చేజేతులా..!

11 Sep, 2019 10:58 IST|Sakshi

బ్యూటిప్స్‌

‘మొక్కే కదా అని పీకేస్తే..’ అంటూ, ఆ తర్వాత ఇంకేదో అంటాడు ‘ఇంద్ర’ సినిమాలో చిరంజీవి. అలాగే.. ‘వెంట్రుకే కదా రాలిపోయింది’ అని అనుకోలేం. గుండె పిండినట్లవుతుంది.. వేళ్లకు, దువ్వెనకు చిక్కుకుని వచ్చింది అది సింగిల్‌ శిరోజమే అయినా! కొందరైతే స్ట్రెస్‌ కూడా ఫీల్‌ అవుతారు. వెంట్రుకలు రాలిపోతుండటానికి అనేక కారణాలు ఉన్నా చేజేతులా మనం రాల్చుకోవడం కూడా ఉంటుందంటే మీరు నమ్ముతారా. ‘చేజేతులా’ అంటే.. మన అలవాట్ల కారణంగా. ఆ అలవాట్లను మార్చుకుంటే వెంట్రుకల్ని సమకూర్చుకున్నట్లే! ఖర్చు చేయకుండా ఉండటం కూడా పొదుపే కదా. అలాగన్నమాట. ఇంతకీ వెంట్రుకల్ని రాల్చే ఆ అలవాట్లు ఏమిటి?

గట్టిగా ముడి వెయ్యడం: నుదుటి మీద, చెవుల మీద పడుతున్నాయని వెంట్రుకల్ని గట్టిగా బిగించి కట్టి, గంటల పాటు అలా ఉంచేస్తే మాడు మీద మూలాల్లో వెంట్రుక బలహీన పడి రాలిపోతుంది.
శ్రద్ధ లేకపోవడం: సాధారణంగా మన ధ్యాసంతా ఫిట్‌నెస్‌ మీద, చర్మ సంరక్షణ మీద ఉంటుంది. కేశాలను అస్సలు పట్టించుకోం. నిజానికి ఫిట్‌నెస్‌ కన్నా, చర్మం మీద కన్నా ఎక్కువ శ్రద్ధ కేశాల పోషణ మీద పెట్టవలసి ఉంటుంది. తరచు తల వెట్రుకలకు నూనె పట్టిస్తుండండి. సిటీలో ఉంటే కనుక హెయర్‌ ‘స్పా’కు వెళ్లడంలో తప్పేం లేదు. సొంతంగా చేసుకునే హెయిర్‌ మాస్క్‌లు కూడా మంచి ఫలితం ఇస్తాయి.
అతి వేడి: వాతావరణంలోని ఉష్ణోగ్రత కాదిది. తలస్నానం చేశాక త్వరగా ఆరేందుకు డ్రయర్‌ని ఎక్కువ హీట్‌ మీద ఉంచుతారు చాలామంది. దాని వల్ల వెంట్రుకలు చిట్లి, బలహీన పడి రాలిపోతాయి.
పోషణనివ్వని ఆహారం: శరీరానికి పోషణ అవసరమైనట్లే వెంట్రుకలకూ అవసరం. జుట్టుకు బలాన్నిచ్చే ఆహారాన్ని తీసుకుంటుంటే వెంట్రుకలు రాలే సమస్యే ఉండదు.
హెయిర్‌ ప్రాడక్ట్స్‌: వీటిల్లో ఉండే రసాయనాలు మరీ అంత చెడ్డవి కాదు కానీ, తరచు బ్రాండ్‌లను మార్చి వాడటం వల్ల కానీ, అనేక రకాల ఉత్పత్తులను ఒకేసారి అప్లై చేయడం వల్ల కానీ వెంట్రుకలు దెబ్బతిని రాలిపోతాయి.
ఇవే కాదు.. మానసిక ఒత్తిడి, తరచు తలస్నానం చెయ్యడం కూడా వెంట్రుకలకుహాని చేస్తాయి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. కాలుష్యం ఎక్కువై తల మాసింది అనుకున్నప్పుడు మాత్రమే తలస్నానం చెయ్యాలి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు