టాప్‌ టెన్‌లో ఈ నలుగురు

5 May, 2018 00:05 IST|Sakshi

ప్రభాస్, మహేశ్‌బాబు, రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్‌.ఏంటీ కాంబినేషన్‌? మల్టీస్టారర్‌ వస్తోందా.. ఈ నలుగురితో! ఏమో రాదని చెప్పలేం. పోనీ, స్టార్‌ వార్‌ ఏమైనా వస్తోందా? ఇది చెప్పొచ్చు. ఎప్పటికీ రాదు. సౌత్‌లో ఎవరి పవర్‌ వారిదే. ఎవరి స్టార్‌డమ్‌ వారిదే. నో పోటీ.  పక్కా జెంటిల్మెన్‌.మరి.. ఈ నలుగురూ కలిసి ఎక్కడికైనా టూర్‌ కొడుతున్నారా? నలుగురూ కలిసి ఎందుకు కొడతారు? కొడితే ఇద్దరిద్దరుగా కొట్టాలి. పెళ్లయిన వాళ్లు, పెళ్లికాని వాళ్లు. ఇంకేంటీ? ఏ ఇండస్ట్రియలిస్ట్‌ కూతురి మ్యారేజ్‌కైనా ప్రత్యేక ఆహ్వానితులుగా వెళ్తున్నారా? నలుగురూ స్వచ్ఛ భారత్‌లోని నాలుగు స్కీములకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎన్నికయ్యారా? ఏవైనా అవార్డులు అందుకోబోతున్నారా? ‘లవర్‌ బాయ్స్‌’ అంటూ.. ఈ నలుగురి ఫ్యాన్స్‌ కామన్‌గా ఓ క్లబ్‌ స్టార్ట్‌ చెయ్యబోతున్నారా? ఇవేవీ కాదు. 

2017లో ‘మోస్ట్‌ డిజైరబుల్‌ మెన్‌’ ఎవరు అని ‘టైమ్స్‌’ పత్రిక దేశవ్యాప్తంగా సర్వే చేస్తే.. వచ్చిన యాభై మంది పేర్లలో సౌత్‌ నుంచి టాప్‌–10లో ఈ నలుగురూ ఉన్నారు. ప్రభాస్‌ ర్యాంక్‌ 2 అయితే, మహేశ్‌ 6, రానా 7, దుల్కర్‌ 9 ర్యాంక్‌లలో నిలబడ్డారు. (ఫస్ట్‌ ర్యాంక్‌ బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌కి వచ్చింది). ఇంతకీ ఈ నలుగురికీ ఎందుకంత పాపులారిటీ. స్టయిలిష్‌గా ఉంటారు. స్మయిలింగ్‌ లుక్‌ ఇస్తారు. డీసెంట్‌గా, డిగ్నిఫైడ్‌గా ఉంటారు. ఈ క్వాలిటీలు చాలవా! కామన్‌గా సరే. ఒక్కొక్కరికీ ఒక్కో క్వాలిటీ, ఒక్కో స్పెషాలిటీ ఉంది. అవేంటో చూద్దాం.

ప్రభాస్‌ :‘బాహుబలి’లో ప్రభాస్‌ శివలింగాన్ని ఎత్తినట్లుగా.. బాహుబలి చిత్రం ప్రభాస్‌ని దేశదేశాల్లో ఎత్తుకుని తిరిగి పాన్‌–ఇండియా స్టార్‌ని చేసింది. అంతేనా! ఇండస్ట్రీలోని మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్రహ్మచారులలో ప్రభాస్‌ ఒకరు. కో–స్టార్‌ అనుష్కతో లవ్‌ నడుస్తోందన్న రూమర్, ఓ పెద్దింటి అమ్మాయితో పెళ్లి కుదిరిందన్న న్యూస్‌ కూడా దేశంలోని చూపులన్నిటినీ ప్రభాస్‌ వైపు తిరిగేలా చేశాయి.
సడెన్‌గా ప్రభాస్‌ గ్లామర్‌ గ్రాఫ్‌ ఇంతగా పెరగడానికి కారణం.. బాహుబలి తర్వాత ప్రభాస్‌ కమర్షియల్‌ యాడ్స్‌ కూడా చేయడం, ఇప్పుడు వస్తున్న ప్రతి తెలుగు సినిమా బాలీవుడ్‌లోకి డబ్‌ అవడం. ఒక తెలుగు సినిమా మార్కెట్‌ గ్రాఫ్‌ ఎంతగా ఉందో ఇప్పుడు ప్రభాస్‌ మార్కెట్‌ను బట్టి తెలుస్తోంది. ప్రభాస్‌ చేస్తున్న ‘సాహో’ బడ్జెట్‌ 300 కోట్ల దాకా అవుతుందంటే అతని స్టామినా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇక తన సినిమా సమయంలో తప్ప బయట వెతికినా కనిపించని ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ అనే విషయం అందరికీ తెలిసిందే!
ఇవి కాక : ఎత్తుగా ఉంటాడు. అందంగా ఉంటాడు. మంచి ఫిజిక్‌.


మహేశ్‌బాబు : కామ్‌ అండ్‌ క్లెవర్‌. లాస్ట్‌ ఇయర్‌ విడుదలై నెమ్మదిగా మూవ్‌ అయిన ‘స్పైడర్‌’ కూడా మహేశ్‌ కెరియర్‌ని స్లో చెయ్యలేకపోయింది. టాలీవుడ్‌లో కిరీటం లేని ‘ప్రిన్స్‌’ మహేశ్‌కు పదమూడేళ్ల క్రితం నమ్రతతో పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా. అయినా క్రేజ్‌ తగ్గలేదు. పైగా సినిమా సినిమాకూ గ్లామర్‌తో పాటు ఇమేజ్, కమర్షియల్‌గా ఆయన వాల్యూ పెరుగుతోంది. తన సినిమాలు, కుటుంబం తప్ప వేరే ప్రపంచాన్ని పట్టించుకోని వ్యక్తి మహేశ్‌బాబు. ఎప్పుడు సమయం దొరికినా ఏదో ఒక దేశానికి ఫ్యామిలీతో వెళ్తుంటారు. అందుకే అంటారు ఆయన్ని ఫ్యామిలీ మ్యాన్‌ అని. అలాగే ఫిట్‌నెస్‌కు కూడా తగినంత సమయాన్ని కేటాయిస్తూ ఎప్పుడూ ఫిట్‌గా వుంటూ తన సినిమాకు ఎలా కావాలో అలా వుంటాడు మన ప్రిన్స్‌. కమర్షియల్‌ యాడ్‌ల గురించి అంటారా! మనవాడికి ఫుల్‌ నాలెడ్జ్‌. ఏ సీజన్‌లో అయినా టీవీ ఆన్‌ చేస్తే ఏదో ఒక యాడ్‌లో తళుక్కున మెరుస్తూనే వుంటాడు. ఇప్పుడు మహేశ్‌ చేసిన ‘భరత్‌ అనే నేను’ సినిమా మొదటిసారిగా 200 కోట్ల క్లబ్‌లో చేరనుండటం విశేషం. తెలుగు సినిమా స్టామినా మరోసారి రుజువైంది.
ఇవి కాక : నడక స్టయిల్‌గా ఉంటుంది. స్మైల్‌ ఛిల్లింగ్‌గా ఉంటుంది. మనసుకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. 

రానా దగ్గుబాటి :
బాహుబలిలో ‘భల్లాలదేవ’ క్యారెక్టర్‌తో ఇండియన్‌ సినిమాలో రానాకు ఒక గుర్తింపు వచ్చింది.  కానీ రానా మల్టీట్యాలెంటెడ్‌. ఎప్పుడూ ఒకే  రకమైన మూస సినిమాల ధోరణి కాకుండా, కొత్త ట్రెండ్‌కు తగినట్టుగా... ఒకసారి బాలీవుడ్‌లో, మరోసారి కోలీవుడ్‌లో హీరోలతో సంబంధం లేకుండా ఏ హీరోతో అయినా కో–ఆర్టిస్ట్‌గా సహకరిస్తూ ఉంటారు. ప్రతి రోజూ బిజీగా కనిపిస్తుంటాడు. సినిమాకు సంబంధించిన ప్రతి క్రాఫ్ట్‌తోనూ పరిచయం ఉన్న వ్యక్తి రానా. ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా మనిషిలో ట్యాలెంట్‌ ఉంటే చాలు ఆ వ్యక్తిని దగ్గరకు తీస్తాడు. అలాంటి ప్రతిభతో వచ్చిన చిన్న కుర్రాడు సంకల్ప్‌రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేసిన ‘ఘాజీ’ హీరో రానా. ఏ హీరోయిన్‌తో అయినా లవ్‌లో ఉన్నాడో లేదో కానీ ఒంటరిగా ఉంటున్నాడని, అతడి గుండె గది ప్రస్తుతం వేకెంట్‌గా ఉందని అనుకోవాలి మనం. ఎప్పుడు ఆ వార్త చెబుతాడో వెయిట్‌ అండ్‌ సీ (ఏ వార్త అనుకునేరు పెళ్లి వార్తండీ).
ఇవి కాక : కాలానుగుణమైన వ్యక్తిలా అనిపిస్తాడు. కాకా హోటల్‌లోనూ సెట్‌ అవుతాడు. ‘రన్‌వే’ స్పీడ్‌ యుగం మనిషిలానూ ఉంటాడు. అడ్జెస్ట్‌మెంట్‌ మెయిన్‌ క్యారెక్టర్‌. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతాడు.

దుల్కర్‌ సల్మాన్‌ :
మలయాళీ యాక్టర్‌. అంతకన్నా.. సన్నాఫ్‌ మమ్ముట్టీ. మలయాళ సూపర్‌ స్టార్‌ కొడుకన్నమాట. రెండేళ్ల క్రితం బాక్స్‌ బద్దలు చేశాడు. ఏ సినిమా అనుకుంటున్నారా? అదేనండీ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఓకే బంగారం’ సినిమాతో. మే 9న వస్తున్న ‘మహానటి’లో జెమినీ గణేశన్‌ నిజజీవిత పాత్రలో జీవించాడట! ఈ సంవత్సరం బాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఫ్యామిలీ గై. సోషల్‌ మీడియాలో భార్యతో, కూతురితో ఉన్న అతడి ఫొటోలు చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. అంత లవ్లీగా ఉంటాడు. 
ఇవి కాక : పసిపిల్లాడిలా నవ్వుతాడు. ఆ నవ్వుకు పడిపోతాం.
  

మరిన్ని వార్తలు