విబూది

20 Aug, 2019 07:20 IST|Sakshi
ఐ.ఐ.టి. విద్యార్థిని జ్యోతి ప్రియదర్శిని (15) , ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌

వన్‌ అండ్‌ ఓన్లీ

పెద్ద వయసులో ఎవరెస్టును ఎక్కడం, చిన్న వయసులో ఐఐటీ ధన్‌బాద్‌ సీటు కొట్టడం, యాషెస్‌ సిరీస్‌లో రన్‌ల రికార్డ్‌ను బ్రేక్‌ చెయ్యడం ఎవ్రీడే అచీవ్‌మెంట్స్‌గా అనిపించవచ్చు. కానీ వాటి వెనుక ఉన్న ‘హఠంపట్టు’ (పర్‌సెవీరెన్స్‌) ఎవరికి వాళ్లకే ప్రత్యేకం. వన్‌ అండ్‌ ఓన్లీ. ఆ పట్టు పిడికిలిలోంచి రాలిపడే విబూదిని నుదుటికి రాసుకోవలసిందే.- మాధవ్‌ శింగరాజు

బెస్ట్‌ ఫిమేల్‌ ప్లేయర్‌ :అని అనడంలో ‘స్త్రీ సాధించింది’ అని కాక, ‘స్త్రీ అయివుండీ సాధించింది!’ అనే ఎగ్జయిట్‌మెంట్‌ ఉండే మాట వాస్తవమే. అయితే స్త్రీని ఉమన్‌ అచీవర్‌గా కాక, ఒక హ్యూమన్‌ అచీవర్‌గా మాత్రమే చూడడం అంటే ఆమె పర్‌సెవీరెన్స్‌ని తక్కువ చేయడమే. తక్కువ అంటే పురుషుడికి ఈక్వల్‌ చెయ్యడం.

ఎవరికైనా గిన్నిస్‌ ఒక గుర్తింపు. అయితే ఇప్పుడెవ్వరూ గిన్నిస్‌ను గుర్తిస్తున్నట్లు లేదు. గిన్నిస్‌ బుక్కే చిన్నబోయేంతగా ఉంటున్నాయి మరి ఘనతలు!  విజయాలు, వీర స్వర్గాలూ రొటీన్‌ అయిపోయి అభినందనగా చెయ్యి చాచడానికి ఎవరికీ మనసు రావడం లేదు. ఎక్కినందుకు, దిగినందుకు, ఎగిరినందుకు.. ఇలా గిన్నిస్‌వాళ్లు రికార్డులు ఇస్తూనే ఉన్నా.. ఎక్కడమేం గొప్ప, ఎగరడమేం గొప్ప అన్న చప్పరింపే వినిపిస్తోంది. బహుశా.. గిన్నిస్‌లోకి ఎక్కడమన్నది ఏ విలువా లేని గుర్తింపు అనే కాలంలోకి మనుషులు వచ్చి పడుండొచ్చు. శిఖరాన్ని చేరుకోవడం గొప్ప పనేం కాదనే అనుకుందాం. చేరుకునేవరకు మనసు నిలువలేకపోవడం.. అది గొప్పే కదా. కొండలెక్కొస్తే ఎవరికి ఉపయోగం? ఎవరికీ లేదు. కొండకి లేదు. కొండను ఎక్కిన మనిషికీ లేదు. కానీ ఒరిపిడి! పాదాల ఒరిపిడి రాళ్లకు, రాళ్ల ఒరిపిడి పాదాలకు. ఆ రాపిడి పొడి విబూదిలా నుదుటిపై పెట్టుకోవలసిందే. ఎక్కి దిగొచ్చేలోపు ఎన్ని జన్మలు, ఎన్ని జన్మరాహిత్యాలు.. ఆ మనిషికి!

మహిళలు సాధించే విజయాలు కూడా గిన్నిస్‌ రికార్డుల్లా చాలా ఈజీ అయిపోయాయి. మహిళలకు కాదు ఈజీ అయిపోవడం, ఆపోజిట్‌ జెండర్‌కి. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లూ నెగ్గడం సర్వసాధారణం అయిపోవడం వల్ల ఆ నెగ్గడానికి ఏ విలువా ఉన్నట్లు కనిపించకపోయినా, నెగ్గుకు రావడం అనేది ఒకటి ఉంటుంది.. దానికి ఉంటుంది వాల్యూ. ఒకళ్లిస్తే పెరిగే వాల్యూ, ఇవ్వకపోతే తగ్గిపోయే వాల్యూ కాదది. ‘ఎందుక్కాదో తేల్చుకుందాం’ అని అనువుకాని దాని వెంటపడి సాధించడంలోని ‘వాల్యూ ఆఫ్‌ పర్‌సెవీరెన్స్‌’! ఈ  పర్‌సెవీరెన్స్‌ (పట్టువదలకపోవడం)  స్త్రీ, పురుషులిద్దరికీ ఉంటుంది కానీ, స్త్రీ ‘మోర్‌ పర్‌సెవీరింగ్‌’గా ఉండాలి. చేతులు ఊపుకుంటూ నడిచే నడకకు, తలపైన బరువులు మోసుకుంటూ నడిచే నడకకు మధ్య ఉండే వ్యత్యాసం వల్ల తప్పనిసరి అయ్యే ‘మోర్‌’ అది. ఎక్కువ కష్టపడాలి స్త్రీ తను అనుకున్నది సాధించడం కోసం. టెన్నిస్‌ ప్లేయర్‌ సెరెనా విలియమ్స్‌కి ఈ మాట నచ్చదు. ‘లెబ్రాన్‌ జేమ్స్‌ని బెస్ట్‌ మేల్‌ ప్లేయర్‌ అంటున్నారా? ఫెదరర్‌నీ, టైగర్‌ ఉడ్స్‌నీ బెస్ట్‌ మేల్‌ ప్లేయర్స్‌ అంటున్నారా? మరెందుకు నేను గానీ, ఇంకో ఉమన్‌ అథ్లెట్‌ గానీ బెస్ట్‌ ఫిమేల్‌ ప్లేయర్‌ అవ్వాలి?’అని రెండేళ్ల క్రితం కావచ్చు ఆవిడ చికాకు పడ్డారు. బెస్ట్‌ ఫిమేల్‌ ప్లేయర్‌ అని అనడంలో ‘స్త్రీ సాధించింది’ అని కాక, ‘స్త్రీ అయివుండీ సాధించింది!’ అనే ఎగ్జయిట్‌మెంట్‌ ఉండే మాట వాస్తవమే. అయితే స్త్రీని ఉమన్‌ అచీవర్‌గా కాక, ఒక హ్యూమన్‌ అచీవర్‌గా మాత్రమే చూడటమంటే ఆమె పర్‌సెవీరెన్స్‌ని తక్కువ చేయడమే. తక్కువ అంటే పురుషుడికి ఈక్వల్‌ చెయ్యడం.

ఉమెన్స్‌ యాషెస్‌ సిరీస్‌లో ఇటీవల ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్‌ జట్టును ఓడించింది. ఇంగ్లండ్‌లోని ఛెమ్స్‌ఫోర్డ్‌లో జరిగిన ట్వంటీ ట్వంటీ మహిళల ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ అది. ఆస్ట్రేలియా కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌. 63 బంతుల్లో 133 పరుగులు తీశారు. వాటిల్లో 6 సిక్సర్లు, 17 ఫోర్లు. నాటౌట్‌. టీ–ట్వంటీ మహిళా క్రికెట్‌లో ఇది అత్యధిక వ్యక్తిగత స్కోరు. వరల్డ్‌ రికార్డు. మన దగ్గర ఒక్క పేపర్‌ కూడా మెగ్‌ లానింగ్‌ సాధించిన ఈ ఘన విజయం గురించి చిన్న వార్తయినా రాయలేదు!

కనీసం రెండు కారణాల వల్లనైనా లానింగ్‌ని సీరియస్‌గా తీసుకోకపోవడం అన్నది జరగకుండా ఉండాల్సింది. ఒక కారణం: రికార్డును సాధించడమే కాదు, రికార్డును బ్రేక్‌ చేశారు కూడా లానింగ్‌. ఆ బ్రేక్‌ చేసిన రికార్డు కూడా తనదే! ఐదేళ్ల క్రితం బంగ్లాదేశ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ జట్టు మీద 126 పరుగులు స్కోర్‌ చేసి వరల్డ్‌ రికార్డ్‌ నెలకొల్పారు లానింగ్‌. దాన్నే మళ్లీ బ్రేక్‌ చేశారు. రెండో కారణం : లానింగ్‌ ఆడింది ‘యాషెస్‌’ సిరీస్‌! నూటా ముప్ఫై ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సిరీస్‌.  మగవాళ్లది మెన్స్‌ యాషెస్‌. మహిళలది ఉమెన్స్‌ యాషెస్‌. మగవాళ్లయినా, మహిళలైనా యాషెస్‌ సిరీస్‌లో రికార్డు సాధించడం గొప్ప సంగతి. కానీ క్రికెట్‌లో ఒక్క రన్నే అయినా మగవాళ్లు కొట్టినదే, ఒక్క వికెట్టే అయినా మగవాళ్లు తీసిందే గొప్పగా రిఫ్లెక్ట్‌ అవుతుంటుంది.

చదువుల్లో కూడా అమ్మాయిల ఘనతలు కామన్‌ అయిపోయాయి! ఆ ఘనతల వెనుక ఆ కష్టం, ఆ స్ట్రెస్‌ కామన్‌ విషయాలా? వంద మంది అమ్మాయిలు ఒకే విధమైన వంద విజయాలను ఏటా సాధిస్తూనే ఉన్నా ప్రతి అమ్మాయి విజయమూ ప్రతి ఏడాదీ తొలి మహిళా విజయమే. ఈ ఏడాది జ్యోతి ప్రియదర్శిని అనే 15 ఏళ్ల రాయ్‌బరేలి అమ్మాయి జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ ఐఐటీలో (ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ మైన్స్‌) సీటు సంపాదించింది! కాకపోతే చిన్న వయసులో పెద్ద చదువులు చదవడం అన్నది పాత బడిపోయి జ్యోతి కూడా ఒక రొటీన్‌ జీ–ర్యాంకర్‌ అయిపోయింది లోకానికి. జ్యోతి తండ్రి సురేశ్‌కుమార్‌ మ్యాథ్స్, సైన్స్‌ టీచర్‌. పదకొండు మంది ఉండే ఉమ్మడి కుటుంబానికి (అందులో ఒకరు స్ట్రోక్‌ సర్వైవర్‌) ఆయన జీతమే ఆధారం. జ్యోతిని మెడిసిన్‌ చదివించాలని ఆయన. ఇంజనీరింగ్‌ చదవాలని జ్యోతి. తండ్రిని ఒప్పించేందుకు ఒక పెయిన్‌. తండ్రిని నొప్పిస్తున్నానేమోనని ఇంకో పెయిన్‌.జ్యోతి అనే కాదు, చదువు అనే కాదు. లానింగ్‌ అనే కాదు, ఆట అనే కాదు.  ఏ రంగంలో ఏ స్త్రీ సాధించిన ఘనత వెనుకైనా ఘనత వహించిన పెయిన్‌ ఒకటి ఉంటుంది. దానిక్కొట్టాలి సెల్యూట్‌.. చెయ్యి పైకెత్తి, కాలును నేలకు తాటించి. 

మరిన్ని వార్తలు