నిర్భయమే సాహసం

29 Jan, 2020 00:24 IST|Sakshi

రామ్‌సింగ్‌ బస్‌ డ్రైవర్‌. ముఖేశ్‌సింగ్‌.. రామ్‌సింగ్‌ తమ్ముడు. వినయ్‌ శర్మ జిమ్‌ ఇన్‌స్ట్రక్టర్‌. పవన్‌ గుప్తా పండ్ల వ్యాపారి. ఇవన్నీ 2012 డిసెంబర్‌ 15 ముందు వరకు. ఆ ఏడాది డిసెంబర్‌ 16వ తేదీ నుంచి వీళ్లందరి గుర్తింపు ఒక్కటే.. నిర్భయ అత్యాచార నిందితులు. ఆనాటి నిర్భయ ఘటనతో ఉలిక్కి పడింది భారతదేశంలో ఉన్న వాళ్లు మాత్రమే కాదు. అదే రోజు అమెరికాలో ‘డెల్టా ఉమెన్‌’ అవార్డు అందుకున్న కీర్తి జయకుమార్‌ కూడా.

కీర్తి ఉలికిపాటు అక్కడితో ఆగిపోలేదు. ‘రెడ్‌ ఎలిఫెంట్‌ ఫౌండేషన్‌’ ఆవిర్భావానికి దారి తీసింది. నిర్భయ ఘటన తన జీవితం మరింత బాధ్యతాయుతమైన మలుపు తీసుకోవడానికి కారణమైందని చెప్తారు కీర్తి జయకుమార్‌. ‘‘యు.ఎస్‌.లో అవార్డు అందుకున్న ఆ రోజు రాత్రి నాకు నిద్రపట్టలేదు. ఇండియాలో నా వయసే ఉన్న ఒక యువతి అత్యంత పాశవికంగా లైంగిక దాడికి గురైంది! యునైటెడ్‌ నేషన్స్‌ సహకారంతో నేను ప్రపంచదేశాల మహిళల హక్కుల కోసం గళం విప్పాను.

అంతర్జాతీయంగా మహిళ ఎదుర్కొంటున్న వివక్ష మీద పోరాడడానికి కార్పొరేట్‌ లాయర్‌గా ఉద్యోగాన్ని వదిలి గొప్పపని చేశానని కూడా అనుకుంటూ ఉన్నాను! నా పాదాల కింద పెరుగుతున్న కలుపు మొక్కలను ఏరిపారేయకుండా, లైంగిక వివక్షకు గురవుతున్న ఆడపిల్లలకు అండగా నిలబడకుండా ఎక్కడో పని చేయడం ఏమిటి అని ఆలోచించాను. అందుకే తను నివసిస్తున్న చెన్నై నగరంలోని స్కూళ్ల నుంచి, జెండర్‌ సెన్సిటివిటీ, సేఫ్‌ టచ్‌– అన్‌ సేఫ్‌ టచ్‌ అనే అంశాలతోపాటు పిల్లలు మంచి పౌరులుగా ఎదగడానికి నా వంతు ప్రయత్నం చేయాలని నిశ్చయించుకున్నాను’’ అన్నారు కీర్తి.

నిర్భయ పోరాటం
గడాఫీ హయాంలో లిబియా అత్యాచారానికి గురైన మహిళలు, సిరియాలో రసాయనిక దాడులకు గురైన వాళ్లు, ఐసిస్‌ నుంచి బయటపడిన యాజ్‌ది తెగ మహిళలు, పారిపోయి వచ్చిన కాశ్మీరీ పండిట్‌లు, ఆఫ్ఘన్‌ శరణార్థులు తిరిగి తమ జీవితాలను నిలబెట్టుకోవడానికి పడిన శ్రమను, వారి జీవన పోరాటాన్ని కథలుగా సమాజంలో వివిధ వర్గాల వారికి, మన మహిళల్లో సమస్యలతో పోరాడే ధైర్యాన్ని నింపుతున్నారు కీర్తి.  
నిర్భయ ఘటన అనంతరం ఆరు నెలల పాటు సాగిన మధనం తర్వాత రెడ్‌ ఎలిఫెంట్‌ ఫౌండేషన్‌ ప్రారంభించారు కీర్తి. తమ జీవితాన్ని తమకు నచ్చినట్లు జీవించే హక్కు మగవాళ్లకు ఎంతగా ఉందో ఆడవాళ్లకు కూడా అంతే హక్కు ఉందని తెలియచేస్తూ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఉద్యోగ ప్రదేశాలు, నివాస ప్రదేశాల్లో సదస్సులు నిర్వహిస్తున్నాను. ఇప్పటికి 120 వర్క్‌షాప్‌ల ద్వారా 3,500 మంది మహిళలు, బాలల్ని చైతన్యవంతం చేశారు కీర్తి.

‘సాహస్‌’ నెట్‌ వర్క్‌
2016, మే నెల 15వ తేదీ. కీర్తి ఉదయం నిద్రలేచేటప్పటికి మొబైల్‌ ఫోన్‌లో 16 మిస్‌డ్‌ కాల్స్, 31 వాట్సాప్‌ మెసేజ్‌లు. అవన్నీ ఒకే నంబర్‌ నుంచి వచ్చినవే! ఐరోపాలోని ఒక స్నేహితురాలి నుంచి సహాయం కోరుతూ వచ్చిన ఫోన్‌ కాల్స్, మెసేజ్‌లూ అవన్నీ. ఆమెను ఆమె భర్త రోజూ హింసిస్తున్నాడు. ఉదయం తాను బయటకు వెళ్లేటప్పుడు గదిలో పెట్టి తలుపు వేసి వెళ్లేవాడు. ఓ రోజు అర్జెంటు పని మీద హడావుడిగా వెళ్తూ ఎప్పటిలాగ ఆమె గదికి తాళం వేయడం మర్చిపోయాడు. ఆ రోజు ఆమె భర్త తిరిగి వచ్చే లోపు సహాయం కోసం తెలిసిన వాళ్లందరికీ ఇంట్లో ఉన్న స్పేర్‌ ఫోన్‌ నుంచి కాల్స్‌ చేసింది, మెసేజ్‌లు పెట్టింది. ఆ తర్వాత ఆ సిమ్‌ కార్డ్‌ని ముక్కలు చేసి పారేసింది. పెళ్లికి ముందు ఆమె ఎప్పుడూ ఇండియా దాటి బయటి దేశానికి వెళ్లనే లేదు. అప్పుడు తానున్న దేశంలో చట్టాల గురించి ఆమెను ఏ మాత్రం అవగాహన లేదు.

ఆ స్థితిలో ఆమెకు తన సమీపంలో ఉన్న ఫ్రెండ్‌ ఆదుకుని, బంధువుల ఇంటికి చేర్చింది. ‘‘తర్వాత మా రెడ్‌ ఎలిఫెంట్‌ ఫౌండేషన్‌ పెద్ద ఎక్సర్‌సైజ్‌నే చేసింది. మహిళల కోసం పని చేసే ఐదు వేల సంస్థలను ‘సాహస్‌’ అనే వెబ్‌ యాప్‌తో అనుసంధానం చేశాం. ఆ సంస్థలు 197 దేశాలలో విస్తరించి ఉన్నాయి. ఇప్పుడు నలభైవేల సంస్థలు మా ‘సాహస్‌’ యాప్‌ నెట్‌వర్క్‌ పరిధిలోకి వచ్చాయి. మొత్తం ఎనిమిది భాషల్లో సమాచారం చేరవేయడం జరుగుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది వేల మంది జీవితాలు ఒడ్డుకు చేరాయి. వైద్యసేవలు, న్యాయ సహాయం, కౌన్సెలింగ్‌ సహకారం, తలదాచుకోవడానికి హోమ్‌లు, విద్య– ఉపాధి అవకాశాల కల్పన వంటి సేవలు అందిస్తున్నాం. చేసింది, చేస్తున్నది చెప్పుకుంటే పూర్తయ్యే ఉద్యమం కాదిది. కొన్ని తరాల పాటు అవిశ్రాంతంగా సాగించాల్సిన మహోద్యమం’’ అని ముగించారు కీర్తి.
– మంజీర

శక్తినిచ్చిన డైరీ
‘ద డైరీ ఆఫ్‌ యాన్‌ ఫ్రాంక్‌’ పుస్తకం కీర్తి జయకుమార్‌లో నిశ్శబ్దంగా శక్తిని నింపింది. చెన్నైలోని ‘స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ లా’లో న్యాయశాస్త్రం చదివారు కీర్తి. కోస్టారికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్‌ పీస్‌’ నుంచి శాంతి, సంఘర్షణ, జెండర్‌ స్టడీస్‌ చదివారు. విద్యార్థి దశలో ఆమె హ్యూమనేటేరియన్‌ ‘లా’, మానవ హక్కుల చట్టం, పాలసీల ఉల్లంఘన వంటి అంశాల మీద పేపర్‌లు సమర్పించారు. అమెరికాకు చెందిన ‘డెల్టా ఉమెన్‌’ ఎన్‌జీవోతో పనిచేశారు కీర్తి. ఆ అవార్డు అందుకున్న రోజే నిర్భయ ఘటన జరిగింది. కీర్తి యూఎస్‌ ప్రెసిడెంట్‌ సర్వీస్‌ మెడల్, యూఎన్‌ ఆన్‌లైన్‌ వాలంటీర్‌ ఆఫ్‌ ది అవార్డులు కూడా అందుకున్నారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా