ఉరికోత

16 Sep, 2017 00:14 IST|Sakshi
ఉరికోత

ప్రాణం తియ్యడం ప్రాణం తీస్తుంది.
ఉరివేస్తే గుండె కోస్తుంది.
ప్రాణం ఒకరికి పోతే...
మరణం ఇంకొకరికి వస్తుంది.
మరి శిక్ష ఎవరికి పడినట్టు ?
పోయినవాడికా? తీసినవాడికా?


నేరము–శిక్ష పై స్టోరీ కాదు ఇది.
ఉరి కరెక్టా కాదా.. అన్న డిస్కషనూ కాదు.
పాత ఫ్రెంచి సామెత ఒకటి ఉంది. ఉరి తాడుకు కూడా దోషి మెడకు బిగుసుకోవడం ఇష్టం ఉండదట!
ఉరి తీసే తలారికి మాత్రం ఇష్టం ఉంటుందా? ఉండదు.
శిక్ష విధించిన జడ్జికి ఇష్టం ఉంటుందా? ఉండదు.
మనుషులం కదా.. చట్టానికి అతీతంగా ఆలోచిస్తాం.
నేరం చేసినవాడు, నేరం చేసేటప్పుడు ఆలోచించకపోవచ్చు.
ఉరిశిక్ష వేసేవాళ్లు, ఉరి వేసి ప్రాణం తీసేవారు మాత్రం.. ఒక్క క్షణమైనా ఆలోచిస్తారు.


రెండేళ్ల క్రితం. ఇదే నెల.  పవన్‌ కుమార్‌ ఒక ఫోన్‌ కాల్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ కాల్‌ ఏ రోజైనా, ఏ క్షణమైనా అతడికి రావచ్చు. అందుకు సిద్ధంగా కూడా ఉన్నాడు. నేరస్థుడి బరువుకు సమానమైన ఇసుక బస్తాను ఒక బలమైన తాడుకు వేలాడగట్టి ఆ తాడు పటుత్వాన్ని పరీక్షించి చూస్తున్నాడు. తాడును తన గొంతుకు తగిలించుకుని ముడి ఏ మాత్రం మృదువుగా జారుతున్నదీ శ్రద్ధగా గమనిస్తున్నాడు. అదృష్టం కలిసొస్తే.. అతడికి తొలిసారిగా ఉరితీసే భాగ్యం లభిస్తుంది. అందుకోసమే ఈ ‘ట్రయల్స్‌’. అతడి తాతగారు ఇందిరాగాంధీ హంతకులను ఉరితీశారు. అతడి తండ్రి 12 మందిని ఉరితీశాడు. ఆ వంశంలో ఇక మిగిలి ఉన్న ఉరితీతగాడు పవన్‌ కుమార్‌ ఒక్కడే! అతడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే వాళ్లను ఈ దారిలోకి రానివ్వడం పవన్‌ కుమార్‌కు ఇష్టం లేదు.

పవన్‌ ఆ ఫోన్‌ కాల్‌ కోసం ఎదురు చూడ్డానికి కారణం, అప్పటికి నెలక్రితం అతడికి ఓ ఫోన్‌ కాల్‌ రావడం. మీరట్‌కి 250 మైళ్ల దూరంలో ఉన్న జైపూర్‌ సిటీ జైలు నుంచి వచ్చింది ఆ కాల్‌. ‘శిక్ష పడిన ఒక నేరస్థుడిని ఉరితియ్యాలి. సిద్ధంగా ఉండు’ అన్నది సారాంశం. పవన్‌ కుమార్‌ ఉద్వేగానికి లోనయ్యాడు. తొలిసారి తను ఉరితియ్యబోతున్నాడు! అయితే అతడికి ఆ అవకాశం రాలేదు. ఆఖరి నిముషంలోని క్షమాభిక్ష ఉత్తర్వులు ఆ నేరస్థుడిని ఉరిశిక్ష నుండి తప్పించాయి.పవన్‌కు మళ్లీ రెండోసారి ఉరితీసే అవకాశం వచ్చింది! నర హంతకుడు సురీందర్‌ కోలిని ఉరితియ్యడానికి ఏర్పాట్లు చేసుకొమ్మని అధికారులు వర్తమానం పంపారు. అయితే సురీందర్‌ ఉరి కూడా చివరి క్షణాలలో వాయిదా పడింది. అందుకు పవన్‌ నిరుత్సాహపడలేదు. కానీ బాధపడ్డాడు. కనీసం ‘నిర్భయ’ లాంటి కేసుల్లోనైనా నేరస్థులకు తనే స్వయంగా ఉరిశిక్ష విధించాలని అతడి కోరిక.

52 ఏళ్ల (అప్పటికి) పవన్‌ కుమార్‌ ప్రభుత్వ రికార్డులలో అధికారికంగా నమోదై ఉన్న తలారి. ఉరితీతలకు నిమిత్తం లేకుండా నెలకు అతడికి 3000 రూపాయల జీతం చేతికొస్తుంటుంది. అయితే అది.. మీరట్‌ నగరంలో ఏడుగురు సభ్యులున్న కుటుంబాన్ని నడపగలిగేంత మొత్తం కాదు. సైకిల్‌ స్టాండు వెనుక బట్టల తాన్లను ఎత్తుగా కట్టుకుని ఇల్లిల్లూ తిరిగి అమ్ముతుంటాడు పవన్‌.  ఉరి కళ పవన్‌కి పారంపర్యంగా అబ్బింది కానీ, ఉరి తీసే అవకాశమే ప్రభుత్వం నుండి రాలేదు. 2013లో తీహార్‌ జైల్లో అఫ్జల్‌ గురును ఉరితీసింది పవన్‌కుమార్‌ అని అంటారు. అయితే  2014 సెప్టెంబరులో ‘ది గార్డియన్‌’ పత్రిక విలేఖరి జేసన్‌ బర్క్‌ చేసిన ఇంటర్వ్యూని బట్టి పవన్‌ కుమార్‌ అప్పటికింకా తన జీవితంలో ఉరి తీసే తొలి అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలింది 2015 నాటి యాకుబ్‌ మెమన్‌ ఉరి. అది కూడా పవన్‌ తీసిన ఉరి కాదు. హై ప్రొఫైల్‌ ఉరిశిక్షలు కాకుండా, పవన్‌ ఇంకెవరినైనా ఉరి తీశాడేమో మరి. మారిన నిబంధలన ప్రకారం తలారి వివరాలను ప్రభుత్వం వెల్లడించడం లేదు కాబట్టి ఎవరు ఎవరిని ఉరితీశారన్నది కచ్చితంగా తెలిసే అవకాశం లేదు.

కసబ్‌కి ఉరి శిక్ష పడగానే, అతడిని మేం ఉరి తీస్తామంటే, మేం ఉరితీస్తామని ప్రభుత్వానికి కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వెళ్లాయి! రాజీవ్‌ టాండన్‌ అనే ఒక ప్రాపర్టీ డీలర్‌ అయితే ఏకంగా రాష్ట్రపతికే లెటర్‌ పెట్టాడు.. ‘ప్లీజ్‌.. వాణ్ణి ఉరి తీసే అవకాశం నాకు కల్పించండి’ అని. ఒక ఉగ్రవాదిని చేజేతులా ఉరి తీయడాన్ని మించిన దేశ సేవ ఏముంటుందన్న భావనే టాండన్‌ లెటర్‌లోనూ, మిగతా దరఖాస్తులలోనూ ప్రధానంగా కనిపించింది. అయితే వాళ్లెవరూ అధికారికంగా తలారులు కారు. ఆ అర్హత ఒక్క మమ్ము సింగ్‌కే ఉంది. ప్రభుత్వ రికార్డులలో ఉన్న చిట్టచివరి భారతీయ తలారి మమ్ము సింగ్‌. పైన మనం చెప్పుకున్న పవన్‌ కుమార్‌ తండ్రి అతడు. ముమ్ము సింగ్‌ ఉరితాడుకు గ్రీజు పెట్టాడంటే ప్రాణం పోతున్నది కూడా తెలీదు. అంత ఎక్స్‌పర్ట్‌. అయితే అతడు కస ను ఉరి తీయడానికి ఏడాది ముందే అనారోగ్యంతో తన 66 ఏళ్ల వయసులో 2011లో చనిపోయాడు. వెంటనే ఆ పోస్టు వారసత్వంగా పవన్‌కుమార్‌కు వచ్చింది కానీ, కసబ్‌ను ఉరితీసే అవకాశం మాత్రం రాలేదు.

మరైతే కసబ్‌ను ఉరితీసిన తలారి ఎవరు? బాబు జల్లాద్‌ అని ఓ పేరు బయటికి వచ్చింది. అది కూడా ఎప్పుడు వచ్చిందంటే.. 2015లో అదే వ్యక్తి యాకుబ్‌ మెమన్‌ను ఉరి తీసేందుకు నాగపూర్‌ వచ్చినప్పుడు! జల్లాద్‌ అంటే హిందీలో తలారి అని. అంటే తలారి బాబు. తలారి బాబు అన్నది పేరెలా అవుతుంది? జస్ట్‌ కోడ్‌ నేమ్‌. అసలు పేరు యోగేశ్‌ దేశాయ్‌ అని, అతడు నాగపూర్‌ జైలు సూపరింటెండెంట్‌ అనీ ఆ తర్వాత ప్రచారంలోకి వచ్చింది. కసబ్‌ని, మెమన్‌నీ ఉరి తీసినందుకు అతడికి ఐదూ, ఐదూ.. పదివేల రూపాయలను ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ తలారిబాబుకు ఎర్రవాడ జైల్లో తను ఉరి తీయబోతున్నది కసబ్‌నేని తెలీదు! అంత రహస్యంగా ఉంచారు. అధికారికంగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న తలారి ఇప్పటి వరకు ఒక్క పవన్‌ కుమారే అయినా, ఆపద్ధర్మంగా వెళ్లి దోషికి ముసుగు కప్పి, మెడకు తాడు బిగించి, లీవర్‌ లాగి అతడి ప్రాణాలను పంచభూతాల్లో కలిపేసిన అన్‌ అఫిషియల్‌ తలారి ఎక్స్‌పర్ట్‌లూ మనం దేశంలో కొంతమంది ఉన్నారు. వారిలో ముఖ్యుడు నాతా మల్లిక్‌. కోల్‌కతాలోని అలీపూర్‌ సెంట్రల్‌ జైలు చేతికింది తలారి అతడు.

తన జీవితకాలం మొత్తం మీద అతడు వంద మందికి పైగా ఉరితీశాడు! 2009తో తన 89 ఏళ్ల వయసులో చనిపోయాడు. అతడి ఇరవై ఐదేళ్ల ‘ఉరి కెరీర్‌’లోని ముఖ్యమైన ఒక సందర్భం ధనంజయ్‌ ఛటర్జీని ఉరి తియ్యడం. విచారణ ఖైదీగా పద్నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాక కూడా అతడికి ఉరిశిక్ష విధించడం సరికాదని దేశంలోని ప్రగతిశీల ఉదారవాదులు ఎన్ని నినాదాలు చేసి, ఎన్ని కేసులు వేసినా కోర్టు తన తీర్పుకే కట్టుబడి ఉంది. ధనంజయ్‌ని ఉరితియ్యడానికి ముందు నాతా మల్లిక్‌తో ఒక రోజు మొత్తం కూర్చొని జోసీ జోసెఫ్‌ అనే ఫిల్మ్‌ మేకర్‌ ‘ఎ డే ఫ్రమ్‌ ఎ హ్యాంగ్‌మన్స్‌ లైఫ్‌’ అనే 83 నిమిషాల డాక్యుమెంటరీ తీశాడు. మల్లిక్‌ కూడా ధనంజయకు ఉరిశిక్ష విధించడం ఇష్టం లేదన్న భావం అందులో లీలగా వ్యక్తం అవుతుంది.

లక్నోలోని నఖాస్‌ ప్రాంతంలో ఉంటాడు అబ్దుల్లా. అతడికో దుకాణం ఉంది. అందులో క్యాండీలు, పెన్సిళ్లు అమ్ముతుంటాడు. నఖాస్‌లోని ముస్లిం క్వార్టర్స్‌లో ఉంటున్న అబ్దుల్లా గురించి ఆ చుట్టపక్కల వారికి అంతవరకు మాత్రమే తెలుసు. అతడొక హ్యాంగ్‌మన్‌ అన్న సంగతి అతి రహస్యం. తనొక చెడిపోయిన మనిషినని బాగా దగ్గరి వారికి చెప్పుకుంటుంటాడు అబ్దుల్లా. వృత్తిధర్మంగా నైనా సరే మనుషుల్ని చంపడం పాపం అని అతడు అనుకుంటాడు. అబ్దుల్లా తండ్రి తలారి. చిన్నప్పుడు తండ్రితో పాటు తెల్లవారు జామునే లేచి ఉరికంబాలకు వెళుతుండేవాడు అబ్దుల్లా. ముఖానికి ముసుగు కప్పడం, గొంతుకు ఉరి బిగించడం తండ్రి చేసే పనులైతే, కాళ్ల బొటన వేళ్లను కలిపి తాడుతో కట్టేయడం అబ్దుల్లా పని. తండ్రి చనిపోయాక 1965లో 16 ఏళ్ల వయసులో అబ్దుల్లా తొలిసారి ఒంటరిగా ఉరి బిగించి, లివర్‌ లాగాడు. ఎప్పుడు ఉరికి తీయడానికి వెళ్లినా, ముందురోజు రాత్రి జైల్లోనే ఉండిపోయి నడిరేయికి, తెల్లవారుజాముకు మధ్య ఏ సమయంలోనో వచ్చే ఆదేశాలపై దిగ్గున లేచి, తంతును ముగించేవాడు అబ్దుల్లా. నిజానికి అది అతడికి ఇష్టం లేని పని. ఎప్పటికప్పుడు అయిష్టంగానే తన జీవితకాలంలో 38 కి పైగా ఉరిశిక్షలను అమలు చేశాడు అబ్దుల్లా. ఇప్పుడీ అరవై ఏడేళ్ల వయసులో ఆయన ఇంట్లోంచి బయటికే రాకుండా గడుపుతున్నారు. ఏ పాప చింతనో ఆయనను ఈ 67 ఏళ్ల వయసులో ప్రక్షాళన చేస్తూ ఉండి ఉండాలి.

ఉరి తీయబోయే ముందు హ్యాంగ్‌మన్‌ మానసిక స్థితి ఎలా ఉంటుంది? స్వాతీ సాథే దృష్టిలో ఇదొక అర్థరహితమైన ప్రశ్న. సాథే గతంలో ఆర్థర్‌ రోడ్‌ ప్రిజన్‌లో జైలరుగా పని చేశాడు. కట్టుదిట్టమైన భద్రత మధ్య కసబ్‌ను ఉంచిన జైలు అది. సినిమాల్లో చూపించే విధంగా ఉరితీసే వ్యక్తి విషణ్ణవదనంతో ఏమీ ఉండడు. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఏ చిన్న కానిస్టేబుల్‌ అయినా చాలా మామూలుగా ఉరి తీసేయగలడు. ముసుగేసి, తాడు బిగించి, బటన్‌ నొక్కేయడం. అంతే. ఫినిష్‌’’ అని సాథే చెబుతుప్పుడు.. ఇంత ఈజీనా ఒక ప్రాణాన్ని తీసేయడం అనిపిస్తుంది. ‘కసబ్‌ను ఉరి తీసే ఛాన్సే వస్తే నేను దాన్ని వదులుకోను’ అని కూడా సాథే అన్నాడు కానీ, అతడికి ఆ అవకాశం రాలేదు.

మహారాష్ట్రలో చివరి రెండు ఉరి శిక్షలు మెమెన్‌ (2015), కసబ్‌ (2012) లవి. దాదాపు 17 ఏళ్ల విరామం తర్వాత ఆ రాష్ట్రంలో అమలైన శిక్షలు ఇవి. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అరుణ్‌ కుమార్‌ వైద్య హంతకులు సుఖ్‌దేవ్‌ సింగ్, హరీందర్‌ సింగ్‌ జిందాలను 1992లో ఉరి తీశారు. తర్వాత 1995లో అలీబాగ్‌ నివాసి సుధాకర్‌ జోషిని (తన యజమానిని, అతడి ఇద్దరు పిల్లల్ని చంపినందుకు) ఉరి తీశారు. రెండుశిక్షల్లో ఉరి తీసిన మరాఠీ హ్యాంగ్‌మన్‌ అర్జున్‌ భికా జాదవ్‌ 1996లో రిటైర్‌ అయ్యారు. ఆయన తన 33 ఏళ్ల కెరియర్‌లో 101 మందికి ఉరికర్మలు నిర్వహించారు. కసబ్‌ని కూడా తనే ఉరితీస్తానని అన్నాడు కానీ, అవకాశం రాలేదు. ఉచితంగా ఉరి తీస్తానని కూడా జాదవ్‌ భారత ప్రభుత్వానికి ఆఫర్‌ ఇచ్చాడు!

లేటెస్టుగా ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఉరి శిక్ష పడిన తాహిర్‌ మర్చంట్, ఫిరోజ్‌ ఖాన్‌లను ఎప్పుడు ఉరితీస్తారో తెలియదు. వాళ్లను ఏ తలారుల వారసులు ఉరితీస్తారో తెలియదు. కానీ ఉరికి తలవంచడం, ఉరి వేసి తల తుంచడం.. స్విచ్‌ వేస్తే ఆటోమేటిగ్‌గా జరిగిపోయేవి కావు. ఉరికంబం.. దోషికి, తలారికీ.. ఇద్దరికీ సమానంగా నిద్రలేకుండా చేస్తుంది. ఇద్దరి కళ్లకింద అంతర్మథన వలయాలకు కారణం అవుతుంది. ఇద్దరూ నలిగిపోతారు. ఇద్దరూ ఒక నిశ్శబ్ద బలవన్మరణం కోసం వేకువజామునే నిద్ర లేస్తారు. సూర్యోదయం అవుతుండగా ఒక పిట్ట తన ప్రాణాల్ని టపటప కొట్టుకుంటుంది. ఒక పిట్ట ‘దేవుడా ఈ తప్పు నాదు కాదు..’ అని చెంపదెబ్బలు వేసుకుంటుంది.
 
తీసిందెవరో తెలియదు!
కసబ్‌ని ఉరితీసిన వ్యక్తే, యాకుబ్‌ మెమన్‌నీ ఉరి తీశాడని అంటారు. అయితే ఆ వ్యక్తి పేరు మాత్రం బయటికి వెల్లడి కాలేదు. నాగపూర్‌ సెంట్రల్‌ జైల్‌ సూపరింటెండెంట్‌ యోగేశ్‌ దేశాయ్‌ చేత వాళ్లిద్దరినీ ఉరి తీయించారని కూడా అంటారు. ఇక అఫ్జల్‌ గురుని మాత్రం ప్రొఫెషనల్‌ తలారే ఉరి తీశాడని అంటారు. అతడే పవన్‌ కుమార్‌. అయితే అతడే అఫ్జల్‌ గురుని ఉరితీశాడని నిర్థారణగా వెల్లడి కాలేదు. యాకుబ్‌ మెమన్‌ని ఉరి తీసే అవకాశం రానందుకు మాత్రం పవన్‌ ఎంతో అసంతృప్తి చెందాడు. యాకుబ్‌ ఉరికి ముందు పవన్‌ ఉత్తరప్రదేశ్‌ డి.జి.పి.కి ఒక ఉత్తరం కూడా రాశాడు. ‘‘మా నాన్నగారు మమ్ము సింగ్‌ 12 మందిని ఉరితీశారు. మా తాతగారు కల్లు జల్లాద్‌ ఇందిరాగాంధీ హంతకులను ఉరితీశారు. కాబట్టి వాళ్లందరి వారసుడిగా యాకుబ్‌ని ఉరితీసే అవకాశం నాకు ఇవ్వండి’’ అని అభ్యర్థించాడు. అయితే అప్పటికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా డి.జి.పి. అతడి అభ్యర్థనను మన్నించలేకపోయారు.

చివరి ఉరి: ఇండియాలో చివరిసారిగా.. యాకూబ్‌ మెమన్‌ను 1993 ముంబై పేలుళ్ల కేసులో 2015 జూలై 30న నాగపూర్‌ సెంట్రల్‌ జైల్లో ఉదయం 6 గం. 30 ని. ఉరి తీశారు. అఫ్జల్‌ గురును 2001 పార్లమెంటుపై దాడి కేసులో 2013 ఫిబ్రవరి 9న ఢిల్లీ తీహార్‌ జైల్లో ఉదయం 8 గం.లకు ఉరితీశారు. అజ్మల్‌ కసబ్‌ను 2008 ముంబై దాడుల కేసులో 2012 నవంబర్‌ 21న పుణె ఎరవాడ జైల్లో ఉదయం 7.30 నిముషాలకు ఉరి తీశారు. ధనంజయ్‌ ఛటర్జీని 1990 మార్చి 5న పద్నాలుగేళ్ల స్కూలు బాలికను రేప్‌ చేసి, చంపేసిన కేసులో 2004 ఆగస్టు 14న కోల్‌కతాలోని ఆలీపూర్‌ సెంట్రల్‌ కరెక్షనల్‌ హోమ్‌లో తెల్లవారు జామున ఉరి తీశారు. (1995 తర్వాత చివరిసారి మనదేశంలో అమలైన ఉరిశిక్ష ధనంజయ్‌ చటర్జీదే.)

మరిన్ని వార్తలు