సహస్ర కాంతుల దీపం

19 Oct, 2017 04:11 IST|Sakshi

ధర్మం నాలుగు పాదాల మీద నడవాలి. పాదాల మీద కంటే ముందు.. మనసులో నడవాలి. మాటలో నడవాలి. చూపులో నడవాలి. చర్యలో నడవాలి. మానవ జీవన సూత్రం.. సమతాధర్మం. ఆ సమతకు దారి దీపమే చినజీయర్‌ స్వామీజీ. దీపం సహస్ర కాంతులను విరజిమ్ముతుంది. సహస్ర కాంతులతో వెలుగుతున్న  పరంపర దీపం.. స్వామీజీ. దీపావళి నాడే ఆయన జన్మదినం. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన సంభాషణం.

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌ స్వామి

తేదీకి భారతీయ సంప్రదాయంలో సమానమైంది నక్షత్రం. ప్రతినెలలో రెండు పక్షాలు ఉంటాయి. తిథి రెండుసార్లు వస్తుంది. కాని నక్షత్రం నెలలో ఒక్కరోజే ఉంటుంది. ప్రతినెలా 27 నక్షత్రాలు తేదీలతో సమానం. పుట్టినతేదీ ఆంగ్ల సంప్రదాయం అయితే పుట్టిన స్వాతి నక్షత్రం ఉన్న రోజున జన్మదినోత్సవం చేసుకుంటారు. పెద్దల పుట్టినరోజును తిరునక్షత్రం అంటారు. అక్టోబర్‌ 19, 2017న శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్‌ స్వామి 61వ తిరునక్షత్రం. ఈ స్వాతిముత్యం దీపావళినాడు మెరిసింది. శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించడం వల్ల ఆతని నరకబాధలనుంచి విముక్తమైన లోకులు దీపాలు వెలిగించి పండుగ చేసుకోవడమే దీపావళి. మరో అంతరార్థం ఉందని జీయర్‌ స్వామి వివరించారు. నర–క అంటే నరులలో హీన లక్షణం. దానికి ప్రతీక చీకటి. ఆత్మకు, జ్ఞానానికి దీపమే ప్రతీక. మనలోని హీనలక్షణాల చీకట్లను ఆత్మజ్ఞాన దీపావళుల వెలుగులతో అంతరింపజేయడమే నిజమైన నరకాంతక దీపావళి.

ఆచరించి చెప్పేవాడు, చెప్పిందే ఆచరించే వాడే ఆచార్యుడు కనుక ఆచార్యనామాన్ని సార్థకం చేస్తున్న రామానుజాభి మతాచార్యుడు,  మొదటి రామానుజ జీయర్‌ స్వామిని పెద్ద జీయర్‌ అంటూ శాశ్వతంగా చిన్న జీయర్‌ నామాన్ని ధరించిన నిరాడంబరుడు శ్రీమన్నారాయణ రామానుజాచార్యుడు. టీవీ మాధ్యమాలకు భక్తి ఠీవిని నిలిపిన తొలితరం టీవీ ప్రవచనకర్త, పరిచయం అవసరం లేని ప్రవక్త. భవబంధాలనుంచి ముక్తి కల్పించేది భక్తి అన్న రామానుజ సిద్ధాంతాన్ని మనసా వచసా కర్మణా పాటిస్తున్న బుద్ధి, త్రికరణశుద్ధి ఆయనది.  61 సంవత్సరాల జీవితం అంతా ఇదే జీయర్‌ జీవనం. దేశదేశాలలో దివ్యోపదేశాలు చేస్తూ ప్రపంచానికి ‘ఈదేశం సందేశం’ అని చెప్పుకోతగ్గ భారతీయుడు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలుగా సాకారమైన ఆయన ఆలోచనలివిగో...

Equityఅంటే సమత, న్యాయమైన సమానత అని అర్థం. దాన్ని సాధించడానికి మీ ప్రాజెక్టు ఉపయోగపడుతుందా?
స్వామి: ఉపయోగపడాలనే ఉద్దేశ్యం. సమానత అంటే సరిపోదు, న్యాయమైన సమానత కదా కావలసింది. ఆర్థిక న్యాయం లేని సమానత లేదు. సామాజిక న్యాయం కూడా లేదు. ఆర్థికంగా సమానత రావాలంటే అవకాశాలు సమానంగా చేతికి అందాలి. కొందరు తక్కువ కష్టంతో ఎక్కువ సుఖపడే పద్ధతులు, మరికొందరు ఎంత కష్టపడ్డా కొంతైనా సుఖం దొరకని పరిస్థితులు తప్పు. ఇదే అసమానత అంటే. ఎంత కష్టపడితే అంత సుఖపడే అవకాశం ఉండాలి. కష్టపడదలచుకున్న వారికి పనిచేసే అవకాశం రావాలి. అప్పుడే ఆర్థిక న్యాయం వస్తుంది. ప్రపంచంలో సమాన హక్కులకోసం పోరాడిన వారు ఎందరో ఉన్నారు. వారందరి జీవిత చిత్రాలను సేకరించి సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఒక హాల్‌ లో ఏర్పాటు చేస్తున్నాం. నెల్సన్‌ మండేలా, అబ్రహం లింకన్, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ వంటి అనేక మంది హక్కుల పోరాట వీరులు దేశదేశాల వారు మొత్తం 160 మంది విగ్రహాలు ఈ హాల్‌లో కొలువు దీరుతాయి. వారు ఏం చేశారో వారి వల్ల సమాజానికి ఏ మేలు జరిగిందో సంక్షిప్తంగా తెలియజేస్తాం. ఎవ్వరి జీవితమైనా రాబోయే తరాలకు స్ఫూర్తి కలిగిస్తే లక్ష్యం వైపు అడుగులు పడినట్టే.

ప్రతి వ్యక్తిలో అంతర్గతమైన శక్తి ఉంటుంది. అయితే, దాన్ని వెలికితీసే అవకాశాలే అందరికీ దొరకవు. భగవంతుడి సృష్టిలో అందరికీ సమానంగా బతికే అధికారం ఉంది. శక్తికి జ్ఞానానికి ఆసక్తికి తగినట్టు బతికే సామర్థ్యం మనిషికి ఉంది. ఆ శక్తిని, జ్ఞానాన్ని సంపాదించే అవకాశాలు కూడా సమానంగా ఉండాలి. ప్రతివ్యక్తి బుద్ధిని వికసింపచేసే అవకాశాలలో అధికారాలలో కొరత ఉండకూడదు.

మన సంవిధానం ఆర్టికల్స్‌ 14, 15, 16 లో ప్రభుత్వ, బహిరంగ సహజ వనరులు, ఉద్యోగ విద్యావకాశాలు అందుకునే అవకాశాలు అందరికీ ఉండాలని నిర్దేశిస్తున్నాయి. అవి ప్రాథమిక హక్కులు కదా..?
అవును. చదువుకోగలిగితే ఎవరైనా శాస్త్రజ్ఞులు కావచ్చు, అందరూ చదువుకోవచ్చుననే వీలుండే వ్యవస్థ ఉండాలి. నోబుల్‌ బహుమతి పొందగలిగే సత్తా అందరికీ ఉన్నా అవకాశా లున్న వారికే బహుమతి వస్తుంది. నోబుల్‌ రానివాడు అనర్హుడు అని కాదు. అవకాశాలు రాక పైకి రాలేకపోయిన వారెందరో ఉంటారు. వనరులు, సంపదలు చేరువలో ఉంటే, చేయగలిగిన వాడు, చేతనైన వాడు, చేవ ఉన్నవాడు అందుకుంటాడు.దానికి ఉదాహరణ. ఆదిలాబాద్‌లో బెల్లంపల్లి గ్రామంలో ఆదిమజాతుల కోసం మేం ఏర్పాటు చేసిన ఒక పాఠశాల. ఆదిమజాతి విద్యార్థి ఇక్కడ వచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకుని 97 శాతం మార్కులు సంపాదించి బాగు పడుతున్నాడు.

సునామీలు, భూకంపాలు మనం పుడమితల్లికి చేస్తున్న తీవ్రగాయాలని మీరు ఒక చోట పేర్కొన్నారు..?
అవును. అక్షరాలా అవి తీవ్రగాయాలే. ప్రాణికోటి హద్దు మీరి నీటిని వాడుకోవడం వల్ల ఈ ప్రమాదాలు వస్తాయి. సముద్రాలను కూడా కలవరపెట్టి కలుషితం చేసి ఇటువంటి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నాం. మన వ్యవసాయం పూర్తిగా పర్యావరణ ధ్వంసకరంగా మారింది.

భగవద్‌ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా మీరు తలపెట్టిన బృహత్‌ కార్యక్రమం ఎప్పటికి ఒకరూపు దిద్దుకుంటుంది?
ఈ మహత్కార్యం రెండు దశలలో సాగుతుంది. మొదటి దశ ఏప్రిల్‌ 2018లో రామానుజ విగ్రహావిష్కరణ తో పూర్తవుతుంది. కూర్చున్న భంగిమలో ప్రపంచంలోకెల్లా ఎత్తయిన లోహ రామానుజ విగ్రహ ప్రారంభంతోపాటు ఆ యతిరాజ జీవిత చరిత్రను వివరించే అంశాలను కూడా ప్రదర్శన రూపంలో ఆవిష్కరించబోతున్నాం. రెండో దశ మరింత ముఖ్యమైంది. రామానుజుని సమతా సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఆ దశలో ప్రయత్నాలు జరుగుతాయి. 108 శ్రీమన్నారాయణ దివ్యదేశాలకు ప్రతీకల నిర్మాణాన్ని చేపడతాం. ఇది మూడు సంవత్సరాల కాలంలో పూర్తవుతుందని అంచనా.  అందుకు ఆయన రచనలను ప్రజానీకానికి అందుబాటులోకి తేవలసి ఉంది. గ్రంథాల రచన, సేకరణ, పుస్తక ప్రచురణ, అనువాద రచనల ప్రచురణ ఆ తరువాత డిజిటల్‌ గ్రం«థాలయాలను అంతర్జాలంలో అందించడం కూడా ముఖ్యంగా భావిస్తున్నాం. ఇదంతా రెండోదశలో ఉన్న ముఖ్యమైన భాగాలే. రామానుజుని జీవనగా«థ గురించి తమిళంలో వివరమైన ప్రచురణలు కొన్ని ఉన్నాయి. గురుపరంపర ప్రభావం పేరుతో ఒక తమిళ గ్రంథంలో రామానుజ జీవనం విస్తారంగా రచించారు. ఈ గ్రంథాన్ని తెలుగులో తీసుకురావడం అవసరం. అదేవిధంగా నవల రూపంలో రామానుజుని కథా సంఘటనలను కవిరత్న గుదిమెళ్ల హృదయ రంజకంగా రచించారు. అయితే, అవి అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని అదే ధోరణిలో పరిష్కరించే ప్రయత్నాలు అవసరమే. భక్తినివేదన ధారావాహికలో రామానుజ జీవనగాథ చాలావరకు వస్తుంది. ఇంకా శేషభాగం గురించి అవకాశాలు పరిశీలించాలి. ప్రపన్నామృతం పేరుతో మరొక గ్రంథం ఉంది. దానిని తెలుగులోని అనువదించాల్సి ఉంది. టీకే చూడామణి భగవద్రామానుజ చరిత్ర పేరుతో రచించిన తెలుగు పుస్తకాన్ని జీయర్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ ప్రచురించింది.   

విద్యాకార్యక్రమాల విస్తరణలో మీరు గురుకులం పేర కొన్ని సంస్థలు ప్రారంభించారు కదా, వాటిని వ్యవస్థీకరించి విస్తరించే ప్రణాళికలేమయినా ఉన్నాయా?
పిల్లలే మన భవిష్యత్తు. వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దడం మనతరం బాధ్యత. కనుక ఉన్న వసతులతో ఆదర్శప్రాయంగా ఉన్నత ప్రమాణాలతో మూడు గురుకుల విద్యాలయాలను ప్రారంభించాం. అల్పాదాయ వర్గాల పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తున్నాం. వారు అక్కడే నివసిస్తారు. ఉచితంగా నివాసం, భోజనం, విద్యాబోధన, పుస్తకాలు, ఇతర సామగ్రి ఇస్తున్నాం. కాని ప్రతి గ్రామంలో ఆ విధంగా ఒక్కొక్క గురుకులం నెలకొల్పాలంటే పెద్ద ఎత్తున ఆర్థిక అండదండలు అవసర మవుతాయి. నిరంతరం చేయాలంటే దానికి భారీ ఎత్తున వనరులను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఒక్క సంస్థకు అన్ని వనరులు ఉండడం కష్టం కదా. అలాగే వైద్యరంగంలో కూడా సేవలు అవసరం. చికిత్సా కేంద్రాలు, హాస్పిటల్స్‌ నిర్మించడం కూడా భారీ వనరులుంటేనే సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఒక పెద్ద హాస్పిటల్‌ను, వైద్యకళాశాలను నిర్వహిస్తు న్నాం. ఇతర ప్రైవేట్‌ హాస్పిటళ్ల ఫీజులు, ఖర్చులతో పోలిస్తే 20 శాతానికే నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నాం.

చాలా గ్రామాల్లో పాఠశాల, హాస్పిటల్‌ లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలకు విద్య, వైద్యం అందడం లేదు. టిటిడి వంటి సంస్థలు ఈ సేవలు అందించడం మంచి పనులే కదా? ఎందుకు చేయరు?
నిజమే. టిటిడిగానీ బాగా ఆదాయం ఉన్న ఇతర దేవాలయ సంస్థలు గానీ ఆ డబ్బును గ్రామాల్లో విద్య, వైద్య రంగాలకు వెచ్చించడానికి వారి నియమ నిబంధనలు, చట్టాలు, విధానాలు అంగీకరించాలి కదా. ప్రజలకు ఇవి అవసరం అని వారు భావించాలి. ప్రజల నుంచి అందుకు డిమాండ్‌ రావాలి. ఆ డిమాండ్‌ ను వారు అంగీకరించి సేవలు అందించడానికి పాలసీ రూపొందించిన తరువాత ఆ నిర్ణయం తీసుకుంటే పాలకులు, పాలకమండళ్లు కూడా జనామోదమైన విధానంగా భావించి అమలు చేసే వీలుంటుంది.  

భక్తి మార్గమైనా, సంస్కృతి రక్షణైనా జ్ఞానమార్గం ద్వారానే సాధ్యమంటారు కదా...
అవును, జ్ఞానమే ప్రగతికి మార్గం. జ్ఞానం లేక మరేదీ సాధ్యం కాదు.

మీరు పర్యావరణ పరిరక్షణ పట్ల కూడా దృష్టి పెట్టినట్టుంది కదా.. ఆ కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు, సూచ్యప్రాయంగా ఒకటి రెండు చోట్ల చేయడం కన్న వాటిని వ్యవస్థీకరించి విస్తరించడం అవసరం కదా.
మానవసేవే మాధవ సేవ అనే నినాదం మనందరికీ తెలుసు. ఈ నినాదాన్ని కొంత సంస్కరించి కొత్త రూపు ఇచ్చాం. ‘మాధవసేవగా సర్వ ప్రాణి సేవ’ "Serve All Beings as Service to God' అనేదే ఆ కొత్త నినాదం. మనిషి ప్రకృతిమీద ఆధారపడి బతుకుతూనే ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. పర్యావరణంలో ఈ ప్రకృతిలో ప్రతిదీ ఇతర ప్రాణికోటికి సాయపడుతూనే ఉంటుంది. ఉపకారం చేస్తూనే ఉంటుంది. ఈ భూమిమీద నీటిని, చెట్లను, ఇతర జంతుజాలాన్ని పరిరక్షించుకోకుండా ప్రకృతి రక్షణ ఏముంటుంది?
జీవా ఆశ్రమంలో ఇటీవల మూడు వేలమంది రైతులకు సహజసేద్యంలో శిక్షణ ఇచ్చాం. 9 రోజులపాటు జరిగిన శిక్షణ సమావేశంలో సుభాష్‌ పాలేకర్‌ వంటి సామాజిక సేవా కార్యకర్తలు పాల్గొన్నారు. వారు తమ ప్రసంగాలతో శిక్షణార్థులకు స్ఫూర్తి నిచ్చారు. ఈ విధంగా నేర్చుకున్న వారంతా ఈ విద్యను వ్యాపింపచేస్తారు. ఇటువంటి మోడల్‌ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తే ఇంకా బాగుంటుంది.
 
రాబోయే కాలంలో ఇంకా విశేష కార్యక్రమాలను ఏర్పాటు చేసే ప్రణాళికలు ఉన్నాయా?
(నవ్వుతూ) ప్రభుత్వాలకు పంచవర్ష ప్రణాళికలు... ఆ తరువాత ప్రణాళికలు ఉంటాయి. మాకు ఎందుకు చెప్పండి? ముఖ్యంగా మాముందు ఇప్పుడున్న రామానుజ కార్యక్రమమే మాకు అన్నింటికన్నా బృహత్తరమైంది.

శ్రీధర్‌:  మీరు రామానుజుడిని సమతా సిద్ధాంత కర్త అన్నారు. రామానుజ సహస్రాబ్ది సందర్భంగా ఆ యతిరాజు విగ్రహాన్ని స్థాపిస్తూ  ్ట్చ్టu్ఛ ౌజ ఉ్ఞu్చ జ్టీy (స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ) అన్నారు. ఎందుకని ?
స్వామి: వేయేళ్ల కిందటే అందరూ సమానమని రామానుజుడు సందేశాన్నిచ్చారు. గోపురం ఎక్కి తిరుమంత్రార్థాన్ని అందరికీ అడగకుండానే ప్రసాదించిన ఆచార్యుడు రామానుజుడు. ఆయన ఆదర్శమూర్తిత్వం నుంచి ఒక స్ఫురణ పొందేందుకే ఆయన 216 అడుగుల లోహ విగ్రహాన్ని నెలకొల్పుతున్నాం. ఆయన జీవిత సంఘటనలు ప్రేరణ కలిగించేవి. ఆయన ఆదర్శాలు అనుకరించి సమాజానికి మంచి చేయడానికి ఉపయోగపడేవి. వారి సందేశాన్ని ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేయడం మా లక్ష్యం. ఆ యుగంలో ఆనాటి అలవాట్ల మధ్య, సంప్రదాయాల మధ్య అందరికీ జ్ఞానం సమానంగా అందాలన్నారు. విద్యార్జన, విజ్ఞానార్జన అవకాశాలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలి. ఆ అవకాశాలను అందిపుచ్చుకుని అందరూ బాగుపడతారా లేదా అనేది తదుపరి అంశం. అందుబాటులోకి తేవడం మన పని. అందుకున్నవాడు బాగుపడతాడు. అవకాశాలే కల్పించకపోవడం అన్యాయం. అదే రామానుజుని సమత. సమానత. అందుకే రామానుజ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్‌ ఈక్విటీ అని అందుకే అన్నాం. సమానత రామానుజుని ధ్యేయం, మన సంవిధానపు సమానతే రామానుజుని సమత. కాని బ్రిటిష్‌ పాలన, ఇతరుల పాలనల ప్రభావం వల్ల ఆ సమానతా భావాలు మరుగున పడ్డాయి. మళ్లీ ఆ భావాలను జాగృతం చేయడం, ఇప్పటి తరాలకు ఆనాటి ఆయన సమతావాదాన్ని గుర్తుచేయడం, రాబోయే తరాలకు సమసమాజాన్ని రూపకల్పన చేసే అవకాశం అందించాలన్న సమతా మూర్తి స్ఫూర్తికేంద్రం అనే పేరును కూడా అందుకే ఖాయం చేసాం.

జీయర్‌ గురుకులాలు, జీయర్‌ గురుకుల పాఠశాలలు కటారివారిపాలెం, అల్లంపల్లి, బీర్సాయిపేటలలో ఉన్నాయి.  హింసామార్గంలోకి వెళ్లిపోయే అవకాశం ఉన్న పిల్లలను చదువు వైపు మళ్లించే బడులు ఇవి. మరుగుదొడ్లు అంటే ఏమిటో తెలియని పిల్లలు... ఇప్పుడు బడిలో పిల్లలు మరుగుదొడ్లను వాడుతున్నారు. శాశ్వతమైన కట్టడాలలో నివసిస్తున్నారు. ఆ పిల్లలకు సమగ్ర స్థాయి పోషకాహారం అందుతోంది. మంచి ఆలోచనలు అలవాట్లు నేర్చుకుంటున్నారు. సమాజం నుంచి తీసుకోవడమేనా. తిరిగి ఇవ్వడం కూడా ముఖ్యమే అని తెలుసుకుంటున్నారు. ఈ విద్యాకేంద్రాల్లోని శాస్త్ర ప్రయోగ శాలలు, కంప్యూటర్‌ లాబొరేటరీలు పిల్లలను రేపటి డిజిటల్‌ ప్రపంచానికి సంసిద్ధం చేస్తున్నాయి. వారు అక్కడ టీవీల్లో డిస్కవరీ, జియోగ్రాఫిక్‌ చానెల్స్‌ చూస్తారు. ఆటపాటల సంస్కృతి నేర్చుకుంటున్నారు. నాగరిక భాషల్లో మాట్లాడుకుంటున్నారు. మంచి హాస్టళ్లు, పరిశుద్ధమైన తాగునీరు ఇవన్నీ గిరిజన బాలబాలికలకు అందుబాటులో ఉన్నాయి. ఈ పిల్లలకు 2016 కరాటే పోటీల్లో మొదటి, రెండో బహుమతులు రావడం విశేషం.  హైదరాబాద్‌లోని నేత్ర విద్యాలయ కాంపస్‌లో ఆర్థికంగా వెనుకబడి నేత్రపరంగా దివ్యాంగులైన వారికి ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ విద్యాబోధన కళాశాలను నిర్వహిస్తున్నారు. వారు బిఎ, బికాం చదువుకోవచ్చు. 
ఇంటర్వ్యూ: ఆచార్య మాడభూషి శ్రీధర్‌

మరిన్ని వార్తలు