అంతిమ సంస్కారం

24 Oct, 2018 00:12 IST|Sakshi
మామ చితి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న రెహానా

పుట్టుకకు చావుకు ఉందా ధర్మం
వ్యాధికీ బాధకూ  ఉందా మతం
నీటికీ నిప్పుకూ ఉందా భేదం
మనుషులందరికీ అంతిమంగా ఉండాల్సింది సంస్కారం...

ఆ యువతి ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది... కట్టుకున్న భర్తతోపాటు, మామ కూడా మంచానికే పరిమితమైనా.. మొక్కవోని దీక్షతో వారిద్దరికీ సపర్యలు చేస్తూ... ఉన్న ఒక్కగానొక్క ఇంటిని తాకట్టు పెట్టి, వారిద్దరి వైద్యానికి ఖర్చు చేసింది. ఈ కష్టానికి ముప్పులా ఆదివారం (అక్టోబర్‌ 21) ఆమె మామ మృతి చెందాడు. మృతదేహాన్ని తమ సొంతింటికి తీసుకురాగా, దానిని తాకట్టు పెట్టుకున్న వ్యక్తి అడ్డుగా నిలిచాడు. శవాన్ని ఇంట్లోకి తీసుకురావడానికి వీల్లేదు అన్నాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్నవారంతా ఏకమై, వారి బాకీని వారంలోగా తీరుస్తామని హామీ ఇవ్వడంతో, మృతదేహాన్ని ఇంట్లోకి రానిచ్చాడు. ఆ తర్వాత ఆ యువతే కొడుకులా నిలిచి, హిందూ ధర్మం ప్రకారం తానే బద్దె వేసుకుని, కాటివరకూ వచ్చి, శ్మశానంలో తన మామకు తలకొరివి పెట్టింది. టీవీ సీరియళ్లలో దుర్మార్గమైన కోడళ్లను చూపుతున్న ఈ కాలంలో ఈ కోడలు అందరికీ ఆదర్శంగా నిలిచింది.

ఏం జరిగింది?
గూడూరు గమళ్లపాళానికి చెందిన పర్వతాల రమణయ్య, రమణమ్మల ఏకైక కుమారుడు శ్రీనివాసులు. తండ్రి రమణయ్య చెన్నై దుకాణదారులకు అవరసమైన వస్తు సామాగ్రిని తీసుకొచ్చి అందజేస్తూ సీజ  వ్యాపారం చేస్తుండేవారు. శ్రీనివాసులు కూడా తండ్రికి చేదోడుగా, అప్పుడప్పుడూ చెన్నై వెళ్లి అవసరమైన వారికి సామాగ్రిని తీసుకొస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో  కొన్నేళ్ల క్రితం తల్లి రమణమ్మ క్యాన్సర్‌ వ్యాధితో మృతి చెందింది. దాంతో తండ్రి బాగోగులు కొడుకు శ్రీనివాసులు ఒక్కడే చూసుకుంటూ ఉన్నాడు.రెండేళ్ల క్రితం శ్రీనివాసులుకు రెహానా అనే యువతితో పరిచయమై, అది కాస్త ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. కోడలిగా ఆ ఇంట అడుగు పెట్టిన రెహానా ఇంటిని చక్కదిద్దే పనిలో పడింది. అయితే ఏడాది క్రితం రమణయ్యకు కూడా క్యాన్సర్‌ వ్యాధి సోకింది. కొత్త కోడలు మామ సేవలను చూసుకుంటూ ఉండగా,  శ్రీనివాసులు సీజ¯Œ  వ్యాపారం చేస్తూ ఇల్లు లాక్కొచ్చేవాడు. విధికి అంతటితో సంతృప్తి కలగలేదు. మూడు నెలల క్రితం శ్రీనివాసులు కూడా అనారోగ్యానికి గురయ్యాడు.రోజురోజుకూ శుష్కించిపోతూ మంచం పట్టాడు. దీంతో రెహానాకు ఏం చేయాలో తెలీక కుంగిపోయింది. డబ్బు అవసరమయ్యింది. అదే ప్రాంతంలో ఉన్న ఓ వ్యక్తికి తాముంటున్న ఇంటిని తాకట్టుపెట్టి 3 లక్షలు తీసుకుని, భర్తతోపాటు, మామకూ వైద్యం చేయిస్తూ బతుకుబండిని లాక్కురాసాగింది. ఇంతలో మరో అశనిపాతం. ‘‘ఇకపై మీరు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెంటనే ఖాళీ చేయాల్సిందే’’నని ఇంటిని తాకట్టు పెట్టుకున్న వ్యక్తి కరాఖండీగా చెప్పాడు. చేసేదిలేక రెహానా, తన మామ రమణయ్యతోపాటు, శ్రీనివాసులును తీసుకుని నెల్లూరుకు వెళ్లి, అక్కడ ఇంటిని అద్దెకు తీసుకుని, ఉన్న కాస్త డబ్బుతో మామ, భర్తలకు వైద్యం చేయిస్తూ బతుకుతోంది. ఈ క్రమంలో ఆదివారం రమణయ్య తీవ్ర అస్వస్థతకు గురవడంతో, తిరుపతికి తీసుకెళ్లింది. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రమణయ్య ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో రెహానా బతుకులో చీకట్లు మరింత చిక్కనయ్యాయి.

ఒకవైపు మంచంలో ఉన్న భర్త, మరోవైపు మృతి చెందిన మామ... చేసేది లేక నెల్లూరులోని అద్దె ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్తే రానివ్వరని, అంబులెలో గూడూరుకు తీసుకొచ్చింది. తాము తాకట్టుపెట్టిన ఇంటిని అద్దెకు ఇచ్చి ఉన్నారని తెలియడంతో, రమణయ్య పార్ధివ దేహాన్ని ఎక్కడ ఉంచి అంత్యక్రియలు చేయాలా... అని ఆందోళనకు గురైంది. ఈలోపు ఆ ప్రాంతంలో ఉన్నవారికి సంగతి తెలిసింది. వారంతా రమణయ్య మృతదేహాన్ని సొంతింటికే తీసుకురావాలని సలహా ఇచ్చారు. దాంతో మృతదేహాన్ని అక్కడికి తీసుకొచ్చారు. ఈలోగా ఇల్లు తాకట్టుపెట్టుకున్న వ్యక్తికి సమాచారం అందడంతో అక్కడకు వచ్చాడు.మృతదేహాన్ని  ఇంట్లోకి అనుమతించనంటూ తలుపునకు అడ్డుగా నిలుచున్నాడు. అది న్యాయం కాదంటూ కొందరు చెప్పిచూశారు. కొంత వాగ్వివాదం జరిగాక కూడా ఇంట్లోకి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఆయన ససేమిరా అన్నాడు.  ఆ ఇంటి పక్కనే  రమణయ్య సోదరులూ ఉన్నారు. ‘‘మీరైనా ఇంట్లోకి రానివ్వ’’మంటూ రెహానా ఎంతో ప్రాధేయపడింది. అయినా వారికి కనికరం కలగలేదు.మా ఇంట్లోకి రానివ్వమని తెగేసి చెప్పారు. దీంతో ఆ ప్రాంతంలోని వారంతా కలసి, ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా వారిపై ఎలాంటి కనికరం చూపించకుండా, తానేమీ చేయలేనని పోలీసు కేసు పెట్టుకోండంటూ పంపేశారు. దీంతో చేసేది లేక, అర్ధరాత్రి వరకూ ఆ ఇంటి బయటే మృతదేహాన్ని ఉంచారు. దాంతో ఆ ఇంట్లో అద్దెకున్నవారు వెళ్లిపోయారు. ఇంత జరిగినా తాకట్టుపెట్టుకున్న వ్యక్తి మాత్రం తాను వెళ్లిపోకుండా గడియపెట్టుకుని ఇంట్లోనే ఉండిపోయాడు. ఇదంతా చూస్తూ ఉన్న ఇరుగుపొరుగు వాళ్ల మనసు కరిగింది. వారు అతడిని పిలిచి... ఎలాగోలా డబ్బు సర్దుబాటు చేస్తామని, ఇలా శవాన్ని బయట ఉంచడం బాగుండదని, ఈలోపు తమదీ పూచీ అని హామీ ఇవ్వడంతో శవాన్ని ఇంట్లోకి రానిచ్చాడు. 

హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసిన రెహానా
ముస్లిం యువతి అయిన రెహానా తన మామకు సోమవారం సాయంత్రం హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపించింది. ఆమే కుమారుడిలా బద్దె వేసుకుని, ఇంటి నుంచి శ్మశాన వాటిక వరకూ వెళ్లింది. అక్కడ హిందూ ధర్మం ప్రకారం తానే తలకొరివి పెట్టి, అంత్యక్రియలు జరిపించింది. మధ్యలో దింపుడు కళ్లం వద్ద కూడా మామ పేరును తానే మూడుసార్లు పిలవడం, అక్కడున్నవారందర్నీ కంటతడి పెట్టించింది. ఈ సంఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ‘‘ఇదిరా ప్రేమంటే. కలసిన మనసులకు ఉదాహరణ ఆ దంపతులేరా’’ అంటూ రెహానాను చూసి కంటతడి పెట్టారు. ఆ సంఘటనకు చలించిపోయిన ఆ ప్రాంతంలోని వారంతా కూడా సాయం అందించి రెహానాకు బాసటగా నిలిచారు. యావత్‌ స్త్రీ జాతికే రెహానా ఆదర్శమంటూ కొనియాడారు. దాతలు ముందుకొచ్చి ఆ త్యాగమూర్తికి సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
– పుచ్చలపల్లి శ్రీనివాసులురెడ్డి,  సాక్షి, గూడూరు
 

మరిన్ని వార్తలు