కోతిబుద్ధి

13 Dec, 2017 23:59 IST|Sakshi

చెట్టు నీడ

ఒక నది ఒడ్డున పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మలపై రకరకాల పక్షులు గూళ్లు కట్టుకుని పిల్లాపాపల్తో హాయిగా జీవిస్తున్నాయి. మండే ఎండల నుంచి, కుండపోతగా పడే వానల నుంచి తరతరాలుగా ఆ చెట్టు ఆ పక్షులకు రక్షణ కల్పిస్తోంది. ఇలావుండగా, చలికాలంలో ఓ రోజు అకస్మాత్తుగా ఆకాశం నిండా మబ్బులు కమ్ముకున్నాయి. ఆహారం కోసం వెళ్లిన ఎక్కడెక్కడి పక్షులన్నీ వేగంగా వచ్చి చెట్టు మీదకు చేరుకున్నాయి. వెంటనే గాలీ వానా మొదలైంది. పక్షులన్నీ భద్రంతా తమ గూళ్లలో తలదాచుకున్నాయి. ఈ లోగా ఒక కోతుల గుంపు ఆ చెట్టు కిందికి చేరుకుంది. అవన్నీ బాగా తడిచి, వణుకుతున్నాయి. చెట్టుపై ఉన్న పక్షులు, చెట్టు కింద ఉన్న కోతుల్ని చూసి జాలి పడ్డాయి.

కొన్ని పక్షులు కిందికి వంగి చూసి, ‘‘ఓ వానరోత్తములారా.. ఎలా తడిసిపోయారో చూడండి. ఎలా ఒణికిపోతున్నారో చూడండి. మాకున్న చిన్న ముక్కుతోనే మేము ఈ గూళ్లు కట్టుకున్నాం. భగవంతుడు మీకు కాళ్లు, చేతులు కూడా ఇచ్చాడు. మాకన్నా మంచి ఇళ్లు మీరు కట్టుకుని ఉండవచ్చు కదా. ఇకనైనా కట్టుకోండి’’ అని హితవు పలికాయి. ఆ మాటకు కోతుల గుంపుకు కోపం వచ్చింది. ‘మనకే సలహా ఇస్తాయా! వాన తగ్గనివ్వు. తగిన శాస్తి చేద్దాం’ అనుకున్నాయి. వాన తగ్గింది. వెంటనే కోతులన్నీ చెట్టు పైకెక్కి పక్షులను తరిమేశాయి. పక్షి గూళ్లను పడగొట్టాయి. పక్షి గుడ్లను పగలగొట్టాయి. పక్షి పిల్లలను విసిరికొట్టాయి. పక్షులన్నీ లబోదిబోమన్నాయి.ఈ కథ హితోపదేశాలలోనిది. అడక్కుండా ఎవరికీ సలహా ఇవ్వకూడదని నీతి. మానవులలో కూడా కొందరికి ‘కోతి బుది’్ధ ఉంటుంది. కోతి బుద్ధి అంటే.. కోతుల బుద్ధి అని కాదిక్కడ. అడక్కుండా సలహా ఇచ్చిన పక్షుల బుద్ధి. ఇవాళ ‘వరల్డ్‌ మంకీ డే’.  ఈ సందర్భంగా కోతులను, మనుషులను  ప్రస్తావించుకోడానికే ఈ పక్షుల కథ.

మరిన్ని వార్తలు