వృత్తికి  గులాం

22 Mar, 2018 00:32 IST|Sakshi
గులాం అలీ ఖాన్‌

గులాం అలీఖాన్‌

గులాం అలీ ఖాన్‌ సూదీదారం పట్టుకుని యాభై ఏళ్లవుతోంది. ఇరవై మూడేళ్ల వయసులో మెడలో వేసుకున్న టేప్‌ ఇప్పటికీ ఉంది. చేతిలో కత్తెర మెత్తగా పని చేసుకుపోతూనే ఉంది. మెషీన్‌ చక్రం గిర్రున తిరుగుతూనే ఉంది. అది బతుకు చక్రం. జీవితాన్ని మలిచిన చక్రం. వృత్తిలో చక్రం తిప్పాడు గులాం. దుకాణం అంటే అన్నం పెట్టిన అమ్మ అంటాడు. దుకాణం తెరవని రోజు అమ్మను చూడని రోజేనంటాడు. అమ్మకు సలాం... వృత్తికి గులాం అంటున్నాడు హైదరాబాద్, హెచ్‌ఎఫ్‌ నగర్‌కు చెందిన ఈ సీనియర్‌ టైలర్‌.

గులాం అలీ తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా రాలేదేంటి అని అమ్మను అడుగుతున్నాడు. మాటల్లోనే వచ్చాడు నాన్న. అమ్మ చాయ్‌ ఇచ్చే వరకు ఉగ్గబట్టుకున్నాడు. ఆయన చాయ్‌ కప్పు కింద పెట్టగానే...‘‘నాన్నా నేను టైలరింగ్‌ నేర్చుకుంటా’’ ఉపోద్ఘాతం ఏమీ లేదు. విషయం చెప్పేశాడు గులాం అలీ.‘‘మనోళ్లలో ఎవరికీ రాదు బేటా, ఎక్కడ నేర్చుకుంటావ్‌’’‘‘దర్జీ దుకాన్‌కెళ్లి నేర్చుకుంటా అప్పా’’
‘‘..........’’‘‘సరేనంటే రేపే వెళ్తా’’కొడుకు ఆరాటం అర్థమవుతోంది. ‘అలాగే’ అన్నాడు ముక్తసరిగా.

గులాం అలీకి మెషీన్‌ మీద కూర్చున్నట్లే ఉంది. చక్రం గిర్రున తిరగడం, మెషీన్‌ టకటకలాడడం వింటుంటే తానే మెషీన్‌ కుడుతున్నట్లు ఉంది. షర్ట్‌ కుడుతున్న సీనియర్‌ వైపు తదేకంగా చూస్తున్నాడు. హెమ్మింగ్‌ చేసే నీడిల్‌ ఎడమ చేతి చూపుడు వేలిలో గుచ్చుకున్నది. ‘అబ్బా...’ అంటూ ఈ లోకంలోకి వచ్చాడు. ‘‘ఏంట్రా! ఏ లోకంలో ఉన్నావ్‌’’ గద్దించాడు మాస్టర్‌.మాస్టర్‌ చేతిలోని కత్తెర వంపు తిరుగుతూ క్లాత్‌ను కట్‌ చేస్తుంటే ఆకాశంలో వంగిన ఇంద్రధనుస్సును చూసినంత సంబరంగా ఉంది గులాంకి. తానెప్పుడు అలా కట్‌ చేసేది. మెడలో టేప్‌ వేసుకుని కత్తెరతో సర్రున మెత్తగా కట్‌ చేసి, చెవిలో ఉన్న పెన్సిల్‌ తీసి మార్క్‌ చేసి వాటిని చుట్ట చుట్టి మెషీన్‌ మీదున్న టైలర్‌ వైపు విసిరేస్తున్నాడు మాస్టర్‌. యాక్షన్‌ సీన్‌ చూస్తున్నట్లే ఉంది గులాంకి.
 

‘‘నాన్నా! పదిహేను రూపాయలు. నెల జీతం. రోజుకు యాభై పైసలు. నే పనికి ఒక్క రోజు కూడా డుమ్మా కొట్టలే. అందుకే మొత్తం జీతం వచ్చింది. అమ్మకిస్తున్నా’’ అంటూ తల్లి చేతిలో పెట్టాడు.
గులాం తెచ్చిన డబ్బుకంటే... అతడి కళ్లలోని ఆనందాన్ని చూసి మురిసి పోయారు అతడి తల్లిదండ్రులు.‘‘నాన్నా! నేను సొంతంగా దర్జీ దుకాన్‌ పెడతా’’ అన్నాడోరోజు.‘‘ఎక్కడ పెడతావు, ఆబిడ్స్‌లోనేనా’’‘‘దర్జీలంతా ఆబిడ్స్‌లోనే ఉన్నట్లున్నారు. నేను ఎర్రగడ్డలో పెడతా, అఫ్జల్‌ కాకా స్టీల్‌ దుకాణం పక్కనే అద్దెకు గది ఉంది’’‘‘అన్నీ చూసుకున్నావ్‌. నేను చెప్పేదేంటి కానివ్వు’’ 
అలా... 1969లో మొదలైంది గులాం అలీ ఖాన్‌ సొంత దర్జీ దుకాణం. నెలకు పాతికరూపాయల అద్దె. ఒక బ్లవుజ్‌ కుడితే నాలుగు నుంచి ఐదు రూపాయలు నడుస్తున్న రోజులవి. ఐదు లేదా ఆరు బ్లవుజ్‌లు కుడితే రెంట్‌ వచ్చేస్తుంది. మిగిలిన డబ్బుతో జామ్‌జామ్‌గా బతికేయవచ్చు. ఇక ప్యాంట్‌ షర్టులకు లెక్కేలేదు. గవర్నమెంట్‌ ఉద్యోగుల కంటే పెద్ద రాబడి. ఒకరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు. సొంతంగా ఎవరికీ తల వంచని దర్జీలా దర్జాగా జీవించవచ్చు. గులాం ముందున్న చిత్రం ఇది. కుర్రాడు మంచి పని వాడేననే పేరుతో పాటు పిల్లనిచ్చే వాళ్ల క్యూ రెడీ అయింది. షహనాజ్‌బేగంను పెళ్లి చేసుకున్నాడు. ఆరుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. తొమ్మిది మందినీ చదివించాడు. ఏడుగురికి పెళ్లిళ్లు చేశాడు గులాం అలీ ఖాన్‌. ఇక ఇద్దరికి పెళ్లి చేయాలి. ఇప్పుడతడి వయసు 71. 23 ఏళ్ల వయసులో సొంత దుకాణం తెరిచారు. అప్పటి నుంచి ఇప్పటికీ మడత నలగకుండా చక్కగా ఐరన్‌ చేసిన ఖరీదైన షర్టు, ప్యాంట్‌తో గెజిటెడ్‌ ఆఫీసర్‌లాగా ఉంటాడు. డ్రస్‌ అలాగే మెయింటెయిన్‌ చేస్తాడని చెప్తారు బాగా తెలిసిన వాళ్లు. 

పిల్లలు టేప్‌ పట్టుకోలేదు!
గులాం ఆరుగురు కొడుకులనూ చదివించాడు. ఒక కొడుకు ఓలా క్యాబ్‌ నడుపుతున్నాడు. మున్సిపాలిటీ ఆఫీస్‌లో ప్రైవేట్‌ వర్క్, డీఎల్‌ఎఫ్‌లో ఉద్యోగం, టైలరింగ్‌ మెటీరియల్‌ షాప్, మొబైల్‌ షాప్, చిన్న కొడుకు డీజె. కొడుకులలో ఒక్కరినైనా దర్జీని చేయాలనుకున్నాడు గులాం. ‘‘ఈ దుకాణం మీదనే అందరినీ చదివించాను, పెళ్లిళ్లు చేశాను. అప్పట్లో చేతి నిండా పని. ఇప్పుడు నెలలో పదిహేను రోజులు పని ఉంటే చాలా బాగున్నట్లు. మిగిలిన రోజులు షాపు తెరిచి కూర్చోవాల్సిందే. అద్దెలు కట్టుకుంటూ, కరెంట్‌ బిల్లు కట్టుకుంటూ గిరాకీల కోసం ఎదురు చూస్తున్నాను. ‘మేమంతా పని చేస్తున్నాం, ఇంక దుకాణం బంద్‌ చేయ’మంటారు పిల్లలు. దుకాణం బంద్‌ చేయాలంటే అమ్మను చూడకుండా ఆమె ముఖాన తలుపేసినట్లే, అట్లా మనసు రాదు. పాణం సుస్తీ చేసినా సరే, సాయంత్రం ఓ గంటయినా వచ్చి కూర్చుంటాను.

అప్పుడు పాతిక... ఇప్పుడు తొమ్మిది వేలు!
అప్పట్లో ఐదారు బ్లవుజ్‌ల డబ్బు అద్దెకెళ్లేది. ఇప్పుడు బ్లవుజ్‌కు 175 రూపాయలు తీసుకుంటున్నాను. షాపు అద్దె తొమ్మిది వేలు, కరెంటు బిల్లు ఆరొందలు. ఎన్ని బ్లవుజ్‌లు కుడితే షాపు రెంటు గడవాలి. నేను లేడీస్, జెంట్స్‌ ఇద్దరికీ కుడతాను కాబట్టి ఈ మాత్రమైనా బండిని నడిపిస్తున్నాను. మగవాళ్ల దుస్తులు మాత్రమే కుట్టే వాళ్లు దుకాణాలు బంద్‌ చేసేశారు. మగవాళ్లంతా రెడీమేడ్‌ ప్యాంట్, షర్ట్‌ కొనుక్కుంటారు. వాళ్లకు దర్జీతో పనే ఉండటం లేదు. లేడీస్‌కి అలా కాదు. కరెక్ట్‌ ఫిట్టింగ్‌ రెడీమేడ్‌లో దొరకక టైలర్‌తో కుట్టించుకునే వాళ్లుంటారు. రెడీమేడ్‌ కొని ఆల్టరేషన్‌కి వచ్చేవాళ్లుంటారు. ఇప్పుడు టైలర్లను బతికిస్తున్నది ఆడవాళ్లే.

రెడీమేడ్‌ దుస్తులు కుట్టడం ఈజీ!
మూడు వందలకు రెడీమేడ్‌ కుర్తా వస్తుంది. మేము కుట్టడానికే 225 తీసుకుంటాం. మరి మా దగ్గరకు ఎందుకు వస్తారు? అలా చార్జ్‌ చేయకపోతే మేము బతకలేం. రెడీమేడ్‌లో లాగ మేము కుర్తాను బారుగా కుట్టేస్తే సరిపోదు. కరెక్ట్‌ ఫిట్టింగ్‌ వచ్చేలా కుట్టాలి. దానికి టైమ్‌ పడుతుంది. కొత్తగా టైలరింగ్‌ నేర్చుకునే వాళ్లు కూడా పెద్ద పెద్ద దుస్తుల తయారీ కంపెనీలలో ఉద్యోగానికి వెళ్లిపోతున్నారు. అక్కడ ఐదు వేలిస్తారు. సైజ్‌ల వారీగా కామన్‌గా కుట్టేస్తారు. దాంతో దర్జీ దుకాన్‌ తెరమరుగు అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది’’ అన్నారు గులాం అలీ ఖాన్‌ ఆవేదనగా.దర్జీలు తెరమరుగవడానికి రెడీమేడ్‌ దుస్తులు మార్కెట్‌ని వెల్లువలా ముంచేయడం ఒక కారణమైతే, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ మరో కారణం. పెద్దగా నైపుణ్యం లేని వాళ్లు తక్కువ జీతాలతో రెడీమేడ్‌ దుకాణాల కార్ఖానాల్లో చేరిపోతున్నారు. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగం వేళ్లూనుకోవడంతో స్కిల్‌ ఉన్న టైలర్‌లు డిజైనర్‌తో కలిసి పని చేస్తున్నారు. సొంతంగా పనిచేసుకుంటూ నేను దర్జీని అని చెప్పుకునే వాళ్లు కనిపించడం లేదు. 

నా దగ్గరకు క్లాత్‌ తెచ్చి కుట్టించుకునే వాళ్లకు నేనెలా కుడతానో చెప్పేది నా డ్రస్సే. నేను రెడీమేడ్‌ డ్రస్‌ వేసుకుని టేప్‌ మెడలో వేసుకుని కొలతలు తీసుకుంటుంటే, కొలతలిచ్చే వాళ్లకు నా పని మీద నమ్మకం కలగదు. ఇతర కంపెనీలను ప్రమోట్‌ చేయడం కాదు, నాకు నేనే ప్రమోషన్‌ ఇచ్చుకోవాలి. నేను శుభ్రంగా, నీట్‌గా కనిపిస్తే నా దగ్గర కుట్టించుకోవడానికి వస్తారు. ఇది వృత్తి సూత్రం 
– వాకా మంజులారెడ్డి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు