్తలను ఉల్లాసపరచడానికి జింకల పార్కు, నెమళ్ళ పార్కు వంటివి ఏర్పాటు చేసింది. గతంలో పాలకమండలి నడకదారి మధ్యలో దశావతారాల విగ్రహాలను ఏర్పాటు చేసింది. వాడుకలో వున్న రెండవ దారి శ్రీవారి మెట్టు మార్గం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఈ దారిన తిరుమల చేరుకున్నాడట. నారాయణవనంలో పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తరువాత శ్రీవారు శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు ప్రాంతం మీదుగా తిరుమలకు చేరుకున్నారు. పురాణాల ప్రకారం ఇదే మొట్టమొదటిది, ప్రాచీనమైనది. తరువాతి కాలంలో సాళువ నరసింహరాయలు ఈ మార్గం గుండా తిరుమలకు చేరుకోవడానికి గల దూరాన్ని తగ్గించి, ఆధునికీకరించారు.

శ్రీకృష్ణదేవరాయులు ఈ మార్గం గుండా ఏడుసార్లు తిరుమలకు చేరుకుని స్వామి వారికి విలువైన ఎన్నో వజ్రవైఢూర్య ఆభరణాలు సమర్పించాడట. చంద్రగిరి వైపున వున్న ఈ మార్గం కర్ణాటక ప్రాంతం నుంచి విచ్చేసే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. 2100 మెట్లు ఉండే ఈ మార్గం గుండా గంటలోపే తిరుమలకు చేరుకోవచ్చు. ఇటీవల కాలంలో ఈ మార్గం గుండా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండడంతో టీటీడీ ఈ మార్గం పొడవునా సన్‌షేడ్స్‌ ఏర్పాటు చేసింది. ఇక మూడవది 15వ శతాబ్దంలో తాళ్ళపాక నుంచి కుక్కలదొడ్డి మీదుగా పార్వేటి మండపం వరకు ఉన్న దారి. శ్రీవారిని తన పద కవితలతో అర్చించిన అన్నమయ్య తాళ్ళపాక నుంచి ఈ మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారట. ఇప్పటికీ ఏటా అన్నమయ్య జయంతి రోజున ఈ మార్గం ద్వారా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఈ మార్గంలో ఆ కాలంలో ఏర్పాటు చేసిన మండపాలు శిథిలావస్థలో ఉన్నాయి.

కొద్ది సంవత్సరాల కిందట కొందరు భక్తులు ఈ మార్గాన్ని అభివృద్ధి చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ద్వారా టీటీడీ దృష్టికి తీసుకువచ్చినా, భద్రత కారణాల దృష్ట్యా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇప్పటికీ ఈ మార్గం ద్వారా కొందరు ట్రెక్కింగ్‌కు వెళ్తుంటారు. ఇక నాలుగవది తుంబురతీర్థం నుంచి కుక్కలదొడ్డి మీదుగా కడపజిల్లా సోమేశ్వరాలయం వరకు ఉన్నది. రెడ్డిరాజుల కాలంలో సోమశిల రాజులు ఏర్పాటు చేసిన ఈ మార్గం చాలాకాలంగా వాడుకలో లేకపోవడంతో ఈ మార్గం ఒకటి ఉందనే సంగతి ఇప్పటి జనాల్లో చాలామందికి తెలియదు. ఇక ఐదవది తరిగొండ వెంగమాంబ మార్గం. శ్రీవారికి పరమ భక్తురాలైన వెంగమాంబ తన స్వస్థలమైన తరిగొండ నుంచి తిరుమలకు చేరుకోవడానికి భాకరాపేట అడవుల గుండా తలకోన మీదుగా మొగలిపెంట, యుద్ధగళ్ళతీర్థం ద్వారా ప్రస్తుతం టీటీడీ ఏర్పాటు చేసిన వేద పాఠశాల వద్ద కలుస్తుంది.

ఈ మార్గం ప్రస్తుతం వాడుకలో లేకపోవడం, దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో కనీస భద్రత ఏర్పాట్లతో 30 మందికి పైగా భక్తులతో బృందంగా వెళ్ళవచ్చు. ఇక ఆరవది యుద్ధగళ్ళతీర్థం నుంచి పాలకొండల వరకు వున్న మార్గం. గడికోట రాజులు ఈ మార్గాన్ని  ఏర్పాటు చేశారు. బ్రిటిష్‌వారు 1801లో శ్రీవారి ఆలయాన్ని తమ అజమాయిషీలోకి తీసుకోవడంతో ఆదాయం కోల్పోయిన పాలెగాళ్ళు ఈ మార్గం గుండా వచ్చే భక్తులపై దాడులు చేసి, వారిని దోచుకునే వారట. ప్రస్తుతం ఈ దారి వాడుకలో లేదు. ఇక చివరిది ఏడవది తొండమాన్‌ చక్రవర్తులు ఏర్పాటు చేసిన మార్గం. కరకంబాడి నుంచి అవ్వాచారి కోన మీదుగా తిరుమలకు చేరుకుంటుంది. బ్రిటిష్‌ వారి కాలంలో పలువురు సామంతులు శ్రీవారి ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఈ మార్గం గుండానే దండయాత్రలు చేశారట. కష్టతరమైన మార్గం కావడంతో కాలక్రమేణా ఈ మార్గం కూడా వాడుకలో లేకుండాపోయింది. ప్రస్తుతం ఈమార్గం పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతమైపోయింది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు