లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌

29 Apr, 2020 07:42 IST|Sakshi

ఉల్లాసం.. ఉత్సాహం
అరవై మంది భారతీయ యువ వైద్యులు 2013 నాటి ఫరేల్‌ విలియం ఉల్లాస గీతం ‘హ్యాపీ’ ని అనుకరిస్తూ డాన్స్‌ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ‘ఈ కరోనా సమయంలో మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని మీకు గుర్తు చేయడానికే మేమున్నాం. రేపటి సూర్యోదయం మన కోసం మరింత ప్రకాశవంతంగా ఉంటుందన్న ఆశతో..’ అంటూ ముంబై, పుణె, ఢిల్లీ, నాగపుర్, కన్యాకుమారి, ఇంకా వివిధ నగరాల్లోని వైద్యులు ఈ వీడియోలో ఆకాంక్షించారు. వాళ్లేమీ పాడరు, మాట్లాడరు. ఎక్కడి వాళ్లక్కడే ఊరికే డాన్స్‌ చేస్తుంటారు. ఆ డాన్స్‌లన్నిటి కూర్పే.. ఈ సాంగ్‌ ఆఫ్‌ హోప్‌. ఆశలు కోల్పోకండి. సంతోషంగా ఉండండి అని చెప్పడమే ఉద్దేశం.

తప్పు తప్పే


పోషా కారు నడుపుతున్నాడు కుర్రాడు. కారుకు దీటుగా ఉన్నాడు. లాక్‌డౌన్‌లో ఎందుకో బయటికి వచ్చాడు. ‘ఎందుకో కాదు. ఖాళీ రోడ్లపై విహరించేందుకు వచ్చాడు చిన్నినాయన’ అంటున్నారు స్పెషల్‌ ఫోర్స్‌ వాళ్లు. కలవారి అబ్బాయి. మధ్యప్రదేశ్‌లో పెద్ద బిజినెస్‌మేన్‌ కొడుకు. మామూలు పోలీసులైతే పోనీలే అనుకుని వదిలేసేవారేమో. ఆపింది ఇండోర్‌ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌ మెంబర్‌. కారును పక్కన పెట్టించి రోడ్డు మీద గుంజీళ్లు తీయించాడు. పాస్‌ చూపిస్తున్నా వదల్లేదని కుర్రాడి తండ్రి ఆరోపణ. దీనిపై వెంటనే ఇండోర్‌ ఎఎస్పీ వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. ‘పాస్‌ వుంది నిజమే. మాస్క్‌ లేదు’ అని ఆయన సమాధానం!

పక్కపక్క వార్డులు


తల్లికి కరోనా పాజిటివ్‌. ఆమె జన్మనిచ్చిన బిడ్డకు కరోనా నెగటివ్‌. ఇద్దర్నీ వేర్వేరు వార్డుల్లో ఉంచారు. బిడ్డను తాకడానికి, కనీసం చూసుకోడానికి లేదు. ఏప్రిల్‌18న పుట్టింది బిడ్డ. ఆరోజు నుంచి.. వైద్యులు ఏర్పాటు చేసిన వీడియో కాల్‌ లోనే బిడ్డను చూసుకుని సంతృప్తి పడుతోంది ఆ తల్లి. ఔరంగాబాద్‌  సివిల్‌ ఆసుపత్రిలో (మహారాష్ట్ర) ఆమెకు సిజేరియన్‌ జరిగింది. స్పృహలోకి రాగానే బిడ్డను చూపించమని బతిమాలింది. ‘‘ఇప్పుడొద్దమ్మా..’’ అన్నారు. వైద్యులకూ చూపించాలనే ఉంది కానీ, కరోనా వార్డులోకి బిడ్డను తీసుకెళ్లడం, కరోనా వార్డు నుంచి తల్లి రావడం రెండూ ప్రమాదమే అని నచ్చజెప్పారు. సోషల్‌ మీడియాలో కొందరు ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ‘‘దేవుడా.. ఈ తల్లీ బిడ్డల్ని వేరు చేయకు’’ అని వేడుకుంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.  

మరిన్ని వార్తలు