పాడి పుణ్యాన..!

9 Jul, 2019 11:41 IST|Sakshi
ఆవుల పోషణ పనుల్లో విజయగౌరి

నాగిరెడ్డి రామారావు, విజయగౌరి దంపతులది విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్‌ మండలం రాజుపేట గ్రామం. కుటుంబం కష్టాల్లో ఉన్న కాలంలో పాడి ఆవుల పెంపకం ప్రారంభించారు. కుటుంబాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. విజయగౌరి పెద్దగా చదువుకోకపోయినా ప్రతి విషయాన్ని ఆసక్తిగా నేర్చుకుంటూ.. ప్రణాళికాబద్ధంగా  పనులను చేపడుతూ ముందుకు సాగుతున్న వైనం  ఆదర్శప్రాయం. వివరాలు ఆమె మాటల్లోనే..

‘‘నా భర్త రామారావు. మాకు ఇద్దరు పిల్లలు. ఆయన రాజకీయాలలో ఆర్థికంగా చితికిపోవడంతో ఉన్న ఐదెకరాల్లో మూడెకరాల భూమిని అమ్మేశాం. చిన్నప్పటి నుండీ వ్యవసాయం, పశువుల పెంపకంలో నాకు అనుభవం ఉండటంతో పాడి ఆవుల పెంపకం చేపట్టాను. ఆర్థికంగా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఏడేళ్ల క్రితం పశు క్రాంతి పథకం ద్వారా విశాఖ డెయిరీ సహకారంతో చెన్నై నుంచి మూడు ఆవులతో పాడి పశువుల పోషణను ప్రారంభించాను. నా భర్త రామారావు సహకారంతో తరువాత పలు జాతుల ఆవులు కొన్నాం. 5 జెర్సీ, 2 హెచ్‌.ఎఫ్‌. ఆవులతోపాటు 4 ఒంగోలు, 2 సాహివాల్, 1 పుంగనూరు తదితర దేశీ జాతి ఆవులు.. మొత్తం 16 ఆవులు, 2 పెయ్యలను జాగ్రత్తగా పోషిస్తున్నాం. వ్యవసాయ శాఖ, విశాఖ డెయిరీ, పశుసంవర్ధక శాఖల సహకారంతో కో–4 గడ్డిని ఎకరంలో పెంచుతున్నాం. మిగతా ఎకరంలో వరి పండిస్తున్నాం. పశువులకు ఆరోగ్యకరమైన మేతను, దాణాని అందిస్తూ పాడిపైనే ఆధారపడి జీవిస్తున్నాం.

రోజుకు 80 నుంచి 100 లీటర్ల పాలు విశాఖ డెయిరీ వారి పాల కేంద్రానికి పోస్తున్నాం. 15 రోజులకోసారి డబ్బు చేతికందుతుంది. సగం ఆదాయాన్ని పాడి పశువుల పోషణ, బాగోగుల కోసమే ఖర్చు పెడుతున్నాం. అప్పుడప్పుడూ రోజుకు 120 నుంచి 150 లీటర్ల పాలు పోసిన రోజులున్నాయి. పశువుల పేడతోనే గోబర్‌ గ్యాస్‌ ఉత్పత్తి చేసి వాడుకుంటున్నాం. నా భర్త, నేను తెల్లవారుఝామున 3.30 గంటలకు లేచి పశువులను శుభ్రం చేసి, పాలు తీస్తాం. పశువులను /కొష్టాన్ని శుభ్రం చేయడం, పాలు తీయడం, డైరీకి పాలు అందించడం, కొన్నిపాలు గ్రామంలో అమ్మడం, పశువుల మేత/దాణా వేయటం, అవసరమైన ఆవులకు మందులు వేయడం.. ఇదే మా దినచర్య. తెల్లవారుజాము నుంచి రాత్రి 10 గంటల వరకు ఏడాది పొడవునా ఇదే మా జీవనం. ఆవులే మాకు ఆధారం. డెయిరీలో లీటరు పాల ధర రూ. 28 రూపాయలు. బయట అమ్మితే రూ. 30 నుంచి 35లు వస్తాయి. 

నా భర్త రామారావు మా ఊళ్లో విశాఖ డెయిరీ పాలకేంద్రం కార్యదర్శిగా, నీటిసంఘం అధ్యక్షులుగా బిజీగా ఉంటారు. ఆవులు, కుటుంబ బాధ్యతలు నేనే చూసుకుంటున్నాను. పాడి ఆవుల పుణ్యాన మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగి ప్రస్తుతం హాయిగా ఉన్నాం. మా అబ్బాయి నాగేంద్రకుమార్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు, అమ్మాయి యశోదను తిరుపతిలో ఇంజనీరింగ్‌ చదివిస్తున్నాం. కష్టపడటానికి ఇష్టపడే వారు నాలుగు పాడి పశువులతో హాయిగా బతికేయొచ్చు.’’– రంపా రాజమోహనరావు,బొబ్బిలి రూరల్, విజయనగరం జిల్లా

మరిన్ని వార్తలు