బిజినెస్‌ను పండిస్తోంది

10 May, 2018 23:45 IST|Sakshi
ఆగ్రోప్రెన్యూర్‌ నీహారిక భార్గవ

లండన్‌ బిజినెస్‌ స్కూల్లో చదివి, ఢిల్లీలో పెద్ద ఉద్యోగం చేసి.. రోటీన్‌ లైఫ్‌తో విసుగెత్తిపోయి, సొంత ఊరికి వెళ్లి వ్యవసాయం మొదలుపెట్టిన ఈ అమ్మాయి.. సేంద్రియ ఎరువులతో వంటింటి దినుసులను సాగు చేస్తూ లాభాల పంట పండించుకుంటోంది!

నీహారిక భార్గవ పాతికేళ్ల అమ్మాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఓ మారుమూలనున్న పహర్‌పూర్వ గ్రామం ఆమెది. భారతీయ పురాతన నగరం ఖజురహోకి 15 కి.మీ. దూరంలో ఉంటుంది పహర్‌పూర్వ. కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన వాతావరణంలో పెరిగింది నీహారిక.  లండన్‌లోని కాస్‌ బిజినెస్‌ స్కూల్లో మార్కెటింగ్‌లో కోర్సు చేసింది. కొద్ది నెలలు డిజిటల్‌ మార్కెటింగ్‌ కంపెనీలో ఉద్యోగం చేసింది. ఆమె అదే ఉద్యోగంలో కొనసాగి ఉన్నా, అలాంటి మరొక కంపెనీకి మారి ఉద్యోగం చేస్తూ ఉన్నా.. ఆమె గురించి ఇంత మంది చెప్పుకునేవాళ్లు కాదు. ‘జీవితం అంటే ఇది కాదు’ అనిపించిందో రోజు నిహారికకు! ‘నిద్రలేచామా, ఆఫీస్‌కెళ్లామా, ఉద్యోగం చేసుకున్నామా, నెల ఆఖరున జీతం తీసుకున్నామా.. అనేది కాదు జీవితం. ఉద్యోగం కంటే గొప్పగా మరేదైనా చేయాలి’ అనుకుంది. ‘నేనిది చేశాను, ఇది నేను సాధించిన విజయం’ అనేటట్లు ఉండాలి అనుకుంది. ఆ అనుకోవడమే ‘ద లిటిల్‌ ఫార్మ్‌ కంపెనీ’ ఆవిర్భావానికి కారణమైంది.

ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు
తన మదిలో రూపుదిద్దుకున్న చిట్టి వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించడానికి.. పుట్టిన నేలను వదిలి ఎక్కడికో పరుగులు తీయాల్సిన అవసరం ఏ మాత్రం లేదనుకుంది నీహారిక. సొంతూర్లో కొంత పొలం ఉంది. ఆ పొలమే తన వ్యాపారానికి గొప్ప వనరు అనుకుంది. ఆ పొలంలో పండించిన పంటలే తన పరిశ్రమకు ముడిసరుకు అని తీర్మానించుకుంది. మనిషి పుట్టినప్పటి నుంచి పోయే వరకు ప్రతి రోజూ తప్పకుండా చేసే పని మూడు పూటలా తినడమే. ఏ పని చేసినా చేయకపోయినా వంట గదిలో స్టవ్‌ వెలగక తప్పదు. అందుకే నేరుగా వినియోగదారుల ఇంటి డైనింగ్‌ టేబుల్‌ మీదకు వెళ్ల గలిగితే ఇక ఆ వ్యాపారానికి తిరుగుండదనుకుంది.

పంట.. వంట
ద లిటిల్‌ ఫార్మ్‌ కంపెనీ ఉత్పత్తులకు ముడి సరుకును నీహారిక తమ పొలంలోనే సహజ పద్ధతుల్లో పండిస్తోంది. ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ అన్నమాట. పచ్చళ్ల కోసం పండించే కూరగాయలు, పండ్లు మాత్రమే కాదు.. వాటిలో వాడే ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, అల్లం, పచ్చిమిర్చి వంటివన్నీ తన పొలంలోనే పండిస్తోంది. సోడియం తక్కువగా ఉండే ఉప్పు, సల్ఫర్‌ వేయని బెల్లం తయారవుతోంది. వాటితో పచ్చళ్లు, జామ్‌లు, మార్మలేడ్‌లు (జామ్‌లు) తయారు చేస్తోంది. చెరకు రసం మాత్రం బయటి రైతుల నుంచి తీసుకుంటోందామె. ఆమె కంపెనీకి ఆర్గానిక్‌ ఫుడ్‌ సర్టిఫికేట్‌ కూడా వచ్చింది. నీహారిక దగ్గర పదిహేను మంది మహిళలు, ముగ్గురు మగవాళ్లు పని చేస్తున్నారు. పొలంలో కాయలను కోసిన తర్వాత వెంటనే నీటితో శుభ్రం చేయడం, ఎండలో ఆరబెట్టడం, ముక్కలు తరగడం జరిగిపోతాయి. పండ్లు, కాయలను కోసిన తరవాత రెండు గంటల్లో పచ్చడి, జామ్‌ల ప్రాసెస్‌లోకి వెళ్లిపోతాయి. ఆరబెట్టడానికి మెషీన్‌లలో వేడి చేయరు, ఎండకు ఆరాల్సిందే. పొడుల కోసం గ్రైండర్‌ తప్ప మరే యంత్రమూ ఉండదు ఆ యూనిట్‌లో. ‘మా ఉత్పత్తులను ఒకసారి రుచి చూసిన వాళ్లు మరోసారి మా ప్రొడక్ట్స్‌ కావాలని అడిగేటట్లు నాణ్యత పాటించటమే మా బిజినెస్‌ ఫిలాసఫీ’ అంటుందామె. నీహారిక యూనిట్‌ స్థాపించిన పహర్‌పూర్వ మధ్యప్రదేశ్‌లో బాగా వెనుకబడిన ప్రాంతం. అక్కడ మరే పరిశ్రమా లేదు. దాంతో కాలుష్యమూ లేదు. నీహారిక పరిశ్రమ స్థానికంగా ఉపాధి కల్పనకు పెద్ద అవకాశంగా మారింది. ప్రభుత్వం అడవికి సమీపంలో ఉన్న నాలుగు వందల ఎకరాలను లిటిల్‌ ఫార్మ్‌కి లీజుకిచ్చింది. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడం, ఆ పంటతో సహజమైన పద్ధతుల్లో వంట చేయడం నీహారిక ప్రాజెక్ట్‌ ఉద్దేశం. ఇప్పుడామె విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో యూనిట్‌ విస్తరణలో నిమగ్నమైంది.

రెండేళ్లలోనే లాభాలు
‘గృహిణి ఇంట్లో వంట చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ వంటను తినేది ఇంట్లో వాళ్లు, ఇంటికొచ్చిన బంధువులు, స్నేహితులే అయి ఉంటారు. అందుకే గృహిణి వంటను అంత జాగ్రత్తగా చేస్తుంది. మన ఆహారోత్పత్తులను తినే వాళ్లు కూడా మనకు బంధువులు, స్నేహితులే. ఆ బంధువులతో బాంధవ్యాన్ని ఎల్లకాలం కొనసాగేటట్లు ఉండాలి మన ఆతిథ్యం. మన అతిథులు మన వినియోగదారులే’ అని చెప్తుంది నీహారిక తన ఉద్యోగులతో. అంత అంకితభావంతో చేయడం వల్లనే రెండేళ్లు కూడా నిండని కంపెనీ బ్రేక్‌ ఈవెన్‌ దాటి లాభాల బాట పట్టింది. 
– మంజీర

మరిన్ని వార్తలు