మహిళలం కావడమే మన గుర్తింపు... మన గౌరవం

26 Apr, 2018 23:14 IST|Sakshi
రాణీ ముఖర్జీ 

ఫెమినిజం

ఫెమినిజం లేదా స్త్రీవాదం అనే భావనకు దశాబ్దాలుగా ఎవరికి తోచిన భాష్యం వారు చెబుతూ వస్తున్నారు.  చివరికి దానినొక గౌరవం లేని పదంగా మార్చేసింది పురుషాధిక్య సమాజం. ఇదే విషయమై బాలీవుడ్‌ నటి రాణీ ముఖర్జీ ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు కొన్నింటిని వెల్లడించారు. 

గౌరవం కనీస హక్కు
మహిళ ఎట్టి పరిస్థితుల్లోనూ తన గుర్తింపును తాను కోల్పోకుండా ఉండగలగడమే అసలైన ఫెమినిజం అంటున్నారు రాణీ ముఖర్జీ. ఫెమినిజం అంటే... స్త్రీ ఒక మగవాడితో కలిసి జీవించే క్రమంలో తన వ్యక్తిత్వాన్ని, గుర్తింపును కోల్పోకుండా నిలబెట్టుకుంటూ జీవించగలగడమేనంటోందామె. ‘‘భర్తకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే తనకు దక్కాల్సిన గౌరవం దక్కించుకోవాలి. భార్య స్థానం కోసం వ్యక్తిగా తను రాజీపడాల్సిన పరిస్థితి రాకూడదు’’ అంటున్నారామె. అలాగే... ‘‘సమానత్వం అని నినదిస్తూ దైనందిన జీవితంలో తనను తాను కోల్పోవడం కాదు ఫెమినిజం అంటే. మార్పు దిశగా అడుగు వేయాలి, సమాజాన్ని మార్చడానికి మరో అడుగు వేయాలి’’ అని కూడా రాణి అన్నారు.  

మాతృత్వపు మధురిమ
ఓ బిడ్డకు తల్లి కావడంలో ఉండే మధురానుభూతి చాలా గొప్పది అంటారు రాణి. కూతురు ‘అధిర’ కు జన్మనివ్వడం ద్వారా తాను తల్లి పాత్రలోకి మారానంటూ ఓ బిడ్డకు తల్లిగా తన్మయత్వాన్ని పొందుతున్నారు ఆమె. ఈ కోణంలో సినీ పరిశ్రమ దృష్టిని,  ప్రాచ్య, పశ్చిమ దేశాలలో స్త్రీ పరిస్థితిని ఆమె విశ్లేషించారు. ‘‘పాశ్చాత్య దేశాల్లో చాలా వరకు స్త్రీకి, పురుషునికి మధ్య ఎలాంటి భేదాలు చూపించరు. నటీనటులకు కూడా అదే సూత్రం వర్తిస్తుందక్కడ. నటిగా స్థిరపడడం, పెళ్లి చేసుకోవడం, బిడ్డకు జన్మనివ్వడం వంటివన్నీ ఒకదానికొకటి సమాంతరంగా జరిగిపోతుంటాయి. ఇండియాలో అలా ఉండదు ’’ అంటారు రాణీ ముఖర్జీ. అంటే పెళ్లి కాగానే  నటిగా ఆమె కెరీర్‌ ఆగిపోతుందని. 

వ్యక్తిగా తొలి గుర్తింపు
బాల్యంలో ఫలానా వారి అమ్మాయి, ఫలానా ఇంటి కోడలు లేదా ఫలానా వ్యక్తి భార్య, వార్ధక్యంలో ఫలానా వారి తల్లి.. ఇదీ మహిళకు భారతీయ సమాజం ఇచ్చిన గుర్తింపు. ‘మహిళ గుర్తింపు ఇలాగే ఉండాలి, ఇలా ఉండడమే ఆమెకి గౌరవం’ అనే తనదైన నిర్వచనం చెప్పిన సమాజం మనది. ఇప్పుడిప్పుడే వ్యక్తి.. వ్యక్తిగా గుర్తింపు పొందే సంస్కృతి వైపు అడుగులు పడుతున్నాయి. అవే అసలైన ఫెమినిజం ఉన్న సమాజ నిర్మాణం దిశగా పడుతున్న అడుగులు’’ అంటారు రాణీ ముఖర్జీ.  ఇండియాలో ఒక నటుడు పెళ్లి చేసుకుని, బిడ్డకు తండ్రయి నటుడిగా తన కెరీర్‌ని యథాతథంగా కొనసాగించడానికి అంగీకరిస్తారు. కానీ ఒక నటి పెళ్లి చేసుకుని బిడ్డను కనడాన్ని ఔదార్యంతో స్వీకరించలేరు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు