లైసెన్స్‌లో అమ్మ పేరు

28 Mar, 2018 00:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మహిళలు ఇంటిని నడిపారు, ప్రపంచాన్నీ నడిపిస్తున్నారు.   అయితే ఎక్కడ, ఏ రంగంలో ఏ అప్లికేషన్‌ ఫామ్‌ నింపాలన్నా వీరి పేరు నడవడం లేదు! ఇప్పుడా పరిస్థితి క్రమంగా మారుతోంది.

ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వేస్తున్న ఈ తొలి అడుగు... స్త్రీ పురుష సమానత్వం సాధన కోసమా, అభ్యుదయ పథంలోపయనించడానికా అనేది పక్కన పెడితే అది..  ఒక సామాజిక అవసరం అయిందనే చెప్పాలి.

ఓ సింగిల్‌ ఉమన్‌ పేరెంట్‌ తన బిడ్డను స్కూల్లో చేర్చాలంటే ఆ బిడ్డ తండ్రి పేరు రాయవలసిన కాలమ్‌ మాత్రమే కనిపిస్తుంది. స్కూలు ఫీజు కట్టడానికి, బుక్స్‌ కొనడానికి తల్లి డబ్బు పనికొస్తుంది. కానీ అప్లికేషన్‌ ఫారమ్‌లో తల్లి పేరు రాయడానికి కాలమ్‌ ఉండదు! ఆ తండ్రి అనే మనిషి పాపాయి పుట్టినప్పటి నుంచి ముఖం చూడకపోయినా, తన ముఖం బిడ్డకు చూపించకపోయినా సరే తండ్రి కాలమ్‌ తప్పని సరి!

సాఫ్ట్‌వేర్‌లోనే దారి లేదు!
‘నేను పెళ్లి చేసుకోలేదు, బిడ్డను దత్తత తీసుకున్నాను, తండ్రి కాలమ్‌ నింపడం కుదరదు’ అని వాదించి, సుస్మితాసేన్‌ లాంటి వాళ్లు ఒక దారి చూపారు. ఆ దారిలో నడిచేందుకు సమాజంలో అనేక మంది సింగిల్‌ ఉమన్‌ సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ వాదనను అంగీకరించడానికి స్కూళ్లు, కాలేజ్‌లు ఇటీవలి వరకు సిద్ధంగా ఉండేవి కాదు. కొన్ని స్కూళ్లు అందుకు సంసిద్ధంగా ఉన్నప్పటికీ కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌లో ఆ కాలమ్‌ ఉండదు. కాబట్టి గార్డియన్‌ కాలమ్‌ దగ్గరే తల్లి పేరు రాసుకోవాల్సి వచ్చేది. అలాగే ఇతర రంగాలు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 1 నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌ అప్లికేషన్‌ ఫామ్‌లో తల్లి పేరున కూడా ప్రత్యేకంగా ఒక కాలమ్‌ ఇవ్వడానికి ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

సమానత్వం కాదు.. అవసరం
ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వేస్తున్న ఈ తొలి అడుగు... స్త్రీ పురుష సమానత్వం సాధన కోసమా, అభ్యుదయ పథంలో పయనించడానికా అనేది పక్కన పెడితే అది.. ఒక సామాజిక అవసరం అయిందనే చెప్పాలి. ఇప్పుడు అనేక కారణాలతో సింగిల్‌ పేరెంట్స్‌ ఎక్కువవుతున్నారు. ఇండియాలో సింగిల్‌ పేరెంట్‌ అంటే సాధారణంగా.. తల్లి మాత్రమే. అలా తల్లి పెంపకంలో పెరిగిన పిల్లలు ఏ అప్లికేషన్‌లో అయినా తల్లి పేరు మాత్రమే రాయగలుగుతారు. ఒకవేళ తండ్రి పేరు ఫలానా అని తల్లి చెప్పినా సరే... బాధ్యత లేని ఆ తండ్రి పేరుతో తమ ఐడెంటిటీని ఇష్టపడటం లేదు ఈ తరం పిల్లలు. వీటన్నింటి దృష్ట్యా ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ విభాగం తల్లి పేరుతో డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇవ్వడానికి సిద్ధమైంది. వచ్చే ఏప్రిల్‌ ఒకటి నుంచి ఇది అమలులోకి రానుంది.  

మిగతావీ తల్లి పేరు మీదే
ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఇచ్చే డ్రైవింగ్‌ లైసెన్స్‌ దేశమంతటా చెల్లుబాటులో ఉంటుంది. ఈ ఐడీ ప్రూఫ్‌ ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే మరే కార్డు అయినా తల్లి పేరుతోనే ఉంటుందని, దేశంలో ఇలాంటి మంచి పనికి శ్రీకారం చుట్టిన తొలి రాష్ట్రం ఢిల్లీనే అని అధికారులు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాస్‌పోర్ట్‌ విషయంలో ఈ వెసులుబాటు కల్పించింది. భార్యాభర్తలు విడిపోయిన సందర్భాలలో వారి పిల్లలు నాచురల్‌ గార్డియన్‌ అయిన తల్లి సంరక్షణలో ఉండే అవకాశాలే ఎక్కువ. ఆ పిల్లలకు జారీ చేసే పాస్‌పోర్టులో తండ్రి పేరు ఇప్పుడు తప్పని సరి కాదు. అయితే డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇవ్వడంలో చొరవ తీసుకున్నది మాత్రం ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వమే. ఓ పదేళ్ల కిందట ఒక మహిళ తాను సింగిల్‌ పేరెంట్‌నని చెప్పుకోవడానికి బిడియ పడేది. అప్పటి సామాజిక పరిస్థితులు అలా ఉండేవి. ఇప్పుడిక  ఇలాంటి భరోసా కూడా దొరికితే ఇకపై ధైర్యంగా జీవించగలుగుతారు. వాళ్ల పిల్లలను వేధిస్తున్న ‘మీ నాన్న ఎవరు? ఎప్పుడూ కనిపించడేంటి’ వంటి ప్రశ్నలు దాదాపుగా ఉండవు. 

హర్‌ నేమ్‌ యొలాండా రీనీ
‘ఐ హ్యావ్‌ ఎ డ్రీమ్‌’ అన్నారు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌. ఇప్పుడు ఆయన మనవరాలు 9 ఏళ్ల యొలాండా రీనీ అదే మాట అంటోంది. నలుపు, తెలుపు అనే తేడా లేకుండా మనుషులంతా ఒక్కటే అవ్వాలని మార్టిన్‌ కలగన్నారు. ‘అయిందేదో అయింది. గన్‌ కల్చర్‌ లేని గొప్ప దేశం కావాలి అమెరికా’ అని యొలాండా ఇప్పుడు కలగంటోంది. శనివారం వాషింగ్టన్‌లో జరిగిన ‘మార్చ్‌ ఫర్‌ అవర్‌ లైవ్జ్‌’ ప్రదర్శనలో మాట్లాడే చాన్స్‌ వచ్చినప్పుడు.. యొలాండా తన శక్తిమంతమైన గొంతుతో వేలాదిమందిని ఉర్రూతలూగించింది. ఎవరినైనా కట్టిపడేసే కంఠం అది. ఇంకో 27 ఏళ్ల తర్వాత 2036లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలను మలుపు తిప్పే స్వరం అది. అప్పటికి ఏడాది ముందు మాత్రమే యొలాండాకు అధ్యక్షురాలిగా పోటీ చేసే కనీస వయసు (35 ఏళ్లు) వస్తుంది.

లతీతియా కాయ్‌
‘ఆహా.. ఎంత అందమైనదీ ప్రపంచం?!’ అని విస్మయం చెందుతుంది లతీతియా కాయ్‌. అత్యాచార దోషాన్ని బాధితుల మీదికే నెట్టేసే ఈ ప్రపంచంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసే తీరు ఇది! ఈ ఐవరీ కోస్ట్‌ దేశపు టీనేజ్‌ కళాకారిణి.. సామాజిక రుగ్మతలను ప్రశ్నించడానికి తరచు తన జుట్టును కూడా ముడి వేస్తుంటుంది. ‘మీటూ’ఉద్యమానికి మద్దతుగా లతీతియా వేసుకున్న ఈ ముడి.. వాటిల్లో ఒకటి. మినీస్కర్ట్‌లు వేసుకుంటున్నందువల్లనే అమ్మాయిలపై లైంగిక దాడులు జరుగుతున్నాయనే వాదనకు నిరసనగా ఈ అమ్మాయి ఇలా ‘హెయిర్డ్‌’ చేసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోను పోస్ట్‌ చేసుకుంది. ఇదొక ఆలోచనాత్మకమైన సందేశం.

ఆరాధ్యా రాయ్‌
అచ్చం ఐశ్వర్యలా ఉన్న ఆరాధ్య ఫొటోను చూసి సోషల్‌ మీడియా ఇప్పుడు ముద్దుగా మెటికలు విరుస్తోంది. ఇందులో ఆ నవ్వు, ముఖ కవళికలు అచ్చు అమ్మనే పోలివున్నాయి. ‘ఆరాధ్య తనకు తానుగా, వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిగా ఎదగాలి’ అని ఐశ్వర్య అదే పనిగా అంటుంటారు. ఇక ముందు అలా అనే అవసరం ఆమెకు ఉండకపోవచ్చు. గ్లామర్‌ ఫీల్డులో ఉన్న అమ్మానాన్నను, తాతయ్యను చూస్తూ పెరుగుతున్న ఆరాధ్య ఒక మామూలు అమ్మాయిగా పరిణతి చెందడాన్ని ‘బిగ్‌’ ఫ్యామిలీ ఆనందంతో వీక్షిస్తోంది. 

బనితా సంధూ
ఏప్రిల్‌లో విడుదల అవుతున్న ‘అక్టోబర్‌’ చిత్రంలో ప్రధాన కథానాయికగా మనం ఈ అమ్మాయిని చూడొచ్చు. పేరు బనితా సంధూ. అయితే అది హిందీ చిత్రం. అంతమాత్రాన ఆమెను చూడలేకపోతామని తెలుగువాళ్లం నిరాశ చెందే పనే లేదు. నటనలో ఆమె ప్రదర్శించిన ‘ఒడుపు’ను చూసి ముగ్ధుడైన చిత్ర దర్శకుడు షూజిత్‌ సర్కార్‌.. ఆమె ఎలా చేస్తే అలా చెయ్యనిచ్చి, అదే అసలైన నటన అని ప్రశంసించడంతో పాటు.. ‘పరభాషా చిత్రాలకు త్వరలోనే మీకు పిలుపు వస్తుంది’ అభినందించారు కూడా! బనితా వయసు ఇరవై. లండన్‌లో పుట్టారు. లండన్‌లోనే చదువుతున్నారు. పీజా తినడం, స్పెయిన్‌ వెళ్లడం ఆమెకు ఇష్టమైన విషయాలు.  
–మంజీర

మరిన్ని వార్తలు