ఈ మూడు ముక్కల్లో ఎక్కడైనా లవ్‌ ఉందా?!

3 Jan, 2020 06:21 IST|Sakshi

విడిపోడానికి ఒప్పందం చేసుకుని పెళ్లికి సిద్ధమైన దొంగముఖంలా హార్ధిక్‌ పాండ్యా మీక్కనిపిస్తే కనుకఈ ఏడాది మీరు మరి కాస్త మంచి మనసుతో మనుషుల్నిఅర్థం చేసుకోడానికి ప్రయత్నించడం అవసరమేమో! జనవరి1న జరిగిన హార్ధిక్, నటాషాల నిశ్చితార్థం వీడియో,ఫొటోలు హార్ధిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే కనిపించడంమీ అనుమానానికి మొదటి కారణం అయి వుండొచ్చు.అతడి ప్రియురాలైన నటాషా తన ఇన్‌స్టాగ్రామ్‌లోవాటిని ఎందుకు పోస్ట్‌ చేయలేదని శంకించడం మాని..ఒకసారి మళ్లీ ఆ వీడియోను తిలకించండి.

పూలు, బెలూన్‌లు, గిటార్‌ ప్రణయ గీతాలాపనలతో అలంకృతమై ఉన్న స్పీడ్‌బోటు (యాట్‌) అరేబియన్‌ జలాల మీద తేలియాడుతుండగా.. నటాషా వేలికి రింగును తొడిగాడు హార్ధిక్‌. రింగు తొడుగుతుండగా, తొడిగేముందు, తొడిగిన తర్వాత హార్ధిక్‌ పట్టలేని సంతోషాన్ని మీరు ఎన్నిసార్లయినా ఈ వీడియోలో చూడవలసిందే. హార్ధిక్‌ వయసు 26. నటాషా వయసు 27. కొత్తగా పెళ్లయిన కోడె వయసు జంట.. కొన్నాళ్ల వరకైనా నిదురే పోరాదంట. (ఇలా అని.. ‘జీవనజ్యోతి’ సినిమాలో శోభన్‌బాబు పాడతాడు). ఇంకా ప్రేమ జంటే కనుక, నిశ్చితార్థం అయినా, వివాహ మహోత్సవానికి ముహూర్తం ఫిక్స్‌ కాలేదు కనుక.. ఎవరి నిద్ర వాళ్లు పోవలసిందే.

‘మైయ్‌ తేరా, తూ మేరా జానే, సారా హిందూస్థాన్‌’ అన్నాడు హార్ధిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో.. నటాషా పక్కన తనున్న ఫొటోను షేర్‌ చేస్తూ. నటాషా ఎడమ చేతి గోళ్లకున్న ఎర్ర రంగు, ఆమె కుడి చేతి వేళ్లకు షాంపేయ్‌ గ్లాస్‌.. ఇవే బ్రైట్‌గా ఉన్నాయి ఆ ఫ్రేమ్‌ మొత్తం మీద. హార్ధిక్‌ ఏమైనట్లు మరి! ఫొటోలో ఉన్నా తన లోకంలో తను ఉన్నాడు. ఎక్కడుంది తన లోకం? ఇంకెక్కడా.. నటాషాలోనే. ముందు మీరు ప్రతిదాన్నీ సందేహించడం మానండి. వీళ్లిద్దరే కాదు ‘యాట్‌’లో ఉన్నది. ఫ్రెండ్స్, హార్ధిక్‌ కుటుంబ సభ్యులు ఒకరిద్దరు ఉన్నారు. నటాషా వైపు పెద్దగా ఎవరూ రాలేదు. రాలేదో, వచ్చేంత టైమ్‌ని ఈ ప్రేమికుడు ఇవ్వలేదో!

వీడియో మొత్తం మీద కనిపిస్తున్నవి హార్ధిక్‌ విలాసాలు, ఉల్లాసాలే! హత్తుకుంటాడు. ముద్దు పెట్టుకుంటాడు. రెండు వేళ్లెత్తి చూపమంటాడు. నటాషా చిన్న స్మైల్‌ మాత్రం ఇస్తోంది. అతడు చెప్పినట్టల్లా చేస్తుంది. అమ్మాయి కదా.. ఆ మాత్రం బిడియం ఉండటం కూడా పెళ్లి కళే. పెళ్లి సరే.. వీళ్లిద్దరి ప్రేమకళ ఇన్నాళ్లూ ఎక్కడా కనిపించలేదే! హార్ధిక్‌ అంటూనే ఉన్నాడు.. ‘నటాషా మై లవ్, నటాషా మై లైఫ్‌’ అని. ఎవర్నమ్ముతారు? నటాషా నమ్మిందేమో. ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో హార్ధిక్‌ చేసిన ‘షో’ చూసినవాళ్లెవరూ, విన్నవాళ్లెవరూ అతడికి పిల్ల దొరుకుతుందంటే, పెళ్లవుతుందంటే నమ్మరు. ఇదిగో.. పోయిన ఏడాది ఇదే జనవరిలోనే పెద్ద కాంట్రావర్సీ! ‘షో’ జనవరి ఆరున ప్రసారం అయింది. హార్ధిక్‌ అప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. జనవరి పదమూడున బిసిసిఐ నుంచి అతడికి ఫోన్‌ వెళ్లింది. ‘ఇక ఆడింది చాలు, వెనక్కి వచ్చేయ్‌’ మని! ఆట నుంచి సస్పెండ్‌ అయ్యాడు. ట్విట్టర్‌లో చెంపలు వేసుకున్నా క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు కరుణించలేదు. ఎలా కరుణిస్తుంది? నా అంత మగాడు లేడని కరణ్‌ షోలో చొక్కా బటన్‌లు విప్పుకున్నాట్లుగా.. ఒళ్లు తెలీకుండా డప్పాలు కొట్టుకుంటేను హార్ధిక్‌.

నేనిన్ని సిక్సర్‌లు కొట్టాను, నేనన్ని వికెట్ల లేపాను అని చెప్పుకుంటే ‘ఓహ్‌.. గ్రేట్‌’ అనుకునేవాళ్లు మళ్లొకసారి. ఇంతమంది అమ్మాయిల్ని పైకి లేపాను, అంతమంది అమ్మాయిల్ని పడగొట్టాను. పడగొట్టి, పైకి లేపి ఇంటికొచ్చి మా డాడీకి కూడా చెప్పాను అన్నాడు. షో హోస్ట్‌ కరణ్‌ ఒకటే నవ్వు. ఆ నవ్వు చూసి హార్ధిక్‌ మళ్లీ రెచ్చిపోవడం. అమ్మాయిలంటే బొమ్మలే అన్నట్లు మాట్లాడాడాడు.

ఈ హిస్టరీ అంతా ఇప్పుడు తవ్వడం పెళ్లి చెడగొట్టడమే. పెళ్లి చెడిపోతే బాగుండునని అనుకోవడమే. హార్ధిక్‌ మారాడేమో! ప్రేమకు మార్చే శక్తి లేకున్నా.. పెళ్లికి ఉంటుంది. ఇప్పటికే మార్చేసిందో, పెళ్లి తర్వాత ఎలా మార్చేస్తాను కదా అనుకుందో నషాటా నవ్వును తప్ప మాటను పెదవి దాటనివ్వడం లేదు. ఇంతవరకు ఒక్కసారిగా కూడా ‘ఐ లవ్‌ హిమ్‌’ అని ఆమె బయట పడలేదు. అక్టోబర్‌ 11న హార్ధిక్‌ బర్త్‌డే అయింది. అప్పుడు కూడా ఆమె.. క్రికెటర్‌గా అతడి గొప్పతనం గురించి మాట్లాడింది తప్ప గొప్ప ప్రియతముడు అని ఎక్కడా అనలేదు. హార్ధిక్‌ బర్త్‌డేకే ఆమె ఇచ్చిన స్పెషల్‌ మెసేజ్‌ ఎలా ఉందో చూడండి!!

‘‘నా ఆప్తమిత్రుడికి. శక్తిమంతుడికి, అత్యంత అందమైన మనసుగలవాడికి... ఈ ఏడాది ఎన్నో ఎత్తుపల్లాలు చూశావు. గొప్పవింకా చాలా జరుగుతాయి నీ జీవితంలో. అన్నీ గొప్పవి కాకున్నా అవి నిన్ను మానసికంగా బలాఢ్యుడిని చేస్తాయి.’’

ఈ మూడు ముక్కల్లో ఎక్కడైనా లవ్‌ ఉందా?!
అయినా ఆడవాళ్ల ప్రేమ పైకి కనిపించదని అంటారు. హార్ధిక్‌ అదృష్టవంతుడనే అనుకోవాలి. విరాట్‌ కోహ్లీ కూడా ‘కంగ్రాట్స్‌ హార్ధిక్‌’ అనేశాడు. అమ్మాయి లక్షణంగా ఉంది. అబ్బాయిలో ఏవైనా అవలక్షణాలుంటే వాటిని పోగొట్టేలానూ ఉంది. మంచి విషయమే. మంచిది నాయనా. మంచిది తల్లీ. చల్లగా సంతోషంగా ఉండండి.

ఎవరీ అమ్మాయి?
సెర్బియా అమ్మాయి. పూర్తి పేరు నటాషా స్టాంకోవిక్‌. నటనలో కెరీర్‌ని మలుచుకునేందుకు 2012లో ఇండియా వచ్చింది. మొదట ఫిలిప్స్, క్యాడ్‌బరీ, టెట్లీ, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఉత్పత్తులకు మోడల్‌గా చేసింది. ‘సత్యాగ్రహ’ ఆమె తొలి సినిమా. ఇప్పటి వరకు మొత్తం పది సినిమాలు. రెండు టెలివిజన్‌ షోలు, ఒక వెబ్‌ సిరీస్, మూడు మ్యూజిక్‌ వీడియోలు. ఇదీ ఆమె కెరీర్‌. వీళ్లిద్దరి మధ్య (నటాషా, హార్ధిక్‌) ప్రేమ ఎప్పుడు అంకురించిందనేది ఇప్పటికీ రహస్యమే. ముంబైలో ఉంటున్న హార్ధిక్‌ తల్లి దండ్రులకు కూడా మొన్న దీపావళికే ఈ సంగతి తెలిసింది. ఇంటికి తీసుకెళ్లి నటాషాను పరిచయం చేశాడు హార్ధిక్‌.

హార్థిక్‌ పాండ్యా
వరుడిది.. సారీ, గురుడిది గుజరాత్‌. సూరత్‌లో పుట్టాడు. ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌. ఆల్‌ రౌండర్‌. రైట్‌ హ్యాండెడ్‌ బ్యాట్స్‌మన్‌. టీ ట్వంటీలు, వన్‌డేలు, టెస్ట్‌ మ్యాచ్‌లు చాలా ఉన్నాయి కెరీర్‌లో. ఉన్న చోట ఉండడు. ఒకడే ఉండడు. చుట్టూ ఫ్రెండ్స్‌. నటాషా హార్ధిక్‌ను ఎంతగా అభిమానిస్తుందో అతడి అభిమానుల్నీ అంతగా రెస్పెక్ట్‌ చేస్తుంది. ఇక హార్ధిక్‌ తల్లిదండ్రుల్ని ఎలా చూసుకుంటుందో చెప్పాలా?!

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు