తన కోపమే తన శత్రువు

26 Apr, 2018 00:17 IST|Sakshi

మైండ్‌ యువర్‌ హెల్త్‌

రమేశ్‌ చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తనకు దక్కని ఆటవస్తువును సాధించుకునేందుకు కోపం అనే ఆయుధాన్ని వాడాడు. తనకా ఆటవస్తువు దక్కింది. అంతే... కోపం  అనేదాన్ని ఒక పనిముట్టుగా వాడుకుంటే దక్కనివి చాలా దక్కుతాయని అతడిలో ఒక అభిప్రాయం ముద్రించుకుపోయింది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ధోరణితోనే తాను సాధించుకుంటున్న ప్రయోజనాల జాబితా కూడా పెరుగుతూ పోయింది. రమేశ్‌లో కోపం అనేది తనకు ప్రయోజనకారి అనే ధోరణీ పెరిగిపోయింది. ఒకనాడు అదే కోపంతో ఒకరిని బలంగా వెనక్కు నెట్టేశాడు. ఎదుటివారిని గాయపరచడం రమేశ్‌ ఉద్దేశం కాదు. కేవలం కోపంతో ఎదుటివాడిపై ఆధిపత్యాన్ని సాధించడమే అప్పటికి అతడి లక్ష్యం. కానీ విధి వేరేగా తలచింది. ఎదుటివాడు తీవ్రంగా గాయపడ్డాడు. రమేశ్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. అతడు ప్రస్తుతం అండర్‌ ట్రయల్‌ ఖైదీగా కాలం వెళ్లదీస్తున్నాడు. ఇదీ తనపై తనకు అదుపులేనంత కోపం తేగల అనర్థం అని చెప్పే ఒక కేస్‌ స్టడీ. 

కోపం అనే భావోద్వేగం ఎప్పుడూ మన అదుపులోనే ఉండటం అవసరం. సమాజంలో మనం బతుకుతున్నప్పుడు అది మరింతగా అవసరం. మనల్ని మనం అదుపులో ఉంచుకోకపోతే... మనల్ని మనం సామాజికంగా వెలివేసుకున్నట్లే. లేదా కోపం మరింత మితిమీరితే మనల్ని మనమే బలితీసుకున్నట్లే. మనలో ఎన్ని మంచి గుణాలు ఉన్నా క్షణికావేశంలో చేసే ఒకే ఒక తప్పు మొత్తం జీవితాన్నే మసకబార్చవచ్చు. ఆ కోపం తాలూకు క్షణికాగ్రహం వల్ల కొందరు కుటుంబాల్నీ, ఇంకొందరు జీవితాల్నీ, మరికొందరు సాక్షాత్తూ తమ ప్రాణాలనే పోగొట్టుకున్నారు. ఇవాళ్ల మనకు తెలిసీ... జైల్లో ఉన్న చాలామంది కేవలం తమ కోపం వల్ల చేసిన భౌతిక దాడులతో శిక్షార్హులై... ఆ క్షణాన్ని వెనక్కుతేలేక పశ్చాత్తాపంలో మగ్గిపోతున్నారంటే అది అవాస్తవం కాదు. అలాంటి కోపం గురించి, దాన్ని అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం గురించి, అందుకు అందుబాటులో ఉన్న మార్గాల గురించి వివరిస్తున్న ప్రత్యేక కథనం ఇది. 

కోపం అంటే... 
అసలు కోపం అంటే ఏమిటి?  ఒక సహజమైన ఉద్వేగం. ఒక సహజాతం. ఇంగ్లిష్‌లో చెప్పాలంటే ఇన్‌స్టింక్ట్‌. అందుకే నెలల పిల్లల్లోనూ అది ఉంటుంది. కావాల్సింది దొరకనప్పుడు, అసౌకర్యంగా ఉన్నప్పుడు పిల్లలు కోపాన్ని ఏడుపు ద్వారా వ్యక్త పరుస్తారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఇది కొత్త రూపాలను పొందుతుంటుంది. కొత్త మార్గాల్లో వ్యక్తమవుతుంటుంది. 
నిర్వచన రూపంలో చెప్పుకోవాలంటే... ‘కోపం అనేది మనకు ఇష్టం లేనివి జరుగుతున్నప్పుడు లేదా సౌకర్యంగా లేనిది చోటుచేసుకుంటున్నప్పుడు రేగే ఒక ప్రతికూల భావోద్వేగం’. ఈ భావోద్వేగం కలిగినప్పుడు అదుపు కోల్పోతే  మర్యాదాకరం కానివిధంగా రియాక్ట్‌ అవుతాం. అర్థం లేకుండా, నిర్లక్ష్యంగా, బెదిరింపు ధోరణితో ప్రవరిస్తాం. కట్టలు తెంచుకున్న కోపంలో అనర్థాలు చేసి కూర్చుంటాం. ఇలా కోపం వల్ల జీవితాలే నాశనం చేసుకున్నవారు ఉన్నారు.

తీవ్రమైతే అనర్థమే... 
కోపం కొందరిలో చాలా తీవ్రంగా ఉంటుంది. ఇందుకు మన పూర్వ గ్రంథాల్లో ఉదాహరణలు కూడా ఉన్నాయి. దూర్వాసుడు మహామునే అయినా కోపం అనే గుణం కారణంగానే కోపిష్టి అనే మచ్చ పొందాడు. అంటే వ్యక్తిత్వాన్ని, శీలాన్ని దెబ్బతీసే దుర్గుణం కోపానికి ఉందని అర్థం. పొరుగువారిపై ద్వేషాలతో పుట్టిన కోపమే ప్రపంచ వ్యాప్తంగా చాలా యుద్ధాలకు కారణం. అయితే దేనికైనా మితం ఉంటుంది. మితిమీరిన కోపం తనకూ సమాజానికీ నష్టం చేసే స్థాయిలో ఉన్నప్పుడు  దాన్ని తప్పకుండా ఒక మానసిక సమస్యగానే మానసికవేత్తలు పరిగణిస్తారు. 

కోపం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది... 
మనలో ఉత్పన్నమయ్యే భావోద్వేగాలకు మెదడులోని బాదం షేపులో ఉండే ‘అమిగ్దలా’ కారణం. మనకు ఏదైనా అప్రియమైన ఘటన జరుగుతుందని తెలిసిన వెంటనే ఈ అమిగ్దలా ప్రేరేపితమవుతుంది. అయితే మనకు జరగబోయే అసలు నష్టాన్ని తార్కికంగా ఆలోచించే భాగం ‘కార్టెక్స్‌’. ఈ కార్టెక్స్‌ కంటే ముందుగానే అమిగ్దలా రంగంలోకి దిగిపోవడంతో ఒంట్లో అడ్రినలీన్, కార్టిసోల్, టెస్టోస్టెరాన్‌ వంటి హార్మోన్లు స్రవిస్తాయి. అడ్రినలిన్‌ రక్తంలోకి చాలా ఎక్కువ మోతాదులో పంప్‌ అవుతుంది. అడ్రినలిన్‌ ఎంత ఎక్కువగా ఉంటే కోపం తీవ్రత అంత ఎక్కువన్న మాట. అదే సందర్భంలో ఆ కోప సమయాన్ని ఎదుర్కునేందుకు అవసరమైన శక్తి కోసం రక్తంలోకి గ్లూకోజ్‌ కూడా ఎక్కువగా పంప్‌ అవుతుంది. అంతేకాదు అన్ని కణాలకూ ఆ శక్తి చేరడానికి వీలుగా రక్తనాళాలూ విప్పారతాయి. ఇలా విప్పారడం వల్ల రక్తం జివ్వున ఎగజిమ్మడం వల్లనే కొందరిలో కోపం వచ్చినప్పుడు ముఖం, శరీరం ఎర్రబారతాయి. అయితే సమన్వయ వ్యవస్థలో భాగంగా  మెదడులోని విచక్షణాæ కేంద్రమైన కార్టెక్స్‌ రంగంలోకి దిగి క్రమంగా పరిస్థితిని అవగతం చేసి పారాసింపాథెటిక్‌ నర్వస్‌ సిస్టమ్‌ ద్వారా వ్యక్తిని క్రమంగా నార్మల్‌ స్థితికి తెస్తుంది. ఇదీ కోపంలో జరిగే మెకానిజమ్‌. 

ఆగ్రహ వ్యక్తీకరణల్లో అనేక రకాలు  
కోపం వ్యక్తమయ్యే తీరును బట్టి దానికి పేరు పెట్టారు మానసిక నిపుణులు. కోపం యొక్క లక్షణాలు, వాటి పేర్లు ఇలా ఉన్నాయి. 
షౌటింగ్‌ స్పెల్స్‌ : తీవ్రస్వరంతో గొంతు చించుకుని అరవడం. ఇలా అదుపు కోల్పోయి అరవడం వల్ల కొన్నిసార్లు కొందరిలో స్వరపేటిక దెబ్బతింటుంది. గొంతు బొంగురుబోతుంది. చాలా రోజులు మామూలుగా మాట్లాడలేరు కూడా. ఇలాంటి కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘షౌటింగ్‌ స్పెల్స్‌’గా చెప్పవచ్చు. 
బ్యాంగింగ్‌ ఆఫ్‌ హెడ్‌  : తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోతూ తలను గోడకేసి బాదుకోవడాన్ని ‘బ్యాంగింగ్‌ ఆఫ్‌ హెడ్‌’ అని అంటారు. 
డెలిబరేట్‌ సెల్ఫ్‌ హార్మ్‌ (డీఎస్‌హెచ్‌) :  ఇది కోపంలో తమకు తాము హాని చేసుకునే స్థితి. ఉదాహరణకు బైక్‌పై వెళ్తున్నప్పుడు రాయి అడ్డం పడి బండి పక్కకు ఒరిగిపోయిందనుకోండి. కోపంతో వాహనదారుడు కాలు చిట్లి రక్తం వచ్చేంత తీవ్రతతో ఆ రాయిని తంతాడు. గాయపడతాడు. ఆత్మహత్యకంటే ఒక మెట్టు తక్కువ స్థాయి ఆగ్రహప్రకటన ఇది. 
డెలిబరేట్‌ ఇన్‌సామ్నియా : కొందరు తమ ఆగ్రహాన్ని నిద్ర మీద చూపిస్తారు. తమకు ఎంతగా నిద్రవస్తున్నా నిద్రపోకుండా తమను తాము హింసించుకుంటారు. దీన్ని వైద్యపరిభాషలో ‘డెలిబరేట్‌ ఇన్‌సామ్నియా’గా చెబుతారు. 
డెలిబరేట్‌ నాన్‌ కో–ఆపరేషన్‌: గాంధీమార్గంలో కోపం వ్యక్తం చేసే రూపమిది. బాగా కోపం వచ్చిన వారు దాన్ని తమ రోజువారీ కార్యకలాపాల మీద చూపిస్తారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లరు. పెద్దలైతే ఆఫీసుకు వెళ్లరు. బాస్‌ పిలిచినా ఆఫీసు సమావేశాలకు అటెండ్‌ కారు. 
చేతిలోని వస్తువు విసిరి కొట్టడం : టీవీలో మనం సపోర్ట్‌ చేస్తున్న టీమ్‌ ఓడిపోయిందనుకోండి. టీవీని బద్దలు కొట్టేస్తాం. అలాగే కొందరు కళ్లజోడునూ, చేతిలోని మొబైల్‌నూ విసిరివేయడం చాలా కుటుంబాల్లో చూసే దృష్టాంతమే. ఇది ఆర్థికంగా చేసుకునే హాని. 
జుట్టు పీకేసుకోవడం : ఆగ్రహంతో జుట్టుపీకేసుకోవడం చేస్తారు. కేవలం తలపైని జుట్టు కాకుండా కొందరు కనురెప్పల్లోని వెంట్రుకలు మీసంలోని వెంట్రుకలు పీకేసుకుంటుంటారు. ఇలా జుట్టు పీకేసుకునే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘ట్రైకోటిల్లోమేనియా’ అంటారు. 
– డా.కళ్యాణ్‌ చక్రవర్తి, సీనియర్‌ కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్, 
లూసిడ్‌ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్‌ 

ఆగ్రహాన్ని అదుపు చేసుకొనే మార్గాలు (యాంగర్‌ మేనేజ్‌మెంట్‌)
కోపం ఎప్పుడూ మన అదుపులోనే ఉండాలి. దాని అదుపులోకి మనం వెళ్లకూడదు. కోపాన్ని నివారించుకునేందుకు అనుసరించదగిన కొన్ని మార్గాలివి...  
►కోపంతో ఏదైనా పనికి పూనుకునే ముందు దానిని వాయిదా వేయాలి. ఒకటికి రెండు సార్లు చేయబోయే పని మంచిదేనా అని ఆలోచించాలి. ఆ పని చేసే ముందర శ్రేయోభిలాషితో తప్పక సంప్రదించాలి. 
►జీవితంలో అన్నీ తాత్కాలికమైన పరిణామాలే. కోపం ఒక ఉద్వేగం. అది క్షణికం మాత్రమే. ఆ స్థితి దాటిన తర్వాత పరిస్థితి మామూలైపోతుంది అని గ్రహించాలి. 
►ప్రతిసారీ మనదే గెలుపు కాదు. కొన్నిసార్లు అవతలి వాళ్లూ గెలవవచ్చు. ఇది చాలా సహజం. క్రీడాస్ఫూర్తితో ఈ వాస్తవాన్ని ఆమోదించాలి. 
►మీరు ఎంతగా మన శ్రేయోభిలాషుల మాటలు వింటుంటే, మీలోని ఆగ్రహం అంతగా తగ్గుతుంది.  
► జీవితంలో ప్రతిదీ మీకు తెలిసి ఉండాలనే లేదు. మీకు తెలియని అంశాలూ ఉండవచ్చు. అందుకోసం చిన్నబుచ్చుకోవడం, కోపం తెచ్చుకోవడం తగదు. 
►నిద్రపోవడం, విశ్రాంతి తీసుకోవడం, రిలాక్స్‌ కావడం... జీవితంలో ఇవీ చాలా ప్రధానమైనవే అని గుర్తుంచుకోండి. 
►కోపాన్ని సమర్థంగా నియంత్రించగలవాడు అని మీరు నమ్మినవాళ్లను మీ రోల్‌మోడల్‌గా ఎంచుకోండి. వాళ్లను అనుసరించడానికి ప్రయత్నించండి. వారంలో కనీసం కొద్దిసేపు వాళ్లతో గడపండి.
►మీకు కోపం వచ్చినప్పుడు మీరు గెలవవచ్చు. కానీ మీ కుటుంబ సభ్యులు ఓడిపోతుంటారన్న విషయాన్ని గ్రహించండి. 
► మీ మాట నెగ్గుతోందా, మీ పంతం నెరవేరుతోందా, లేక మీరు గెలుస్తున్నారా అన్న అంశంపై స్పష్టత తెచ్చుకోండి. 
►ఏయే సమయాల్లో మీకు కోపం వస్తుందో గ్రహించి, మీ వృత్తి బాధ్యతలలో కోపం వల్ల మీరేమి కోల్పోతున్నారో, దానిని అధిగమించడం వల్ల మీరు గెలవగలిగేదేమిటో రాసుకొండి. దాన్ని మాటిమాటికీ చదువుకోండి. 

కోపంతో కొన్ని ప్రయోజనాలివి... 
కోపం అన్నది ఎప్పుడూ ప్రతికూలం మాత్రమే కాదు. కొన్నిసార్లు ఉపయోగకరమైన మోతాదులో మంచి కూడా చేస్తుంది. అలా దాన్ని పాజిటివ్‌గానూ ఉపయోగించవచ్చు. కోపాన్ని సద్వినియోగం చేసుకోగల పరిస్థితులివే... 
►మీరు ఒక మంచి వ్యాపకాన్ని ఎంచుకోండి. మీకు కోపం వచ్చినప్పుడల్లా ఆగ్రహాన్ని ఆ వ్యాపకంలో ప్రదర్శించండి. 
►ఏదైనా ఒక ఆటను ప్రాక్టీస్‌ చేయండి. ఆగ్రహ సమయంలో మీకు ఇష్టమైన ఆట ఆడండి. 
►వేర్వేరు రంగాలకు చెందిన అనేక రకాల వ్యక్తులతో మీకు సత్సంబంధాలు ఉండేలా చూసుకోండి. కోపం రాగానే, మీరున్న చోటి నుంచి పక్కకు వెళ్లి, మీ స్నేహితులను కలవండి. 
► కోపాన్ని నియంత్రించుకోవడంలో ఇతరులకు శిక్షణ ఇవ్వండి. ఇలాంటప్పుడు ఇతరులకు బోధించే మీరే... కోపాన్ని నివారించుకోవాలన్న స్పృహను అభివృద్ధి చేసుకుంటారు. 
►  సేవా కార్యకలాపాల్లో  ఉన్నప్పుడు కోపం కలగదు సరికదా... సంతోషం మరింత ఎక్కువవుతుంది.
► మీరు డ్రైవ్‌ చేస్తున్నప్పుడు ఇతరులు మిమ్మల్ని ఓవర్‌టేక్‌ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్లను ముందుగా వెళ్లనీయండి. వెళ్లనిచ్చేలా మనసుకు శిక్షణ ఇచ్చుకోండి. మన జీవననైపుణ్యాలకు ఈ గుణాన్ని అలవరిస్తే దీనితో జీవితంలోనూ చాలా మార్పులు వస్తాయి. ఫిలసాఫికల్‌గా మీరు చాలా ఉన్నత స్థానంలోకి చేరుతారు. మిమ్మల్ని అభిమానించేవారూ పెరుగుతారు. 
► మంచి సంగీతం, పాటలూ మిమ్మల్ని ఆహ్లాదపరుస్తాయి. 
►  కోపం వచ్చినప్పుడల్లా మరిన్ని అదనపు బాధ్యతలు తీసుకోండి. కసితో వాటిని పూర్తి చేయండి. 
►  మనస్తత్వ శాస్త్రానికి చెందిన కొత్త పుస్తకాలను వెతకండి. చదవండి. ఆసక్తికరమైన ఇతర మంచి పుస్తకాలూ చదవచ్చు. 
►హాస్యసంఘటనలు, హ్యూమర్‌ వీడియోలు, కార్టూన్లు, కామెడీ సినిమాలు చూడండి. 

మరిన్ని వార్తలు