చర్చినే కాదు, జీవితాన్నీ సరిగ్గా కట్టుకోవాలి

18 Dec, 2016 00:30 IST|Sakshi
చర్చినే కాదు, జీవితాన్నీ సరిగ్గా కట్టుకోవాలి

యూదా రాజైన యోవాషు జీవితం దేవుని అద్భుతాలకు ప్రతిరూపం. అతల్యా అనే దుర్మార్గురాలు యూదా రాజవంశీయులందరినీ చంపి ఆ దేశాన్ని పాలిస్తున్న కాలంలో, యోవాషును దేవుడు పసివాడుగా ఉండగానే కాపాడాడు. ప్రధాన యాజకుడైన యెహోయాదా భార్య ఏడాది కూడా నిండని యోవాషును కాపాడి దేవుని మందిరంలోనే అతన్ని దాచింది. అప్పటికే మందిరం ప్రజల నిరాదరణకు గురై పాడుదిబ్బగా మారడంతో ఎవరూ దానివైపు కనీసం కన్నెత్తి చూడటం లేదు. అందువల్ల యోవాషును ఉంచడానికి అదే సురక్షిత స్థలమయింది. అతల్యా హతమైన తర్వాత యెహోయాదా పర్యవేక్షణలో ఏడేళ్లకే యోవాషు యూదా దేశాన్ని ఏలడం ఆరంభించాడు. ప్రధాన యాజకుడు భక్తిపరుడైన యెహోయాదా సూచనల మేరకు యోవాషు ఎంతో దైవభయంతో జీవించాడు, పాలించాడు.

ప్రజల నుండి ద్రవ్యం పోగుచేసి మందిర పునరుద్ధరణ కార్యం ఆరంభించాడు. ఆరాధనలు, దహనబలులు నిరంతరం జరిగే పూర్వవైభవాన్ని మందిరానికి తెచ్చాడు. పునరుద్ధరణ తర్వాత ఇంకా డబ్బు మిగిలితే ఆలయానికే కొత్త బంగారు, వెండి వస్తువులు చేయించాడు. ఈలోగా ప్రధాన యాజకుడైన యెహోయాదా 130 ఏళ్ల వయసులో మరణించాడు. అప్పటినుండి మార్గనిర్దేశం చేసేవారు లేక యూదా రాజ్యప్రజలు, యోవాషు కూడా దారి తప్పి దేవతాస్తంభాలు స్థాపించి విగ్రహారాధనలు ఆరంభించారు. ఆ విధంగా ఆత్మీయంగా పతనమయ్యారు. యూదా రాజ్యాన్ని తలుచుకుంటేనే జడిసిపోయే సిరియా సైన్యం, చిన్న గుంపుతో వచ్చి దాడి చేసి అసంఖ్యాకమైన యూదా సైన్యాన్ని ఓడించింది. నిజమే, ఆత్మీయంగా పతనమైనప్పుడు, చిన్న సవాళ్లు, చిన్నవాళ్లే విశ్వాసులకు పెనుసవాళ్లుగా మారడం చూస్తూంటాం.

దుర్మార్గతను వాడమని చెప్పడానికి దేవుడు యెహోయాదా కుమారుడైన జెకర్యానే వారికి ప్రవక్తగా పంపాడు. అతడు వారిని చాలా గట్టిగా హెచ్చరించాడు కూడా! అయితే యెహోయాదా అతని కుటుంబం తనకు చేసిన మేలు మర్చిపోయి, యోవాషు రాజు జెకర్యాను రాళ్లతో కొట్టించి చంపించాడు. అలా దేవునికి రోజు రోజుకూ దూరమై చివరికి 47 ఏళ్ల వయసులోనే తీవ్రమైన రుగ్మతలకు లోనై మరణించాడు. అయితే అతని దుర్మార్గతను బట్టి, రాజుల సమాధులుండే స్థలంలో కాక ప్రజలతన్ని మరోచోట పాతిపెట్టారు (2దిన 23–24). అత్యద్భుతంగా సాగి ఎంతో వైభవంగా ముగియవలసిన యోవాషు జీవితం అలా అర్ధాంతరంగా అధ్వానంగా ముగిసింది. శిథిల మందిరాన్ని తిరిగి కట్టగలిగిన యోవాషు అతి ప్రాముఖ్యమైన తన జీవితాన్ని కట్టుకోవడంలో విఫలమయ్యాడు.

మందిరాన్ని నిర్మిస్తే చాలు దేవుడు నాకు వంద మార్కులు వేస్తాడనుకున్నాడు యోవాషు. కాని దేవుడు చూసేది, చూసి ఆనందించాలనుకునేది తన జీవితాన్ని అన్న చిన్న వాస్తవాన్ని మర్చిపోయాడు. చర్చిలైనా మరే ఆరాధనా స్థలాలైనా, అక్కడి పవిత్రతను ప్రాంగణాల్లో కాదు, భక్తుల హృదయాల్లో దేవుడు చూస్తాడు. ఆదివారం నాడు ఆరాధనలో కనిపించే పరిశుద్ధత సోమవారం నుండి శనివారం దాకా విశ్వాసుల జీవితాల్లో లోపిస్తే, ఆ ఆరాధనకు దేవుని దృష్టిలో విలువ లేదు. పాలరాతితో చర్చిని నిర్మించిన వారి గుండెల నిండా పాపాల గుట్టలు పేరుకు పోయివుంటే దేవుడు చర్చిని చూసి మురిసిసోవాలా, భక్తుల్ని చూసి బాధపడాలా?
– రెవ.డాక్టర్‌ టి.ఎ. ప్రభుకిరణ్‌
 

మరిన్ని వార్తలు