అమ్మంటే  ఇష్టం లేదు

3 Jan, 2019 00:00 IST|Sakshi

ఆడపిల్లకు ప్రమాదం, నష్టం జరిగడానికి వీలైన అన్ని పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఆ రెండుమూడు రోజులు గడిపింది. ప్రమాదం, నష్టం జరిగాయా? తెలియదు. కాని ఇంటికి రాగానే తల్లితో యుద్ధాలు. తల్లికి కూతురితో యుద్ధాలు.  

‘పదహారేళ్లంటే నీకేం తెలుసు. లోకం ఎలా ఉంటుందో తెలుసా? బయట ఎంత ప్రమాదమో తెలుసా? మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారో తెలుసా? అసలు ఏం తెలుసని ఇంట్లో నుంచి పారిపోయావ్‌? పైగా ఆడపిల్లవి’ ‘మాట్లాడవేం?’‘అవన్నీ నాకు తెలుసో లేదో తెలియదు. కాని ఒక్కటి మాత్రం బాగా తెలుసు’‘ఏంటది’‘మా అమ్మకు నేనంటే ఇష్టం లేదు. అందుకే నాకు మా అమ్మంటే ఇష్టం లేదు’ఆ జవాబుకు కన్సల్టేషన్‌ రూమ్‌లో నిశ్శబ్దం అలముకుందిఆ అమ్మాయికి అచ్చంగా పదహారేళ్లుంటాయి. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ బై.పి.సి ఇష్టమని చేరింది. కాని చదవదు. కాలేజ్‌కని వెళుతుంది. కాని వెళ్లదు. మాట విన్నట్టే కనిపిస్తుంది కాని వినదు. హుషారుగా ఉన్నట్టు అభినయిస్తుంది కాని నిజంగా హుషారుగా ఉండదు.‘నాకు చాలా బెంగ’ అని మెసేజ్‌ పెట్టింది ఫేస్‌బుక్‌లో కనిపించిన హైస్కూల్‌నాటి ఫ్రెండ్‌కి.‘నాకూ బెంగే’ అని కుర్రాడు అన్నాడు.‘మనిద్దరం కష్టసుఖాలు చెప్పుకుందామా?’ అని టైప్‌ చేసింది.‘అందుకేగా నీతో ఫ్రెండ్‌షిప్‌ చేస్తోంది’ అన్నాడు వాడు.ఆ అమ్మాయి తన తొలి కష్టం చెప్పుకుంది.‘మా అమ్మంటే నాకు ఇష్టం లేదు’‘నాకు మా నాన్నంటే ఇష్టం లేదు. ఎప్పుడూ తిడుతుంటాడు’ అన్నాడు వాడు.ఇలా కొన్నాళ్లు మాటలు నడిచాయి. ఇద్దరూ పెనుకష్టాల్లో ఉన్నారని ఆ కష్టాలకు ఇళ్లే కారణమని ఇళ్లలో నుంచి పారిపోతే పూర్తి కష్టాలు పోతాయని ఇద్దరూ అనుకుని పారిపోయారు.వైజాగ్‌ వెళ్లారు. అక్కడ ఏం చేయాలో తోచలేదు. అరకుకు వెళ్లి సాయంత్రం ఆ చీకటిని, తెలియని ముఖాలని చూసి బెంబేలెత్తారు. ఆ తర్వాత విజయవాడ వెళ్లారు. అక్కడి బస్‌ స్టేషన్‌లో ఆ అమ్మాయిని వదిలి ఇప్పుడే వస్తానని వాడు పారిపోయాడు. భయాన్ని తట్టుకోలేక ఇల్లు చేరాడని తర్వాత తెలిసింది. మొండి అమ్మాయి ఇంకో రోజు బెజవాడలోనిబస్టాండ్‌లో, రైల్వేస్టేషన్‌లో తిరిగి ఇల్లు చేరింది.ఆడపిల్లకు ప్రమాదం, నష్టం జరగడానికి వీలైన అన్ని పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఆ రెండుమూడు రోజులు గడిపింది. ప్రమాదం, నష్టం జరిగాయా?తెలియదు. కాని ఇంటికి రాగానే తల్లితో యుద్ధాలు. తల్లికి కూతురితో యుద్ధాలు. ఇలా ఎంతకాలం అని భార్యనూ, కూతురిని సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకొచ్చాడు తండ్రి.

ముందు ఎవరూ లేకుండా చేసి కూతురితో మాట్లాడాడు సైకియాట్రిస్ట్‌.‘ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను మా అమ్మ నాతో బాగుండదు. చీటికి మాటికి కోప్పడుతుంటుంది. కరెక్ట్‌ చేయాలని చూస్తుంటుంది. చూశారుగా నన్ను. కొంచెం పొట్టి. మా అమ్మా నాన్నల పక్కన ఎలుకపిల్లలా ఉంటాను వాళ్ల పర్సనాల్టీస్‌కి. అసలే కాన్ఫిడెన్స్‌ లేదు. చదువులో స్లో. ఫ్రెండ్స్‌ కూడా ఎక్కువ మంది నాతో కలవాలని అనుకోరు. ఇవన్నీ మా అమ్మకు డిస్‌శాటిస్ఫాక్షన్‌ అనుకుంటాను. అందుకని నాకు రిస్కీ ఫ్రెండ్‌షిప్స్‌ చేయడం అలవాటైంది. పక్కింటి అంకుల్‌తో, ఆటో అంకుల్‌తో, ఫేస్‌బుక్‌లో తెలియనివారితో ఇట్టే ఫ్రెండ్‌షిప్‌ చేస్తాను. తర్వాత వాళ్ల బిహేవియర్‌కి ఫ్రస్ట్రేట్‌ అవుతాను. ఒక ఫ్రెండ్‌తో ఇంట్లో నుంచి పారిపోతే వాడు కూడా నన్ను వదిలి పారిపోయాడు. నేను కోపంగా ఉంటానని మా అమ్మ అంటుంది. కాని మా అమ్మే కోపంగా ఉంటుంది. కాని సడన్‌గా ఒక డౌట్‌ వచ్చింది. ఏ తల్లీ సొంత బిడ్డతో ఇలా వ్యవహరించదు కదా... కొంపదీసి నేను ఈమెకు పుట్టలేదా? అని. అప్పుడు తెలిసింది...’‘ఏమని’‘నేను ఆమెకు పుట్టలేదు. మా పేరెంట్స్‌ నన్ను అడాప్ట్‌ చేసుకున్నారని. నాకు ఎనిమిదేళ్లప్పుడు ఆ సంగతి చెప్పారట..నాకు అర్థం కాలేదు... వాళ్లు ఆ సంగతి రిపీట్‌ చేయలేదు. టీనేజ్‌లోనే సరిగ్గా అర్థమైంది. ఇక ఇంట్లో ఎందుకుండాలి అనుకున్నాను’ ఆ అమ్మాయికి ఏడుపు తన్నుకొచ్చింది.సైకియాట్రిస్ట్‌ ఆ  అమ్మాయిని మనసారా ఏడవనిచ్చాడు.

ఇప్పుడు ఎవరూ లేకుండా సైకియాట్రిస్ట్‌ ఆ అమ్మాయి తల్లితో మాట్లాడాడు.‘డాక్టర్‌... మాది కలిగిన కుటుంబమే. కాని చిన్నప్పటి నుంచి సంతోషం లేదు. మా నాన్న డ్రంకర్డ్‌. అమ్మను నిత్యం బాధించేవాడు.వేధించేవాడు. అనుమానించేవాడు. భయంకరమైన గొడవలను చిన్నప్పటి నుంచే చూస్తూ పెరిగాను. అలాంటి జీవితం నా సంతానానికి రాకూడదనుకున్నాను. పెళ్లితో అయినా నా జీవితం బాగుపడుతుందని ఆశించాను. నా అదృష్టం నా భర్త చాలా మంచివాడు. దురదృష్టం నా అత్తమామలు తగువులమారి స్వభావం ఉన్నవారు. 18 ఏళ్లకు పెళ్లయితే చిన్నదాన్నని కూడా చూడకుండా అన్ని పనులూ నా నెత్తినేసి సుఖం లేకుండా చేశారు. దానికి తోడు పిల్లలు పుట్టలేదు. ఏమిటా దురదృష్టం అని డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. చిన్నప్పటి డిప్రెషన్‌ ఇప్పటి డిప్రెషన్‌ అంతా కలిసి పేషెంట్‌లాగా మారాను’‘తర్వాత?’ సైకియాట్రిస్ట్‌ అడిగాడు.‘అప్పుడు మావారే సర్దిచెప్పి అడాప్ట్‌ చేసుకుందామనుకున్నారు. అనాథ శిశుశరణాలయం నుంచి ఎనిమిది నెలల పాపను దత్తత తీసుకున్నాం. నాకు పిల్లలు ఇష్టమే. ఎన్నో కలలు కన్నాను పెంపకం విషయంలో. కాని పాప మా ఇద్దరికీ ఏ మాత్రం పొంతన లేని ఎత్తుతో పెరిగింది. తెలివితేటలు లేవు. దానికి తోడు ప్రవర్తన కూడా ఏమిటోగా ఉంది. దానిని కంట్రోల్‌ చేయబోయి దానిపట్ల గయ్యాళిగా మారాను. నేను ఎంత ప్రేమిద్దామనుకున్నా ఎందుకు నా బతుకు ఇలా అయ్యిందా అనే నెగెటివ్‌ ఆలోచన. నా జీవితం నరకంగా మారింది. నా భర్తతో కూతురితో ఆనందంగా నేను ఎలా గడపాలి?’... ఆమె కళ్లు ధారలు కట్టాయి.మనసును కుదుటపర్చడంలో కన్నీళ్లకు మించిన మందు లేదు.సైకియాట్రిస్ట్‌ ఆమెను కూడా గుండె తేటపడే
వరకు ఏడ్వనిచ్చాడు.

ఇప్పుడు గదిలో ముగ్గరూ ఉన్నారు. తల్లి కూతురు తండ్రి.సైకియాట్రిస్ట్‌ మాట్లాడటం మొదలుపెట్టాడు.‘చూడండి... చీకటి అంటే వెలుతురు లేకపోవడం కాదు. ఇంకా రాకపోవడం. ఇంకా చెప్పాలంటే ఉన్న వెలుతురును చూడకపోవడం. మీరిద్దరూ జీవితంలో నెగెటివిటీని చూడటానికే అలవాటు పడి జీవితం పట్ల రోత పుట్టించుకున్నారు. (తల్లివైపు చూస్తూ) బాల్యంలో మీరు తల్లిదండ్రుల కొట్లాటలు చూశారు. కాని మీరొక కలిగిన కుటుంబంలో పుట్టారని ఏ పోలియో బాధో అనారోగ్య సమస్యో దేవుడు మీకు ఇవ్వలేదని చదువు అబ్బని తెలివితక్కువతనం ఇవ్వలేదని సంతోషపడలేదు. పెళ్లయ్యాక వేధించే అత్తామామలను చూసి శోకించారు తప్ప ఒక్క లోపం లేని భర్త దొరికాడని ఆనందించలేదు. ముఖ్యంగా మీకు పిల్లలు పుట్టరు అని డాక్టర్లు తేల్చినా లోపం మీదేనని చెప్పినా మిమ్మల్ని పన్నెత్తు మాట అనని భర్తను చూసి జీవితాంతం సంతోషంగా బతకొచ్చని మీరు అనుకోలేదు. దత్తతకు కుమార్తె దొరికితే దానికీ సంతోషపడలేదు. కళకళలాడే ఆడపిల్ల అనుకోక రూపం గురించి, ర్యాంకుల గురించి బాధ పడ్డారు. ఒక్కసారైనా మీరు మీకు ఏమేమి ఉన్నాయో లిస్టు రాసుకుంటే అవి లేనివాళ్లు కోట్లమంది కనిపించి ఉండేవారు. మీ దృష్టి రుణాత్మకం కావడంతో వచ్చిన సమస్య ఇది’ అన్నాడు సైకియాట్రిస్ట్‌.ఆ తర్వాత కూతురి వైపు చూశాడు.‘చూడమ్మా... ఎందరో పిల్లలు అడాప్ట్‌ చేసుకునే తల్లిదండ్రులు లేక బాధపడుతుంటే మంచి తల్లిదండ్రులను నీకు దేవుడు ఇచ్చాడని నువ్వు కొంచెం కూడా సంతోషపడటం లేదు. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతగా లేవు. అమ్మ వేధిస్తుంది అంటున్నావే తప్ప నాన్న నిన్ను ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటున్నాడని మాటవరసకు కూడా అనలేదు. సొంత ఇల్లు, కారు, మంచి కాలేజీ ఇవి ఎంతమందికి ఉన్నాయి. అమ్మ సమస్య ఏమిటో తెలుసుకోకుండా అమ్మ మీద డిమాండ్స్‌ పెట్టి ఆమెను బాధపెట్టావు. మీది అన్నీ ఉండి ఎక్కువైన బాధ. అసలు ఒక కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు హాయిగా జీవనం సాగించే పరిస్థితుల్లో ఉన్నారన్న దానికి మించిన అదృష్టం ఏముంది? మీరు యుద్ధాలు జరిగే నేల మీద, భూకంపాలు వచ్చే చోట, కరువు తాండవించే చోట లేరని కర్ఫ్యూ మధ్య లేరని అప్పుల్లో లేరని తెలుసుకుంటే పోల్చి చూసుకుంటే మీ జీవితం ఎంత వరప్రసాదమో తెలుస్తుంది. అసలు ముందు మీకు ఉన్న గొప్ప పాజిటివ్‌ విషయాలేమిటో చెప్తూ వెళతాను. నెగెటివ్‌ విషయాలు వాటికవే దూదిపింజల్లా తేలిపోతాయి’ అన్నాడు సైకియాట్రిస్ట్‌.సెషన్స్‌ మొదలయ్యాయి.కొన్నాళ్లకు విడివిడిగా ఉన్న ఆ ముగ్గురు ఒక కుటుంబంగా బతకడం నేర్చుకున్నారు.
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

మరిన్ని వార్తలు