లోపలి శత్రువులను జయించాలి!

18 Jul, 2017 23:43 IST|Sakshi
లోపలి శత్రువులను జయించాలి!

అర్జునునికి శత్రుపక్షంలోని వారందరూ బంధువులు, గురువులు అని తెలిసినప్పటికీ, వారిని జయించాలనే ఉద్దేశంతోనే యుద్ధరంగంలోకి అడుగుపెట్టాడు. అయితే వారందరినీ చూడగానే మమకారం పెల్లుబికి, నిస్సహాయుడయ్యాడు, నిలువెల్లా విషాదం ఆవరించడంతో యుద్ధం చేయలేనని వెనుదిరిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించినదే శ్రీమద్భగవద్గీత. ఇంతకీ గీత ఏమంటోందంటే... పుట్టిన ప్రతిప్రాణికీ మరణం తప్పదు, మరణించిన వానికి తిరిగి జన్మించడమూ తప్పదు, అనివార్యమైనదీ, నిశ్చితమైనదీ అయిన జనన మరణ చక్రంలో పడి కొట్టుమిట్టాడే వారి కోసం దుఃఖించడం సరికాదు అంటాడు శ్రీకృష్ణుడు.

అంటే చనిపోయేది ప్రాణి మాత్రమే, ఆత్మ కాదు. మనం ఎవరయితే మరణించారని అనుకుంటున్నామో ఆ మరణించింది భౌతిక సమ్మేళనాలే కాని, చైతన్యరూపంలో ఉండే ఈ ఆత్మ మాత్రం కాదు. ముండకోపనిషత్‌ ప్రకారం ఆత్మ అనేది ప్రతి జీవి హృదయంలో ఉండి అక్కడి నుంచి శక్తిని ప్రసరింప చేస్తూ ఉంటుంది. ఈ చైతన్య ప్రసారం ఆగినప్పుడే దేహం నిర్జీవమవుతుంది. శరీరం నశించినా ఆత్మ మరణించదు. కనుక ఆత్మ నిత్యం, సత్యం, శాశ్వతం, పురాతనం అయినది. ఇది తెలిసిన వాడు జ్ఞాని. మానవుడు చిరిగిపోయిన పాతవస్త్రాలను వదిలి నూతన వస్త్రాలను ధరించినట్లే నాశన రహితమైన ఆత్మ జీర్ణమైన శరీరాన్ని వదిలి నూతన శరీరాన్ని ఆశ్రయిస్తుంది. ఇప్పుడు యుద్ధం లేకపోవచ్చు కానీ, అంతఃశత్రువులున్నారు. కామక్రోధలోభమోహమదమాత్సర్యాలే ఆ శత్రువులు. ఆ శత్రువులను జయించడం కోసమైనా గీతను ఆకళింపు చేసుకోవడం, అందులోని సూత్రాలను ఆచరించడం అవసరం.

మరిన్ని వార్తలు