గర్వభంగం

26 Nov, 2017 00:05 IST|Sakshi

‘‘మన వడివేలు చచ్చిపోయాడు సార్‌!’’‘‘ఏ వడివేలురా!’’‘‘క్యాజువల్‌ లేబర్‌ వడివేలు సార్‌.’’‘‘హెవీ సెక్షనులో పనిచేస్తాడు సార్‌. నలుపుగా, నున్నగా రోజూ తాగివస్తాడే, ఆ వడివేలు సార్‌.’’షర్టు వేసుకొని ఎదురుగా వస్తున్న ఆటోలో కూర్చొని వర్క్‌షాపుకు వెళ్లాడు గోవిందన్‌.వడివేలు రెండు సంవత్సరాలుగా క్యాజువల్‌ లేబర్‌. అతనిలా నలభైమంది చాలాకాలంగా తాత్కాలికంగా పనిచేస్తున్నారు. గోవిందన్‌ ముఖ్యంగా కోరికల్లో క్యాజువల్‌ లేబర్‌ను పర్మినెంటు చేయడం అన్నది ఒక్కటి. ‘‘ఈ వేళ ఎలాగైనా తిరిగి ఆ కోరికను లేవనెత్తాలి. ఈ వేళ కాకపోయినా, ఈ వారమో, ఈ మాసమో! దీన్ని బట్టి అడగాలి, మీటింగ్‌ ఏర్పాటు చేయాలి. దాని కంటే ముందు ఈ వేళ శలవు ఇస్తారేమో చూడాలి’’ అన్నాడు గోవిందన్‌.‘‘శలవు ఇవ్వండి. క్యాజువల్‌ లేబర్‌ కదా అని చట్టం మాట్లాడుతారండి. మనం ఎదిరించి బలంగా పోరాడితే గాని శలవు ఇవ్వరండి.’’‘‘ఊరకనే శలవు ఇవ్వమంటే ఇస్తారా? శవానికి మాలవేసి, మర్యాదా చెయ్యాలని అడగాలి. అందుకు డబ్బు కావాలి. మనిషికి అర్ధరూపాయి వేసుకోవాలి, అని మనవాళ్లనే అడగాలి. అందరికీ తీసుకోవడమే అలవాటు. అర్ధరూపాయి ఇమ్మంటే ముఖం చాటేస్తారు. ఏది ఎలా ఉన్నా వడివేలు చావు ఒక మంచి సందర్భం...

గోవిందన్‌ యూనియన్‌ లీడరు అయి మూడే నెలలు అయింది. ఈ మూడు మాసాల్లో చెప్పుకోదగిన మార్పు లేకపోయినా మేనేజిమెంటు కొంతవరకు దిగి వస్తుంది. ‘‘స్తంభాన్ని చీల్చుకొచ్చిన నరసింహంలా ఏ సమయంలో గోవిందన్‌ గది లోపలికి దూసుకువస్తాడో!’’ అన్న భయం అధికారులకు ఉంది. 1100 మంది పనిచేసే ప్రైవేటు కంపెనీలో యూనియన్‌ లీడరుగా ఉండడం సులభం కాదు. అందుకు గుండె ధైర్యం కావాలి. మంచి మాటకారితనం, వాక్చాతుర్యం, శరీరంలో శక్తి ఉండాలి. గంభీరమైన గొంతు కావాలి. కొంచెం చదువు ఉండాలి. గోవిందన్‌ దగ్గర చదువు చాలా తక్కువ. 8వ తరగతి మూడుసార్లు ఫెయిల్‌ అయి తండ్రి దగ్గర కుక్కలా తన్నులు తినడం మాటిమాటికీ గుర్తుకువస్తుంది.‘‘చదవలేదనేగా ఇంతగా కొడుతున్నావ్‌? ఈ చదువు లేకుండానే నేను గొప్పవాడిని అవుతాను చూడు. నువ్వు చచ్చేలోపల నీకంటే గొప్పవాడినవుతాను చూడు’’ మనస్సులోపలి ఆ తీవ్రమైన కోరికే విత్తనం అయి మొక్క అయి, వృక్షమై శాఖోపశాఖలుగా విస్తరించి, ఈవేళ ఫలాలివ్వబోతున్నది. ఈవేళ 1100 మందికి, నాయకుడైన గోవిందన్‌ ఎన్నికల్లో గెలిచి మాలతో స్నేహితుల భుజాలపై ఎక్కి వస్తున్నప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చింది. ఎక్కువ చదువుకొని ఇంజనీరై, మేనేజరై వచ్చేవాళ్లు తనను చూసి భయపడ్డం చూసినప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చింది. 10 మంది స్నేహితులు అతడి చుట్టూ చేరి, ‘‘ఈ సమస్యనెలాగైనా పరిష్కారం చెయ్యి గురూ!’’ అని ప్రాధేయపడినప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు. గోవిందన్‌ నాయకుడైన మరుసటిరోజు కొత్త చెప్పులు కొనుక్కున్నాడు. స్టయిల్‌గా, దర్జాగా నడవడం నేర్చుకున్నాడు.

 అలా నడిస్తే తను రావడం ఇతరులకు తెలియజేయడం అవుతుందని, తనలో ఒక నమ్మకమైన భావం ఏర్పడింది. అన్నిటికంటే విచిత్రం ఏమిటంటే, ఎవరినో య«థాలాపంగా ‘‘చెప్పుతో కొడ్తాను’’ అని మాట్లాడినందుకు, వెనుక నిలబడి ఉన్న తండ్రి ‘‘ఉంటే కదా కొడ్తావ్‌’’ అని తలమీద మొట్టి, అతడి చెప్పులను మురికి కాలువలో వేసి, వొట్టి కాళ్లతో తరిమిన సంఘటనకు ....? ఇలా ఎందుకు నడుస్తున్నాడని ఎవరూ అడగరు. అడిగే ధైర్యం లేదు. ఒక్కొక్క అడుగుతో తండ్రి ముఖాన్ని తొక్కివేస్తున్న అనుభవం–ఆనందం అతడికి కలిగింది. ఇంటి దగ్గర తప్ప ఇతర చోట్ల దర్జాగా నడవడం గోవిందన్‌ అలవాటు. ఇంటిలో కూడా అలా నడవవచ్చు. ముసలాడు ఏమయినా అనవచ్చు. కంటి ఎదురుగా చెప్పకపోయినా చెవిలో పడేటట్లు తిడతాడు. ఇంటి అరుగుమీద పొగరు పోయి చిరిగిపోయిన గుడ్డలా పడివుంటే తండ్రిని కించపరచడం అనవసరం. ఇలాంటి పది కంపెనీలకు యూనియన్‌ లీడరయి కారులో వచ్చి దిగి చెప్పవచ్చు.
‘‘ఇంటిలో కూడా చెప్పులతో నడుస్తాను. అలాంటి కాలం రాకుండా పోతుందా?’’

ఫ్యాక్టరీ తెరిచే సమయానికి ముందే వాకిట్లో వడివేలు చనిపోయిన విషయం రాయబడి ఉంది. నల్ల రిబ్బన్‌ కొని ముక్కలుగా చేసి అందరి చొక్కాలకు లోపల ప్రవేశించే ముందు తగిలించారు. గోవిందన్‌ అడగడానికి ముందే యాజమాన్యం ఒక గంట ముందు ఇంటికి పోవడానికి అనుమతి ఇచ్చింది. ఒక విధంగా శెలవు ఇవ్వకపోవడమే మంచిది. ‘‘ఇదిగో భోజనం చేసి వస్తాను’’ అని సినిమాకు పోతారు చాలామంది. ఒక్కడే చావు ఇంటిలో ఏడవాలి. అనుమతి అంటే మొత్తం అందర్నీ తీసుకుపోవచ్చు. మొత్తం అందరితో పోతేనే చూడ్డానికి బాగుంటుంది. ఒక హుండీకి నల్లటి గుడ్డ చుట్టి ఒక్కొక్క డిపార్టుమెంటుకి ఊరేగింపుగా పోయారు.
‘‘అర్ధరూపాయికి తక్కువగా ఎవరైనా వేస్తే నేను చాలా చెడ్డవాడిని అవుతాను’’ అన్న గోవిందన్‌ గొంతుకు మన్నింపు ఉంది. హుండీలో ప్రవాహంలా పడుతున్న 415 రూపాయలు తేలింది. 20 రూపాయల మాల, 20 రూపాయల పన్నీర్‌ బాటిల్, 8 రూపాయల ఊదొత్తులు, 15 రూపాయల ఇతర ఖర్చులు పోగా మిగిలింది 352 రూపాయలు మొత్తాన్ని కవర్‌లో పెట్టి దానిపై రాసి జేబులో పెట్టుకున్నాడు. ఒక మనిషిని ముందుగా పంపి తన రాక గూర్చి వడివేలు ఇంటిలో చెప్పమన్నాడు. 

నాలుగు గంటలకు వరండాలో నిలబడి అందర్నీ తన వెనుకే మౌనంగా ఊరేగింపుగా నడచి రమ్మన్నాడు.‘‘మోసగించి పోవాలనుకున్నవారికి ఒక హెచ్చరిక! ఈ వడివేలు పరిస్థితే మనకూ రావచ్చు. జ్ఞాపకం ఉంచుకోండి’’ అన్నాడు. గుంపు అతడి మాటల్ని శిరసావహించింది. తలలాడించి మేకల మందలా వెనుక నడవసాగింది. దారిలో బస్సులు అక్కడక్కడ నిలిచాయి. వేయి మంది ఊరేగింపుగా రావడం చూసి మార్కెట్టు భయపడింది. సగం మూసిన తలుపుల గుండా భయం – ఆశ్చర్యం మిళితమైన ముఖాలు గోవిందన్‌ను చూశాయి. వడివేలు ఇంటి వాకిటిలో, వీధిలో జనం గుంపుగా నిలబడ్డారు. ఊరేగింపు దగ్గరగా రావడంతో అందరూ జరిగి గోవింద్‌కు దారి ఇచ్చారు.ఉదయం నుండి ఏడ్చి గొంతు ఎండిపోయిన ఆడవాళ్లు ఇతడు లోపలకు రావడంతో మళ్లీ ఏడ్వడం ప్రారంభించారు. వడివేలు ముసలి తల్లి పొగాకు కంపుతో పరిసరాలను చికాకు పెడ్తూ వచ్చి గోవిందన్‌ను కౌగిలించుకొని వేర్వేరు గొంతులతో ఏడ్చింది. గోవిందన్‌ ఊపిరి పీల్చుకోలేకపోయాడు.

‘‘పుణ్యాత్ముడు పోయాడు! ఎందుకమ్మా! వచ్చినవాళ్లను బాధపెడ్తావ్‌? పక్కకు వెళ్లు!’’ అని ఒక యువకుడు ఆమెను మరో పక్కకు తీసుకువెళ్లాడు.పెద్ద గులాబీ మాలను వడివేలు మెడలో వేసినప్పుడు, ఇద్దరు ముగ్గురు ఇంగితం లేనివాళ్లు అలవాటు దోషం వల్ల చప్పట్లు చరిచారు. గోవిందన్‌ వాళ్లను ఎర్రగా చూడ్డంతో వాళ్లు వెనక్కు తగ్గారు. మూడు కట్టలు అగరుబత్తి మొత్తంగా వెలిగించినప్పుడు భగభగమని పొగ నాలుగు పక్కలా కమ్ముకుంది. పన్నీరు బాటిల్‌ను, శ్రద్ధగా చల్లిన గోవిందన్‌ను ఆడవాళ్లు ఆశ్చర్యంగా చూశారు.‘‘ఎవరతను? స్నేహితుడా?’’‘‘ఛీ! ఛీ! నాయకుడు!’’‘‘ఎవరికి నాయకుడు?’’‘‘వడివేలు పనిచేస్తున్నాడే! అక్కడ లీడర్‌!’’‘‘జీతం ఇచ్చేవాడా?’’‘‘అంతకు మించి!’’‘‘వడివేలుకు డబ్బు వసూలు చేసి తెచ్చాడు.’’‘‘చస్తే చచ్చాడు గాని, ఎంత వాసనో!’’‘‘ఛా! ఛా! అది ఊదొత్తుల వాసన!’’‘‘అదేనే సెప్పేది. నువ్వూ–నేనూ చస్తే ఎవరు అగరుబత్తీలు వెలిగిస్తున్నారు?’’‘‘పుణ్యాత్ముడు వచ్చాడు. పన్నీరు–ఊదొత్తులు వాసన కొడ్తున్నాయి.’’‘‘ఇంటికి పెద్దవాళ్లు ఎవరమ్మా?’’ అని గోవిందన్‌ అడిగాడు.‘‘ఇదిగో ముసలీ! నిన్నే! పిలుస్తున్నారు!’’ అన్నాడు వాళ్ల ముసలమ్మతో.‘‘వద్దు! వద్దు! ఆ ముసలమ్మ వద్దు!’’ అని వారించాడు గోవిందన్‌.

‘‘ఆయన డబ్బు ఇవ్వాలని పిలుస్తున్నాడు! ఎందుకా ముసల్దాన్ని లేపుతావ్‌? అబ్బాయిని రమ్మను?’’ అబ్బాయి వచ్చాడు. చిన్న మీసం! ఆఫ్‌ ఫేంటుతో ఉన్నాడు. గుంపు మధ్యే రూపాయి నోట్లను లెక్కపెట్టి గోవిందన్‌ అతడి చేతుల్లో పెట్టాడు.‘‘గోవిందన్‌ జిందాబాద్‌! లీడర్‌ గోవిందన్‌ జిందాబాద్‌! వడివేలు జిందాబాద్‌!’’ అని గుంపు చేస్తున్న నినాదాలు పైకప్పును తాకి, ఊదొత్తుల పొగతో గభాలున బయట వ్యాపించాయి. గోవిందన్‌ చేతిసంజ్ఞ చేసి వాకిలివైపు చూసి అరిచాడు.‘‘ఎవర్రా అక్కడ? డప్పులు వాయించమని చెప్పరా!’’ ఆ మాటలు విని ‘‘మేళం! మేళం!’’ అని ఎవరో అని కేకలు వేశారు.చప్పున శవాన్ని ఎత్తమని చెప్పండి. మేము వెళ్లిపోవాలి!’’‘‘మేనమామ రాలేదండి! అందుకే చూస్తున్నాం!’’‘‘అవును’’...‘‘మామ వచ్చి మాలా మర్యాదా చేయబోతాడా? ఇంతమంది పెద్ద మనుష్యులు నిల్చున్నారు. ఎదురు మాట్లాడుతున్నావా?’’ అని లావుగా ఉన్న ఒక ఆవిడ గదమాయించింది. గోవిందన్‌ను చూసి చిరునవ్వు నవ్వింది.

‘‘తొందరగా ముగించమని చెప్పు అమ్మా!’’ మనవాళ్లు చాలా దూరం వెళ్లాలి!’’గోవిందన్‌ బయటకు వచ్చాక కూర్చోవడానికి కుర్చీ వేశారు. సుఖంగా కూర్చోమన్నారు. విసురుకోవడానికి చేతికొక విసనకర్ర ఇచ్చారు. దూరంగా చుట్టూ నిల్చున్నారు. తాగడానికి సోడా అడిగినప్పుడు అల్యూమినియం గ్లాసును గుడ్డ మూసి ఇచ్చారు.‘‘ఎందుకిది?’’‘‘తాగండి! ఉదయం నుండి చాలా అవస్థ పడ్డారు.’’‘‘ఇది తాగే కదా వడివేలు చచ్చిపోయింది.’’‘‘అర గ్లాసు తాగితే ఏమీగాదండి! చావింటిలో దీన్ని ఎవరూ తప్పుబట్టరు.’’గోవిందన్‌ తాగి గ్లాసు ఇచ్చేశాడు. వెనుక నలుగురైదుగురు చేతుల్లో గ్లాసులు పెట్టుకొని ఉండడం చూశాడు. ‘‘ఏరా! పెద్ద డ్రమ్మే తెచ్చారా?’’‘‘వద్దని చెప్పవద్దు గురూ! నువ్వు తాగాలనే మేము కాచుకొని ఉన్నాం. గబగబా చేతులు మారాయి గ్లాసులు 10 నిమిషాల్లో వడివేలు కదిలిపోయాడు. గుంపు చెదిరి తరిగిపోయింది.గోవిందన్‌ తన మనుష్యులను గుండ్రంగా నిలబెట్టాడు. ‘‘ఎవరెవరు ట్రాఫిక్‌ను సరిపెట్టాలి, ఎవరెవరు గుంపును సరిగ్గా నడిపించాలి, ముందు ఎంతమంది వెనుక ఎంతమంది నడవాలి’’ అని అంతా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశాడు గోవిందన్‌.

ఊరేగింపు ఎర్రమింగిన పాములా మెల్లగా కదిలింది. ‘‘ఏమీలేని మనిషి వడివేలు! ఓహో! అని పోయాడు చూడు!’’‘‘ముసల్ది ఏం చేసింది? అంతా ఆ లీడర్‌ బాబు పుణ్యమా అని ఇంతమంది చేరారు. లేకపోతే ఇంత గుంపు చేరుతుందా?’’ గోవిందన్‌కు భూమిమీద కాలు మోపకుండా ఎగురుతున్నట్లుంది.‘‘మీరు వెళ్తూ ఉండండి! పంచె మార్చుకొని వస్తాను’’ అన్నాడు గోవిందన్‌.గుంపును తప్పించుకొని, ముఖ్యమైన కొంతమంది ఆప్తులతో తన ఇంటివైపు మళ్లాడు గోవిందన్‌.ఎదురు అరుగుమీద తండ్రికి ఎదురుగా కూర్చొని పంచె కోసం కేకపెట్టాడు గోవిందన్‌.‘‘యమా గుంపుగురూ! చాలా గొప్పగా చేశావ్‌!’’ అని అతనితో వచ్చినవాళ్లు అతడ్ని పొగిడారు.‘‘ఇదేమంత గొప్ప బ్రదర్‌! మరొక్కసారి ఇలా జరగనీ! 1000 రూపాయలు వసూలు అవుతాయి చూడు.’’‘‘కేవలం డబ్బులు అయితే బాగుండవు. బ్యాండు మేళం పెట్టించాలి.’’‘‘బ్యాండేం గొప్ప! డాన్సింగ్‌ పార్టీని పెట్టించాలి వచ్చేసారి!’’

‘‘నీవు తలచుకుంటే చాలు అంతా అవుతుంది గురూ! కాకపోతే డబ్బు వసూలు చేయడానికి కష్టపడాలి.’’‘‘వదిలిపెట్టను. మేనేజిమెంటు నెత్తిమీద చెయ్యి పెట్టకపోతానా! తీసుకురండిరా 500 రూపాయలు అననా! నువ్వే చూడు... వచ్చేసారి... ఎంత గొప్పగా చేస్తానో!’’ముడుచుకొని పండుకొన్న ముసలివాడు హఠాత్తుగా లేచి కూర్చున్నాడు. ఎత్తుకోసం అంతవరకూ తలకింద పెట్టుకున్న పీటను నేలమీదకు విసిరికొట్టాడు.‘‘ఛీ! ఛీ! లేచిపోరా! సిగ్గుమాలినవాడా!నేను చూస్తూనే ఉన్నాను, మరొక్కసారి, మరొక్కసారి అని అంటూ తోటివాడు ఎప్పుడు చస్తాడా’ అని చూస్తున్నాడు. ఇలాంటి వీడు లీడర్‌ అట! ఛీ! ఛీ! నీ బతుకుచెడా! పోరా! పో! బయటకు!’’ అన్నాడు ముసలివాడు.‘‘ఏం ఈ ముసలివాడు అలా మండిపడుతున్నాడు? లీడర్‌ గోవిందన్‌ ఏం ఇలా వేగంగా పంచయినా మార్చుకోకుండా అలా పరుగెత్తుతున్నట్లు వెళ్లిపోతున్నాడో!’’ అతడితో పాటు ఉన్నవాళ్లకు అర్థం కాలేదు.

మరిన్ని వార్తలు