గర్భగుడికి నడిచొచ్చిన నంది

13 Jun, 2018 00:18 IST|Sakshi

పురస్కారం

మాతృత్వం ఒక వరం. అయితే, కొన్ని కారణాంతరాల వల్ల సహజంగా తల్లి అయ్యే భాగ్యానికి నోచుకో (లే)నివారు, సహజసిద్ధంగా తండ్రి కాలేనివారు సరోగసీ అంటే అద్దె గర్భం ద్వారా సంతానాన్ని పొందుతున్నారు. చట్టాలు కూడా ఇందుకు అనుమతిస్తున్నాయి. సరోగసీ పద్ధతిలో పేద మహిళలు తమ గర్భాలను అద్దెకిచ్చి, పెద్దింటి వారి బిడ్డలను నవమాసాలు మోసి, కని, కూలి తీసుకుని బిడ్డలను వారి చేతిలో పెడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే– అద్దె గర్భం అయినా, అసలు గర్భమైనా అమ్మతనంలో తేడా ఏముటుంది? అసలు అమ్మ అయినా, నొప్పులు పడాల్సిందే, అద్దె తల్లి కూడా ఆ భారాన్ని మోయాల్సిందే, అన్ని నొప్పులూ పడాల్సిందే. ఆ తర్వాత బాలింతరాలి బాధలు అనుభవించవలసిందే. మరి వీరిని వేరు చేస్తున్నదేమిటి? ఉన్నవారు, లేని వారు అనే తేడానే కదా! ఆ ఒక్క తేడా వల్లే తన కడుపులోంచి భూమి మీద పడిన పిల్లల పట్ల మమతానురాగాలు పెంచుకోడానికి వీల్లేదా? ఇది ఏమైనా న్యాయమా? సరోగసీ తల్లికి తన కడుపు చించుకుని పుట్టిన బిడ్డల పట్ల కనీసపు హక్కులు ఉండాలనుకోవడంలో అభ్యంతరం ఎందుకు? ఇవన్నీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నలు.

ఇలాంటి ఎన్నో విషయాలను ప్రస్తావిస్తూ... అవసరం అయితే చట్టంలో మార్పులు తెచ్చి అయినా సరే, తల్లితనానికి విలువ ఇవ్వాలని చెబుతూ ప్రముఖ జర్నలిస్టు, కథా, నవలా రచయిత డాక్టర్‌ చింతకింది శ్రీనివాసరావు రాసిన నాటికే ‘గర్భగుడి’. అమ్మతనంలోని కమ్మదనాన్ని అద్భుతంగా వివరిస్తూనే, ఆ కమ్మదనానికి ఖరీదు కట్టడం సమంజసం కాదని, అసలు తల్లిదండ్రులు కిరాయి చెల్లించి, బిడ్డను సొంతం చేసుకున్న తర్వాత తన కడుపు చించుకుని పుట్టిన ఆ పసికందును కనీసం కంటినిండా చూసుకోరాదని, ఒడినిండా తీసుకోరాదని, ఆ బిడ్డకు చనుబాలివ్వరాదనీ అనడం సహేతుకం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులోని చట్టబద్ధతపై ప్రభుత్వానికి సవాళ్లు విసిరారు. ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో చూసిన ఒక నిజ జీవిత సంఘటన చింతకిందిని చాన్నాళ్లు ప్రశాంతంగా నిద్రపోనివ్వలేదు. దాంతో తన మనసులో చోటు చేసుకున్న భావ సంఘర్షణలకు ఓ రూపం ఇచ్చారు. 

గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చిన ఆవేదన ఆధారంగా రాసిన చక్కటి ఇతివృత్తంతో కూడిన ఈ నాటికను కళాకారులు ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు. ఎంతోమంది కంట తడి పెట్టించి ఎన్నో ప్రదర్శనలను అందుకున్నది ఈ నాటిక. నాటక ప్రియులు, విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తాయి. అంతేనా...దాంతోబాటు  2017 రాష్ట్రప్రభుత్వ నాటకోత్సవాలలో ప్రథమ ఉత్తమ నాటికగా నిలిచిందీ నాటిక. ఆ నాటిక రచయితగా నంది పురస్కారాన్ని గెలుచుకున్నారు చింతకింది.విశాఖపట్నం జిల్లా చోడవరంకు చెందిన చింతకింది చక్కటి ఉత్తరాంధ్ర మాండలికంలో సొగసైన రచనలు చేయడంలో అందె వేసిన చేయి. మానవీయ కోణంతో కూడిన వార్తలు రాయడంలో మేటి. ‘అదిగో ద్వారక’, ‘వికర్ణ’ వంటి పౌరాణిక నవలలు, ‘దాలప్ప తీర్థం’, ‘కాన్పుల దిబ్బ’, ‘కప్పస్తంభం’ కథాసంపుటాలతో అశేష పాఠకాభిమానాన్ని సంపాదించుకున్న చింతకింది, ఇప్పుడు ఈ నాటికతో నంది పురస్కారాన్ని సాధించారు. 
– డి.వి.ఆర్‌. 

మరిన్ని వార్తలు