నేరపరిశోధనలో నారీమణి

3 Oct, 2018 01:11 IST|Sakshi

అత్యాచారాలు.. హత్యలు.. దోపిడీలు.. ఇంకా క్రూరాతి క్రూరమైన లైంగిక నేరాలలో.. నిజ నిర్ధారణ సవాళ్లతో కూడుకున్న పని. అయితే ‘ఫోరెన్సిక్‌ ఒడంటాలజీ’లో నిష్ణాతురాలైన డా. హేమలతా పాండే ఎంతో నైపుణ్యంతో ఈ అంతుచిక్కని  నేరాలను ఛేదిస్తున్నారు.

దంత వైద్యశాస్త్రంతో ముడిపడిన ‘ఫోరెన్సిక్‌ ఒడంటాలజీ’ భారత్‌లో ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నా.. లైంగికదాడులు, ఇతర హింసాత్మక కేసుల్లో నిందితుల ప్రమేయాన్ని నిగ్గుతేల్చడంలో ముఖ్యమైన ఆధారంగా ఉపయోగపడుతోంది. వివిధ సివిల్, క్రిమినల్‌ కేసులతో పాటు క్రీడాకారుల వయసు నిర్ధారణ వివాదాల పరిష్కారానికీ ఈ శాస్త్ర పరిశోధన దోహదపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు విచారణలో భాగంగా తొలిసారి ఫోరెన్సిక్‌ ఒడంటాలజీ వెలుగులోకి వచ్చింది. దీని ద్వారానే ఈ కేసులో నిందితుల క్రూరత్వాన్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపించగలిగారు. పోలీసులిచ్చిన అనుమానితుల ఫొటోల్లోని ముఖకవళికలను బట్టి నిందితుల నోటి పళ్ల సరళి ద్వారా వారి వయసు (రేప్‌కు పాల్పడిన వారిలో ఓ మైనర్‌ కూడా ఉండటంతో) నిర్ధారించారు.నిర్భయ శరీరంపైæగాయాలను ఈ నిందితుల పలువరసను పోల్చి చూడటం ద్వారా ఈ కేసును పరిష్కరించారు. ఇలాంటి కేసులను ఛేదించడంతో పాటు హత్యలు లేదా ఏవైనా ప్రమాదాల్లో ఆనవాలు పట్టలేని విధంగా మారిపోయిన శరీర అవశేషాలతో అపరిష్కృతంగా మిగిలిపోయిన కేసుల పరిష్కారంలోనూ ఈ శాస్త్రం ముఖ్యభూమిక పోషిస్తోంది. అస్థిపంజరం లేదా ఎముకల ఆధారంగా వేసే వయసు అంచనాలో పదేళ్ల వరకు వ్యత్యా సం ఉండే అవకాశం ఉండగా.. దంతాల ఆధారంగా హతులు లేదా నిందితుల వయసు అంచనా ఓ ఏడాది మాత్రమే అటూ ఇటుగా ఉండటంతో ఈ ఒడంటాలజీకి ప్రాధాన్యం చేకూరింది. 
 
దేశంలో ఉన్నది పదిమందే!
సవాళ్లతో కూడుకున్న ఈ ఫోరెన్సిక్‌ ఒడంటాలజీ రంగంలో డా. హేమలతా పాండే తనదైన ప్రతిభను చాటుతున్నారు. ఈ ప్రత్యేక నేరపరిశోధనా రంగంలో శాస్త్రపరమైన అనుభవమున్న వారు దేశవ్యాప్తంగా ఉన్నది కేవలం పదిమందే. వీరంతా కూడా విదేశాల్లో ఈ పీజీ కోర్సును పూర్తిచేశాక, అక్కడే శిక్షణ పొంది వచ్చినవారే. ముంబైలోని కింగ్‌ ఎడ్వర్డ్‌ మెమోరియల్‌ (కేఈఎం) హాస్పటల్‌లో గ్రాడ్యుయేషన్‌ కోర్సు చదువుతున్నపుడు హేమలతకైతే అర్హులైన ఫోరెన్సిక్‌ సైన్స్‌ బోధకులే ఉండేవారు కాదు. అయినా ఫోరెన్సిక్‌ డెంటిస్ట్రీపై పాండేకు ఆసక్తి పెరిగింది. ఇంగ్లండ్‌లోని వేల్స్‌ నుంచి మాస్టర్‌డిగ్రీ పూర్తిచేశాక, 2013 లో కేఈఎం ఆసుపత్రిలోనే చేరారు. ఫోరెన్సిక్‌ రంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ తర్వాత స్థానికంగా, ఇతర రాష్ట్రాల్లోనూ వివిధ కేసుల పరిశోధనలకు పోలీసులకు సహకారాన్ని అందించారు.గుర్తుపట్టలేనంతగా తయారైన శరీరభాగాల కొలతలతో ముందుగా పుర్రె స్వరూపాన్ని రూపొందించుకుని అందులో దంత ద్వయాన్ని, పండ్ల మధ్యనున్న సందులు ఇతర రూపాలను ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్, బంకమట్టి, ఇతర మోడళ్లు, డిజిటల్‌ పరికరాలతో తయారుచేసుకుంటామని హేమలత తెలిపారు. 

గ్రామీణ యువతి హత్య కేసు
అత్యాచారాలు, లైంగికహింస, హత్యల వంటి కేసుల్లో మరణించిన వారి వయసుతో పాటు, వారు ఆడా, మగా అనేది ముందుగా నిర్ధారించాల్సి ఉంటుంది. హతులు ఫలానావారు అయుండొచ్చని పోలీసులు అనుమానిస్తే తదనుగుణంగా వారి ఫొటోలు, ముఖకవళికలను బట్టి గుర్తించేందుకు వీలుగా పంటి ద్వయాన్ని సిద్ధం చేస్తారు. మహారాష్ట్రలోని ఓ గ్రామీణ యువతి హత్య కేసు పరిశోధనలో భాగంగా పాండే బృందం ఓ గ్రూపు ఫొటో నుంచి ఆనవాళ్లు తీసుకుని, వాటిని శవంతో సరిచూసి నిర్ధారించగలిగారు. ఫొటోను పెద్దదిగా చేసినపుడు ఆ అమ్మాయి నవ్వులో పలువరస కనిపించడంతో దాని ఆధారంగా దంతాల తీరును, ముందుపళ్ల నున్న సందుతో హతురాలిని గుర్తించారు. ఎనిమిది నెలల తర్వాత డీఎన్‌ఏ టెస్ట్‌లో ఇదే విషయం స్పష్టమైంది. రెండేళ్లక్రితం నాటి అహ్మద్‌నగర్‌ రేప్‌ కేస్‌లోనూ ఆమె పరిశోధనతోనే హతురాలి శరీరంపై పళ్లగాట్లతో నేరస్తుడిని పోల్చి పట్టుకున్నారు. దీనిపై ఆమె కోర్టులోనూ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. దాదాపు పది, పన్నెండు కేసుల్లో కోర్టు విచారణకు హాజరై ఫోరెన్సిక్‌ సైన్స్‌ నిపుణురాలిగా హేమలత సాక్ష్యమిచ్చారు.

స్పెషల్‌ కోర్సు లేదు!
భారత్‌లో ప్రతీ ఏడాది దాదాపు 26 వేల మంది డెంటిస్ట్‌ గ్రాడ్యుయేట్లు తయారవుతున్నారు. అందులో మూడువేల మందే పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ వరకు వెళుతున్నారు. ప్రస్తుతం దేశంలో ‘ఫోరెన్సిక్‌ డెంటిస్ట్రీ’ కోర్సుకు సంబంధించి ప్రభుత్వ గుర్తింపు పొందిన పీజీ కోర్సు ఏదీ లేదు. ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ ఒడొంటాలజీ మాత్రం.. ఓ సర్టిఫికెట్‌ కోర్సుతో పాటు ఈ రంగంలో వర్క్‌షాపులు, శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఈ అసోసియేషన్‌ కార్యదర్శి డా. ఆషిత్‌ ఆచార్య  నిర్భయకేసు పరిశోధనలో కీలకంగా వ్యవహరించారు. ధార్వాడ్‌లోని ఎస్‌డీఎం కాలేజి ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌ అండ్‌ హాస్పటల్‌లో ఆయన అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కర్ణాటకలోని అన్నెగెరిలో లెక్కకు మించి మనుషుల పుర్రెలు బయటపడినపుడు, అవి 1790 నాటి స్త్రీ, పురుషులవిగా ఆయన తన పరిశోధనలో తేల్చారు. ఇక హైదరాబాద్‌లోని పాణనీయ  ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి ఫోరెన్సిక్‌ డెంటిస్ట్రీ విభాగాధిపతి డా. సుధీర్‌ బళ్లా వివిధ కేసుల్లోని దోషుల వయసు నిర్ధారణలో తనవంతు కృషి చేస్తున్నారు. 18 ఏళ్ల పైబడిన, ఆ వయసు కంటే తక్కువున్న వారికి చట్ట అన్వయం ఒక్కో విధంగా ఉన్నందున వయసు నిర్ధారణలో ఈ శాస్త్రం కీలకంగా మారింది.. 16–18 ఏళ్ల వయసున్న వారిని వయోజనులుగా పరిగణించవవచ్చు కాబట్టి వారికి పడే శిక్షలు వేరుగా ఉంటాయి. ఈ సైన్స్‌ ద్వారా మనుషుల్లోని జ్ఞానదంతం పెరుగుదలను బట్టి వయస్సును నిర్ధారిస్తారు.   
– కె. రాహుల్‌ 

మరిన్ని వార్తలు