మొగ్గలోనే తుంచేద్దాం

12 Apr, 2018 00:21 IST|Sakshi

అరె... చాలా బాగుండేవాడే అని ఆ తర్వాత అనుకుని ప్రయోజనం లేదు.అలాంటి సింప్టమ్స్‌ ఏవీ కనిపించలేదండీ అని అనుకున్నా లాభం లేదు.ముందే తెలిసుంటే బాగుండేది అని  ఆ తర్వాత పశ్చాత్తాపం పడితే ఏంటి ప్రయోజనం?డిప్రెషన్‌ అనేది ఉంది.అది ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది... భారతదేశాన్ని మరింతగా! కనిపెడదాం. నయం చేసుకుందాం.మైల్డ్‌  మాడరేట్‌ దశలో... అంటే... మొగ్గలోనే తుంచేద్దాం డిప్రెషన్‌ నుంచి విముక్తం అవుదాం!

ఒంటరిగా జీవించాల్సి రావడం, విడాకులు, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఈ సమస్య ఉండటం, తల్లి/తండ్రిని లేదా బాగా ప్రేమిస్తున్న వారిని కోల్పోవడం, ఉద్యోగం లేదా ఉపాధి కోల్పోవడం వంటివి కూడా సివియర్‌ డిప్రెషన్‌కు కారణమవుతాయి.

ప్రపంచంలో డిప్రెషన్‌తో బాధపడుతున్న వారి సంఖ్య మన దేశంలోనే అత్యధికం అని మీకు తెలుసా? మన దగ్గర ప్రతి నలుగురిలో ఒకరు ఏదో ఒక స్థాయి డిప్రెషన్‌కు లోనవుతున్నట్లు మీకు అవగాహన ఉందా?భౌతికపరమైన వ్యాధులకు సింప్టమ్స్‌ కనిపిస్తాయి. కాని డిప్రెషన్‌ వంటి మానసిక వ్యాధులకు ఎంతో అప్రమత్తంగా గమనిస్తే తప్ప ఆ వ్యాధి మనకు ఉన్నట్టు తెలియదు. గత వారం ఆత్మహత్యలకు కూడా పురిగొల్పే తీవ్రస్థాయి డిప్రెషన్‌ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు స్వల్పమైన (మైల్డ్‌), ఒక మోస్తరు (మాడరేట్‌) స్థాయి డిప్రెషన్‌ గురించి తెలుసుకుందాం.

భారంగా పరిణమించే  ఐదో అతిపెద్ద వ్యాధి ఇది... 
ప్రపంచంలో అత్యధికుల్ని బాధిస్తున్న మొదటి ఐదు వ్యాధులను లెక్కవేస్తే డిప్రెషన్‌ ఆ వరుసలో ఐదవ స్థానంలో ఉంది (మొదటి నాలుగు – శ్వాసకోశ వ్యాధులు, హెచ్‌ఐవీ–ఎయిడ్స్, కాన్పు సమయంలో కలిగే సమస్యలు, నీళ్ల విరేచనాలు). అంటే ఇది ఎంత ముఖ్యంగా పట్టించుకోవాల్సిన వ్యాధో మనకు అర్థమవుతోంది. 2020 నాటికి అన్ని వ్యాధులను అధిగమించి ఇది కనీసం రెండో స్థానానికి చేరుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా వేస్తున్నదంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో చాలామంది చాలా మానసిక వ్యాధులతో బాధపడుతుంటారు. కాని ఎక్కువమందిని బాధిస్తున్న మానసిక వ్యాధులలో మొదటి స్థానంలో ఉన్నది మాత్రం  నిస్సందేహంగా డిప్రెషనే.

దిగులుగా మారకండి... డిప్రెషన్‌కు లోనుకాకండి... 
జీవితం అంటేనే సవాళ్ల మయం. అవి ఎదురైనప్పుడు స్వీకరించి పోరాడాలి కాని డిప్రెషన్‌కు లోను కాకూడదని మానసిక వ్యాధి నిపుణులు అంటున్నారు.  మైల్డ్‌ లేదా మాడరేట్‌ డిప్రెషన్‌కు మొదటి కారణాలు సాధారణంగా ఆశాభంగాలు అని చెప్పవచ్చు. పరీక్షలో మంచి ఫలితాలు రాకపోవడం, ఇంటర్వ్యూ తర్వాత ఉద్యోగం రాకపోవడం, లవ్‌ ప్రపోజ్‌ చేసినప్పుడు అవతలి వారు కాదనడం వంటి అంశాల్లో ఆశాభంగం ఎదురవుతుంది. దాంతో డిప్రెషన్‌కు వెళ్తారు. అదే పెరిగి పెద్దదై సివియర్‌ డిప్రెషన్‌గా మారవచ్చు. ఒంటరిగా జీవించాల్సి రావడం, విడాకులు, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఈ సమస్య ఉండటం, తల్లి/తండ్రిని లేదా బాగా ప్రేమిస్తున్న వారిని కోల్పోవడం, ఉద్యోగం లేదా ఉపాధి కోల్పోవడం వంటివి సివియర్‌ డిప్రెషన్‌కు కారణమవుతాయి. ఇటీవల టీవీ రంలో ఉన్నవారు తమ షోల టెలికాస్ట్, రేటింగ్‌ల వంటి వాటి విషయంలో కూడా డిప్రెషన్‌లోకి వెళుతున్నారనడానికి ప్రముఖ కమెడియన్‌ కపిల్‌ శర్మ ఉదంతం ఒక ఉదాహరణ. శరీరంలో ఉండే కెమికల్‌ ఇన్‌బేలెన్స్‌ డిప్రెషన్‌కు లోపలి కారణమైతే ఈ బాహ్యపరిస్థితులు మరో కారణం. కనుక ఈ లోపలి, బయటి విషయలాను సమన్వయం చేసుకుంటూ సమర్థంగా డిప్రెషన్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

‘ట్రీట్‌మెంట్‌ గ్యాప్‌’ చాలా ఎక్కువ... 
మైల్డ్‌ లేదా ఒక మోస్తరు (మాడరేట్‌) డిప్రెషన్‌ వ్యాధి గ్రస్తులలో దాదాపు 50 శాతం మందికి తమకు ఆ వ్యాధి ఉన్న విషయమే తెలియదు. అలాంటప్పుడు వారు డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకునే అవకాశమే ఉండదు. ఇక మిగతా 50 శాతం మంది డాక్టరును కలిసినా వారు తాము ఎదుర్కొంటున్న శారీరక లక్షణాలను డాక్టర్లకు వివరిస్తారు. దాంతో డాక్టర్లు రోగులు పేర్కొన్న శారీరక లక్షణాలకు మాత్రమే వైద్యం చేస్తారు. ఎప్పటికీ నయం కానప్పుడు ఆ డాక్టర్లు తమ రోగుల్లో దాదాపు సగం మందిని మాత్రమే సైకియాట్రిస్ట్‌ దగ్గరకు పంపుతారు. అంటే ప్రస్తుతం కేవలం 25 శాతం మంది మాత్రమే డిప్రెషన్‌కోసం సైకియాట్రిస్ట్‌లను కలుస్తున్నారన్నమాట. అందులో దాదాపు సగం మంది... అంటే 12 శాతం మాత్రమే సైకియాట్రిస్ట్‌ చెప్పినట్లుగా పూర్తి కాల చికిత్స తీసుకుంటూ ఉంటారు. అందునా ఇక ఇప్పుడు పూర్తి సైకియాట్రీ చికిత్స అంది నయమయ్యే వారు కేవలం 5 నుంచి 8 శాతం మంది మాత్రమే. అంటే వంద మందిలో కేవలం ఐదుగురి నుంచి ఎనిమిది మందికి మాత్రమే డిప్రెషన్‌ తగ్గించగలుగుతున్నారు. దీన్నే ‘ట్రీట్‌మెంట్‌ గ్యాప్‌’ అని డాక్టర్లు వ్యవహరిస్తుంటారు. ఇదంతా అవగాహన లేమి వల్ల జరిగే ప్రక్రియ. కాబట్టి  తగిన మందులు తీసుకుంటే ఈ కొద్ది మందికి మాత్రమేగాక... అందరికీ డిప్రెషన్‌ తగ్గుతుంది. అలా జరగాలంటే ‘ట్రీట్‌మెంట్‌ గ్యాప్‌’ ఉండకూడదనేది సైకియాట్రిస్ట్‌లు చెబుతున్న మాట. డిప్రెషన్‌ కారణంగా జరిగే ప్రతి ఆత్మహత్యనూ నివారించవచ్చనే  మరో మాటనూ వారు నమ్మకంగా చెబుతున్నారు. 

డిప్రెషన్‌ చికిత్స : మందులు, సైకోథెరపీ వంటి ప్రక్రియలు, మరికొన్ని ఆధునిక చికిత్సల ద్వారా డిప్రెషన్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. సైకియాట్రిస్ట్‌ పర్యవేక్షణలో మందులు వాడుతూ సరైన చికిత్స తీసుకుంటే డిప్రెషన్‌నుంచి బయటపడేందుకూ, అది నయం అయ్యేందుకు పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. ఎలక్ట్రో కన్వల్సివ్‌ థెరపీగా పేర్కొన షాక్‌ ఇచ్చే చికిత్స ప్రక్రియ (ఈసీటీ)తో డిప్రెషన్‌ చాలా ప్రభావపూర్వకంగా తగ్గుతుంది. ఇక తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడేవారిలో ఇది ఒక మ్యాజిక్‌ లా పనిచేసి డిప్రెషన్‌ను రూపుమాపుతుంది. 

మీరు ఆరోగ్యవంతులేనా?
ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యంగా ఉంటేనే అతణ్ణి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది. ఆ.. డిప్రషనే కదా తక్కినదంతా బాగానే ఉంది కదా అనుకుంటే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు కాదు. డిప్రెషన్‌– అనగా దిగులూ వ్యాకులతా కుంగుబాటూ మనలో ఉంటే అందుకు కారణమైన అంశాలను దూరం చేసుకోకపోతే లేదా  నిర్లక్ష్యం చేస్తే...  మైల్డ్‌ డిప్రెషన్‌ మాడరేట్‌కూ... ఆ తర్వాత సివియర్‌కూ చేరవచ్చు.

డిప్రెషన్‌ – శరీరంపై ప్రభావం 
మైల్డ్‌ లేదా మాడరేట్‌ డిప్రెషన్‌ల ప్రభావం మన రోగనిరోధక శక్తిపై ఉంటుంది. దాని వల్ల రోగనిరోధక శక్తి తగ్గి అనేక శారీరక రుగ్మతలు వచ్చే అవకాశం ఎక్కువ. గుండెజబ్బులు ఉన్నవారికి డిప్రెషన్‌ ఉంటే వాళ్లలో హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశాలు మూడున్నర రెట్లు ఎక్కువ.  డిప్రెషన్‌ ఉన్నవారికి డయాబెటిస్‌ చికిత్స మామూలు వారికంటే కఠినమవుతుంది.  డిప్రెషన్‌కు తగిన చికిత్స లభించకపోతే మతిమరుపు (డిమెన్షియా) రావచ్చు.   డిప్రెషన్‌ ఉన్నవారికి థైరాయిడ్, ఇతర హార్మోన్‌ సమస్యలు రావడం ఎక్కువ. అంటే డిప్రెషన్‌కు కారణమయ్యే కెమికల్‌ ఇన్‌బేలెన్స్‌ ఇతర రసాయనాలను కూడా ప్రభావితం చేసి వ్యాధులను కలిగిస్తుందన్న మాట. పక్షవాతం, పార్కిన్‌సన్‌ డిసీజ్, తలకు గాయం, మెదడులో కణుతులు, మూర్ఛ వంటి నరాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారిలో డిప్రెషన్‌ చాలా సాధారణంగా కనిపిస్తుంటుంది.  డిప్రెషన్‌ ఉన్నవారిలో ఎముకల అరుగుదల, అస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్‌ వంటి ఎముకల సమస్యలు ఎక్కువగా రావచ్చు. మనం సాధారణంగా వాడే నొప్పి నివారణ మందులు (ఎన్‌ఎస్‌ఏఐడీ), బీపీ మందులు, గర్భనిరోధక మందులు, రక్తంలో కొవ్వుపాళ్లను తగ్గించే స్టాటిన్స్‌తో పాటు సల్ఫానమైడ్స్, స్టెరాయిడ్స్‌ వంటివి డిప్రెషన్‌ను కలగజేస్తాయి. కాబట్టి వైద్యుల సలహా లేకుండా ఇలాంటివి సొంతంగా వాడకూడదు.

మీకు మీరే చేసుకోదగ్గవి... 
డిప్రెషన్‌లో ఉన్న లక్షణాలైన నిరాశ, నిస్పృహ, నెగెటివ్‌ ఆలోచనలు రావడం, భవిష్యత్తు ఆశాజనకంగా కనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు వ్యక్తులు తమకు తామే ఈ కండిషన్‌ నుంచి బయటికి రావడాన్ని ప్రయత్నించవచ్చు. అందుకోసం అనుసరించదగిన మార్గాల్లో కొన్ని ఇవి...   తొలుత తాము ఒంటరిగా ఉండకుండా నలుగురితో కలవడాన్ని ప్రయత్నించాలి. పదిమంది వస్తూపోతూ ఉండే ప్రదేశాలకు తప్పక వెళ్తుండాలి. ప్రతివారూ ఎన్నో కొన్ని సంతోషభరిత క్షణాలు గడిపే ఉంటారు. వాటిని తలచుకోవాలి. అంతేకాదు... ప్రతికూల క్షణాలు గడిచిపోయాక... తాము అనుభవించిన తరహా క్షణాలు మళ్లీ వస్తాయని మనసుకు చెప్పుకోవాలి.  తమకు ఇంతకుముందు చాలా సంతోషాన్ని ఇచ్చిన ఇష్టమైన హాబీలు ఏవైనా ఉంటే వాటిలో మళ్లీ నిమగ్నం అయి, మునుపటి స్థితిని పొందేందుకు ప్రయత్నించాలి. తమ నైపుణ్యాలను ప్రదర్శించాలి.  గతంలో తాము చేసిన మంచి పనులు, సాధించిన అంశాలు ఏవైనా ఉంటే వాటిని మాటిమాటికీ తలచుకుంటూ... ‘అవి చేసింది నేను కదా. మరి ఇప్పుడూ అలాంటిది చేయగలను కదా. సరే చేద్దాం’ అంటూ ప్రయత్నించాలి. 

∙    వ్యాయామం మీద దృష్టి పెట్టాలి. వ్యాయామంతో మెదడులో కొన్ని సంతోషకరమైన రసాయనాలు వెలువడుతాయి. అవి డిప్రెషన్‌ను అధిగమించేందుకూ తోడ్పడతాయి. 
∙    వీటన్నింటికీ తోడు మంచి సమతులాహారం కూడా తీసుకోవాలి. 
∙    అన్నిటికంటే ముఖ్యంగా తమ మనసులోని మాటనూ, తమ నిరాశ, నిస్పృహలను తాము నమ్మే వారితో నిస్సంకోచంగా మనసు విప్పి చెప్పాలి. 

ఇతరులు చేయగలిగినవి... 
డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తి చెప్పకపోయినా... సన్నిహితులు, బంధువులు తమకు బాగా పరిచయం ఉన్న వ్యక్తినీ, తమ కుటుంబ సభ్యుడిని దగ్గరిగా గమనిస్తుంటారు. తమ తోటి వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు వచ్చినా వారు చేయాల్సినవి ఇవి... 
∙    వీలైనంతగా ఎక్కువగా వారితో సంభాషిస్తూ ఉండాలి. వారి ప్రవర్తనను తప్పు పట్టకుండా... వారి బాధను తాము అర్థం చేసుకున్నామనే ధోరణిలో సన్నిహితుల మాట తీరు ఉండాలి.  వాళ్లకు నైతిక స్థైర్యం అందించడానికి తామెప్పుడూ సంసిద్ధంగా ఉంటామనే మాటలను తరచూ చెబుతుండాలి. ఆ మేరకు వాళ్ల వ్యవహార శైలి కూడా అలాగే ఉండాలి.     ఒకరు డిప్రెషన్‌కు లోనైనట్లు గుర్తిస్తే వారిని ఎప్పుడూ ఒంటరిగా ఉంచకూడదు. కొన్నిసార్లు అది ఆత్మహత్య వంటి అనర్థాలకు కారణం కావచ్చు.    అన్నింటికంటే ముఖ్యంగా... ఒక వ్యక్తి డిప్రెషన్‌లో ఉన్నాడని అనుమానించినప్పుడు... అతడిని అనునయపూర్వకంగా డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లాలి.

కనుగొనడం ఒకింత కష్టమే గానీ... 
ఒక వ్యక్తి  విచారంగా నిరాశ నిస్పృహలతో కూడిన మాటలు మాట్లాడటం జరుగుతుంటే డిప్రెషన్‌ ఉన్నట్లు నిర్థారణ చేయడం చాలా సులభం. కానీ కొన్ని సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు లేకుండానే డిప్రెషన్‌ ఉంటుంది. ఇలా లక్షణాలు లేకుండా డిప్రెషన్‌ ఉండటాన్ని వైద్యపరిభాషలో ‘ఎటిపికల్‌ సింప్టమ్స్‌’గా డాక్టర్లు చెబుతుంటారు. లక్షణాలేమీ కనిపించవు కాబట్టి దీన్ని గుర్తించడం చాలా అనుభవజ్ఞులైన డాక్టర్లకూ కష్టమవుతుంది. అందుకే ఇటీవల ఒకరిద్దరు డాక్టర్లు సాక్షాత్తూ న్యూరో విభాగంలో  పని చేస్తూ కూడా డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు వెలుగుచూసి, సంచలనం సృష్టిస్తున్నాయి. ఇలాంటి వ్యక్తుల్లో డిప్రెషన్‌ ఒక్కోసారి చిరాకు, కోపం రూపంలో కనిపించవచ్చు. డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తులకు కేవలం తమ జీవితంలోని ప్రతికూలతలూ, నెగెటివ్‌ అంశాలు మాత్రమే పదేపదే గుర్తుకొస్తుంటాయి. వారు జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. మన చుట్టుపక్కల అలాంటి ప్రవర్తనతో కనిపిస్తున్నవారిని కూడా డిప్రెషన్‌ గురించి హెచ్చరించాల్సి ఉంటుంది. ఎంత సామాన్యుడిలోనైనా ఏదో ఒక పాజిటివ్‌ సంఘటన ఉంటుంది. సంతోషంగా గడిపిన క్షణాలూ ఉంటాయి. డిప్రెషన్‌లో ఉన్నవారు ఆ క్షణాలను ఏమాత్రం స్మరించరు. ఇలా తమ సంతోష క్షణాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కేవలం ప్రతికూలతలను గురించే ప్రస్తావించడాన్ని బట్టి మైల్డ్, మాడరేట్‌ డిప్రెషన్‌లను కనుగొనవచ్చు. అలా గుర్తించగలిగితే మనం మన ఆప్తులను రక్షించుకోవచ్చు. 

►డిప్రెషన్‌ను కనుగొని చికిత్స అందిస్తే... సమాజానికి పనికి వచ్చే చాలా మంది విలువైన వారితోపాటు...  ఎంతో కాలాన్నీ, శ్రమనూ, అధ్యయనాన్నీ, ధనాన్ని వెచ్చిస్తే గానీ తయారు కాని డాక్టర్లు, ఇంజనీర్లు, ఇతర సునిశిత వ ృత్తివిద్యానైపుణ్యాలు ఉన్న విలువైన మానవ వనరులను మనం కాపాడుకోవచ్చు.  

ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ శ్రీనివాస్‌ ఎస్‌ఆర్‌ఆర్‌వై
ప్రొఫెసర్‌ అండ్‌ హెచ్‌ఓడి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైకియాట్రీ కాకతీయ మెడికల్‌ కాలేజ్, వరంగల్‌ 

మరిన్ని వార్తలు