వీడని నీడ

9 Feb, 2018 02:41 IST|Sakshi
గ్రామ దేవతల ఉత్సవాల సందర్భంగా నృత్యం చేస్తూ కల్లు సీసాను నోటితో ఎత్తుతున్న జోగినీ (ఫైల్‌) 

జోగినీ వ్యవస్థ ప్రభావం ఇంకా సమాజాన్ని వేధిస్తూనే ఉంది! ఈ దుర్వ్యవస్థ, దురవస్థ మూలాలు మిగిలే ఉన్నాయి. జోగినీ దురాచారాన్ని రూపుమాపడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు కొద్ది మేర ఫలితాలు ఇస్తున్నప్పటికీ పేదరికం, మూఢత్వం ‘జోగిని’ని పూర్తిగా రూపు మాపలేక పోతున్నాయి. ఇప్పటికే జోగినీలుగా ఉన్నవారికి ఉపాధి చూపడంతో పాటు కొత్త వారు రాకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు లేకపోవడంతో జోగినీ వ్యవస్థ నిర్మూలన జరగడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 16 వేల మంది జోగినీలు వివిధ పేర్లతో ఉన్నట్టు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. దానికితోడు వ్యవస్థలోకి కొత్తవారు రావడం మరింత ఆవేదన కలిగించే విషయం.


దెప్పి పొడుపులు : శ్యామల కథ
కామారెడ్డి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన  శ్యామల (పేరు మార్చాం) కష్టాన్ని వింటే మనుసున్న వారెవరికైనా కళ్లు చెమరుస్తాయి. శ్యామల ఐదేళ్ల ప్రాయంలో ఉండగా అనారోగ్యానికి గురైంది. ఆమె కుటుంబంలో జోగినీ ఆచారం ఉందని, మొక్కుకుంటే నయం అవుతుందని కొందరు సలహా ఇవ్వడంతో శ్యామలను జోగినీగా మారుస్తామని దేవునికి మొక్కుకున్నారు. దేవత అనుగ్రహం వల్లే బతికిందని నమ్మిన తల్లిదండ్రులు పసి వయసులోనే ఆమెను జోగినీగా మార్చారు. అయితే కుటుంబంలో అన్నలతో కలిసి చదువుకున్న శ్యామల ఉన్నత చదువులపై దృష్టి పెట్టింది. ఇటీవల శ్యామల సోదరులు ఆమెకు పెళ్లి చేయాలన్న ఆలోచనకు వచ్చారు. బంధువులతో పెళ్లి సంబంధాల గురించి మాట్లాడారు. ఇంతలోనే శ్యామల తండ్రి అనారోగ్యానికి గురికావడంతో శ్యామల కుటుంబసభ్యులు పెళ్లి ఆలోచన విరమించారు. దేవతతో పెళ్లి చేసిన శ్యామలకు మళ్లీ పెళ్లి చేస్తే అరిష్టమని, అందుకే తండ్రి అనారోగ్యం పాలయ్యాడని శ్యామల బంధువులు శ్యామలను ఇప్పుడు దెప్పిపొడుస్తున్నారు. 

వెంటాడే గతం : మమత వ్యథ
నిర్మల్‌ జిల్లాలోని కుంటాల మండలానికి చెందిన మమత (అసలు పేరు కాదు)ది మరో దీనగాథ. వీళ్ల కుటుంబంలో తరతరాలుగా జోగినీ దురాచారం కొనసాగుతోంది. వీరి తల్లిదండ్రులకు పిల్లలు పుట్టగానే చనిపోవడంతో మమత పుట్టగానే జోగినీగా మారుస్తామని వారు మొక్కుకున్నారు. అందులో భాగంగానే చిన్నతనంలోనే మమతను జోగినీగా మార్చారు. అయితే దురాచారానికి ఎదురు నిలిచిన మమత పోస్టుగ్రాడ్యుయేషన్‌ చేస్తోంది. అయితే పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో అప్పటికే పెళ్లయిన మేనబావతో సహజీవనం చేస్తోంది. ప్రస్తుతం మమతకు ఇద్దరు పిల్లలు. టైలరింగ్‌ చేస్తూ చదువు ఖర్చులు భరిస్తూ జీవనం సాగిస్తోంది. సమాజానికి ఎదురు నిలిచి సొంతకాళ్లపై నిలబడ్డ మమతను దురాచారపు ఆనవాళ్లు అడుగడుగునా వెంటాడుతున్నాయి. 

అమలుకాని సిఫారసులు
జోగినీ వ్యవస్థను రూపుమాపడానికి చేపట్టే చర్యల్లో భాగంగా అప్పటి ఉమ్మడి ప్రభుత్వం వి.రఘునాథ్‌రావ్‌ కమిషన్‌ను నియమించింది. ఆ ఏకసభ్య కమిషన్‌ ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తూ నివేదిక ఇచ్చింది. అయితే నివేదికలోని సూచనలు ఎక్కువ భాగం అమలుకు నోచుకోలేదు. జోగినీలు ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం చేపట్టిన చర్యలు లేవు. జోగినీల పిల్లలకు ఉద్యోగాలు కల్పించే విషయాన్ని పూర్తిగా విస్మరించారు. దానికి తోడు జాతరలు, గ్రామ దేవతల ఉత్సవాలు జరిగినపుడు జోగినీల నృత్యాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితిని మార్చే చర్యలు కావాలిప్పుడు.

మాలెక్క మా పిల్లలు కావొద్దు
నాకు పదకొండేండ్లకే దేవునితో పెండ్లి చేసి జోగినీగా మార్చిండ్రు. మస్తు కష్టాలు ఎల్లదీసినా. ఎన్నో అవమానాలు ఎదురైనయి. నాకు ఇద్దరు ఆడ పిల్లలు. పిల్లలకు తండ్రి ఎవరంటే ఏం చెప్పుతం సార్‌. అప్పుడే రాజయ్య సార్‌ మా దగ్గరికి వచ్చిండు. మాకు ధైర్యం చెప్పిండు. హేమలత మేడం, లవణం సార్‌లతో కలిసి ఢిల్లీదాకా పోయినం. మాకు న్యాయం జరగాలని తిరిగినం. నాలెక్క ఎంతో మంది జోగినీలు పడుతున్న కష్టాల నుంచి బయట పడేయడానికి రాజయ్య సార్‌ తో కలిసి ఊరూరు తిరిగి అందరినీ కూడగట్టినం. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినం. అప్పుడు జోగినీలకు రూ.1,500 పింఛన్, మూడెకరాల భూమి ఇయ్యాలన్నారు.  నాకు, నాతోటోళ్లకు ఎకరం చొప్పున మాత్రమే భూమి వచ్చింది. మూడెకరాలు ఇయ్యలేదు. పింఛన్‌ కూడా రాకుండే. ఒంటరి మహిళల పింఛన్‌ కింద రూ. వెయ్యి ఇస్తున్నరు. మాలెక్క మా పిల్లలు అన్నాయం కావద్దనుకుని వాళ్లకు సదువు చెప్పిచ్చినం. పిల్లలు చదువుకున్నరు. ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నరు. ప్రభుత్వం జోగినీలకు పింఛన్లు ఇయ్యాలె. భూములు ఇయ్యాలె. పిల్లలకు ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలె. బతుకుదెరువు ఉంటే అందరితో కలిసిపోతరు. ఈ కష్టాలు పోతయి. 
– కామవ్వ, జోగినీ,  బొమ్మన్‌దేవ్‌పల్లి, నస్రుల్లాబాద్‌

పిల్లలకు ఉద్యోగం కల్పించాలి
జోగినీలుగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాం. ఇప్పటికీ ఎదుర్కొంటున్నాం. మేం కొంత అవగాహన వచ్చిన తరువాత మాలాంటి వాళ్లను చైతన్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే చాలా మంది మాకు బతుకుదెరువు లేదంటున్నారు. భూములు లేవు. ఉపాధి లేదు. దీంతో చాలామంది ఇప్పటికీ శవయాత్రల్లో నాట్యం చేస్తున్నరు. చాలా మందికి ఇండ్లు కూడా లేవు. తినడానికి తిండి దొరక్క ఎంతో మంది కష్టాలు పడుతున్నరు.  జోగినీల పిల్లలకైనా కనీసం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వారి జీవితాలు బాగుపడతాయి. ప్రభుత్వానికి అప్పట్లో రఘునాథ్‌రావ్‌ కమిషన్‌ జోగినీలకు భూములు ఇవ్వాలని చెప్పినా, ఎక్కడా సరిగా ఇవ్వలేదు. భూమి లేదు, ఇల్లు లేదు. చేయడానికి పనులు కూడా లేవు. బతకడం కష్టంగా ఉంది. అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలి. తద్వారా దురాచారాన్ని నిర్మూలించవచ్చని మేం గూడా కలెక్టర్‌ను కలిసి విన్నవించినం. ప్రభుత్వం ఆలోచన చేయాలె. 
– పద్మ, జోగినీ, నాగిరెడ్డిపేట

ఆర్థికంగా బలోపేతం చేయాలి
జోగినీ వ్యవస్థను నిర్మూలించాలని మేం దశాబ్దాలుగా ప్రభుత్వంతో పోరాటం చేశాం. రఘునాథరావ్‌ కమిషన్‌ వేసిండ్రు. కమిషన్‌ ఇచ్చిన సిఫారసులు ఇప్పటికీ అమలు కావడం లేదు. కొందరికి ఎకరం చొప్పున భూములు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. జోగినీలుగా ముద్రపడిన అందరికీ భూములు ఇవ్వాలి. వాటిని అభివృద్ది చేసుకోవడానికి సాయం చేయాలి. వారి పిల్లల చదువులకు సాయం అందించాలి. ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. ఆర్థికంగా వారు కష్టాలను అధిగమిస్తేనే ఈ దురాచారాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించవచ్చని ప్రభుత్వానికి సూచించాం. ఇటీవల ఎంపీ కవితను కలిసి విన్నవించాం. మేం నాలుగైదు జిల్లాల్లో తిరిగి సర్వే చేస్తున్నాం. కొత్తగా కూడా జోగినీలు తయారవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  – రాజన్న, సంఘ వికాస స్వచ్ఛంద సంస్థ చైర్మన్‌
 – ఎస్‌.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి

మరిన్ని వార్తలు