హారతి పళ్లెం... ఆత్మకు ప్రతీక

16 Jul, 2017 00:22 IST|Sakshi
హారతి పళ్లెం... ఆత్మకు ప్రతీక

పరమాత్మను దర్శించాలంటే మూర్తి ప్రతిమ కావాలి. ఘంటానాదంలో నిర్గుణ బ్రహ్మ ఉపాసన చేయవచ్చు. సగుణమైనా, నిర్గుణమైనా... రెండూ అర్చనలో అనుసరణీయాలే! గంట మధ్యలో వేలాడుతూ నాదానికి కారణమయ్యే కడ్డీ ‘కంకిణి’. ఘంటానాదం ఓంకార నాదం.

పంచతీర్థ పాత్రలు పంచేంద్రియాలకు ప్రతీక. హారతి పళ్లెం ఆత్మకు ప్రతీక. ఆచమనం శుచి కొరకు. సంకల్పం కాలపురుషుని ఆరాధన. కలశం సంపూర్ణ పరమాత్మ రూపం. దీపం స్వప్రకాశ జ్ఞానం. ధూపం వాయు రూపంలోని సర్వాంతర్యామికి ప్రతీక. గంధం భూ తత్త్వానికి ప్రతీక. జలం బ్రహ్మతత్త్వం. ఇక పుష్పం హృదయానికి ప్రతీక.

నైవేద్యం అంటే నివేదన దృష్టితో స్వీకరించడం. ఏది మనం తింటున్నామో, తినాలనుకొన్నామో దానినే ముందుగా పరమాత్మకు అర్పిస్తాం. ఏం తినాలన్నా ముందుగా ఎదుటివారికి ఇచ్చి తర్వాత మనం స్వీకరించాలి.

నీరాజనం జ్ఞానకాంతికి ప్రతీక. మంత్రపుష్పం అంటే పరమాత్మ దివ్య స్వరూపాన్ని మననం చేయడమే. కొబ్బరికాయ బొప్పె, పీచుటెంక – ఈ మూడు స్థూల సూక్ష్మ కారణ దేహాలకు ప్రతీక. అందులోని నీరు చంచలమైన మన మనసుకు ప్రతీక. మానవుడి జ్ఞాననేత్రంతో కలిపి మూడు కన్నులు – కొబ్బరి కాయకు ఉన్న మూడు కన్నులకు ప్రతీక. కనుక కొబ్బరికాయ మన దేహానికి, ఆత్మకు ప్రతీక.

తీర్థం అంటే తరింపజేసేది అని అర్థం. అకాల మృత్యువును హరించి, వ్యాధులను వారించి, పాపాలను నశింపజేయడం ద్వారా తీర్థం పవిత్రతను, శుభాన్ని మనకు కలిగిస్తుందని తీర్థం తీసుకుంటాం మనం.

చివరగా, అన్నిటికన్నా ముఖ్యం పూజ చేసే సమయంలో మనసు ఇతర విషయాల వైపు పోకుండా చూసుకోవడం. అర్ధమనస్కంగానో, అన్యమనస్కంగానో పూజచేస్తే అది నిష్ఫలం అవుతుంది. పరమాత్మ మీద మనసు లగ్నం చేస్తేనే పూజ పూర్ణఫలాన్ని ఇస్తుంది.

మరిన్ని వార్తలు