మధురానుబంధానికి ఏడడుగులు

13 Apr, 2018 00:12 IST|Sakshi

భార్య–భర్త 

ఇంటికి వచ్చిన అతిథికి కాఫీ ఇస్తూ, ‘పంచదార వేయొచ్చా?’ అని అడగడం సర్వ సాధారణం అయిపోయింది. మిథునం కథలో శ్రీరమణ ‘ప్రతివారికి శంఖుచక్రాల్లా బీపీ షుగర్లు ఉంటున్నాయి’ అని చమత్కరించారు. అది వాస్తవం కూడా. మధుమేహం (షుగర్‌) ఏ కారణం వల్ల వచ్చినా, మధుమేహం వచ్చినవారు వారు మాత్రమే కాకుండా వారి జీవిత భాగస్వామిపైన కూడా ఆ ప్రభావం ఉంటుంది. ప్రభావం అంటే.. మధుమేహం వారిపై వారి భాగస్వామి మరింత శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఏర్పడడం. మధుమేహాన్ని భాగస్వామి తన నియంత్రణలో ఉంచుకునేలా వారు ప్రోత్సహించాలి. ఇది కొత్త బాధ్యతే కావొచ్చు. కాని తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన బాధ్యత. 

ఒత్తిడిని తగ్గించాలి: మధుమేహం వచ్చిందని తెలియగానే భాగస్వామికి తాను భారంగా ఉన్నాననే భావనలో పడిపోతారు. అది తప్పు అని చెప్పాలి. ఒత్తిడి పెరిగే కొద్దీ  వ్యాధి పెరుగుతుంది కనుక, ఒత్తిడి పడకుండా, ఎప్పటికప్పుడు వ్యాధిని నియంత్రణలో ఉంచుకునేలా వారితో ప్రేమగా మాట్లాడుతుండాలి.

శ్రద్ధ తీసుకోవాలి: మధుమేహం గురించి పూర్తిగా అవగాహన కలిగించాలి. మొదట్లో కొన్నిసార్లయినా డాక్టరు దగ్గరకు భాగస్వామితో కలిసి వెళ్లి, వ్యాధి గురించి వివరంగా అడిగి తెలుసుకోవాలి, మధుమేహం గురించి బాగా చదవాలి. ఎంత తెలుసుకుంటే, అంత జాగ్రత్తగా ఉండొచ్చని, భయపడటం అనవసరమని చెబుతూ ఉండాలి. 

కలిసి వాకింగ్‌: మధుమేహం అనేది జీవన విధానంలో ఒక అసమతుల్యతని, వ్యాధి తగ్గడానికి సమష్టి కృషి అవసరమని, భాగస్వామితో చర్చించి, ఏం చేయాలనే అంశం నిర్ణయించుకోవాలి. ఎటువంటి విషయంలో సహాయం అవసరమవుతుందో ముందుగానే చర్చించుకోవాలి. ఉదాహరణకి ఆరోగ్యకరమైన ఆహారం గురించి సూచించడం, వాకింగ్‌ చేసేలా సహకరించడం, వారితో పాటు వాకింగ్‌కి వెళ్లడం. 

శాసించకూడదు: నిరంతరం ఏదో ఒక జాగ్రత్త చెబుతూంటే, భాగస్వామికి చిరాకు కలిగి, చాలాకాలం పాటు వ్యాధిని నిర్లక్ష్యం చేస్తారు. ఇది చాలామందిలో కనిపిస్తుంది. ఏ ఒక్కరూ ఆరోగ్యం విషయంలో క్రమశిక్షణతో ఉండరనే  గుర్తించాలి. మీరు కూడా మీ ఆరోగ్యాన్ని ప్రతిరోజూ శ్రద్ధతో కాపాడుకోరనే విషయం గుర్తు తెచ్చుకోవాలి. మనకు ఇష్టులైనవారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే బాధ కలుగుతుంది. అలాగని నిత్యం నస పెడుతున్నట్లుగా జాగ్రత్తలు చెప్పడం వల్ల ఆరోగ్యం కుదుట పడదని గ్రహించాలి. మధుమేహం కారణంగా శారీరకంగా బాధపడుతుంటే గమనించి, వారికి మరింత సహకరించాలి. ఆ రోజు వరకు వారు ఎంత చక్కగా పనిచేసారోనని ప్రశంసిస్తూ, 2,3 రోజులు విశ్రాంతి తీసుకోమని సూచించాలి.

కొన్ని మానేయాలి: జీవన విధానంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాలి. భాగస్వామి ఎదురుగా జంక్‌ ఫుడ్‌ తింటూ, టీవీ చూస్తూ కూర్చోకూడదు. భాగస్వామి కోసం చిన్న చిన్న త్యాగాలు చేయాలి. ఆహారనియమాలు పాటిస్తూ, వ్యాయామం చేయడానికి సహకరించాలి. ఇద్దరూ కలిసి జిమ్‌లో చేరాలి. తీపి తినడం, పొగతాగటం, మద్యం సేవించడం వంటి అలవాట్లను విడిచిపెట్టాలి. చెడు అలవాట్లను విడిచిపెట్టి, ఆరోగ్యంగా జీవించడానికి ఇదొక మంచి అవకాశంగా భావించాలి.
ఓర్పు అవసరం: పదే పదే వ్యాధి గురించి మాట్లాడకూడదు. భాగస్వామికి ఆసరాగా ఉంటున్నారనే విషయం వారు నెమ్మదిగా అర్థం చేసుకునేవరకూ ఓరిమితో ఉండాలి. వారి కోసం  తప్పక సమయాన్ని కేటాయించాలి. 

నిపుణుల సహకారం: వ్యాధిని నియంత్రించుకునే ఈ సుదీర్ఘ ప్రయాణంలో నిపుణుల అభిప్రాయాలు తీసుకోవడం అవసరం. వైద్యులను తరచుగా కలుస్తూ ఉండటం వల్ల సందేహాలు పోతాయి. వెళ్లిన ప్రతిసారీ వైద్యునితో వివరంగా అన్నీ చెప్పాలి. డైటీషియన్‌ దగ్గర నుంచి డైట్‌ప్లాన్‌ తెచ్చుకోవాలి.  ఇలా అన్ని విషయాల్లో భాగస్వామితో ‘మనసున మనసై’ అన్నట్లు ఉండడం వల్ల తమకు మధుమేహం వచ్చిందనే ఫీలింగ్‌ బాధించదు. పైగా త్వరగా నియంత్రణలోకి వస్తుంది.

>
మరిన్ని వార్తలు