రైతొక్కడే

7 Sep, 2019 07:54 IST|Sakshi

సందర్భం

నీళ్లుండవు. వానలుండవు. విత్తనాలు ఉండవు. ఎరువులు ఉండవు. రైతొక్కడే ఉంటాడు. తెల్లారే లేచి పండించడానికి వెళతాడు. ఆశ! కాల్వ పారకపోతుందా, ఆకాశం కురవకపోతుందా, విత్తనాలు రాకపోతాయా, ఎరువుల లారీలు లోడు దించకపోతాయా అని.. ఆశ.

పాలనల్లో తేడాలుంటాయేమో,పంట భూముల్లో చిందే స్వేదంలో భేదాలుండవు. రైతు పడే కష్టం, రైతు మీద పడే నష్టం.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలమైనా,ఈ భూమండలంలో ఇంకోచోట మరోచోట అయినా ఒకటే.-మాధవ్‌ శింగరాజు

అసలుకైతే ‘రాజు’ అని పిలవాలి ఆయన్ని. అసలైన రాజొకరు ప్రజల్ని పరిపాలిస్తూ ఉంటారు కనుక ఆయన్ని రైతు అని పిలవక తప్పదు. ఆ రైతుకు ఒక పేరుంది. ఒకవేళ ‘రాజు’ అనేదే ఆ రైతు పేరు అయివున్నా, ‘రాజు’ అనే ఆ పేరు కన్నా ‘రైతు’ అనేది సిరి గల పేరు కాబట్టి ఆయన్ని రైతు అనడమే ఆయనకు సరితూగే మాట.గింజల కోసం పక్షులు రైతు ఇంటిని వెతుక్కుంటూ వస్తాయి. గింజల్ని చేర్చడం కోసం రైతే ప్రజల్ని, రాజప్రాసాదాన్ని, మంత్రివర్యుల ఇళ్లను వెతుక్కుంటూ వెళ్తాడు. గింజల్ని పండించి, బస్తాలు దించే పక్షి ఆయన. అలాంటి పక్షి రైతు ఒకరు మొన్న గురువారం.. చెట్టుపై నుంచి టప్పున రాలి పడినట్లుగా.. నిలుచున్న చోటే నేలన పడి కన్నుమూశాడు. కరెంటు తీగ మీద పక్షులన్నీ ఒక వరుసలో వాలి నిలబడినట్లు.. యూరియా కోసం రైతులంతా ఒక వరుసలో నిలబడి వేచి ఉన్నప్పుడు, మూడు రోజులుగా అలాగే నిలబడి నిలబడి చివరికి నేలకు కూలబడి తలవాల్చేశాడు. ఆయన వయసు 69 ఏళ్లు. నలుగురు కూతుళ్లు. పెద్ద కూతురి భర్త ఏడేళ్ల క్రితం చనిపోయాడు. ఏడేళ్ల క్రితమే ఆమె పుట్టింటికొచ్చేసింది. రెండో కూతురు పెళ్లయింది. మెట్టినింటికి వెళ్లిపోయింది. మూడో కూతురు వికలాంగురాలు. నాలుగో కూతురికి నాలుగు నెలల క్రితమే పెళ్లి చేశాడు. పెళ్లి కోసం అప్పు చేశాడు. అదింకా తీరనే లేదు.. అకస్మాత్తుగా గుండె ఆగి చనిపోయాడు. ఇప్పుడు ఆయన భార్య ఒంటరి రైతు. ఆయన చనిపోయే క్షణాల్లో ఆమె ఇంకో వరుసలో నిలబడి ఉన్నారు.. ఈ వరుసలో రాకపోయినా, అదృష్టం ఉంటే ఆ వరుసలోనైనా యూరియా వస్తుందని. 

చనిపోయిన రైతు పేరు, చనిపోయిన రైతు ఊరు చెప్పుకోవడం రైతును ఒక ముక్కకో, చెక్కకో పరిమితం చేయడమే. రాజుకు ఒకటే రాజ్యం. ఏ రాజ్యంలోనైనా రైతు పండించినదే భోజనం. పాలనల్లో తేడాలుంటాయేమో, పంట భూముల్లో చిందే స్వేదంలో భేదాలుండవు. రైతు పడే కష్టం, రైతు మీద పడే నష్టం.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలమైనా, ఈ భూమండలంలో ఇంకోచోట మరోచోట అయినా ఒకటే. నీళ్లుండవు. వానలుండవు. విత్తనాలు ఉండవు. ఎరువులు ఉండవు. రైతొక్కడే ఉంటాడు. తెల్లారే లేచి పండించడానికి వెళతాడు. ఆశ! కాల్వ పారకపోతుందా, ఆకాశం కురవకపోతుందా, విత్తనాలు రాకపోతాయా, ఎరువుల లారీలు లోడు దించకపోతాయా! యూరియా కోసం మూడు రోజులు ఆశపడ్డాడు ఆ రైతు. మూడో రోజు శ్వాస వదిలాడు. అన్నం పెట్టే రైతు ఎర్రటి ఎండలో ఎరువుల కోసం విస్తరి పట్టుకుని వరుసలో నిలుచోవడం ఏంటి! ‘రైతన్నా.. నువ్వు ఇంటికెళ్లు.

నీ ఇంటికే ఎరువొస్తుంది’ అనే చెప్పే రాజు ఏడి? ‘రైతన్నా.. రాజుగారు పంపించారు నీకు విత్తనా లిమ్మని’ అని రైతు ఇంటికి వెళ్లి తలుపు తట్టే మంత్రి ఏడి? ‘రైతన్నా.. ఇన్నాళ్లూ పండించావు. డెబ్బై ఏళ్లొచ్చినా ఇంకా పండిస్తానంటున్నావ్‌. నీ బదులు నేను వరుసలో నిలబడి ఎరువు తెస్తా. ఆ నీడన కూర్చో’ అనేవాళ్లు ఏరి?! అనేవాళ్లు లేకపోయినా.. రైతు తరఫున అడిగేవాళ్లు లేకుండా పోతారా? ‘‘ప్రభుత్వమే చంపేసింది ఈ వృద్ధ రైతుని’’ అన్నారు. ‘‘సినిమా టిక్కెట్ల కోసం క్యూలో నిలుచుని గుండెపోటుతో చనిపోతే సినిమా హాలు ఓనరు బాధ్యుడవుతాడా?’’ అన్నారు మంత్రి గారు! ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం క్యూలో నిలబడినవారు, పంట పండించడం కోసం వరసగట్టినవారూ ఒకటేనా?! రైతు చనిపోడానికి గుండెపోటే కారణం అయినా, గుండెపోటు రావడానికి ఒక కారణం ఉంటుందిగా? నోట్లు రద్దయినప్పుడు ఏటీఎంల దగ్గర నిలబడి చనిపోయినవారు, డెడ్‌లైన్‌లు దగ్గర పడినప్పుడు ‘ఆధార్‌’ కోసం నిలబడి చనిపోయినవారు, ఇప్పుడు యూరియా కోసం నిలబడి చనిపోయిన రైతూ.. వీళ్లందరికీ క్యూలో ఉన్నప్పుడే గుండెపోటు ఎందుకు వచ్చింది? ఎందుకు వస్తోంది?  భారతదేశంలో ఐదు వేల ఏళ్ల క్రితమే వ్యవసాయం మొదలైందన్న సీసీఎంబీ పరిశోధనా ఫలితం ఒకటి ఆ రైతు చనిపోయిన రోజే బయటికి వచ్చింది. ఐదు వేల ఏళ్లుగా రైతు వ్యవసాయం చేస్తున్నా.. ప్రభుత్వాలు  ఈనాటికీ ఆయన్ని ‘లైన్‌’లో నిలబెట్టకుండా చిన్న సాయం కూడా చేయలేకపోతున్నాయి!     

మరిన్ని వార్తలు