గోదారమ్మ నేర్పిన లౌకిక పాఠాలు

28 Jun, 2020 00:09 IST|Sakshi

రమణీయం – నేడు ముళ్లపూడి జయంతి

జర్నలిస్టుగా, కథారచయితగా, అనువాదకునిగా, సినీ రచయితగా, నిర్మాతగా ప్రజల హృదయాల్లో తనదైన ముద్రవేసుకున్న ముళ్ళపూడి వెంకట రమణ తన బాల్యంలో –రాజమండ్రి వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో సెకండ్‌ ఫారం చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటలను తన జీవిత చరమాంకంలో–80వ పడికి చేరువలో రాసిన స్వీయచరిత్ర ‘కోతికొమ్మచ్చి’లో వర్ణించారు. 1931 జూన్‌ 28న రాజమండ్రి ఆల్కాట్‌ గార్డెన్స్‌ ఆసుపత్రిలో రమణ జన్మించారు. భారత మాజీప్రధాని పి.వి.నరసింహారావు కూడా 1921 జూన్‌ 28న జన్మించారు. ‘అంటే నా కన్నా పదేళ్ళు (పి.వి) చిన్న అని నేను అన్నప్పుడు, ఆయన పకపకా నవ్వారు–ఎందుకో?’.. అని స్వీయచరిత్రలో రమణ  చమత్కార బాణం సంధించారు. చిన్నప్పుడు తాను పెరిగిన ఇంటిని గురించి, వాతావరణం గురించి, రమణ చెప్పిన మాటలు... మా ఇల్లు కోలాహలంగా ఉండేది.  గుమ్మంలో ఎప్పుడూ ఒక పందిరి. పందిట్లో హరికథలు, అవి లేనప్పుడు సావిట్లో కుసుమహరనాథ భజనలు, నట్టింల్లో దెయ్యాలను సీసాల్లో బిగించే ముగ్గుల పూజలూ, బైరాగులూ–పెరటి వసారాలో చుట్టాలూ వాళ్ళ చుట్టాలకి పెట్టుకునే తద్దినాలూ,  శాంతులూ, తర్పణాలూ.. మా నాన్న ఒకసారి ఆసుపత్రికి వెళ్లారు. ఇంక రారు అని చెప్పారు, అప్పుడు మా ఇల్లు చీకటైపోయింది...’

తలుపులు ఇంట్లో అన్నం తిన్నందుకు...
ఆకలని ‘బాల రమణ’ గోల చేస్తే, తలుపులు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి గంజిలో అన్నం కరుడు వేసి పెట్టేవాడట. ఈ సంఘటన ముళ్ళపూడి మాటల్లో... ‘వాళ్ళింట్లో వెడల్పయిన కంచుగిన్నె ఉండేది. వాళ్ళు ఆ కంచుగిన్నెను పీట మీద పెట్టి, తాము కింద కూర్చుని తినేవాళ్ళు. మా ఇంట్లో నాన్నా వాళ్ళు పీట మీద కూచుని నేల మీద కంచం పెట్టుకుని తినేవారు. ఒకసారి మా ఇంట్లో అన్నం దగ్గర కూర్చుని, పీట మీద కంచం పెట్టి, కింద కూర్చుని తినబోయాను. అమ్మమ్మ చూసింది – ‘అదేమిట్రా–పీట మీద కంచం’ అంది. ‘తలుపులూ వాళ్ళింట్లో ఇలాగే తింటారు – అన్నం దేవుడట కదా? అందుకని దీన్ని పీటమీద పెట్టి మనమే కింద కూచోవాలిట’ అన్నాను. ‘వాడింట్లో అన్నం తిన్నావా’ అంది అమ్మమ్మ. ‘కాదమ్మా, సద్ది కూడు..’ అన్నాను. ‘ఓరి గాడిదా! లే నూతి దగ్గిరికి పద’ అంటూ ఈడ్చుకెళ్ళి చేదతో నీళ్ళు తోడి నెత్తిమీద దిమ్మరించింది... సీన్‌ కట్‌ చేస్తే–1969. నేస్తం బాపుతో కలసి ‘బుద్ధిమంతుడు’ సినిమా తూర్పుగోదావరి జిల్లా, పులిదిండి గ్రామంలో తీసారు.

పరిమనిష్ఠాగరిష్ఠుడైన మాధవాచార్యులు అన్నగారు –మద్యం, మగువలతో కాలక్షేపం చేసే గోపాలాచార్యులు ఉరఫ్‌ గోపి తమ్ములుంగారు. అన్నగారికి నిరంతరం ఆలయంలోని కృష్ణపరమాత్మకు తన కష్టసుఖాలు చెప్పుకోవడం రివాజు, తమ్ముడు వర్ణాంతర వివాహానికి సిద్ధపడ్డాడని తన ఆవేదనను నల్లనయ్యతో చెప్పుకుంటాడు. ‘వాడు పూర్తిగా చెడిపోయాడు. తగని సావాసాలు చెయ్యడమే కాకుండా, వర్ణాంతర వివాహానికి, వర్ణ సంకరానికి సిద్ధమయ్యాడు. వాడిని వెలివేసాను’ చిరునవ్వుతో కృష్ణుడికొంటె ప్రశ్న–మాధవయ్యా! మరి నిన్నెవరు వెలివేయాలి?’ ఇంత నిష్ఠాగరిష్ఠుడిని–నన్నే కృష్ణుడు ఇలా ప్రశ్నిస్తాడా? అని....‘ఎందుకూ?’ అమాయకంగా కృష్ణుడిని ప్రశ్నించాడు. ‘నీవు వర్ణసంకరం చేయడం లేదా? నేను క్షత్రియుల ఇంట పుట్టానని, యాదవుల ఇంట పెరిగానని నీకు తెలియదా? నన్ను నీ ఇంటిలోనే నిలుపుకుని నా ప్రసాదం కళ్ళకద్దుకుని తింటున్నావే? నిన్నెవరు వెలివేయాలి?.’ – వారణాసి సుబ్రహ్మణ్యం, సాక్షి, రాజమహేంద్రవరం కల్చరల్‌

గోదావరి గట్టుపై బాపురమణలు

మరిన్ని వార్తలు