ఇక్కడ సాధన అక్కడ బోధన

27 Jan, 2020 02:08 IST|Sakshi

నాట్యశ్రీ

కత్యా తొషేవా! బల్గేరియా పౌరురాలు. భారతీయ కళలంటే  మక్కువ. తరచూ దక్షిణ భారతదేశంలో పర్యటిస్తూ ఉంటారు. ఇక్కడ సాధన చేసిన నృత్యాలను అక్కడికెళ్లి బోధిస్తుంటారు. ప్రస్తుతం బెంగళూరులో గురు రవి శంకర్‌ మిశ్రా దగ్గర కథక్‌ నేర్చుకుంటున్నారు. విషయం తెలిసి సాక్షి ఆమెను సంప్రదించింది. ఇ–మెయిల్‌ ద్వారా సంభాషించింది. ఆ విశేషాలివి.

ఐరోపా, ఆసియా ఖండాలకు మధ్యలో ఉండే ఓ ఒక చిన్న దేశం బల్గే రియా. అందంగా, ప్రకృతిసిద్ధం అనిపించేలా ఉంటుంది.పర్వత శ్రేణులు ఎక్కువ. నల్ల సముద్ర తీరంలో ఉంటుంది.  బల్గేరియాలోని సోఫియా ఆమె స్వస్థలం. డిగ్రీ వరకు చదివారు. పెళ్లయింది. ఇప్పుడే పిల్లలు వద్దనుకున్నట్లున్నారు. తొషేవాకు ఒక తమ్ముడు. అమ్మానాన్న డాక్టర్లు. భర్త పేరు రోజున్‌ జెన్‌కోవ్‌. ఆయనకు వాద్య పరికరాలంటే ఇష్టం. రకరకాల వాద్యాలు నేర్చుకోవటానికి ప్రయత్నించారు. చివరకు తబలా దగ్గర సెటిల్‌ అయిపోయారు. సంస్కృతిని, సంప్రదాయ కళల్ని ఇష్టపడేవారెవరైనా భారతదేశాన్నీ ఇష్టపడతారు. అలా ఈ దంపతులకూ ఇండియా ఇష్టమైన దేశం అయింది.

యోగా వల్ల ఆసక్తి
‘‘నాట్యం నేర్చుకోవాలనే కోరిక ఎవరికైనా సహజంగానే కలగాలి’’ అంటారు తొషేవా. ‘‘నేను యోగా చేయటం ప్రారంభించాక,  నాట్యం మీద ఆసక్తి కలిగింది. చివరికి నాట్యాభ్యాసం లేనిదే జీవితం లేదన్న స్థితికి చేరుకున్నారు. నాట్యం ఇప్పుడు నా ఊపిరి’’ అన్నారు తొషేవా ఓ ప్రశ్నకు సమాధానంగా. భరతనాట్యం అభ్యాసంతో ఆమె నృత్యయానం మొదలైంది. ప్రస్తుతం బెంగళూరులోని ‘సాంజలి సెంటర్‌ ఫర్‌ ఒడిస్సీ అండ్‌ కథక్‌’ లో గురు షర్మిల ముఖర్జీ  దగ్గర, పండిట్‌ మిశ్రా దగ్గర ఒడిస్సీ కథక్‌ నృత్యాలను  నేర్చుకుంటున్నారు. ‘‘కూచిపూడి నాట్యంలో మాత్రం నాకు ప్రవేశం లేదు. గురు సరస్వతి రాజేశ్‌ ద్వారా తొలిసారి కూచిపూడి గురించి తెలుసుకున్నాను’’ అన్నారు తొషేవా.

ఇష్టమైన వ్యాపకం
భార్యాభర్తలు ఏడాదంతా బల్గేరియా, భారత్‌ల మధ్య ప్రయాణిస్తూనే ఉంటారు. బల్గేరియాలో.. భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్న ‘ఇందిరా గాం«ధీ’ అనే పేరున్న ఒక పాఠశాలలో తొషేవా నాట్యానికి సంబంధించిన పాఠాలు బోధిస్తుంటారు. ‘ఇండియన్‌ డ్యాన్స్‌ స్కూల్‌ కాయా’ అని ఒక స్కూల్‌ను స్థాపించి, బల్గేరియాలోని పెద్ద పెద్ద నగరాలైన సోఫియా, ప్లొవ్‌డివ్‌లలో పిల్లలకు, పెద్దలకు నాట్యం నేర్పిస్తున్నారు. ‘‘మా అమ్మమ్మ గారి స్వగ్రామం బ్రూసెన్‌లో కూడా నాట్యం నేర్పిస్తున్నాను.

భారతదేశం పట్ల నాకున్న ప్రేమను అందరితో పంచుకోవటం కోసం, ప్రతి నెల వర్క్‌షాపులు నిర్వహిస్తూ, ప్రపంచంలోనే భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనదో ప్రసంగాలు ఇవ్వడం నాకు ఇష్టమైన వ్యాపకం. గ్రీసు, సైప్రస్, స్పెయిన్, ఫ్రాన్స్, సెర్బియా దేశాలలో నా ప్రదర్శనలకు మంచి ప్రశంసలు వచ్చాయి. అయితే అవి నాకు కాదు. భారతీయ సంస్కృతికి లభించినట్లుగా నేను భావిస్తాను’’ అంటారామె. రెండేళ్ల క్రితం భారత రాష్ట్రపతి బల్గేరియా సందర్శించిన సందర్భంలో ఆయన ముందు నాట్యం చేయటానికి ఆమెకు ఆహ్వానం అందింది. బల్గేరియా, ఫ్రాన్స్, సైబీరియా ప్రాంతాలలో భారత దేశ రాయబారుల ఎదుట కూడా ప్రదర్శనలిచ్చారు.  
వైజయంతి పురాణపండ  

మరిన్ని వార్తలు