ఇద్దరు అమ్మాయిలు

19 Feb, 2020 04:15 IST|Sakshi

అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తున్న నమ్రతా జార్జ్, థెరెసా బోబన్‌

‘‘బెంగళూరు నీళ్లకు కాబోలు జుట్టంతా రాలిపోతోంది..’’ తల స్నానం చేసి జుట్టుకు హెయిర్‌ డ్రయర్‌ పెడుతూ అన్నది నమ్రతా జార్జ్‌. ‘‘ఓసారి ట్రైకాలజిస్ట్‌ను కలవాలి’ అంది మళ్లీ తనే నమ్రత పక్కనే ఉన్న రూమ్మేట్‌ థెరిసాతో. ‘‘అప్పర్‌ లిప్‌ మీద హెయిర్‌ వస్తోంది. ముఖమంతా యాక్నే, ఒంటిమీద నల్లగా చుక్కలు కూడా వస్తున్నాయి. డెర్మటాలజిస్ట్‌ను కూడా కలవాలేమో’’ దిగులుగా తనలో తనే అనుకున్నట్లుగా అంటోంది నమ్రత. ‘‘నువ్వు కలవాల్సింది గైనకాలజిస్ట్‌ని’’ డ్రెస్‌ వేసుకుంటూ, హడావుడిగా టేబుల్‌ దగ్గరకు వెళ్లి వెజిటబుల్‌ సలాడ్‌ ఫోర్క్‌తో నోట్లో పెట్టుకుంటూ బదులిచ్చింది థెరిసా. థెరిస్సాను విచిత్రంగా చూసింది నమ్రత. ‘‘నాకు వరుసగా మూడు నెలలు పీరియడ్స్‌ మిస్‌ అయ్యాయని గైనకాలజిస్ట్‌ని కలిశాను కదా! అప్పుడు తెలిసింది ఇవన్నీ పీసీఓఎస్‌ లక్షణాలని. నన్నయితే బరువు తగ్గమని గట్టిగా చెప్పింది. నువ్వు కూడా ఓ సారి కలువు’’ నమత్ర వైపు చూడకుండా చెప్పుకుంటూ పోతోంది థెరిసా.

నమ్రతా జార్జ్, థెరెసా బోబన్‌లు పదకొండేళ్లుగా స్నేహితులు. ఈ కేరళ అమ్మాయిలు ఏడేళ్లుగా రూమ్మేట్‌లు. ఇద్దరూ ఫ్యాషన్‌ ఎక్స్‌పర్ట్‌లే. సొంతూరు కొచ్చి నుంచి గత ఏడాది బెంగుళూరుకొచ్చి ఫ్యాషన్‌ పరిశ్రమలో పని చేస్తున్నారు. థెరిసా సలహాతో నమ్రత గైనకాలజిస్ట్‌ను సంప్రదించింది. నిజమే! ఆమె సమస్య కూడా పీసీఓఎస్‌నే. అండాశయంలో సిస్ట్‌లు ఏర్పడ్డాయి. నిండా పాతికేళ్లు లేవు. ఇప్పుడే గర్భాశయ సమస్యలేంటి? అసలీ పీసీఓఎస్‌ ఏంటి? ఇది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది? అని పరిశోధన చేసినంత పని చేశారు. తమ ఇద్దరిలోనే కాదు ఈ పీసీఓఎస్‌ ప్రపంచ వ్యాప్తంగా కోటిమంది మహిళలను వేధిస్తోందనీ, మన దేశంలో ఈ దశాబ్దంలో విపరీతంగా పెరిగిపోతోందనీ తెలుసుకున్నారు.

ధైర్యం చెబుతున్నారు
మనదేశంలో మహిళలు తమ ఆరోగ్యాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియచేస్తున్నారు కేరళకు చెందిన ఇద్దరు స్నేహితులు. ఇంకా ముఖ్యంగా ఆడపిల్లలను పెళ్లికి ముందు రొటీన్‌ చెకప్‌లలో భాగంగా గైనకాలజిస్టుకు చూపించడానికి తల్లిదండ్రులు భయపడతారు. పెళ్లికావల్సిన అమ్మాయిని గైనకాలజిస్టు దగ్గరకు తీసుకెళ్లినట్లు ఎవరికైనా తెలిస్తే ‘వాళ్లు ఏమనుకుంటారో’ అని ఆందోళన పడుతుంటారు తప్ప సమస్య తొలిదశలో ఉన్నప్పుడే వైద్యం చేయించాలనుకోరు. పీసీఓఎస్‌ సమస్య దీర్ఘకాలం కొనసాగితే గర్భధారణ సమస్యలు ఎదురవుతాయని తెలిసినా సరే పెళ్లయిన తర్వాత డాక్టర్‌ను సంప్రదించవచ్చని.. సమస్యను తీవ్రతరం చేసుకుంటుంటారు. ఇంకా... పీసీఓఎస్‌కు చికిత్స చేయించుకుందని బంధువులకు, స్నేహితులకు తెలిస్తే ‘ఈ అమ్మాయికి సమస్య ఏ స్థాయిలో ఉందో ఏమిటో, పిల్లలు పుడతారో లేదో’ అనే అనుమానాలను చిలువలు పలువలు చేసి ప్రచారం చేస్తారేమోనని మరొక భయం.

తేలిగ్గా వివరిస్తున్నారు
ఆడపిల్లలను గైనకాలజిస్టుకు చూపించడం మీద మన సమాజంలో ఉన్న అనేక అపోహలను తొలగించే ప్రయత్నం మొదలు పెట్టారు నమ్రతా జార్జ్, థెరెసా బోబన్‌లు. ఇందుకోసం ఇన్‌ స్టాగ్రామ్‌లో పేజీ ఓపెన్‌ చేసి సందేహాలకు సమాధానాలిస్తున్నారు. గైనిక్‌ సమస్యల పట్ల యువతులను చైతన్యవంతం చేయడానికి పూనుకున్న స్నేహితుల చొరవ ఇది. డాక్టర్లు వివరించేటప్పుడు వైద్యపరమైన సాంకేతిక పదాలు సామాన్య యువతులను, మహిళల్ని భయపెడుతుంటాయి. ఈ ఫెండ్స్‌ మాత్రం విషయాన్ని సామాన్యులకు అర్థమయ్యే çపదాలతో సులువుగా వివరిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ అంతగా విజయవంతం కావడానికి ఇదీ ఒక కారణమే. ‘‘మొదట్లో కొన్నాళ్లు బెంగళూరు నీటిని తిట్టుకున్నాం. ఆ తర్వాత రియాలిటీలోకి వచ్చాం’’ అని నవ్వారు ఈ ఫ్రెండ్స్‌. – మంజీర

సమస్యే కాదు
డిజిటల్‌ మీడియా వేదికగా మేము చేపట్టిన ఈ ఉద్యమం... మహిళల ఆరోగ్యం పట్ల మన సమాజంలో కరడుగట్టి ఉన్న నిరాసక్తతను పటాపంచలు చేయడానికే. ‘టూ బ్రోక్‌ గర్ల్స్‌ విత్‌ పీసీఓఎస్‌’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ ఓపెన్‌ చేశాం. అందులో పీసీఓఎస్‌ లక్షణాల గురించి సమగ్రంగా తెలియచేస్తున్నాం. అవసరమైతే నిపుణుల సలహా తీసుకుని ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని కూడా సూచిస్తున్నాం. మా పేజీని అనుసరిస్తున్న వాళ్లలో కొందరు తమలో ఉన్న కొన్ని లక్షణాలను బట్టి డాక్టర్‌ను సంప్రదిస్తున్నారు. అన్నింటికంటే ముందుగా పీసీఓఎస్‌ కారణంగా దేహంలో ఎదురయ్యే అవాంఛిత రోమాల వంటి వాటి గురించి అమ్మాయిలు విపరీతంగా వ్యాకులతకు లోనవుతుంటారు. ఇది మానసిక వేదనకు లోను కావాల్సిన సమస్య కానే కాదని వాళ్లకు ధైర్యం చెబుతున్నాం. బయటకు చెప్పుకోలేని ఆవేదనను పంచుకోవడానికి, చైతన్యవంతం కావడానికి ఒక వేదిక కల్పించాం. ఇది ఆరోగ్య చైతన్య విప్లవం. – నమ్రత, థెరిసా 

It’s par-TEA time 🍵🍵🍵 We can’t start a day without a glass of one of our favourite brews. While researching for what dietary changes could help reverse the effect of pcos, we came across the benefit of having herbal teas to help control the condition. Some teas even have scientific evidence in helping reversing the side effects of pcos. Have a TEA-rrific day. Do share you experiences with various herbal teas that might have helped you #pcos #periodpositive #tea #women

A post shared by Nams & Ter (@twobrokegirlswithpcos) on

మరిన్ని వార్తలు