పవిత్ర బంధం!

17 Nov, 2017 23:41 IST|Sakshi

ఆత్మీయం

ఒకప్పుడు పెళ్లిళ్లకు జాతకాలు చూడటం కొన్ని సామాజిక వర్గాలకే పరిమితం. ఇప్పుడు జాతక పరిశీలన చేయడం అందరికీ అలవాటుగా, ఆచారంగా మారిపోయింది. వివాహ పొంతనలకు జాతకం తీసుకోగానే ‘‘అమ్మో అమ్మాయిది ఆశ్లేష నక్షత్రం అట అత్తగారికి గండం మాకు ఆ సంబంధం వద్దనీ, మూల నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే మూలనున్న ముసలివాళ్లు కూడా ఎగిరిపోతారని, జ్యేష్ట నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే కోడలి బావగారు అంటే ఇంటికి పెద్ద కుమారుడికి గండం అని, విశాఖ నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే ఇంకేదో అని, మఖ నక్షత్రంలో పుట్టిన కన్యను కోడలిగా తెచ్చుకుంటే మరోటి అవుతుందని... ఇలా చాలా మూఢ నమ్మకాలు సమాజంలో పాతుకు పోయి ఉన్నాయి. ఒకరి జన్మ నక్షత్రాల వల్ల మరణాలు మరొకరికి సంభవించేటట్లయితే ఇంక వ్యక్తిగత జాతకాలెందుకు? కోడలి నక్షత్రం వల్లో, మరొకరి రాశి వల్లో చెడు జరుగుతుందనుకోవడం అసంబద్ధం. నక్షత్రాలపైన మీకు ఏదైనా సంశయం ఉంటే అది వివాహం చేసుకున్న భార్యాభర్తలకే వర్తిస్తుంది కాని వారి తల్లిదండ్రులకు, అక్క చెల్లెళ్లకు లేక అన్నదమ్ములకు వర్తింపచేయడం ఏ మాత్రం సహేతుకం కాదు.

కాబట్టి జాతక పరిశీలనలో అన్ని విషయాలకు పొంతన కుదిరితే నక్షత్రం పేరు మీద అనవసరంగా భయానికి లోనై విద్య, వినయం, వివేకం, గుణం, సాంప్రదాయం, సంస్కారం, రూపం గల వధువులను వదులుకోవద్దు. ఏమాత్రం సంకోచం లేకుండా మీరు ఆ కన్యను కోడలిగా తెచ్చుకోవచ్చు. ఒకప్పుడు ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే, గుండెల మీద కుంపటి ఉన్నట్లు భావించేవారు ఆడపిల్ల తల్లిదండ్రులు. ఇప్పుడది కాస్తా తిరగబడింది. అవును మరి, చేసిన పాపం ఊరికే పోతుందా? మగపిల్లలం మాకేమిటని విర్రవీగిన వారు కాస్తా ఇప్పుడు అమ్మాయిలు, వారి అమ్మానాన్నలు చెప్పిన సవాలక్ష నిబంధనలకు తలవంచి మరీ తాళి కట్టేస్తున్నారు. అబ్బాయిల తలిదండ్రులు తమ కొడుక్కి ఎలాగయినా పెళ్లి జరిగేలా చూడమని దేవుళ్లకి ముడుపులు కడుతున్నారు. ఏమయినా, ఇలాంటి పరిస్థితిలో మార్పు రావాలి. అలా మార్పు రావాలంటే ముందు మనం మారాలి. జాతక పరిశీలన బంధాలను ముడి వేయడానికే తప్ప మనుషులను దూరం చేయడానికి కాదు.

మరిన్ని వార్తలు