ఎన్నారై టార్చర్‌ : రోజుకు మూడు కాల్స్‌

6 Feb, 2018 00:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం 

మీ అమ్మాయిని ఎన్నారైకి ఇచ్చి చేస్తున్నారా? అయితే ఆలోచించండి. ఢిల్లీలోని మన ‘విదేశీ వ్యవహారాల మంత్రిత్వ’ శాఖకు (ఎంఈఏ) ప్రతి 8 గంటలకు ఒకసారి వినిపిస్తున్న ‘ఆక్రందన’ల్లో మీ అమ్మాయిదీ ఒకటి కాకుండా జాగ్రత్త పడండి. నా భర్త నన్నొదిలేశాడు. నా భర్త నా పాస్‌పోర్ట్‌ దాచేశాడు. నా భర్త నన్ను హింసిస్తున్నాడు. నా భర్త డబ్బు తెమ్మంటున్నాడు. నా భర్త నా బిడ్డను తీసేసుకున్నాడు. నా భర్త నన్ను వెళ్లగొట్టాడు. ఇవన్నీ.. సహాయం కోసం ఎన్నారై భార్యల నుంచి ఎంఈఏ కి అందిన, నేటికీ అందుతున్న ఫిర్యాదులు! 2015 జనవరి 1 నుంచి 2017 నవంబర్‌ 30 వరకు.. 1,064 రోజులలో ఇలా ఆ శాఖకు 3,328 ఫిర్యాదుల కాల్స్‌ అందాయి.

అంటే రోజుకు సగటున మూడు కన్నా ఎక్కువ కాల్స్‌. ప్రతి ఎనిమిది గంటలకు ఒక కాల్‌! ఇదికాదు అసలు విషయం. కాల్‌ చేసినవాళ్లలో ఎక్కువమంది ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల ఎన్నారైల భార్యలేనట. ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌’ ఈ వివరాలను వెల్లడించింది. వాషింగ్టన్‌లో భారతీయ రాయబారిగా వివిధ హోదాలలో 16 ఏళ్లు పనిచేసిన ఆర్తీరావ్‌ కూడా.. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో వరకట్న దురాచారం బలంగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం అని అభిప్రాయపడుతున్నారు.

అబ్బాయి విదేశాలనుంచి వస్తాడు. అక్కడేదో మంచి ఉద్యోగం చేస్తున్నాడంటాడు. తల్లిదండ్రుల్ని వెంటేసుకుని వెళ్లి అమ్మాయిని సెలక్ట్‌ చేసుకుంటాడు. అమ్మాయి తల్లిదండ్రులకు ఆశ చూపి పెళ్లి చేసుకుంటాడు. తనతో పాటు విదేశానికి తీసుకెళతాడు. అక్కడ టార్చర్‌ మొదలుపెడతాడు. ఇదండీ.. ట్రెండ్‌! అందరూ అలా ఉంటారా? ఉండకపోవచ్చు. మన కర్మకాలితే అలాంటి వాడు మనమ్మాయినే వెతుక్కుంటూ రావచ్చు. సందేహించడం తప్పుకాదు. ఏదో ఒక ఉద్యోగంలే, ఎవరో ఒకరులే అని సర్దుకుపోవడం తప్పు. 

మరిన్ని వార్తలు