పనిమనషి

11 Mar, 2019 00:00 IST|Sakshi

తిన్న కంచం నుంచి వేసుకునే బట్టల దాకా శుభ్రం చేయాలి. వంట గది నుంచి తోట పని దాకా మనకు తోడవ్వాలి. రోజంతా ఇంటి బాధ్యతలతో పాటు మన బాగోగులూ చూసుకోవాలి.  కుటుంబ సభ్యులతో సమానంగా అంతకు మించీ మనతో ఉంటున్న  తననెందుకు పనిమనిషి అంటున్నాం? మనమనిషి అనుకోలేమా? ఈ ప్రశ్నలకు సమాధానం అందరి దగ్గరా లేకపోవచ్చు కానీ కొందరి దగ్గర ఉంది. ఆ కొందరిలో ఒకరి గురించి తెలుసుకుందాం. అందరికీ ఆ సమాధానాన్ని చేరువ చేద్దాం. 

‘‘దీదీ... కుక్కర్‌ ఏదీ... తోమడానికి వేయలేదు?’’‘‘పాచి వాసన పోవట్లేదని నేను కడిగేశాలే’’ఆ సమాధానంతో అపరాధభావానికి లోనైంది రాధ. మిగిలిన గిన్నెలు కడిగేసి.. ఇల్లు ఊడ్చి.. తుడవడానికి సన్నద్ధమైంది. తుడిచే గుడ్డ కనిపించలేదు. అంతా వెదికింది. ఎక్కడా లేదు.‘‘దీదీ.. తుడిచే గుడ్డ కనిపించడం లేదు?’’‘‘ఇవ్వాళ్టి నుంచి దీంతో తుడువు...’’ అంటూ మాప్‌ కర్రను తెచ్చిచ్చింది.‘‘దీంతోనా?’’ చూపుల్లో ఆశ్చర్యం... స్వరంలో కుతూహలంతో రాధ.ఈలోపు ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడు లేచి ఏడుపు అందుకున్నాడు. చేతిలో పని పడేసి గబగబా వచ్చి ఉయ్యాల్లోంచి పిల్లాడిని తీసి ఎత్తుకుంది రాధ.. పంటి బిగువున పాపాయి బరువును భరిస్తూ!గబగబా వచ్చిన యజమానురాలు..‘‘నేను ఎత్తుకుంటాలే’’ అంటూ బిడ్డను తీసుకుంది రాధ చేతుల్లోంచి!యజమానురాలి ఊహించని చర్యకు విస్తుపోతూ.. ‘‘దీదీ.. బాబుకి నా చేతుల్లో నిద్రపడుతుంది.. నేను పడుకోబెడ్తాలే’’ అంది.‘‘నేను చూసుకుంటానన్నాను కదా...’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది యజమానురాలు. ఆమె కొత్తగా ఉండడంతో దిగులు పడుతూనేబాల్కనీలోకి వెళ్లింది రాధ. బట్టలు ఉతకడానికి. నల్లా కింద బకెట్‌ పెట్టి... నల్లా విప్పింది. ఆ చప్పుడికి మళ్లీ లోపలి నుంచి పరిగెత్తుకొచ్చింది యజమానురాలు.‘‘ఏం చేస్తున్నావ్‌?’’‘‘బట్టలుతుకుదామని నల్లా తిప్పాను దీదీ...’’ అమాయకంగా రాధ.‘‘నల్లా కట్టేసి.. బట్టల్ని వాషింగ్‌ మెషీన్‌లో వెయ్‌’’ యజమానురాలి ఆర్డర్‌. ‘‘అదేంటి దీదీ? మీరే చెప్తారు కదా ఎప్పుడూ..వాషింగ్‌ మెషీన్‌లో బట్టలేస్తే సరిగ్గా మురికి వదలదని?’’ అడుగుతుంది అదే అమాయకత్వంతో.‘‘ఇప్పుడు చెప్తున్నా కదా.. వెయ్‌! వాడకుండా దాన్నలా మూలన పెట్టి పాత సామాన్లకుఅమ్మేయడానికా?’’ అంటూ లోపలకు వెళ్లిపోతుంది యజమానురాలు.దీదీ వింతగా కనపడ్తోంది ఆ రోజెందుకో మరి రాధకు.పనైపోయాక అటూ ఇటూ తచ్చాడుతుంటుంది రాధ.. ‘‘యే.. ఇంకా ఇంటికెళ్లవా?’’ అడుగుతుంది యజమానురాలు.‘‘వెళ్తా దీదీ..’’‘‘వెళ్లేప్పుడు ఈ పళ్లు తీసుకెళ్లు.. ఎప్పటి నుంచో పడున్నాయిక్కడ’’ డైనింగ్‌ టేబుల్‌ మీదున్న పళ్లబుట్టను చూపిస్తూ యజమానురాలు.‘‘అయ్యో... దీదీ.. ఇవి ఈరోజు పొద్దున తీసుకున్నవే... తాజా పళ్లు’’ అంటుంది చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ రాధ.‘‘చెప్పింది చెయ్‌... తీసుకెళ్లమన్నా కదా.. తీసుకెళ్లు అంతే.. ఆ.. రేపు రానక్కర్లేదు.. సెలవ్‌ తీసుకో’’ అంది యజమానురాలు.రాధ మనసు కీడు శంకించి ఏదో అనబోతుండగా.. కాలింగ్‌ బెల్‌ మోగింది. గబగబా వెళ్లి తలుపు తీసింది రాధ. ఎదురుగా ఓ అమ్మాయి.‘‘ఎవరు కావాలి?’’ అంది రాధ.‘‘నన్ను రమ్మన్నారు’’ అని ఆ అపరిచితురాలు సమాధానం చెప్తూండగానే... ‘‘ఆ.. ఆ.. నేనే రమ్మంది... లోపలికి రా..’’ అంటూ పిలుస్తుంది యజమానురాలు.‘‘రేపట్నుంచి పనిలోకి వస్తావా?’’ అడుగుతుంది యజమానురాలు లోపలికి వచ్చిన ఆ అమ్మాయితో.‘‘దీదీ.. నేనేమై పోవాలి?’’.. ఆందోళనతో రాధ. ‘‘నీతో కాదులే రాధా.. నువ్వాగు’’ అని రాధను వారిస్తూ కొత్త అమ్మాయితో ‘‘పాచి వాసన రాకుండా గిన్నెలు తోమాలి, ఇల్లు ఊడ్చి, తుడవాలి, బట్టలు.. అన్నీ చేయాలి. రేపటి నుంచి వచ్చేయ్‌’’ బాధ్యత అప్పజెప్పేస్తుంది యజమానురాలు.  ‘‘మరి వంట? ఎంతమందికి వండాలి?’’ కొత్త అమ్మాయి ప్రశ్న. ‘‘వంట పని నేను, రాధ చూసుకుంటాంలే..’’ అని ఆమెతో చెప్పి.. ‘‘యే... రాధా.. నాకు హెల్ప్‌ చేస్తావ్‌ కదా?’’ అడుగుతుంది నవ్వుతూ యజమానురాలు. రాధా కళ్లల్లో చెమ్మ... ఆనందంతో!‘‘రాధా.. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నన్నెంత శ్రద్ధగా చూసుకున్నావ్‌? మరి నువ్‌ గర్భిణిగా ఉంటే నేనూ అంతే శ్రద్ధగా నిన్ను చూసుకోవాలా లేదా?’’ రాధను దగ్గరకు తీసుకుంటూ చెప్తుంది యజమానురాలు!

ఇది ఒక యాడ్‌. విమెన్స్‌ డే సందర్భంగా విడుదలైంది. డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌ని.. ముఖ్యంగా ఇంటి పనుల్లో సహాయపడ్తున్న మహిళలను గౌరవించమని... మనుషులుగా చూడమని చెప్తున్న యాడ్‌. బాగుంది.. యాడ్‌.. అలా ఉండాలన్న ఊహా.. చాలా బాగుంటుంది. కానీ ప్రాక్టికల్‌గా అలా ఉండ దు. ఎన్ని ఇళ్లల్లో పనమ్మలకు వేరు టీ కప్పు.. సప రేట్‌ టిఫిన్‌ ప్లేట్లుండవ్‌? నిజంగా జరిగే పని కాదు.అలా ఎందుకు అనుకోవడం? నిజంగా జరిగిన సంఘటనల ప్రేరణతోనే ఆ యాడ్‌ పుట్టి ఉండొచ్చు కదా! అలాంటి రియల్‌ లైఫ్‌ యజమానురాలిని ఇక్కడ పరిచయం చేసుకుందాం.ఆమె పేరు... నిహారికా రెడ్డి. హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడ, ఇంజనీర్స్‌ కాలనీలో నివాసం. బొటిక్‌ నడిపిస్తుంది. కొన్నాళ్ల కిందట నాగమ్మ అనే అమ్మాయి నిహారిక వాళ్లింట్లో డొమెస్టిక్‌ హెల్పర్‌గా చేరింది. పెళ్లికాని పిల్ల. స్వస్థలం.. కరీంనగర్‌ జిల్లాలోని సబ్బితం అనే పల్లె. నిహారికను అక్కా... అని ఆప్యాయంగా పిలుస్తూ ఇంటి పనుల్లో సహాయంగా ఉండేది. నిహారికా ఆ అమ్మాయిని బుజ్జీ అంటూ అంతే ప్రేమగా చూసుకునేది. నిహారిక దగ్గర చేరిన ఆర్నెల్లకు నాగమ్మ అస్వస్థతకు గురైంది. నిహారికే ఆసుపత్రిలో చూపించింది. కిడ్నీ సమస్య అని తేలింది. వయసుతోపాటు కిడ్నీలు పెరగక రెండు కిడ్నీలు పాడైపోయాయని చెప్పారు వైద్యులు.కిడ్నీ మార్పిడి ఒక్కటే పరిష్కారమని, అప్పటివరకు డయాలసిస్‌ చేయించాలని సూచించారు. ఈ విషయాన్ని  గ్రామంలో ఉన్న నాగమ్మ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది నిహారిక. అప్పటికే నాగమ్మ తండ్రి పక్షవాతంతో, తల్లి డయాబెటీస్‌తో బాధపడ్తున్నారు. నాగమ్మ ఇద్దరు అక్కల పెళ్లిళ్లయిపోయి అత్తగారిళ్లల్లో ఉన్నారు. అన్నదమ్ములు చదువుకుంటున్నారు. తమ బిడ్డ ఆరోగ్యం కోసం రూపాయి ఖర్చు పెట్టలేమని నిస్సహాయతను వ్యక్తం చేశారు నాగమ్మ తల్లిదండ్రులు. దాంతో ఆమె బాధ్యతను నిహారికే తీసుకుంది. దక్కన్‌ ఆసుపత్రిలో చేర్పించింది. నాగమ్మ కోసం తను స్వయంగా ఆరు లక్షల రూపాయలను వెచ్చించింది. కిడ్నీ మార్పిడి  ప్రయత్నం కోసం ఫండింగ్‌కూ వెళ్లింది. దురదృష్టం.. నాగమ్మ బతకలేదు. ఆర్థికంగా అండగానే కాదు.. రాత్రింబవళ్లు కంటికి రెప్పలా.. కన్నబిడ్డలా నాగమ్మను చూసుకుంది నిహారిక. అప్పటికే ఆమెకు ఇద్దరు చిన్నపిల్లలు. అర్ధరాత్రి ఆసుపత్రికి పరుగెత్తాల్సి వచ్చేది. తెలిసిన వాళ్లను ఇంట్లో పిల్లలకు తోడుగా ఉంచి నాగమ్మను తీసుకుని హాస్పిటల్‌ వెళ్లేది. ‘‘ఇంత చేసినా ఆ అమ్మాయిని కాపాడుకోలేకపోయాననే బాధ. బుజ్జీ గురించి నేను పడిన ఆరాటమంతా గొప్పకోసం కాదు. ఓ మనిషిగా నా బాధ్యత అది. డొమెస్టిక్‌ హెల్పర్స్‌ మనకు స్లేవ్స్‌ కారు. మనం ఇంకో చోట వర్క్‌ చేయడానికి ఎలా వెళ్తామో... వాళ్లు మన ఇంట్లో వర్క్‌ చేయడానికి వస్తారు. మన బాస్‌ మనల్ని ఇల్‌ ట్రీట్‌ చేస్తే మనమెంత హర్ట్‌ అవుతామో.. సేమ్‌ మనం ఇల్‌ ట్రీట్‌ చేస్తే డొమెస్టెక్‌ హెల్పర్స్‌ కూడా అంతే హర్ట్‌ అవుతారు. సొసైటీలో ఒకరి మీద ఒకరం ఆధారపడి ఉంటాం. పనులూ అంతే. మనమెక్కడో కంట్రిబ్యూట్‌ చేయాలంటే మన సొంత పనుల్లో ఎవరో ఒకరు మనకు సహాయపడాల్సిందే. పరస్పర సహాయ సహకారాలతోనే సమాజం.. దాని అభివృద్ధి. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే మనుషుల మధ్య తేడాలుండవ్‌. అందరినీ గౌరవించగలుగుతాం’’ అంటుంది నిహారికా రెడ్డి. 

ప్రస్తుతం నీహారిక దగ్గర లక్ష్మి అనే హెల్పర్‌ పదేళ్ల నుంచి పనిచేస్తోంది. ‘‘లక్ష్మీ అక్కా’’ అని పిలుస్తుంది ఆమెను. లక్ష్మీ తన యజమానురాలు నిహారిక గురించి ఏం అంటుందంటే.. ‘‘ఆమె పెద్దబ్బాయి పుట్టినప్పటి నుంచి ఆమె దగ్గరే పనిచేస్తున్నా. అక్కా.. అనే పిలుస్తది. ఎందుకమ్మా అక్కా అంటావ్‌... అంటే ‘నాకు అక్క లాంటిదానివే లక్ష్మక్కా నువ్వు’ అంటుంది. వాళ్లింట్లో మనిషిలాగే చూస్తుంది. ఒంట్లో బాగాలేకపోయినా.. డబ్బు అవసరం ఉన్నా అన్నిటికీ అమ్మలా ఆదుకుంటుంది’’ అని చెప్తుంది. ఇదొక్క ఉదాహరణే కాదు.. డొమెస్టిక్‌ హెల్పర్స్‌కు జీవిత బీమా చేసి, పెన్షన్‌ సౌకర్యం కల్పిస్తున్న యజమానులూ ఉన్నారు. వీళ్లంతా యాడ్‌ ఫిల్మ్స్‌కే కాదు.. రియల్‌ లైవ్స్‌కీ స్ఫూర్తే. 
– సరస్వతి రమ 

మరిన్ని వార్తలు