మనమడిగింది కాదు...దేవుడిచ్చేదే ఆశీర్వాదం!

10 Jun, 2017 23:03 IST|Sakshi
మనమడిగింది కాదు...దేవుడిచ్చేదే ఆశీర్వాదం!

యేసుక్రీస్తు శిష్యుల్లోని యాకోబు, యోహానుల తల్లి ఒకసారి ప్రభువును కలుసుకొని నా కుమారులిద్దరినీ నీ రాజ్యంలో నీ కుడి ఎడమ పక్కన కూర్చోబెట్టుకోమని అర్థించింది. తాను పొందిన శ్రమలన్నీ వాళ్లు కూడా పొందాలనడానికి సాదృశ్యంగా, నేను తాగిన గిన్నెలోది వారు తాగగలరా? అని ప్రభువు ప్రశ్నించి, ఆమె అభ్యర్థన తన తండ్రి వశంలోనిది తప్ప తన వశంలోనిది కాదని జవాబిచ్చాడు. ప్రతి విశ్వాసి పట్లా దేవునికి అత్యంత నిర్దిష్టమైన సంకల్పాలున్నాయి. దేవుని సంకల్పాల నెరవేర్పునకు దోహదం చేసే పరిణామాలే విశ్వాసి జీవితంలో సంభవిస్తుంటాయి. తన రాజ్యంలో యాకోబు, యోహానుల స్థానమేమిటో దేవుడు నిశ్చయించాడు. అందువల్ల ఆ విషయంలో దేవుని సంకల్పమే నెరవేరుతుంది తప్ప, వారి తల్లి ప్రార్థన ఫలించదు.

యేసుకు కుడి ఎడమల స్థానాల్లో కూర్చోవడం గొప్ప విషయమనుకుంటుంది వారి తల్లి. కాని అంతకన్నా ఫలభరితమైన, ఆశీర్వాదకరమైన స్థానాలను దేవుడు వారికివ్వదలచుకున్నాడు (మత్త 21–24). ఎంతో లోతైన, మర్మయుక్తమైన భావాలున్న సంఘటన ఇది. అదే మత్తయి సువార్తలో ‘అడగండి మీకిస్తాను’ అన్నాడు యేసు (మత్తయి 7:7). ఇప్పుడేమో నీవడిగింది నేనివ్వలేనంటున్నాడు ఆ శిష్యుల తల్లితో యేసు. దేవుడు ఏదడిగినా ఇస్తాడు. ఆయన్నడగటం మన హక్కు, మనం పిల్లలం గనక మనమేదడిగితే అదివ్వవలసిన బాధ్యత దేవునిది అన్న ధోరణిలో సాగుతున్న కొందరి ప్రసంగాలు ఈనాడు చాలా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. సువార్త సంపదలు సాధించి పెట్టే సాధనమన్నది వారి సిద్ధాంతం (ప్రాస్పరిటీ గాస్పెల్‌). బైబిలులోని కొన్ని వాక్యాలను వాటి నేపథ్యం నుండి విడదీసి వాటికి చెప్పే వక్రభాష్యం వల్ల వచ్చే చిక్కు ఇది.

విశ్వాసి ప్రార్థనలు దేవుని సంకల్పాల నెరవేర్పునకు దోహదం చేసేవిగా ఉంటే ఆయన అవి తప్పక ఆలకిస్తాడు. ఎందుకంటే, విశ్వాసికి అత్యంత శ్రేష్టమైన, పర సంబంధమైన వరాలనివ్వాలని ఆశిస్తాడు (యాకోబు 1:17). తాను అత్యుత్తమమైనవి ఇవ్వాలనుకుంటున్నప్పుడు, విశ్వాసి అంతకన్నా తక్కువది ఆశించి ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన తప్పక విఫలమవుతుంది. మనం దుర్బుద్ధితో అడిగినా, అజ్ఞానం వల్ల శ్రేష్టమైనవి కానివి అడిగినా దేవుడివ్వడానికి ఇష్టపడడు. మన జీవితాల్లో చాలా ప్రార్థనలు ఫలించకపోవడానికి కారణం అదే. జాగ్రత్తగా ఆలోచిస్తే, ఫలించని ఆ ప్రార్థనల వల్ల కురిసిన ఆశీర్వాదాలూ అర్థమవుతాయి. మనమడిగింది ఇవ్వాలా వద్దా అన్న దేవుని ‘విచక్షణ’ వెనుక మన క్షేమం, దేవుని ఆశీర్వాదం ఉంటాయి. – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్‌

మరిన్ని వార్తలు