జీ'వి'తం లేని అవ్వా తాత

25 Jul, 2019 09:38 IST|Sakshi

పిల్లలు పుడితే పుణ్యం అంటారు. కానీ పిల్లలకు మాత్రం పెద్దలు పుణ్యానికి వచ్చినట్టే అనిపిస్తుంది. జీతం ఇవ్వకుండా జీవితమంతా వాడుకోవచ్చనుకుంటారు. అయినా పెద్దలు బాధ పడరు.
ఆ సేవలో కూడా పునీతులవుతారు. అప్పటికీ వారిని కసురుకుంటే... కించపరిస్తే.. అవమానపరిస్తే... ఆ గోడు ఎక్కడ చెప్పుకోవాలి? పిల్లలు మారాలి... కథను మార్చాలి.  

వేణుగోపాల స్వామి ఆలయం ప్రశాంతంగా ఉంది.చిన్న గుడి అది. కాని ప్రాంగణం విశాలంగా ఉండటం వల్ల రకరకాల చెట్లు బాగా ఎదిగి చల్లటి నీడనే కాదు కొమ్మలను ఊపుతూ గాలిని ప్రసరింప చేస్తూ ఉండటం వల్ల వచ్చినవారికి మనసుకు ప్రశాంతత కలుగుతోంది.భాస్కరరావు, విజయమ్మ ఒక చెట్టు కింద అమర్చిన చుట్టు అరుగు మీద కూచున్నారు.ఉదయం తొమ్మిది, తొమ్మిదిన్నర అయి ఉంటుంది.
వారి పక్కన చిన్న సంచి ఉంది. అందులో వారి బట్టలు ఉన్నాయి.‘అమ్మాయితో చెప్పి వెళితే బాగుంటుందేమో’ అంది విజయమ్మ. ‘వద్దులే. కాల్‌ చేస్తుంది కదా. అప్పుడు చెప్దాం’ అన్నాడు భాస్కరరావు.

‘ఎన్నింటికి బస్‌?’
‘మధ్యాహ్నం రెండు గంటలకు’
‘ఇన్నాళ్లకు బయటపడ్డాం. రాత్రి బస్సుకు వెళదామండీ. కాస్త అలా ఊరంతా తిరుగుదాం. బయట తిందాం. ఇప్పటికిప్పుడు మన ఊరికి వెళ్లి చేసేది ఏముంది కనుక’ అంది విజయమ్మ.
భాస్కరరావు భారంగా తల ఊపాడు.
ఇద్దరికీ మనవడు గుర్తుకొచ్చాడు.
‘వాడు స్కూల్‌ నుంచి రాగానే తాళం ఇచ్చి విషయం చెప్పమని పక్కింటి వాళ్లకు చెప్పావా లేదా?’ అడిగాడు భాస్కరరావు.
‘ఇది మీరు వందోసారి అడగడం. వాళ్లకు వందసార్లు చెప్పాను. వాడు వచ్చాక తినడానికి కొంచెం చికెన్‌ ఫ్రై కూడా చేసి పెట్టాను’
ఇద్దరూ లేచారు.
లోపల వేణుగోపాలస్వామి విగ్రహం మౌనంగా పూజలు అందుకుంటూ ఉంది.
స్వామికి కూతురు, అల్లుడు, మనవడు ఉండి ఆ ముగ్గురి పనుల్లో స్వామి ఉండవలసి ఉంటే స్వామి ఏం చేసి ఉండేవాడో.
వీళ్లు మాత్రం ప్రస్తుతానికి ఊరు బయల్దేరారు.

సాయంత్రం అయిదైంది.
స్కూల్‌ నుంచి బబ్లూ, ఆఫీస్‌ నుంచి రవళి దాదాపు ఒకేసారి ఇల్లు చేరారు. ఇవాళ రవళికెందుకో లోలోపల అలజడిగా అనిపించింది. అందుకే త్వరగా ఇల్లు చేరింది.
‘మీ అమ్మ తాళం ఇచ్చి వెళ్లింది. ఊరు వెళుతున్నామని చెప్పింది’ అని పక్కింటి వాళ్లు వచ్చి చెప్పారు.
రవళి అయోమయంగా చూసింది.
‘అదేంటి.. అమ్మమ్మ, తాతయ్య మనకు చెప్పకుండా ఎలా వెళతారు’ అన్నాడు బబ్లూ.
ఇద్దరూ కంగారుగా ఇంట్లోకొచ్చి ఫోన్‌ కలిపారు.  విజయమ్మ ఎత్తింది.
‘అమ్మా.. ఎక్కడ ఉన్నారు?’ కంగారుగా అడిగింది రవళి.
‘ట్యాంక్‌ బండ్‌ మీద ఉన్నాం. రాత్రికి భోజనం చేసుకుని బస్సెక్కుతున్నాం’
‘అమ్మా.. ఏం మాట్లాడుతున్నావు. సడన్‌గా ఊరెళ్లడం ఏంటి? బబ్లూ ఏడుస్తున్నాడు’
‘ఎందుకు ఏడవడం. వాడేమైనా చిన్న పిల్లాడా. మళ్లీ వస్తాంలే ఒక మూడు నెల్లకో ఆరునెల్లకో. నువ్వు జాగ్రత్తగా పిల్లాణ్ణి చూసుకో. మేం అక్కడ ఉన్నా మా మనసంతా ఇక్కడే ఉంటుంది’
‘అమ్మా.. ఏమిటి ఈ శిక్ష. నువ్వెక్కడున్నావ్‌ చెప్పు’
‘ఎందుకమ్మా. మేం వెళతాంలే. ఊరు చేరాక ఫోన్‌ చేస్తాం’ అని పెట్టేసింది.
రవళి వెంటనే భర్త శ్రీకర్‌కు ఫోన్‌ చేసింది. అతడు ఆఘమేఘాల మీద ఇల్లు చేరాడు. శ్రీకర్, రవళి, బబ్లూ కలిసి నేరుగా బస్టాండ్‌కు చేరుకున్నారు. అక్కడే కాపు కాచి భాస్కరరావును, విజయమ్మను ఇంటికి తీసుకొచ్చారు.

ఆ గండం అప్పటికి గడిచింది.
కాని వాళ్లు మాత్రం ఊరుకు వెళ్లాల్సిందే అని భీష్మించుకుని కూచున్నారు.
‘సరే.. వెళ్దురు... ఒక్కసారి మా ఫ్రెండ్‌తో మాట్లాడి వెళ్లండి. నేనే మిమ్మల్ని బస్‌ ఎక్కిస్తాను’ అంది రవళి.
అలా వాళ్లను సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకొచ్చింది కౌన్సెలింగ్‌ కోసం.

లేడీ సైకియాట్రిస్ట్‌ ఎదురుగా వాళ్లిద్దరూ కూచున్నారు. వృద్ధదంపతులు. భాస్కరరావుకు 70 ఏళ్లు ఉంటాయి. విజయమ్మకు 65. మొదట విజయమ్మే మాట్లాడింది.
‘మాది వ్యవసాయ కుటుంబం డాక్టర్‌. ఊళ్లో పొలాలు పనులు ఉన్నాయి. ఒక్కగానొక్క కూతురు. బాగా చదివించాం. పెద్ద సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయ్యింది. అల్లుడు కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరే. ఇద్దరూ ఉద్యోగం చేయడం ముఖ్యం అనుకున్నారు. మంచిదే. కాని ఉద్యోగమే జీవితం అనుకున్నారు. బాబు పుడితే వాడి కోసమైనా ఎవరూ పని తగ్గించుకోలేదు. ఒక నెల ఆమె అమెరికా వెళితే ఒక నెల అతను అమెరికా వెళతాడు. మరి బాబును ఎవరు చూసుకుంటారు. అందుకే ఉన్న పొలాన్ని కౌలుకు ఇచ్చేలా చేసి నన్ను, మా వారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది. మనవడి పనులు చూడటం ఏ అమ్మమ్మ, తాతయ్యలకు ఆనందం ఇవ్వదు చెప్పండి. వాడి పనుల్లో పడ్డాం. గమ్మత్తేమిటంటే ఇన్నాళ్లు ఊళ్లో ఉండి సంసారం ఈదాను. ఇక్కడికొచ్చాక కూడా సంసారాన్ని ఈదాల్సి వచ్చింది. నా కూతురు, అల్లుడు, మావారు అందరూ నా మీద ఆధారపడ్డవాళ్లే. నేనే ఆ ఇంటికి ఆడదిక్కు. మా మనవడు వాడి అమ్మానాన్నల కంటే మమ్మల్నే అమ్మా నాన్నలు అనుకునేంతగా అటాచ్‌మెంట్‌ పెట్టుకున్నాడు. పన్నెండేళ్లు అయిపోయాయి. ఇప్పుడు నాకు ఓపిక లేదు. ఉదయాన్నే లేచి కూతురికి అల్లుడికి ఏర్పాట్లు చేయలేకపోతున్నాను ఎంత పని మనిషి ఉన్నా. పిల్లాడికి కావలసిన పనులు కూడా చేయలేకపోతున్నాను. మునుపటి హుషారు లేదు. కాసేపు పడుకుని ఉండాలనిపిస్తోంది. అది చూసి నా కూతురు నన్ను కసురుతోంది. విసుక్కుంటోంది. తన పని కావట్లేదని తన బాధ. నా వైపు నుంచి అసలు మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. మా అల్లుడు మంచివాడే కాని ఇవన్నీ పట్టించుకోవాలి కదా’ అందామె.

‘ఇవన్నీ ఎందుకమ్మా. మా చివరి రోజులేవో విశ్రాంతిగా ఊళ్లోనే బతకాలని ఉంది’ అన్నాడు భాస్కరరావు.
సైకియాట్రిస్ట్‌ వాళ్లను బయట కూచోబెట్టి రవళిని, రవళి భర్త శ్రీకర్‌ని లోపలికి పిలిచింది.

‘చూడండి. అమ్మా నాన్నలు మన అక్కర చూసేవాళ్లే తప్ప పనివాళ్లు కాదు. బానిసలు అంతకన్నా కాదు. మీ అవసరానికి వాళ్లను తెచ్చుకున్నారు తప్పితే వారి అవసరానికి వారు మీ దగ్గర వచ్చి ఉండలేదు. మీ అవసరానికి వాళ్లను వాడుకుంటూ ౖపైగా విసుక్కుంటూ చిరాకు పడుతుంటే ఎవరు మాత్రం ఉంటారు. అసలు విచిత్రం చూడండి. పెళ్లిళ్లయ్యి సంపాదన మొదలయ్యాక మీరు వారిని కూచోబెట్టి చూసుకోవాలి. కాని కచ్చితంగా అప్పటి నుంచే వారితో ఎక్కువ చాకిరి చేయించడం మొదలుపెడతారు. ఇన్నాళ్లు వాళ్లు మీ దగ్గర ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడే వారు మీ దగ్గర ఉండటం ప్రారంభించాలి. ఇకమీదట వారి ఆరోగ్య సమస్యలు, అవసరాలు మీరే చూసుకోవాలి. అయినప్పటికీ రిస్క్‌ తీసుకొని మరీ ఊరు వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నారంటే మీ ప్రవర్తన వారిని ఎంత బాధించి ఉంటుందో ఆలోచించండి’ అంది సైకియాట్రిస్ట్‌. రవళికి కళ్ళు ఎర్రబడ్డాయి. శ్రీకర్‌ తల దించుకున్నాడు.

ఆ రాత్రి భోజనాలయ్యాక రవళి వచ్చి తల్లి దగ్గర కూచుంది. తండ్రి మౌనంగా చూస్తూ ఉన్నాడు.
‘అమ్మా.. సారీ. నా గొడవలో పడి నీ సంగతి నాన్న సంగతి పట్టించుకోలేదు. అంతెందుకు... కడుపున పుట్టిన నా కొడుకు సంగతి కూడా పట్టించుకోలేదు. మీరే లేకుండా ఉంటే నా కెరీర్‌ ఏమై పోయి ఉండేది. డబ్బు ఉండాలి మంచిదే కాని డబ్బు మాత్రమే మిగిలి ఇంకెవరూ లేకుండా పోవడం కంటే పాపిష్టి జీవితం మరొకటి ఉండదు. ఇక సంపాదించింది చాలు. అందరం హాయిగా ఉందాం. ఇన్నాళ్లు మిమ్మల్ని నా కోసం ఉంచుకున్నాను. ఇప్పుడు మీ కోసం ఉంచుకుంటాను. మీ అవసరాలన్నీ చూడాల్సిన సమయం ఇది. ఇక ఊరి మాట ఎత్తకండి. నన్ను క్షమించండి’ అని నీళ్లు కారుతున్న కళ్లతో మెల్లగా తల్లి చేయి పట్టుకుంది.

ఏ తల్లి తన బిడ్డను క్షమించకుండా ఉండదు?
‘ఊరుకో తల్లి.. అలాగేలే’ అని కూతురును దగ్గరకు తీసుకుంది, భాస్కరరావు చెమర్చిన కళ్లతో చూస్తూ ఉండగా.

బబ్లూ ఇప్పుడు కూడా స్కూల్‌ నుంచి అదే సమయానికి వస్తున్నాడు.
కాని స్నాక్స్‌ చేసి రవళి రెడీగా ఉంటోంది.
తను వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తోంది. వీలైనప్పుడు చేసే పనినే వెతుక్కుంటోంది.
సాయంత్రం పూట విజయమ్మ, భాస్కరరావు కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్‌కి వెళుతున్నాడు.
శ్రీకర్‌ బిగ్‌బాస్‌ రిలే సమయానికి ఇల్లు చేరి సందడి చేస్తున్నాడని వేరే చెప్పాలా? – కథనం: సాక్షి ఫ్యామిలీఇన్‌పుట్స్‌: డా. పద్మ పాల్వాయి,సైకియాట్రిస్ట్‌

మరిన్ని వార్తలు