వాదనా..ధన్‌!

4 Nov, 2017 00:02 IST|Sakshi

న్యాయదేవతకు చూపు ఉండదు.
ఆ నీడలో కూర్చునే న్యాయమూర్తి...
న్యాయానికి కాగడాలాంటి వారు.
డిఫెన్స్‌ లాయర్‌..
ప్రాసిక్యూషన్‌ లాయర్‌..
వీళ్లే ఇక న్యాయానికి మిగిలిన రెండు కళ్లు.
వకీలు వాదిస్తాడు.
వాదన న్యాయాన్నిస్తుంది.
ధనాధన్‌ వాదిస్తేనే.. న్యాయం!

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ.. లోకం ఎప్పుడూ ఆనందించే విషయాలు. సినిమాల్లో హీరో విలన్‌ని చితక బాదుతుంటే మనసుకు తృప్తిగా ఉండేది అందుకే! దోషికి శిక్ష విధిస్తూ జడ్జిగారు తీర్పు చెప్పినా, దోషికి శిక్ష పడేలా లాయర్‌ కేసును వాదించినా కూడా.. సేమ్‌ అదే తృప్తి.. చివరికి న్యాయం జరిగిందని!ఒకటి గమనించారా? ఎంత బోర్‌ కొట్టే సినిమాలోనైనా కోర్టు సీన్‌ మాత్రం బోర్‌ కొట్టదు!
కొన్ని సినిమాల్లోనైతే చిన్న కోర్టు సీనే సినిమా మొత్తాన్నీ లాగించేస్తుంది. బయటి కోర్టుల్లో వాదనలు ఎలా ఉన్నా... సినిమా కోర్టుల్లో వాదనలు వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు.. బయట కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. అప్పటికప్పుడు, అక్కడికక్కడ జరిగే న్యాయం కోసం.. మనిషి మనసు పరితపించడమే అందుకు కారణం. న్యాయపోరాటమే కథాంశంగా ఉన్న సినిమాలు హిట్‌ కావడానికి కారణం కూడా ఇదే. జస్టిస్‌ చౌదరి, లాయర్‌ విశ్వనాథ్‌ మన జీవితంలో లేకపోయినా, మన చూస్తున్న సినిమాలో ఉన్నా చాలు వెంటనే ఏదో ధైర్యం వచ్చేస్తుంది. ఈలోకంలో మనిషి బతగ్గలడని.

ఎమ్మెల్యే గిరీష్‌ కర్నాడ్‌ కోర్టు బోనులో ఉన్నాడు. అతడికి వ్యతిరేకంగా లాయర్‌ వెంకటేశ్‌ వాదిస్తున్నాడు. వెంకటేశ్‌ కేవలం లాయర్‌ మాత్రమే కాదు. గిరీష్‌ కర్నాడ్‌కి కొడుకు కూడా. రక్తసంబంధం కన్నా న్యాయం, ధర్మం గొప్పవని నమ్మిన కొడుకు.కోర్టు హాల్లో అతడి డైలాగులు రెండు వింటే చాలు. చేస్తున్న బీటెక్‌ కూడా మానేసి వెంటనే వెళ్లి ‘లా’లో చేరిపోవాలనిపిస్తుంది. తల్లి కోసం మొదట తండ్రికి ఫర్‌గా వాదించిన వెంకటేశ్, కోర్టు హాల్లో కూర్చొని ఉన్న ఆ తల్లే మళ్లీ మనసు మార్చుకుని.. ‘నీతి కోసం ఎదురు తిరుగు. న్యాయం కోసం పోరాడు’ అని చిన్న కాగితం ముక్క మీద రాసి పంపడంతో... జడ్జి తీర్పు ఇవ్వబోతున్న ఆఖరి నిముషంలో, ‘ఇంకొక్క నిమిషం యువరానర్‌’ అని పర్మిషన్‌ తీసుకుని గిరీష్‌కు వ్యతిరేకంగా వాదించడం మొదలు పెడతాడు. జడ్జికి కోపం వస్తుంది. ‘‘మిస్టర్‌ రాకేశ్‌ యువార్‌ అవుటాఫ్‌ ఆర్డర్‌’’ అంటాడు.‘‘నో.. ఆయామ్‌ నాట్‌ అవుటాఫ్‌ ఆర్డర్‌. నేనిప్పుడు నిజం చెప్పకోపోతే ఈ కోర్టు అవుటాఫ్‌ ఆర్డర్‌. ఈ చట్టం అవుటాఫ్‌ అర్డర్‌. ఈ స్టేట్‌ అవుటాఫ్‌ ఆర్డర్‌. టోటల్‌ దేశమే అవుటాఫ్‌ ఆర్డర్‌.. ఎస్‌.. ఎస్‌..’’ అని కోర్టు హాలు అదిరిపోయేలా అరిచి చెప్తాడు వెంకేటేష్‌. థియేటర్‌లు కూడా అదిరిపోయాయి. లాయర్లు నిజం చెప్పకపోతే దేశమే అవుటాఫ్‌ ఆర్డర్‌ అయిపోతుందన్న పాయింట్‌ ఆడియన్స్‌ చేత చప్పట్లు కొట్టించింది. సుమారు 20 ఏళ్ల క్రితం 1996లో వచ్చిన ‘ధర్మ చక్రం’ సినిమాలోని సన్నివేశం ఇది. కోర్టు సీన్‌ల టాపిక్‌ ఎక్కడ వచ్చినా ఇప్పటికీ అక్కడ ఈ ధర్మచక్రం తిరుగుతూ కనిపిస్తుంది.

ఈ మధ్య వైజాగ్‌లో.. తిండిలేక, నీరసంగా పేవ్‌మెంట్‌ మీద పడి ఉన్న ఓ నలభై ఏళ్ల మహిళపై పట్టపగలు ఒక యువకుడు అత్యాచారం చేశాడు! ఈ ఘటనకు దేశం దిగ్భ్రాంతి చెందింది. ఏమైపోతోందీ సమాజం? స్త్రీకి రక్షణ లేదా? మీరు లాయర్‌ కాకపోవచ్చు, ఈ కేసును వాదించే ఛాన్స్‌ వస్తే మీ ఆక్రోశం ఎలా ఉంటుందో మిమ్మల్ని మీరు చూసుకునే సీన్‌ ఒకటి మన సినిమాల్లో ఉంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ని కోర్టు హాల్లోకి ప్రవేశపెడతారు. అతడు పారిపోకుండా గట్టి బందోబస్తు. ‘‘చెప్పండి’’అంటాడు ప్రకాష్‌ రాజు. అతడు జడ్జి. లాయర్‌ మొదలు పెడతాడు.. ‘యువరానర్‌.. రాఖీ అనే ఈ ముద్దాయీ..’ అంటూ. ‘‘సార్‌.. నేను చెప్తాను సార్‌’’ అంటాడు ఎన్టీఆర్‌ ఆ లాయర్‌కు చేతులు జోడించి. జోడించిన చేతులతో అలాగే జడ్జి వైపు తిరిగి.. ‘‘సార్‌. నమస్కారం సార్‌’’ అంటాడు. ఇక స్టార్ట్‌ చేస్తాడు.‘‘మొత్తం 49 మర్డర్లు సార్‌. నేనే చేశాను సార్‌. పూర్తి స్పృహతో, పూర్తి ఆరోగ్యంతో, అన్నీ తెలిసి, పక్కాగా ప్లాన్‌ చేసి నేనే చంపాన్సార్‌. నేనే చేశాన్సార్‌. దానికి పూర్తి బాధ్యత నాదే సార్‌. మీరే శిక్ష విధించినా అంగీకారం సార్‌. సార్‌.. శిక్ష విధించే ముందు.. రెండు నిముషాలు మాట్లాడే చాన్స్‌ దొరుకుతుందా సర్‌? రెండే రెండు నిముషాలు సార్‌. ప్లీజ్‌ సార్‌’’ అంటాడు ఎన్టీఆర్‌.ప్రకాశ్‌రాజ్‌ సైగ చేస్తాడు.. బోనులో నిలబడి మాట్లాడమని. బోనులోకి వెళ్తాడు ఎన్టీఆర్‌. చేతులు కట్టుకుంటాడు. థ్యాంక్యూ సర్‌ అంటాడు. తన వాదన మొదలు పెడతాడు.

‘‘సర్‌.. యాభై మందిని చంపేయగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు, అదేందో పెద్ద అణుబాంబు పడ్డట్టు అల్లకల్లోలం అయిపోయారే.. మన జన్మలకు కారణమై, మన రక్తాలు పంచుకుని, మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ల మీద.. ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని.. దారుణాలు సార్‌! నీచాతి నీచంగా, క్రూరాతి క్రూరంగా, జరుగుతున్నయ్‌. ఒక్కడైనా.. ఒక్కడైనా సర్‌.. పట్టించుకున్నాడా? ప్రశ్నించాడా? నిలదీశాడా? పోనీ ఆపే ప్రయత్నమైనా చేశాడా? లేదు. అసలేం జరుగుతోంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్లు, మన కూతుళ్లు బైటికెళ్తే తిరిగొచ్చేంత వరకు ఎందుకుసార్‌ భయం భయంగా ఉంటున్నాం? బిక్కుబిక్కుమంటూ ఎందుకుంటున్నామ్‌? అరె వాళ్లేమైనా అడవుల్లోకి, బాంబుల మధ్య, లేదా ఎడారుల్లోకి వెళ్లిపోతున్నారా? అరె.. మనలాంటి మనుషుల మధ్యకే కద్సార్‌ వెళ్లేదీ! ఆడది బైటికొస్తే చాలు సార్‌. సందుల్లోనూ, రోడ్లల్లోనూ, బస్టాపుల్లోనూ, బస్సుల్లోనూ, రెస్టారెంటుల్లోనూ, ఆఫీసుల్లోను, పోస్టాఫీసుల్లోనూ, పార్కుల్లోనూ, కాలేజీల్లోనూ.. ఎక్కడ పడితే అక్కడ సార్‌. కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ల మధ్య నడవాలి సార్‌ మన స్త్రీ. ఎప్పుడు, ఎవడు, ఎక్కడ, ఏం చేస్తాడోననే భయం సార్‌ మనకి. అరె.. స్త్రీ అంటే సెక్సేనా? ఏంటి సార్‌ ఈ పరిస్థితి? దరిద్రం.. థూ..!’’
కోర్టు హాలు నిశ్శబ్దం అయిపోతుంది. జడ్జి నిశ్శబ్దం అయిపోతాడు. ప్రతి మనిషీ ఆలోచనతో నిశ్శబ్దంలోకి వెళ్లిపోయే రోమాంచిత సన్నివేశం ఇది. 2006లో విడుదలైన ‘రాఖీ’ చిత్రం లోనిది.

మనం అనలేని మాట, మనం చెయ్యలేని పని.. సినిమాల్లో ఇంకొకరు అనడం, చెయ్యడం తెలియని సంతోషాన్నిస్తుంది. బలహీనులకు రక్షణ లేనప్పుడు, న్యాయం జరగనప్పుడు సినిమాలో ఒక బలమైన గొంతు నినదించడం, ఒక బలమైన చెయ్యి పిడికిలి బిగుసుకోవడం చూస్తుంటే.. కసి తీరినట్లు ఉంటుంది. అదే లీగల్‌గా, లాజికల్‌గా జరిగితే.. ఇలా నిజ జీవితంలోనూ సాధ్యమౌతుందన్న నమ్మకం కలుగుతుంది. కోర్టు సీన్‌లకు అందుకే అంత అదరణ ప్రేక్షకులలో. అవి ఎప్పుడూ సామాన్యులను తమ గుండెల్లోన్ని మంటల్ని కోర్టు బోనులలో చల్లార్చుకునే అవకాశాన్ని ఇస్తాయి. వ్యవస్థనే ప్రశ్నించే అధికారాన్ని ఇస్తాయి. ఎన్టీఆర్‌ ‘బొబ్బిలి పులి’ (1982), ఏఎన్నార్‌ ‘ఆదర్శవంతుడు’ (1984), కృష్ణ ‘మహా మనిషి’ (1985), శోభన్‌బాబు ‘విజృంభణ’ (1986), బాలకృష్ణ ‘ధర్మక్షేత్రం’ (1992), చిరంజీవి ‘ఠాగూర్‌’ (2013) కోర్టు సీన్‌లకు ఈ ముప్పై ఏళ్లలోని  కొన్ని క్లాసిక్‌ ఎగ్జాంపుల్స్‌.సినిమా సీన్స్‌లో లాయర్ల వాదన కన్నా, ముద్దాయిల వాదన ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. మనం సంధించాలనుకున్న ప్రశ్నలను వాళ్లు వేస్తారు కదా! అందుకు. పైగా ఈ కోర్టు వ్యవహారాలు, పోలీసులు, చట్టం, న్యాయం.. ఇవన్నీ సామాన్యులకు దూరంగా ఉంటాయి రియల్‌ లైఫ్‌లో. వీటినే థియేటర్‌లో కూర్చొని కింగ్‌లా చూడ్డం బాగుంటుంది.లాజిక్‌ ని సినిమాల్లో కళ్లారా చూసినప్పుడు అది సినిమాలా అనిపించదు. లైఫ్‌లా అనిపిస్తుంది. లైఫ్‌ ఉన్న సినిమా అవుతుంది. ఎంతో మంది లాయర్లు నిర్దోషులకు లైఫ్‌ని ఇచ్చారు. లీగల్‌ ఫైట్‌ సన్నివేశాలున్న ఎన్నో సినిమాలు నిర్మాతలకు లైఫ్‌ని ఇచ్చాయి. మనిషికైనా, సినిమాలకైనా న్యాయం బతుకునిస్తుంది బతకనిస్తుంది. ఇదీ యువరానర్‌ ఈవారం స్టోరీ.

జాలీ ఎల్‌.ఎల్‌.బి.లు
కేవలం కోర్టు సీన్‌ వరకు కాకుండా.. చిత్రం మొత్తం లా మీద, లాయర్‌ మీద వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులకు నచ్చాయి. బాలీవుడ్‌లో వచ్చిన జాలీ ఎల్‌.ఎల్‌.బి., జాలీ ఎల్‌.ఎల్‌.బి –2 అలాంటివే. మొదటిది 2013లో, రెండోదీ 2017లో విడుదలయ్యాయి.  ఈ రెండు సినిమాల డైరెక్టరూ ఒకరే. సుభాష్‌ కపూర్‌. కథ కూడా ఆయన రాసుకున్నదే. ఫస్ట్‌ జాలీలో అర్షద్‌ వార్సీ ఢిల్లీలో ఉండే లాయర్‌. సెకండ్‌ జాలీలో అక్షయ్‌కుమార్‌ లక్నోలో ఉండే లాయర్‌. ఇద్దరి పేర్లూ సినిమాలో ‘జాలీ’నే. మూడో జాలీకి, నాలుగో జాలీకి కూడా ప్లానింగ్‌ ఉందట. ఏంటి అంత నమ్మకం? కథ బాగుందనే నమ్మకం! అర్షద్‌ వార్సీ ఇమేజ్‌నీ, అక్షయ్‌ స్టార్‌ వాల్యూని పక్కన పడేసి సుభాష్‌ కపూర్‌ సినిమా తీశాడు. అంటే కథే అసలు హీరో. రెండు సినిమాలకూ డబ్బులు పెట్టింది ఒకటే సంస్థ. ఇండియాలోని ఫాక్స్‌ స్టార్‌ స్డూడియోస్‌. ‘డబ్బులు ఎంతైనా పెడతాం’ అంది ఆ నిర్మాణ సంస్థ. ‘నమ్మకం పెట్టండి చాలు’ అన్నాడు సుభాష్‌ కపూర్‌. జాలీ ఎల్‌ఎల్‌బిని 10 కోట్లు పెట్టి తీశారు. 37 కోట్లు వచ్చింది. పెద్ద లాభం ఏం కాదు. కానీ మంచి సినిమా తీశానన్న తృప్తి సుభాష్‌కు, మంచి సినిమా చేశామన్న సంతృప్తి అర్షద్‌ వార్సీకి, మంచి సినిమా చూశామన్న సంతోషం ప్రేక్షకులకు మిగిలింది. జాలీ ఎల్‌ఎల్‌బి–2 ని 30 కోట్లు పెట్టి తీశారు. 197 కోట్లు వచ్చింది. పెద్ద లాభమే. అంతకు మించిన లాభం.. సీక్వెల్‌ కూడా ప్రేక్షకులకు నచ్చడం. ఏముంది.. అంతగా నచ్చడానికి జాలీ సిరీస్‌లో?! లైఫ్‌ ఉంది.అర్షద్‌ వార్సీ చెట్టుకింది ప్లీడర్‌. ఓ హిట్‌ అండ్‌ రన్‌ కారు కేసులో ఆరుగుని చంపిన వ్యక్తికి అనుకూలంగా వాదించిన తన ఆరాధ్య సీనియర్‌ క్రిమినల్‌ లాయర్‌కు వ్యతిరేకంగా వాదించేందుకు (డబ్బు కోసం, పేరు కోసం) సిద్ధం అవుతాడు. దిగాక అతడికి తెలుస్తుంది.. ఒక కేసు చుట్టూ ఎన్ని కుట్రలు, తెలివితేటలు, ప్రలోభాలు ఉంటాయో! ఎన్ని ఉన్నా, తట్టుకుని నిలబడి, కారు డ్రైవర్‌ని క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసి కేసు గెలుస్తాడు అర్షద్‌. కోర్టులో అతడు చేసే వాదోపవాదాల కోసమే ప్రేక్షకులు మళ్లీ మళ్లీ జాలీ ఎల్‌ఎల్‌బి కి వెళ్లారు. కానూన్‌ అంధా హోతా హై... జడ్జ్‌ నహీ.. (చట్టానికి కళ్లు లేకపోవచ్చు. కానీ జడ్జికి ఉంటాయి) అనే ఒక చిన్న డైలాగ్‌.. పెద్ద పర్వతం లాంటి మన జుడీషియల్‌ సిస్టమ్‌నే కదలిస్తుంది.

జాలీ ఎల్‌ఎల్‌బి–2 లో అక్షయ్‌ కుమార్‌ ఓ పెద్ద అడ్వొకేట్‌ దగ్గర చిన్న అసిస్టెంట్‌ లాయర్‌. సీటు లేకపోతే లీడర్‌కి, హిట్టు లేకపోతే హీరోకీ, చాంబర్‌ లేకపోతే ప్లీడర్‌కీ గౌరవం ఉండదు అని అతడి నమ్మకం. చాంబరు కట్టుకోడానికి డబ్బుల కోసం.. తను ఎవరి దగ్గరైతే అసిస్టెంటుగా ఉన్నాడో ఆ పెద్ద అడ్వొకేట్‌ వాదిస్తాడని చెప్పి ఆయనకు తెలియకుండా ఒక మహిళ కేసును (ఆమె భర్తను టెర్రరిస్టు అనే పేరుతో ఒక పోలీసు అధికారి ఫేక్‌ ఎన్‌కౌంటర్‌లో చంపేసిన కేసు) టేకప్‌ చేసి ఆమె దగ్గర్నుంచి రెండు లక్షల రూపాయలు తీసుకుంటాడు. అక్షయ్‌ చీట్‌ చేశాడని తెలుసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఇక ఆ పాపపరిహారం కోసం లక్నో నుంచి కశ్మీర్‌ వరకు పడరాని పాట్లు పడి, అసలు టెర్రరిస్టును పట్టి తెచ్చి, కోర్టులో హాజరుపరుస్తాడు. లంచం తీసుకుని అతడిని వదిలిపెట్టిన పోలీసు అధికారికి శిక్ష వేయిస్తాడు. అక్షయ్‌ ధర్మశాస్త్రాలను వల్లిస్తూ టెర్రరిస్టు ముద్దాయి నోట్లోంచి ఆత్మప్రబోధానుసారం నిజాలను కక్కించడం.. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించింది.

మరిన్ని వార్తలు