ఆమే.. ఆ నలుగురు

23 May, 2018 00:02 IST|Sakshi

ఒకరి ప్రాణం పోయినప్పుడు కుటుంబానికి శ్వాస ఆడదు. బాధను దిగమింగుకోవాలా? నలుగురితో నిట్టూర్చాలా? మనకెవరికైనా రాకూడని అలాంటి కష్టమే వస్తే.. చుట్టూ నలుగురుంటారు. మరి లేని వారికో? రాధ ఉంది. ఆమే.. ఆ నలుగురు.

ఒక దెబ్బకే పొడి పొడి అయి రాలిపోయే బలహీనమైన శిలకు ఎప్పటికీ ఏ రూపమూ రాదు. ఉలి దెబ్బలను కాచుకోగలిగిన గండశిలలే శిల్పాలు అవుతాయి. కర్ణాటక రాష్ట్రం, మంగళూరులోని అంబులెన్స్‌ డ్రైవర్‌ రాధిక జీవితమే ఇందుకు సాక్ష్యం. జీవితం కొట్టిన దెబ్బలకు ఆమె తట్టుకుని నిలబడ్డారు. ఆ దెబ్బలు ఆమెను చక్కటి బతుకు శిల్పంగా మలిచాయి.  2002లో అంబులెన్స్‌ డ్రైవర్‌గా స్టీరింగ్‌ పట్టుకున్న రాధిక ఇప్పుడు ‘కావేరీ అంబులెన్స్‌ సర్వీసెస్‌’ పేరుతో పన్నెండు అంబులెన్స్‌లను నడుపుతున్నారు. ఆరవ తరగతితో చదువు ఆపేసిన రాధిక, పెళ్లి చేసుకుని హసన్‌ జిల్లా నుంచి భర్తతో పాటు మంగళూరుకు వచ్చింది. ఇద్దరు బిడ్డలకు తల్లిగా ఇంటిని దిద్దుకుంటూ గడిపిన రాధిక ఈ రోజు ప్రపంచానికి ఇలా పరిచయం కావడానికి వెనుక ఉన్న కథే ఆమె జీవితం. అది ఆమె సాధించిన విజయం కూడా. 

బతుకుబండి తిరగబడింది
రాధిక భర్త సురేశ్‌ మంగళూరులో అంబులెన్స్‌ నడిపేవాడు. ఆ కుటుంబానికి అన్నం పెట్టేది ఆ అంబులెన్సే. అయితే అది అరకొరగానే కడుపు నింపేది. కర్ణాటక ఆర్టీసీలో డ్రైవర్‌ ఉద్యోగం రాగానే అంబులెన్స్‌ను వదిలి పెట్టి గవర్నమెంట్‌ ఉద్యోగంలో చేరిపోయాడు సురేశ్‌. ఖాళీగా ఉన్నప్పుడు రాధికకు డ్రైవింగ్‌ నేర్పించడానికి తప్ప ఆ అంబులెన్స్‌ను వాడటం మానేశాడు. జీవితం హాయిగా గడుస్తుందనుకునే లోపు సురేశ్‌ని లంగ్‌ కేన్సర్‌ కబళించింది. అప్పటికి రాధికకు 30 ఏళ్లు. పెద్దమ్మాయి భూమికకు ఏడేళ్లు, భార్గవికి నాలుగేళ్లు.

అంబులెన్స్‌ నిలబెట్టింది
భర్త చెయ్యి పట్టుకుని మంగళూరుకి వచ్చినప్పుడు రాధికకు బతుకు మీద ఒక భరోసా ఉండేది. అయితే అది భర్త ఉన్నాడన్న ఆ ఒక్క భరోసా మాత్రమే. భర్తతో పాటే అది గతించిపోయింది. గడవాల్సిన వర్తమానం ప్రశ్నార్థకమై నిలిచింది. పెళ్లికి ముందు హసన్‌ జిల్లాలో చిన్న హాస్పిటల్‌లో పనిచేసిన అనుభవం తప్ప రాధికకు మరే పనీ చేతరాదు. భర్త సరదాగా నేర్పించిన డ్రైవింగ్‌ గుర్తుకు వచ్చింది. అంబులెన్స్‌ డోర్‌ తీసి డ్రైవింగ్‌ సీట్లో కూర్చుని స్టీరింగ్‌ పట్టుకుంది. సురేశ్‌ ఉన్నప్పుడు రాధిక అంబులెన్స్‌ నడుపుతుంటే సురేశ్‌ కూడా ఒక చేతిని స్టీరింగ్‌ మీదనే ఉంచేవాడు ఎప్పుడు పొరపాటు చేస్తుందోననే జాగ్రత్తతో. ప్రమాదం జరక్కుండా ఆపడం కోసం ఆ చేయి ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. ఇప్పుడా చెయ్యి లేదు. తనను తానే రక్షించుకోవాలని ఆ క్షణమే ఆమె మనసు హెచ్చరించింది. సరిగ్గానే నడుపుతున్నానని నిర్ధారించుకుని డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం అప్లయ్‌ చేసింది. గతంలో హాస్పిటల్‌లో పనిచేసిన అనుభవమూ కలిసొచ్చింది. పేషెంట్‌కి ఫస్ట్‌ ఎయిడ్‌ చేయడం, ఆక్సిజన్‌ పెట్టడం వంటి పనులు వచ్చి ఉండటంతో హాస్పిటల్‌కు అంబులెన్స్‌ సర్వీస్‌కి అనుమతి వచ్చింది. 

వందల కి.మీ. ప్రయాణం
అంబులెన్స్‌ సర్వీస్‌లో అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా ఉండదు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పనిలోకి దిగాలి. అర్ధరాత్రి ఫోన్‌ కాల్‌ వస్తే ఇద్దరు పిల్లలను అత్తగారికి అప్పచెప్పి డ్యూటీలో దిగేది రాధిక. ఏకబిగిన వందల కిలోమీటర్లు వాహనం నడిపేది. కర్ణాటక నుంచి కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు అంబులెన్స్‌ నడిపింది. ‘ప్రాణం పోయిన వారిని సొంత ప్రదేశాలకు చేర్చడం చాలా భావోద్వేగాలతో నిండిన బాధ్యత. చనిపోయిన వ్యక్తి చుట్టూ సొంత వాళ్లు ఉంటారు, కానీ దుఃఖంలో ఉంటారు. అందుకే మార్చురీ నుంచి ఐస్‌బాక్స్‌ రెడీ చేసుకోవడం, బాడీని అమర్చుకోవడంలో చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. హాస్పిటల్‌ ఫార్మాలిటీస్‌ ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయేమో కనుక్కుని వాళ్లను బయలుదేరదీయాలి. సొంతవాళ్లకు కాలూచెయ్యి ఆడని స్థితి అది. హాస్పిటల్‌ వాడుక భాష ప్రకారం బాడీ అంటే భరించలేకపోతారు కొందరు. అలాంటప్పుడు నా భర్త పోయిన క్షణాలు గుర్తుకు వస్తుంటాయి. మనిషి మీద ఉండే బంధం అలాంటిది’’ అంటారు రాధిక.  ఆడవాళ్లు మానసికంగా బలహీనంగా ఉంటారని, పార్థివ దేహానికి జరిగే అంతిమ సంస్కారాలను చూసి తట్టుకోలేరని అనుకుంటాం. రాధిక  ప్రాణం పోయిన దేహాన్ని స్వస్థలం చేర్చడానికి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తోంది. గమ్యానికి చేర్చాల్సిన వృత్తి బాధ్యతను గౌరవప్రదంగా మోస్తోంది. ‘నలుగురు’ మనుషుల పెట్టుగా మోస్తోంది.  

పిల్లలతోపాటు తనూ ఎదిగింది!
అంబులెన్స్‌ సర్వీస్‌లో నిలదొక్కుకున్న తరవాత బ్యాంకు లోన్‌తో మరో అంబులెన్స్‌ కొని డ్రైవర్‌ని నియమించింది. కావేరీ అంబులెన్స్‌ సర్వీస్‌కు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఆమె 12 అంబులెన్స్‌లను నడుపుతోంది. మరణించిన వారిని సొంత ఊళ్లకు చేర్చడం కోసం ఆమె అనేక రాష్ట్రాలు ప్రయాణించి ఉండటంతో ఆయా ప్రదేశాల మీద పట్టు వచ్చింది. టూర్‌ బస్, వ్యాన్‌లను కూడా నడుపుతోంది. పిల్లలు పెద్దవాళ్లు కావడంతో రాధికకు సహాయంగా ఉంటున్నారు. భార్గవి కామర్స్‌లో డిగ్రీ చేస్తోంది. భూమిక బెంగళూరులో ఇంజనీరింగ్‌ చదువుతోంది. అంబులెన్స్‌ సర్వీస్‌ని తన బతుకుతెరువుగా మొదలు పెట్టినప్పటికీ అందులో ఆమె ఇచ్చే సర్వీస్‌ చాలా మానవీయంగా ఉంటుంది. ఆమెలోని ఆ లక్షణాన్ని గుర్తించిన మంగళూరు ప్రెస్‌ క్లబ్‌ ఆమెను అవార్డుతో సత్కరించింది. 
– మంజీర

మరిన్ని వార్తలు