అన్నీ ‘ఎడారి మిడతలు’ కాదు!

2 Jun, 2020 11:49 IST|Sakshi

పాకిస్తాన్‌ సరిహద్దు ప్రాంతం నుండి వచ్చిన ఎడారి మిడతల వల్ల గత రెండు వారాలుగా ఉత్తర భారత దేశంలో రైతులు వేలాది ఎకరాల్లో పంటలు నష్టపొయారు. మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ మిడతలు వస్తాయోమో అన్న ఆందోళన నెలకొన్న సందర్భంగా మిడతలకు సంబంధించిన విషయాలను పరిశీలిద్దాం. మనకు సాధారణంగా కనబడే మిడతలకు, ఎడారి మిడతలకు తేడా ఏమిటి? వీటిని గుర్తించటం ఎలాగో తెలుసుకుందాం..

విశాఖపట్టణం జిల్లా నుంచి వచ్ఛిన ఫొటోల ఆధారంగా, కేరళలో కొన్నిప్రాంతాలలో కనిపించిన మిడతలు ‘కాఫీ తోటలను ఆశించే మిడతలు’గా, అలానే పిఠాపురం ప్రాంతం నుంచి వచ్చిన ఫొటోల ఆధారంగా వాటిని ‘జిల్లేడు మొక్కలను ఆశించే ప్రత్యేక మిడతలు’గా గుర్తించాలి. మన దేశంలో కనపడే ముఖ్యమైన మిడతల గురించి తెలుసుకుందాం.

ఎడారి మిడత
ఎడారిమిడతలు (schistocerca gregaria) మన ప్రాంతంలో వుండవు. కానీ ఇప్పుడు వేరే దేశాల నుంచి రాజస్తాన్‌ మీదుగా ఇతర రాష్ట్రాల్లోకి దండుగా తరలి వస్తున్న మిడతలు ఇవే. ఇది ఒక ఖండం నుంచి మరో ఖండానికి (వలస) వెళ్లగల అత్యంత వినాశకారి మిడత ఇది.

మిడతల జీవిత చక్రంలో గుడ్డు, రెక్కలు లేని అపరిపక్వ దశ, రెక్కలున్న ప్రౌఢదశలుగా మూడు దశలు వుంటాయి. ఆడపురుగులు ఖాళీగా వుండే ఎడారిప్రాంతాల్లో తగినంత తేమ ఉన్నప్పుడు గుడ్లు పెడతాయి. రెండు వారాల్లో గుడ్డు నుంచి (రెక్కలు లేని) పిల్ల పురుగులు పుడతాయి. ఈ పిల్ల పురుగులు ఐదారు వారాల్లో అన్ని రకాల పంటలను, చెట్ల ఆకులను, గడ్దిని తింటూ అయిదారు సార్లు కుబుసం విడుస్తూ (పాత చర్మాన్ని విడుస్తూ) పరిమాణాన్ని విపరీతంగా పెంచుకుంటాయి. చివరి కుబుసం విడిచే దశ తర్వాత రెక్కలున్న పెద్ద మిడతలుగా మారతాయి.

పెద్దమిడతలు వేరేప్రాంతానికి ఎగురుకుంటూ పోయి ఆయా ప్రాంతాల్లో గుడ్లు పెడతాయి. పెద్ద మిడతలు నాలుగువారాలు బతుకుతాయి.  అయితే ఒంటరిగా వుండే రెక్కలులేని మిడతలు, రెక్కలుగల ప్రౌఢ దశలో ఉన్న మిడతలు ఎక్కువగా వుండి ఆ ప్రదేశం మిడతలతో కలిసి గుంపుగా  మారితే ఈ మిడతల ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది. ఈ గుంపులనే ‘దండు’ అంటారు.

సాధారణంగా రెక్కలు లేని మిడతలు ఒంటరి దశలో ఆకుపచ్చ రంగులో వుంటాయి, కానీ అవి గుంపులుగా వుండే దండు దశకు మారగానే నల్లటి మచ్చలతో పసుపురంగులోకి మారతాయి. చదరపు కిలోమీటరులో పరచుకొని ఉండే ఒక్కో దండులో అయిదారు కోట్ల మిడతలు ఉంటాయి. ప్రౌఢ దశలో ఉన్న మిడతలు ఎంతదూరమైనా ఎగురుకుంటూ పోగలవు.

గాలి వాటంగా రోజుకు 100 కిలోమీటర్లు వెళ్లగలవు. రెక్కలున్న ప్రౌఢ మిడతలైతే గాలి వాటంగా సముద్రమట్టంపై రెండు కిలోమీటర్ల ఎత్తులో వేరే ప్రాంతానికి ఎగురుతూ వెళ్లగలవు.
ఈ ఎడారి మిడతలు సహారా ఎడారుల్లో, పాకిస్తాన్,  మనదేశంలో రాజస్తాన్‌ ఎడారి ప్రాంతంలో వుంటాయి. కానీ, వాటికి, సంతతికి అనుకూలంగా వుంటే వేరే ఖండాలకు, దేశాలకు, ప్రాంతాలకు దండులుగా తిండికోసం, గుడ్లుపెట్టటానికి వెళ్తాయి. ఈ క్రమంలో దొరికిన పంటలను, చెట్లను సర్వనాశనం చేస్తాయి. 

మన దేశంలో ఈ మిడతలు సంతానోత్పత్తి జులై నుండి అక్టోబర్‌ దాకా చేస్తాయి. అయితే పాకిస్తాన్‌లో జనవరి నుండి అక్టోబర్‌దాకా సంతానోత్పత్తి చేస్తాయి. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా మిడతల కదలికలను గమనిస్తూ అన్ని దేశాలకి సలహాలని ఇస్తుంటారు.

కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ‘మిడతల హెచ్చరిక సంస్థ’ ఎప్పటికప్పుడు పక్కదేశాల్లో మిడతల ఉధృతిని అంచనావేస్తూ ఉంటుంది. మన దేశంలో నష్టం కలగకుండా తగు చర్యలు తీసుకుంటుంది.
ఈ సంవత్సరం మార్చి ఏప్రిల్‌ నెలలో ఆఫ్రికా, ఇరాన్, పాకిస్తాన్‌లో ఉన్న ఎడారి ప్రాంతాలో పడిన వానల మూలంగా ఎడారి మిడతల సంతానోత్పత్తి పెరిగింది. అందువల్ల ఈ ఎడారి మిడతలు దండు దశగా మారి ఎప్రిల్‌ నెలలో పాకిస్తాన్‌ నుండి రాజస్తాన్‌ వైపు వచ్ఛాయి.  అవి గాలివాటంగా (బలమైన దక్షిణ గాలుల వల్ల) ఇతర ప్రాంతాల వైపు వస్తున్నాయి. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అంచనాల ప్రకారం ఇప్పుడున్న గాలివాటం ప్రకారం బీహార్, ఒరిస్సా రాస్ట్రాల వరకు జులై నెలదాకా వచ్చే అవకాశం వుంది. అయితే నైరుతీ రుతు పవనాలు మొదలవగానే ఈ మిడతలు గాలివాటంగా మళ్లీ రాజస్తాన్‌ వైపు మరలుతాయని అంచనా. 

జిల్లేడు మిడత

జిల్లేడు మిడత (Poekilocerus pictus) మన భారత ఖండంలోనే వుంటుంది. ఇది జిల్లేడు మొక్కలపై జీవిస్తుంది. బాగా ఆకుపచ్చ రంగులో వుండి పసుపు పచ్చ గీతలు వుంటాయి. ఇవి జిల్లేడు మొక్కల మీద మాత్రమే వుంటాయి. వేరే రకాల మొక్కలపై లేదా పంటలపైకి అసలు రావు. వీటిని మొహం మీద లేదా పొట్ట దగ్గర తాకితే ఒకరకమైన ద్రావణాన్ని చిమ్ముతాయి. వీటిని గుర్తించటం చాలా తేలిక. ఎడారి మిడతలకు వీటికి తేడా సులభంగా అర్థమవుతుంది.

♦ బొంబాయ్‌ మిడత

బొంబాయ్‌ మిడత (Patanga succincta) మన దేశంలో సాధారణంగా అన్ని మొక్కలపై కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సర్వసాధరణంగా అన్ని చోట్లా అన్ని మొక్కలపైనా కనిపిస్తూ వుంటుంది. ఈ మిడతల దండు 1927 తర్వాత మళ్లీ కనిపించలేదు.

ఏ పంటలనూ వదలవు
1993లో రాజస్థాన్‌లో ఎడారి మిడతలు విజృంభించాయి. అప్పట్లో మిడతల నియంత్రణ కార్యక్రమాన్ని 40 రోజులు అమలు చేసి.. మిడతలను సమర్థవంతంగా నిర్మూలించిన అధికార బృందంలో తెలుగు వారైన డాక్టర్‌ కె.ఎస్‌.ఆర్‌.కె. మూర్తి కూడా ఉన్నారు. కీటక శాస్త్ర నిపుణులైన డా. మూర్తి 1999లో ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా రిటైరై సికింద్రాబాద్‌లో ఉంటున్నారు. కీటక శాస్త్ర నిపుణుల జాతీయ సంఘానికి అధ్యక్షునిగా  కూడా సేవలందించారు. ఎడారి మిడతలు ఏ పంటలనూ వదలకుండా రాత్రీ, పగలు తేడా లేకుండా ఆబగా తినేస్తాయని, వీటి పట్ల ప్రభుత్వం, రైతులతో పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డా.మూర్తి చెప్పారు. రైతులు రోజూ ఉదయం, సాయంత్రం పొలాల్లో కలియదిరిగేటప్పుడు ఎడారి మిడతలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించుకుంటూ ఉండాలి. సాధారణంగా వేడి వాతావరణంలోనే ఎడారి మిడతలు వస్తాయి. ఇప్పుడు వర్షాలు వచ్చినా ఇక రావు అనుకోవడానికి లేదన్నారు. ఇతర దేశాల్లో మిడతల తీవ్రత, వాతావరణంలో మార్పులను బట్టి రావచ్చని. రావని కచ్చితంగా చెప్పటానికి లేదని డా.మూర్తి(94415 84255) హెచ్చరిస్తున్నారు.

కాఫీ మిడత

కాఫీ తోటల్లో ఉంటుంది కాబట్టి దీన్ని కాఫీ మిడత (Aularches miliaris) అంటారు. దీన్ని దెయ్యం మిడత, నురుగు మిడత అని కూడా పిలుస్తారు. ఈ మిడత ఇటీవల కేరళలో వయనాడ్‌ ప్రాతంలో కాఫీతోటల్లో కనపడిందని వార్తలు వచ్చాయి. ఎడారి మిడత వచ్చిందని స్థానికులు భయపడ్డారు. దీన్ని గుర్తించటం చాలా తేలిక.
విశాఖపట్టణం జిల్లాలో కాఫీమిడతలకు చెందిన రెక్కలులేని పిల్లపురుగులు. ఎక్కువ సంఖ్యలో వుండటంతో వీటిని చూసి స్థానికులు ఎడారి మిడతలని అనుకుంటున్నారు. వీటికి ఎడారి మిడతలకు చాలా తేడా ఉంది.
కాఫీ మిడత కొబ్బరి, పోక, పనస, రబ్బరు, టేకు, అరటితోపాటు మిగతా పంటల్లో కూడా చాలా అరుదుగా కనిపిస్తుంది.

ఇతర మిడతలు
మనకు సాధారణంగా గడ్డిలో కనబడే అనేక ఇతర రకాల మిడతలు పెద్దగా నష్టం కలగచేయవు. వరి పంటలోనూ ‘వరి మిడత’ను గమనించవచ్ఛు. కొన్నిసార్లు ఈ మిడతల ఉధృతి పెరగవచ్చు.

– డా. శ్రీనివాస రావు చెరుకూరి
కీటక శాస్త్ర ఆచార్యులు (94410 26576)
ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాల, బాపట్ల
cherukurisrao@yahoo.com

మరిన్ని వార్తలు