ఇదిగో... ఇతనే నా భర్త

15 May, 2018 23:58 IST|Sakshi
ఆత్మసఖునితో కోమల 

అంతరంగం

నమస్తే! నా పేరు కోమల. నాకు యాభై ఏళ్లు. డబ్బులు లెక్కపెట్టడం, బస్‌ల మీది పేర్లు చదవగల జ్ఞానం తప్ప పెద్దగా చదువు లేదు. చిన్నప్పుడే పెళ్లి చేసేశారు మావాళ్లు. చేసుకున్నవాడు ముగ్గురు పిల్లలనిచ్చి.. తాగుడుకు బానిసై ఓ రోజు ప్రాణం విడిచాడు. అప్పు తప్ప ఆదాలేని జీవితం. పెళ్లిలో మా అమ్మ పెట్టిన రెండు బంగారు గాజులు తప్ప ఆస్తి లేదు. అవీ తాగడం కోసం అమ్మేస్తాడని చాలా జాగ్రత్తగా దాచా. మా ఆయన చనిపోయినప్పుడు వాటినే అమ్మి అంత్యక్రియలు చేయించా. పిల్లలను పోషించేందుకు మిగిలిన ఇంకాస్త డబ్బుతో ఓ కూరల బుట్ట కొని కోల్‌కతా వీధుల్లో కూరగాయలు అమ్మే పని పెట్టుకున్నా. రోజులు గడిచాయి. ఖర్చులూ పెరిగాయి. సంపాదనలోనే కాస్త కాస్త మిగుల్చుకుంటే కూరలతోపాటు బ్రెడ్డు, కోడిగుడ్లూ అమ్మడం మొదలుపెట్టాను. పిల్లలనూ చదివిస్తున్నాను. అలా కొన్నాళ్లకు దాచిన డబ్బుతో చెట్టుకింద చిన్న పాక వేసి దాల్‌ రైస్, దాల్‌ రోటీ అమ్మడం మొదలుపెట్టాను.

పిల్లలకు రెక్కలొచ్చి వెళ్లారు
పిల్లలు డిగ్రీకొచ్చేసరికే సొంతూళ్లో స్థలం కొన్నాను. వాళ్లకు ఉద్యోగాలు దొరికాక.. ఇల్లూ కట్టుకున్నాం. పిల్లల పెళ్లిళ్లూ చేశాను. ఎక్కడి వాళ్లక్కడ వెళ్లిపోయాక.. నేను, చెట్టు కింద హోటల్‌ లాంటి చిన్న పాకా మిగిలాం. నా బాధ్యతలు తీరిపోయాక కానీ అతనిని గమనించలేదు నేను.  రోజూ వచ్చేవాడు  నా హోటల్‌కు. ఉదయం టీ కోసం.. మధ్యాహ్నం దాల్‌ రోటీ కోసం.. సాయంత్రం మళ్లీ రోటీ కోసం! తినేసి డబ్బులిచ్చి వెళ్లిపోకుండా నా పనుల్లో సాయం చేసేవాడు. ఉల్లిపాయ తరిగివ్వడం దగ్గర్నుంచి గిన్నెలు తోమడంలో కూడా. జనాలు ఎక్కువగా ఉంటే వడ్డించేవాడు కూడా. అలా అతనితో స్నేహం కుదిరింది. పెరిగింది. గిన్నెలు తోమేటప్పుడు.. తన యజమాని దగ్గర్నుంచి నుంచి మమతా దీదీ దాకా చాలా విషయాలు చెప్పేవాడు. ఆ మాటల్లోనే తెలిసింది అతనికి ఎవరూ లేరని. అతనో అనాథని. ‘‘దిగులు పడకు.. పిల్లలుండీ కూడా నేనిప్పుడు అనాథనే కదా! ఎవరి దార్లో వాళ్లు పోయారు. నేనూ నీలాగా ఒంటరినే’’ అన్నాను సముదాయించడానికి. 

అతను రెక్కలు కట్టుకొచ్చాడు!
విమ్‌బార్‌ పీచుతో బాండీని రుద్దుతున్నప్పుడు మొహం మీద పడ్డ నా జుట్టును పక్కకు సవరిస్తూ చెప్పాడు ‘‘కోమలా.. నువ్వంటే నాకు చాలా ఇష్టం’’ అని. షాక్‌ అయ్యా. తేరుకున్నాక నవ్వొచ్చింది. పడీ పడీ నవ్వా. అతను చిన్నబుచ్చుకున్నాడు. తెల్లవారి మళ్లీ చెప్పాడు నిజంగానే నువ్వంటే నాకు ఇష్టం అని. అప్పటి నుంచి అతనిని చూసే నా దృష్టిలో మార్పు వచ్చింది. ఆప్తుడుగా.. ఆత్మీయుడిగా కనిపించసాగాడు. నా పట్ల అతనికున్న ఇష్టం.. ఆ వయసులో నాకు తోడు ఎంత అవసరమో ఆలోచించేలా చేసింది. తోడు అవసరమనే నిర్ణయానికీ వచ్చింది నా మనసు. ఓ రోజు అడిగా.. నన్ను పెళ్లి చేసుకుంటావా అని. చేసుకుంటాను అన్నాడు. మా పిల్లలతో చెప్పా. నాకు ఒంట్లో బాగా లేదని ఎన్నిసార్లు చెప్పినా పని అనే సాకుతో తప్పించుకున్న పిల్లలు ఈ మాట చెప్పగానే ప్రత్యక్షమయ్యారు. సిగ్గులేదా? నువ్వసలు తల్లివేనా? ఇదేం పోయేకాలం.. మా పెళ్లాలు ఏమనుకుంటారు నీ గురించి? చుట్టాలకేం సమాధానం చెప్పుకోవాలి? ఈ వయసులో ఇదేం బుద్ధి? వగైరా వగైరా చాలా తిట్లే తిట్టారు. ఆగక.. అతనిని కొట్టారు. 

నా మనసుకూ రెక్కలొచ్చాయి
నేను తోడు కోరుకోవడం తప్పా? నా మంచీచెడు నేను ఆలోచించుకునే హక్కు నాకు లేదా? అమ్మంటే పిల్లలకు బానిసేనా? విధవరాలిగా.. కొడుకుల ఆదరాభిమానాల భిక్ష కోరుతూనే బతుకు చాలించాలి కాని.. నాకంటూ ఓ జీవితం ఉండకూడదా? ఈ వయసా..? అంటే ?ఈ వయసులో తోడు కోరుకునే అర్హత నాకు లేదా? ఎందుకుండదు? ఇది నా జీవితం.. అందుకే.. అతని చేయి పట్టుకున్నా. ఒకరికొకరం తోడుగా ఉందాం అని పెళ్లి చేసుకున్నా. ఈ ఫొటోలో కనిపిస్తున్న అతనే నా భర్త. అన్నట్టు మమ్మల్ని మా పిల్లలే కాదు.. నా చుట్టాలు.. చుట్టుపక్కల వాళ్లూ వెలేశారు. కోల్‌కతాలోని ఆ చెట్టుకింది మా పాకే మాకిప్పుడు ఆశ్రయం.  ఎప్పటిలాగే రోజూ పాలు తెస్తాడు. కాస్తాడు. ఉల్లిపాయలు, ఆలు తరిగిస్తాడు. గిన్నెలూ తోమిపెడతాడు. జనాలు ఎక్కువగా ఉంటే భోజనం వడ్డిస్తాడు. మా వెనకాల నుంచి ఏవేవో మాటలు వినిపిస్తుంటాయి మేం వినకూడనివి. అందుకే వినట్లేదు. ముందుకు నడుస్తున్నాం.. కలిసి! 
– శరాది

మరిన్ని వార్తలు