జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని కనుమా!

12 Jan, 2020 02:02 IST|Sakshi

మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుమనాడు కోనసీమలోని అంబాజీపేట మండలం, మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం అత్యంత ప్రాచీనమైన, చారిత్రాత్మకమైన, పవిత్రమైన ప్రభల తీర్థం. జగ్గన్నతోటలో ఏ విధమైన గుడి గానీ, గోపురం గానీ ఉండవు, అంతా కొబ్బరితోటలే. ఏకాదశ రుద్రులు కొలువు తీరడం వలన జగ్గన్నతోట ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యతను, చారిత్రాత్మక విశిష్టతను సంతరించుకున్నది.

ఏకాదశ రుద్రుల కొలువు
 లోక కళ్యాణార్థం ప్రతీ సంవత్సరం కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశం అవుతారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్ధం జగ్గన్నతోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారనీ, అప్పటినుండి కనుమ రోజున జగ్గన్నతోటలో ప్రభల తీర్ధం నిర్వహించబడుతున్నదని చారిత్రాత్మక కథనం. పూర్వం పెద్దాపురం సంస్థానాధీశులైన రాజా వత్సవాయి జగన్నాధ మహారాజు (జగ్గన్న) గారు ప్రభల తీర్థానికి విచ్చేసి, ఏకాదశ రుద్రులను దర్శించి, ప్రభల తీర్ధం ఘనంగా నిర్వహించేందుకు అవిరళ కృషి సల్పినారనీ, నాటి జగ్గన్న పూజల ఫలితంగానే ప్రభల తీర్థం జరిగే ప్రదేశం ‘జగ్గన్న’ తోటగా ప్రసిద్ధికెక్కిందని చారిత్రాత్మక కథనం.

ప్రభల తీర్థం రోజున ఏకాదశ రుద్ర గ్రామాలలో కొలువున్న స్వామి వార్లు గంగలకుర్రు అగ్రహారం– వీరేశ్వర స్వామి, గంగలకుర్రు– చెన్నమల్లేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వరం–వ్యాఘ్రేశ్వరస్వామి, పెదపూడి– మేనకేశ్వరస్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వరస్వామి, వక్కలంక–కాశీ విశ్వేశ్వరస్వామి, నేదునూరు–చెన్నమల్లేశ్వరస్వామి, ముక్కామల–రాఘవేశ్వరస్వామి, మొసలపల్లి–మధుమానంత భోగేశ్వరస్వామి, పాలగుమ్మి–చెన్నమల్లేశ్వరస్వామి, పుల్లేటికుర్రు–అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి వార్లను ప్రభలపై మేళతాళాలతో, భాజా భజంత్రీలతో, మంగళ వాయిద్యాలతో జగ్గన్నతోటకు ఊరేగింపుగా తీసుకొని రావడం అనాదిగా వస్తున్న ఆచారం. ప్రభల తీర్థానికి ఆతిథ్యమిచ్చు మొసలపల్లి–మధుమానంత భోగేశ్వరస్వామి అన్ని ప్రభలకన్నా ముందుగా జగ్గన్న తోటకు చేరుకొని, ప్రభలు అన్నింటికీ ఆహ్వానం పలికి తిరిగి వెళ్ళేవరకూ ఉండటం సాంప్రదాయం.

అలాగే జగ్గన్నతోట ప్రభల తీర్థానికి అధ్యక్షత వహించే వ్యాఘ్రేశ్వరస్వామి వారి ప్రభల తీర్ధం లోనికి ప్రవేశించినపుడు మిగిలిన రుద్ర ప్రభలను ఒకసారి పైకి లేపడం సంప్రదాయం. అలాగే జగ్గన్నతోట ప్రభల తీర్థంలో ప్రత్యేకవిశిష్టతను సంతరించుకున్న గంగలకుర్రు అగ్రహారం– వీరేశ్వర స్వామి, గంగలకుర్రు–చెన్నమల్లేశ్వరస్వామి వార్ల ప్రభావాహనాలను కౌశికలో నుండి అవతలి ఒడ్డుకు చేర్చడం వంటి రమణీయ దృశ్యాలు చూడటానికి రెండు కన్నులూ చాలవు. ముఖ్యంగా జగ్గన్న తోట ప్రభల తీర్థంలో ప్రత్యేక ఆకర్షణగా విరాజిల్లుతూ, చారిత్రాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉండి, అన్ని ప్రభల కన్నా ఆఖరుగా వచ్చే గంగలకుర్రు అగ్రహారం– వీరేశ్వరస్వామి ప్రభావాహనం తీర్ధంలోనికి వచ్చేవరకూ మిగిలిన ప్రభలు కూడా వేచి ఉండటం విశేషం. నిండు ప్రవాహంలో విశ్వేశ్వరస్వామి వారిని ఓలలాడిస్తూ కౌశికను దాటించే తీరు కన్నులారా తిలకించే భక్త జన సందోహ ఆనందానికి అవధులు లేవంటే అతిశయోక్తి కాదు. అలా ఏక కాలంలో ఏకాదశ రుద్రులను ఒకే వేదికపై దర్శించి, తరించే భాగ్యం మరి ఏ ఉత్సవాలలోనూ కలగదు.
నిర్వహణ: డి.వి.ఆర్‌. భాస్కర్‌

మరిన్ని వార్తలు