నీడలు మాట్లాడుతున్నాయి!

19 Apr, 2018 02:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మైండ్‌ యువర్‌ హెల్త్‌

మైండ్‌ ఏమైనా రేడియో స్టేషనా మాటలు వినపడటానికి? లేదంటే పాత యాంటిన్నా ఉన్న టీవీనా బొమ్మలు నాట్యమాడటానికి? ఎగ్జాట్లీ! నిజానికి మైండ్‌ బ్రాడ్‌కాస్ట్, టెలికాస్ట్‌ స్టేషనే కాదు... ఒక ప్రొజెక్షన్‌ మెషిన్‌లా కూడా పనిచేస్తుంది. మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలను పరిసరాలపై, పరిసరాల్లో ఉన్న మనుషులపై ప్రొజెక్ట్‌ చేస్తుంది. వాటినే మనం భ్రమలు అంటాం. తొలగిపోతాయిలే అని ఆశిస్తాం. 
కానీ... ఇదొక రుగ్మత. స్కీజోఫ్రీనియా...! ఇట్‌ నీడ్స్‌ ట్రీట్‌మెంట్‌!!

లక్ష్మి ఈమధ్యే పెళ్లిచేసుకొని అత్తగారింట్లో అడుగుపెట్టింది. అత్తింటి వాళ్లకు ఊళ్లో కాస్త మంచి పేరే ఉంది. గౌరవప్రదమైన వ్యక్తులు, సాత్వికులూ అనే ప్రతీతీ ఉంది. అందుకే వారికి పిల్లనిచ్చినందుకు లక్ష్మి వాళ్ల పుట్టింటివాళ్లూ చాలా ఆనందంగా ఉన్నారు. అయితే పెళ్లయిన కొద్దిరోజుల్లోనే లక్ష్మి తన అత్తింటివారి మీద ఆరోపణలు మొదలుపెట్టింది. తన అత్త, ఆడపడుచూ, భర్త కలిసి తనను వేధిస్తున్నారనీ, తనను వదిలించుకోడానికి కుట్రలు పన్నుతున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది. ఊళ్లోవాళ్లూ చాలా ఆశ్చర్యపోయారు... లక్ష్మి అత్తింటివాళ్లు ఇలాంటివారా అని! పరువూ, ప్రతిష్టా దెబ్బతినడంతో లక్ష్మి భర్త తరఫువారు బాగా కుంగిపోయారు. వాళ్లకు కాస్తోకూస్తో పలుకుబడి ఉండటంతో తాము ఒత్తిడికి లొంగిపోయామనే అపవాదు రాకుండా ఉండేందుకు పోలీసులు  నిందితుల పట్ల చాలా కఠినంగానే వ్యవహరించారు. చాలా పకడ్బందీగా దర్యాప్తు జరిపారు. కానీ ఎంతగా ప్రయత్నించినా లక్ష్మి ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాధారాలూ దొరకలేదు. దర్యాప్తు అధికారి అయిన సీఐ రవికి సైకాలజీలో పీజీ ఉంది.అన్ని రకాల దర్యాప్తులూ అయిన తర్వాత సీఐ రవి తన ఫ్రెండ్‌ అయిన సైకియాట్రిస్టును లక్ష్మితో మాట్లాడించాడు. రవి అనుమానమే నిజమైంది. లక్ష్మి ఒక మానసిక వ్యాధితో బాధపడుతోంది. లక్ష్మికి ఉన్న మానసిక సమస్య కారణంగా ఆమె కొన్ని భ్రాంతులకు లోనవుతోంది. ఆ భ్రాంతులను కల్పించే ఆ విచిత్రమైన వ్యాధి పేరు... స్కీజోఫ్రీనియా.

స్కీజోఫ్రీనియా అంటే... అంతకు మునుపు సాధారణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి  ప్రవర్తన అకస్మాత్తుగా అంతుపట్టని విధంగా మారిపోతుంది. భ్రాంతులకు లోనవుతూ ఉంటాడు. పొంతన లేని ఆలోచనలు వేధిస్తుంటాయి. తార్కికతకు అందని ఊహలు చేస్తుంటాడు. ఆలోచనల్లో అన్వయం ఉండదు. ఈ స్థితి కనీసం నాలుగువారాలు కొనసాగుతుంది. ఇది స్త్రీపురుషులిద్దరిలోనూ సమానంగా కనిపిస్తుంది. అయితే వ్యాధి వచ్చే వయసు మాత్రమే వేరుగా ఉంటుంది. పురుషుల్లో అది 16 నుంచి 21 ఏళ్ల మధ్య వస్తే... మహిళల్లో 21 నుంచి 23 ఏళ్లలో సాధారణంగా కనిపిస్తుంది. చాలామంది దీన్ని కొంత అసాధారణమైన వ్యాధి అనుకుంటారు. కానీ ప్రతి 100 మందిలో దాదాపు నలుగురు స్కీజోఫ్రీనియా రోగులు ఉంటారని ఒక అంచనా. అంత సాధారణమైనదీ వ్యాధి.  

లక్షణాలు : ఈ కింది లక్షణాలు కనీసం నెల రోజులపాటు ఉంటే... అవి స్కీజోఫ్రీనియా అనే వ్యాధి కారణంగా కలుగుతున్నవని భావించవచ్చు. 
డెల్యూజన్స్‌ (అవాస్తవికమైన నమ్మకాలు) : ఈ వ్యాధి ఉన్నవారు కొన్ని వాస్తవం కాని వాటిని నమ్ముతుంటారు. మిగతావారు ఎంత నచ్చచెప్పడానికి ప్రయత్నించినా, ఎన్ని రుజువులు చూపినా తమ నమ్మకాలను వారు విడువరు. అయితే ఆరోగ్యవంతులకు అవి భ్రాంతులన్న మాట ఎంత వాస్తవమో... మెదడులో వచ్చే మార్పుల కారణంగా వ్యాధిగ్రస్తులకు అవి వాస్తవమని నమ్మేలా ఉండటమూ అంతే వాస్తవం. అందుకే వ్యాధిగ్రస్తుల వాదనను ఓపికగా అంగీకరించాలి తప్ప... మనదే వాస్తవం అనే ధోరణితో వారి భ్రాంతులను కొట్టిపారేయకూడదు. వాళ్ల నమ్మకాలు సైతం చాలా రకాలుగా ఉంటాయి.

ఉదాహరణకు వాటిలో కొన్ని... 
∙తన భర్త లేదా తన భార్య వేరొక వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నట్లు నమ్ముతుంటారు. దీన్నే డెల్యూజన్‌ ఆఫ్‌ ఇన్‌ఫిడిలిటీ అంటారు. 
∙కొంతమంది వ్యక్తులు తనకు హాని కల్పించడానికో లేదా చంపడానికో ప్రయత్నిస్తున్నారని నమ్ముతుంటారు. (ఉదాహరణకు తన అత్తింటివారు తన కాపురం చెడగొట్టడానికీ, తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని లక్ష్మి నమ్మినట్లుగా). ఈ భ్రాంతిని డెబ్యూజన్‌ ఆఫ్‌ పెర్‌స్కూజన్‌ అంటారు. 
∙తనను చాలా చెడ్డగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారనీ, తన ప్రతిష్టను దిగజార్చడానికి, తనను ఉద్దేశించే అందరూ  మాట్లాడుకుంటున్నారని భ్రాంతి చెందడాన్ని డెల్యూజన్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ అంటారు. 
∙ఇక కొందరి భ్రాంతులు మరీ విచిత్రంగా ఉంటాయి. కొందరు చిప్స్‌ వంటి ఉపకరణాల ద్వారా లేదా కొన్ని యంత్రాల ద్వారా తన ఆలోచనలను తెలుసుకుంటున్నారనీ, రేడియోలోలా తన ఆలోచనలు వారికి ప్రసారమవుతున్నాయనే భ్రాంతితో ఉంటారు. దీన్ని ‘థాట్‌ బ్రాడ్‌కాస్ట్‌’ అంటారు. అయితే ఈ భ్రాంతి రెండు విధాలుగా ఉంటుంది. తన ఆలోచనలను తన మెదడు నుంచి తీసేస్తున్నారని భ్రాంతి చెందడాన్ని ‘థాట్‌ విత్‌డ్రావల్‌’ గా పేర్కొంటారు. వేరే వ్యక్తుల ఆలోచనలను తన మెదడులో పెడుతున్నారని భ్రాంతి చెందడాన్ని ‘థాట్‌ ఇన్సెర్షన్‌’ అంటారు. సాధారణంగా ఒకరి ఆలోచనలు మరొకరికి చెబితే గానీ (కమ్యూనికేట్‌ చేస్తేగానీ) తెలియవు. అలా తెలిసిపోతున్నట్లు భావించడాన్ని ‘లాస్‌ ఆఫ్‌ ఇగో బౌండరీస్‌’ అని వ్యవహరిస్తారు. పైన పేర్కొన్న లక్షణాల్లో ఏది ఉన్నా... వాటి ఆధారంగా ఒక వ్యక్తి స్కీజోఫ్రీనియా తో బాధపడుతున్నాడని నిర్ధారణ చేయవచ్చు. 
∙మరికొందరైతే తమను చంపడానికి ఎవరో చేతబడి చేస్తున్నట్లు బలంగా నమ్ముతుంటారు. ఇలాంటి నమ్మకాలతో పల్లెల్లో ఎందరిపైనో అభియోగాలు మోపి, కొందరిని మంత్రగాళ్లుగా చెప్పి వారి పళ్లు పీకేయడం, ఒక్కోసారి చంపేయడం జరుగుతుంటుంది. 
∙తాను మనిషి రూపం నుంచి జంతువుగా మారిపోతున్నట్లు ఇంకొందరు భ్రాంతి చెందుతారు. ఇలాంటి భ్రాంతులను ఇంగ్లిష్‌లో హేల్యూసినేషన్స్‌ అంటారు. ఇలాంటి హేల్యూసినేషన్స్‌ కొందరిలో మరికొన్ని

రూపాల్లోనూ కనిపిస్తుంటాయి. అవి... 
∙తన చుట్టూ ఎవరూ లేకపోయినా... రోగికి కొందరు మనుషులు కనిపిస్తుంటారు. అలా ఎవరైనా లేదా ఏదైనా కనిపించడాన్ని విజువల్‌ హేల్యూసినేషన్స్‌ అంటారు. అదే ఎవరికీ వినిపించని మాటలు తమకే వినిపించడాన్ని ఆడిటరీ హేల్యూసినేషన్స్‌ అంటారు. ఎవరికి తెలియని వాసనలు తమకే తెలియడాన్ని ఆల్ఫాక్టరీ హేల్యూసినేషన్స్‌ అంటారు. 
∙కొందరు రోగుల్లోనైతే... ఇతరులను కొట్టమనీ లేదా తమను తాము హింసించుకొమ్మని లేదా ఆత్మహత్య చేసుకొమ్మనే మాటలు తమను  శాసిస్తున్నట్లుగా వినిపిస్తాయి. కాబట్టి వాటిని కమాండింగ్‌ హేల్యూసినేషన్స్‌ అంటారు.  ఇలాంటి ఎడతెగని ఆలోచనలు భ్రాంతులతో రోగి భావోద్వేగాలలో/ప్రవర్తనలో మార్పులు వస్తాయి. ఎంతో భయపడడం, ఏడ్వడం, కారణం లేకుండానే నవ్వడం, ఒక్కసారిగా కోపం రావడం, చిరాకు పడడం వంటివి చూస్తాం. ఇలాంటి వ్యక్తులు ఆత్మహత్యకు యత్నించవచ్చు లేదా ఇతరులకూ హాని కల్పించవచ్చు. అందుకే వీరికి తక్షణ చికిత్స అవసరం. 

ఎందుకు వస్తుందీ వ్యాధి... 
స్కీజోఫ్రీనియా వ్యాధి మెదడులోని కొన్ని రసాయనాల్లో మార్పుల కారణంగా వస్తుందని పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఇందుకోసం స్కాన్‌ వంటి పరీక్షలు నిర్వహిస్తే... మెదడులో ఎలాంటి మార్పులూ కనిపించకపోవచ్చు. అయితే వ్యాధి రావడానికి మరికొన్ని అంశాలూ దోహదం చేయవచ్చు. జన్యుపరమైన అంశాలు ఈ వ్యాధి వచ్చేలా ప్రభావితం చేస్తాయని కొందరి ప్రతిపాదన. అయితే ఈ హైపోథెసిస్‌ను బలపరిచే ‘స్కీజోఫ్రీనియా జీన్‌’ని ఇంతవరకూ ఎవరూ గుర్తించలేదు. కాకపోతే అనువంశీకంగా కనిపించవచ్చు. అదెలాగంటే... తాత–ముత్తాతల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నప్పుడు... ఇది వచ్చే రిస్క్‌ 3 శాతం ఉంటుంది. తల్లిదండ్రులిద్దరిలో ఏ ఒక్కరికైనా ఇది ఉంటే... వారి సంతానానికి ఇది వచ్చే రిస్క్‌ 10 శాతం ఉంటుంది.  తల్లిదండ్రులిద్దరికీ ఈ వ్యాధి ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం 40 శాతం ఉంటుంది. ఇక దీనితో పాటు గర్భధారణ, ప్రసవం వంటి సందర్భాల్లో ఏవైనా అవాంతరాలు (కాంప్లికేషన్లు) వచ్చినవారిలోనూ, బాల్యంలో పిల్లల వికాసంలో లోపాలు ఉన్నప్పుడు ఇది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఇక జీవితంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొనే వారు, మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డవారిలో ఆయా అంశాలు ఈ వ్యాధిని ప్రేరేపించవచ్చు. అయితే అంత మాత్రాననే దగ్గరివారిలో లేదా తల్లిదండ్రులలో ఈ వ్యాధి ఉంటే అది తప్పక రావాలనే నియమమేదీ లేదు. కాకపోతే వచ్చే అవకాశాలు కొంత ఎక్కువ. 

చికిత్స 
వ్యాధి ఎంతవరకూ నయం అవుతుందనే విషయం రోగి వయసు, అతడిలో వచ్చే ప్రతికూల ఆలోచనలు, కుటుంబం ఎంతమేర సపోర్ట్‌గా నిలుస్తోంది వంటి అంశాలతో పాటు ‘రోగికి లక్షణాలు కనిపించిన తరువాత ఎంత కాలంలోపు వైద్య చికిత్సకు తీసుకువెళ్లారు’ అన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. వ్యాధి కలిగిన తొలి దశలోనే (నెల నుండి సంవత్సరంలోపు) వైద్యుని సంప్రదించినప్పుడు వ్యాధి నయమయ్యే అవకాశం బాగుంటుంది. అంటే ఎంత త్వరగా వైద్యుణ్ణి కలిస్తే బాగయ్యే అవకాశాలు అంత ఎక్కువ అన్నమాట. కాబట్టి వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుని సంప్రదించాలి.
మందులు క్రమం తప్పక వాడాలి : సైకియాట్రిస్ట్‌ చెప్పేవరకు రోగి మందుల్ని క్రమం తప్పక వాడటం ముఖ్యం. సాధారణంగా వ్యాధి లక్షణాలు మొదటిసారి కలిగినప్పుడు 9 నెలల వరకూ మందులు వాడతారు. ఎందుకంటే మొదటి 6 నెలల్లో మందులు వాడనప్పుడు  వ్యాధి తిరగబెట్టే అవకాశం 70 శాతం వరకు ఉంటుంది. ఎక్కువ సంవత్సరాలు ఈ వ్యాధి ఉన్నవారిలో మాత్రం కనీసం 5 సంవత్సరాల నుంచి జీవితకాలం వరకు మందులు వాడవలసి ఉంటుంది. మందులకు సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగితే వైద్యుని సంప్రదిస్తే వాటిని మారుస్తారు.. ఈ వ్యాధి కోసం వాడే మందులు నిద్రమాత్రలు కావు అన్న విషయాన్ని అందరూ గ్రహించాలి. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి జబ్బులకు సైకియాట్రీలో నిద్రమాత్రలు వాడుతుంటారని చాలామంది అపోహ పడుతుంటారు. అందుకే కొందరు ఇలాంటి లక్షణాలు కనిపించినా తమ అపోహలతో చికిత్స అందించరు. దాంతో అలా వైద్యం చేయకుండా విడిచిపెడితే వ్యాధి లక్షణాలు మెరుగుపడకపోగా, ఎక్కువకాలం వ్యాధితో బాధపడటం వలన మెదడులోని కణాలు నష్టపోయే అవకాశం ఉంది. అప్పుడు వైద్యంతో వ్యాధి నయం కావడం కష్టమవుతుంది. 

ఎలా గుర్తుపట్టాలంటే... 
∙వ్యక్తిగత ప్రవర్తనలో/వ్యక్తిత్వంలో మార్పులు కనిపిస్తే ∙తనను నిత్యం ఎవరో గమనిస్తున్నట్లుగా ఫీలవుతుంటే  ఎవరికీ వినపడని శబ్దాలు, సంగీతం తమకు వినిపిస్తున్నట్లుగా చెబుతుంటే  ఎవరికీ కనిపించని దృశ్యాలు తమకు కనిపిస్తున్నాయంటూ చెబుతుంటే ∙అర్థం లేని పదాలను ఉచ్చరిస్తుంటే ∙తమకు ఇష్టమైన వారిని సందర్భం లేకుండా కోప్పడటం, వారిని అసహ్యించుకోవడం చేస్తుంటే ∙నిద్రలేకుండా గడపుతుండటం లేదా విపరీతంగా ఆవేశపడుతుంటే.  
డాక్టర్‌ ఐ. భరత్‌కుమార్‌ రెడ్డి, 
కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్, 
అపోలో హాస్పిటల్స్, 
హైదర్‌గూడ, హైదరాబాద్‌  

మరిన్ని వార్తలు