పుస్తకాల పిడికిలి

4 Jan, 2020 01:12 IST|Sakshi

గీతారామస్వామి

కాల్పనిక బాలసాహిత్యానికి ‘చందమామ’ పాఠకులను తయారు చేసినట్టుగా కాల్పనికేతర సాహిత్యాన్ని సామాన్య జనం దగ్గరకు చేర్చి.. ప్రాచుర్యం కల్పించింది హెచ్‌బీటీ.. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌! దళిత సాహిత్యం నుంచి జీవిత కథలు, విజ్ఞానశాస్త్రం, మూలికా వైద్యం వరకు ఆమ్‌ ఆద్మీకి అవసరమైన, తెలుసుకోవాల్సిన ప్రతి విషయాన్ని అచ్చులోకి తెచ్చింది.

ఈ ప్రయాణంలోకి అడుగుపెట్టిన హెచ్‌బీటీకి ఈ ఏటితో నలభై సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ప్రచురణ సంస్థగా హెచ్‌బీటీని నిలబెట్టడంలో నిర్వాహకురాలుగీతారామస్వామి భూమిక తక్కువేం కాదు. ఆమె నడుస్తూ.. సంస్థను నడిపించారు. సంస్థను నడిపిస్తూ ఆమె నడిచారు. అవిభాజ్యమైన ఈ ప్రచురణ యానంలో గీత గురించి, బుక్‌ ట్రస్ట్‌ గురించి తెలుసుకోవలసిందే.

తొలి ప్రేరణ
తమిళ కుటుంబం. తండ్రి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో పుట్టారు గీత. ముంబైలో కొంత వరకు, చెన్నైలో కొంత వరకు చదివి హైదరాబాద్‌ వచ్చారు. కోఠీ విమెన్స్‌ కాలేజ్‌లో ఇంటర్‌ ఫస్టియర్‌ చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సైన్స్‌ కాలేజ్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో చేరారు. చదువుకునే రోజుల్లోనే పేదరికం, అసమానత్వం.. పరిష్కారం దొరకని ప్రశ్నలుగా గీతను వెంటాడాయి.  తన కుటుంబంతోపాటు బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో కూడా కనిపించే పురుషాధిపత్యం, మహిళలను అగౌరవంగా చూడ్డం చిన్నప్పటి నుంచీ మింగుడు పడని వాతావరణం ఆమెకు. గీత వాళ్లు అయిదుగురూ ఆడపిల్లలే అని వాళ్లమ్మ బాధ పడేవారట. వాళ్ల పెళ్లిళ్లు, కట్న కానుకల గురించీ దిగులు పడేవారట.

బయట అందరి పిల్లలతో తానూ సమంగా భావించుకునే గీతకు తాము ఆడపిల్లలమని, ఆ ఇంట్లో మగపిల్లాడు లేడని వాళ్లమ్మ ఎందుకు చింతిస్తుందో అర్థమయ్యేది కాదట. ‘అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎందుకు తక్కువ?’ అనే ఆలోచన అక్కడే మొదలయింది గీతలో. ఒకరకంగా తనను విప్లవవాదిగా మార్చిందీ ఆ తత్వమే. తర్వాత కాలంలో ఇంట్లో జరిగిన పరిణామాలూ, ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లో వాతావరణమూ తన పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ను మధ్యలోనే వదిలేసి ఉద్యమంలో పూర్తిస్థాయి భాగస్వామి అయ్యేలా చేశాయి ఆమెను. క్యాంపస్‌లో జార్జిరెడ్డి నాయకత్వంలోని ప్రోగ్రెసివ్‌ స్టూడెంట్స్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌.. మహిళలను గౌరవించడం, సమానంగా చూడ్డం చేసేది. ఈ అంశమే మిగతా ఎందరో విద్యార్థులతోపాటు ఆమెనూ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థుల వామపక్ష ఉద్యమంలో చేరేలా చేశాయి.

అలా మహిళా శక్తిలా ఎదిగి, దూసుకెళ్లిన గీత ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 1975లోనే జార్జిరెడ్డి తమ్ముడు సిరిళ్‌ రెడ్డిని వివాహం చేసుకున్నారు ఆమె.‘‘సిరిళ్‌ రెడ్డిని పెళ్లి చేసుకోవడంతో అద్భుతమైన ఆ కుటుంబంతో మరింత సాన్నిహిత్యం పెరిగింది నాకు. ఒకరకంగా నేను చాలా అదృష్టవంతురాలిని. ఎన్నో ఉద్యమాలతో స్ఫూర్తి చెందిన తరంలో  ఉన్నందుకు. విమెన్స్‌ లిబరేషన్‌ మూవ్‌మెంట్‌తో ప్రేరణ చెందాం. ఆ సమయంలో మగవాళ్లు  మమ్మల్నేదో శత్రువులుగా చూడకుండా మా ఉద్యమానికి మద్దతునిచ్చారు’’ అని నాటి సంగతులను గుర్తు చేసుకుంటారు ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్లు్య) సంస్థాపకుల్లో కూడా ఒకరైన గీత. 1977లో పారిశుద్ధ్య కార్మికుల హక్కుల కోసం పనిచేయడానికి ఘజియాబాద్‌ వెళ్లారు ఆమె. అక్కడే మూడేళ్లున్నారు. తిరిగొచ్చిన తర్వాత తెలంగాణ రైతుల సమస్యలు, హక్కుల మీద పనిచేశారు.

తొలి ప్రచురణ
ఎమర్జెన్సీ సమయంలో వామపక్ష ఉద్యమంలో వచ్చిన ఒక స్తబ్దత.. తెలుగులో పరిజ్ఞాన సంపద కొరతను, ఉద్యమ సాహిత్యం లేమిని గుర్తుచేసింది. దాంతో అలాంటి సాహిత్యాన్ని ప్రచురించే సంస్థ ఒకటి ఉండాలనే భావనతో సీకే నారాయణరెడ్డి, సిరిళ్‌ రెడ్డి, వీరయ్య చౌదరి, ఎమ్‌టీ ఖాన్, సి. భరతుడు, గీతారామస్వామి.. వీళ్లంతా ఒక బృందంగా ఏర్పడి 1980లో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ను స్థాపించారు. రెండువేల అయిదువందల రూపాయల పెట్టుబడితో తొలి ప్రచురణగా ఆచార్య ఎన్‌. గోపి ‘వేమన వేదం’తోపాటు రెండు తమిళ అనువాదాలను తెచ్చారు. ‘‘ఆ కాలంలో పుస్తకాల అమ్మకం అంటే ఒక సాహసమే. పుస్తకాలు పట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, ఊళ్లూ తిరిగి అమ్మేవాళ్లం.

ఊళ్లలోని కూడళ్లలో రెండు బల్లలు వేసుకొని, పెట్రో మ్యాక్స్‌ లైట్‌ పెట్టుకొని పుస్తకాలు అమ్మేదాన్ని.  అలా పుస్తకాలు పట్టుకొని ఊళ్లకెళ్లడం నాకేమీ ఇబ్బందిగా అనిపించేది కాదు. కాని దారిన పోయేవాళ్లే నన్ను చూసి జాలిపడేవారు. ‘‘ఎందుకిలా పుస్తకాలు అమ్ముతున్నావ్‌? నీకెవరూ లేరా? అనాథవా?’’ అంటూ అడిగేవారు. నాకు కోపం వచ్చేది. ‘‘అందరూ ఉన్నారు. పుస్తకాలు అమ్మడం నాకు ఇష్టం. ఇలా మనుషులను కలవడం ఇష్టం’’ అని చెప్పేదాన్ని. ఒక్కోసారి ఊళ్లో బస దొరక్కపోతే బస్టాండ్‌లోనే పడుకునేదాన్ని. హెచ్‌బీటీ తొలినాళ్లు అద్భుతంగా ఉండేవి. సీకే నారాయణ రెడ్డి గురుతుల్యులై చాలా నేర్పించారు. మర్యాదస్తుడైన అంత గొప్ప వ్యక్తిని జీవితంలో చూడలేదు నేను. లెఫ్టిస్టులమని చెప్పుకున్న ఇద్దరు మగవాళ్ల నుంచి తప్ప పుస్తకాలను అమ్మే క్రమంలో ఎవరి నుంచీ నేను ఎలాంటి ఇబ్బందులనూ ఎదుర్కోలేదు’’ అంటారు గీతారామస్వామి.

అలా అప్పట్నుంచి నేటిదాకా హెచ్‌బీటీతో ఆమె ప్రయాణం సాగుతూనే ఉంది. స్త్రీవాదులు, పిల్లల హక్కుల ఉద్యమకారులు, పర్యావరణ, దళిత ఉద్యమకారులు మొదలైన వాళ్లందరితో పనిచేస్తూ ఆయా సమస్యల మీద చైతన్యం, అవగాహన కలిపించే సాహిత్యాన్ని ప్రచురిస్తున్నారు. బయోగ్రఫీలు, ఆటోబయోగ్రఫీలు, విద్య, పిల్లలకు బోధనాపద్ధతులు, ఆరోగ్యం, పౌరహక్కులకు సంబంధించిన రచనలు, అనువాదాలనెన్నిటినో ప్రచురించారు. తనూ స్వయంగా రాశారు. యునెస్కో ప్రాజెక్ట్‌లో భాగంగా ‘ది లంబాడాస్‌.. ఎ కమ్యూనిటీ బిసీజ్డ్‌’ అనే పుస్తకం రాశారు. అనువాదాలూ చేశారు. మాతృభాష తమిళమైనా తెలుగు ప్రచురణ సంస్థను అప్రతిహతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ‘హెచ్‌బీటీతోనే తెలుగు నేర్చుకున్నాను’  అంటారు గీతా రామస్వామి.
– సరస్వతి రమ

మరిన్ని వార్తలు