పరమయోగుల పవిత్ర భూమి...శతవసంతాల యోగ పీఠి

18 Jan, 2017 00:11 IST|Sakshi
పరమయోగుల పవిత్ర భూమి...శతవసంతాల యోగ పీఠి

పుణ్యతీర్థం :: కుర్తాళం పీఠం
పరమ యోగులెందరో నడయాడిన పవిత్ర ప్రాంతం.. దక్షిణ భారతావని. తెలుగు, తమిళ సీమల్లో ఒక్కో ప్రాంతం, ఒక్కో క్షేత్రం, ఒక్కో తీర్థానికి ఒక్కొక్క ప్రత్యేకత. తమిళనాట తిరునల్వేలి జిల్లాలో దక్షిణ కాశి (తెన్‌ కాశి)కి 3 మైళ్ళ దూరంలో చిత్రానదీ తీరంలోని కుర్తాళం అలాంటి ప్రత్యేకతలెన్నో ఉన్న పవిత్రభూమి. స్థలం (త్రికూటాచలం), తీర్థం (చిత్రా నది), దైవం (త్రికూటాచలపతి) – ఈ మూడు విశేషాలూ ఒకే చోట ఉండడం వల్ల ఈ ప్రాంతం ‘త్రికూటాచల క్షేత్రం’గా ప్రసిద్ధి. ‘త్రికూటా చలం’ అన్నమాట వ్యవహారంలో ‘తిరు కుర్తాళం’, ఇప్పుడు ‘కుర్తాళం’ అయి ఉంటుందని అంచనా. (సంస్కృత గ్రంథాల్లో కుద్దాలం అన్నారు).  కుర్తాళం అనగానే ఆహ్లాదం పంచే జలపాతాలు, ప్రకృతి సోయగం నిండిన పర్యాటక ప్రాంతం గుర్తుకొస్తాయి. అక్కడే సరిగ్గా నూరేళ్ళ క్రితం భక్తి, ముక్తి, యోగ సాధనలకు కేంద్రంగా మహిమాన్వితమైన ఒక పీఠం ఏర్పడింది. ఆ పీఠం మన తెలుగు స్వామి ఒకరు ఏర్పాటుచేసిందవడం విశేషం. అదే – శ్రీసిద్ధేశ్వరీ పీఠం... మౌనస్వామి ఆశ్రమం... కుర్తాళం పీఠం.. ఇలా భక్తులు రకరకాల పేర్లతో పిలుచుకొనే పవిత్రమైన ప్రాంగణం.

కుర్తాళం ప్రాచీనకాలం నుంచి ‘అగస్త్య క్షేత్రం’గా ప్రసిద్ధం. అపరిమితంగా ఎత్తు పెంచేస్తున్న వింధ్య పర్వతాన్ని నియంత్రించేందుకు వింధ్యకు అటువైపు ఉన్న ఉత్తరాది నుంచి ఇటు వైపు ఉన్న దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి, తన భార్య లోపాముద్రతో సహా ఈ కుర్తాళం ప్రాంతంలోనే శాశ్వతంగా వసించి, జపతపాలు ఆచరించారట. దక్షిణాదికి వచ్చినప్పుడు విశ్వామిత్రుడు కూడా ఇక్కడ తపస్సు చేశా డంటారు. త్రికూటాచలం అంటే – మూడు కూటముల (శిఖరాల)తో కూడిన అచలం (కొండ). ఇక్కడి కొండ కూడా పడమటి కనుమల్లో మామూలుగా కనిపించే కొండల వరుసలా కాక, 3 శిఖరాలతో దాదాపు ఒక వలయాకారంగా అనిపిస్తుంది. ఆ రకంగా దీన్ని ‘త్రికూటా చలం’ అన్నారు. ఈ క్షేత్రంలోని పురాతన ఆలయంలో దేవుడి పేరు – త్రికూటాచలపతి. ఆయన్నే ‘కుర్తాళనాథుడు’ అనీ పిలుస్తారు. దక్షిణ పాండ్య దేశంలోని 14 ప్రధాన శివ క్షేత్రాల్లో ఈ ‘కుర్తాళం’ ప్రసిద్ధమైనది.

గృహస్థాశ్రమం నుంచి యోగిగా....
అలాంటి చోట ఏర్పాటైన పీఠం – కుర్తాళం పీఠం. గడచిన ఆశ్వయుజ మాసంలో శత వసంతాలు పూర్తి చేసుకున్న ఈ తెలుగు వారి పీఠానిది ఘన చరిత్ర. వందేళ్ళ క్రితం 1916లో శ్రీశివచిదానంద సరస్వతీస్వామి నెలకొల్పిన పీఠమిది. కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా దేశమంతా పర్యటించి, ఎంతోమంది సాధువులు, సన్న్యాసుల నుంచి విజ్ఞానం అందుకొని, అనంతరం మౌనాన్ని ఆశ్రయించిన ఆయన ‘మౌనస్వామి’గా ప్రసిద్ధికెక్కారు. ఆయన అచ్చ తెలుగువారు. దేవీ ఉపాసకులైన ఆయన, మహనీయుడైన ఒక సాధువును కలవడంతో పారమార్థికం వైపు మళ్ళారు. 1906 ప్రాంతంలో ఒక అర్ధరాత్రి వేళ భార్యాబిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిన ఆయన మళ్ళీ ఇంటి ముఖం చూడలేదు. ఉత్తరాదిన పుణ్యక్షేత్రాలు తిరుగుతూ, సన్న్యాస దీక్షతో శివచిదానంద సరస్వతి అయ్యారు. ఆ తరువాత అపర దత్తాత్రేయ అవతారమైన వాసుదేవానంద సరస్వతీ స్వామిని దర్శించి, యోగవిద్య అభ్యసించారు. ఎన్నో సిద్ధులు పొందారు.  

ఇంద్రుడు పంపిన పీఠం... స్వామి పెట్టిన మఠం దేశంలో అనేక మఠాలున్నా కుర్తాళం మఠం ప్రత్యేకత వేరు. భూలోకంలో పూజ కోసం పూర్వం దేవేంద్రుడు నాలుగు పీఠాలను పంపాడట. వాటిలో ఒకటి – శృంగేరిలోని శారదా పీఠం. రెండోది – ఈ కుద్దాల (కుర్తాళ) క్షేత్రంలోని ధరణీ పీఠం. మూడోది – కంచిలోని కామకోటి పీఠం. నాలుగోది ఉత్తర భారతావనిలో నెలకొల్పినట్లు చెబుతారు. ఈ ప్రాశస్త్యాన్ని గుర్తించిన శృంగేరీ పీఠాధిపతి కుర్తాళంలో యతులకు కావాల్సిన మఠం నిర్మించాల్సిందిగా మౌనస్వామితో చెప్పారు. ఫలితమే కుర్తాళం మఠం.

ఆ విఘ్ణపతికి నాడి కొట్టుకొంటుంది! ఈ పీఠంలో రావి చెట్టు కింద సిద్ధి వినాయక విగ్రహాన్ని  మౌనస్వామి ప్రతిష్ఠించారు. హారతిచ్చే సమయంలో విగ్రహం కదులుతున్న అనుభూతి కల్గింది. విగ్రహానికి నాడి కొట్టుకుంటున్న ట్లనిపించింది. ఏదైనా కోరుకొని, గణపతిని ప్రార్థించి, గుడి గడప వద్ద కొబ్బరికాయ కొడితే, ఆ కోరిక తీరుతుంది.

ప్రత్యర్థులపై జయానికి... ప్రత్యంగిరా దేవి  క్షుద్రశక్తుల నుంచి, ప్రత్యర్థులు, శత్రువుల నుంచి కాపాడే దైవం – ప్రత్యంగిరాదేవి. ఎండు మిరపకాయలతో ప్రత్యంగిరా హోమం చేస్తే ప్రతికూల శక్తులు, దురదృష్టం దూరమవుతాయి. అమావాస్యకి ప్రత్యంగిరా హోమం, మంగళవారం మధ్యాహ్నం రాహుకాల పూజ చేస్తారు.

క్షేత్రపాలకుడు దండాయుధపాణి మౌనస్వామి ప్రతిష్ఠించిన దండాయుధపాణి (కుమారస్వామి) ఆలయమిక్కడ ప్రసిద్ధం. ఈ పీఠానికి క్షేత్ర పాలకుడు దండాయుధపాణే! కాళి, కాలభైరవ ఆలయాలూ ఉన్నాయి.

పర్యాటక ప్రాంతం... కుర్తాళం మంచి వేసవి విడిది – కుర్తాళం. పడమటి కనుమల్లో 160 మీటర్ల ఎత్తున నెలకొన్న పంచాయతీ ఇది. భౌగోళికంగా ఇది తమిళనాట ఉన్నా, కేరళ సరిహద్దులకు అతి దగ్గర! కుర్తాళంలో డజను జలపాతాలున్నాయి. ఈ జలపాతాల నీటికి మహత్తరమైన ఔషధీ విలువలున్నాయని నమ్మకం. మదురై, రామేశ్వరం, తిరుచెందూర్, త్రివేండ్రం, శబరిమల లాంటి భక్తి పర్యాటక క్షేత్రాలన్నీ కుర్తాళం నుంచి దగ్గరే!
ఎలా వెళ్ళాలి? కుర్తాళం సమీప రైల్వే స్టేషన్‌ – తెన్‌కాశి. చెన్నైలోని ఎగ్మూర్‌ నుంచి తెన్‌కాశికి ట్రైన్లున్నాయి. తెన్‌కాశి దగ్గర రైలు దిగితే, కుర్తాళానికి రోడ్డు మార్గంలో 20 నిమిషాల్లో చేరవచ్చు.


ఆ స్వామి ‘మౌనస్వామి’ ఎందుకయ్యారు?
హిమాలయాల్లో తపస్సాధనలతో ఎన్నో ఏళ్ళు గడిపిన ఆయన మౌన దీక్ష స్వీకరించడం చిత్రమైన గాథ. కాశ్మీర్‌లో పెద్ద పండిత సభ జరిగింది. అక్కడ వాదనలో చిత్రమైన ఒక ప్రశ్నకు మహా మహా పండితులు సైతం అందరూ అంగీకరించే జవాబివ్వలేకపోయారు. అక్కడే ఉన్న స్వామీజీ జవాబు చెప్పి, సమస్యను చిటికెలో పరిష్కరించారు. అయితే, ఇలా పాండిత్యాన్నీ, శక్తినీ ప్రదర్శిస్తే అహం పెరుగుతుందని స్వామి వారి గురువు గారు సూచించారు. ‘వివాదాల్లో పాల్గొనకుండా, మౌనవ్రతం ఆచరిస్తూ, యోగాన్ని అనుష్ఠించు’ అని శాసించారు. అంతే! వెంటనే స్వామి మౌన దీక్ష చేపట్టారు. అప్పటి నుంచి శేష జీవితమంతా మౌనం లోనే గడిపారు. ఆశ్రయించిన భక్తుల్ని ఆశీర్వదించి, మార్గదర్శనం చేశారు.

ఆశీర్వదించే అమ్మవారు... అయ్యవారు...
మౌనస్వామి దక్షిణాదిలో పర్యటిస్తూ, కుర్తాళంలో స్థిరపడ్డారు. అక్కడే త్రికూటాచలేశ్వరుడి ఆలయంలో ధరణీ పీఠానికి ఎదురుగా కూర్చొని, శిరస్సు నుంచి పాదాల దాకా కాషాయ వస్త్రం కప్పుకొని, రాత్రింబగళ్ళు యోగనిష్ఠలో ఉంటూ తపస్సు చేశారు. దైవప్రేరణ మేరకు 1914లో ఒక తోటలో దత్తాత్రేయ మందిరం నిర్మిం చారు. అటు పైన 1916 అక్టోబర్‌లో శ్రీసిద్ధేశ్వరీ దేవిని ప్రతిష్ఠించారు. అదే ఇప్పటికి వందేళ్ళుగా భక్తుల్ని ఆకర్షిస్తున్న పవిత్ర మౌనస్వామి మఠం. పచ్చటి ప్రకృతి మధ్య నెలకొన్న ఈ మఠంలో ప్రధాన దేవత శ్రీసిద్ధేశ్వరీదేవి (శ్రీరాజ రాజేశ్వరీ దేవి). దేవుడు – కామేశ్వరుడు. ఇక్కడకు వచ్చి, ఆ ఆదిదంపతులను ప్రార్థించి, ధ్యానించిన భక్తులకు ప్రశాంతత చేకూరు తుందనీ,అమ్మ ఆశీర్వదిస్తుందనీ నమ్మిక.

పీఠం ఏర్పాటైంది ఇలా!
అనేక మఠాలలో పీఠాలున్నట్లే, మన మఠంలోనూ పీఠం ఉండా లని భక్తులు కోరారు. పీఠమంటే శ్రీచక్రం. పీఠం మీద సాక్షాత్తూ పరాశక్తే ప్రతిష్ఠితురాలై ఉంటుంది. మౌనస్వామి రాజరాజేశ్వరీ దేవి సన్నిధానంలో శ్రీచక్రం స్థాపించారు. అలా పీఠం ఏర్పడింది. దానికి ‘శ్రీసిద్ధేశ్వరీ పీఠం’గా పేరు పెట్టారు. రాజరాజేశ్వరీ దేవి అలా శ్రీసిద్ధేశ్వరీ పీఠాధిష్ఠాన దేవత అయింది. కుర్తాళం తెలుగు వారి పీఠమైంది.

మహిమాన్విత మౌనస్వామి
షిర్డీ సాయిబాబా, రమణ మహర్షి, శేషాద్రిస్వామి సహా నిఖిలేశ్వరా నంద, విశుద్ధానంద, వాసుదేవానంద తదితర యోగులతో కుర్తాళం పీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అనుబంధం ఉండేది. శూన్యం నుంచి బంగారం, నవరత్నాలతో సహా సమస్తం సృష్టించే అష్ట మహా సిద్ధులు, భౌతికేతర లింగ శరీరంతో చేసే అతీంద్రియ యానం లాంటివి స్వామికి కరతలామలకం. ఒకసారి నవరాత్రులకు సంతర్పణలో పిండివంటలకు నెయ్యి దొరకనప్పుడు, కిరసనాయిల్‌ని కాచి, దాన్ని నెయ్యిగా మార్చారు. ఇక భక్తుల వ్యాధుల్ని తగ్గించి, కరుణించిన ఘట్టాలు కొల్లలు. ఏకకాలంలో మూడు చోట్ల దర్శనమిచ్చిన ఉదంతాలూ ఉన్నాయి. పీఠంలోని దండా యుధపాణి గుడిలో యోగసమాధి నిష్ఠలోనే ఆయన దేహత్యాగం చేశారు. ఇప్పటికీ పీఠంలో మౌనస్వామి సమాధినీ, శివలింగాన్నీ దర్శించుకోవచ్చు.

వందే గురు పరంపరాభ్యామ్‌!
ఆది శంకరాచార్యుల వారి శృంగేరీ మఠ సంప్రదాయాన్ని అనుసరించి మౌనస్వామి స్థాపించిన పీఠం ఇది. ఆయనే దీనికి విమలానంద భారతీస్వామిని మొదటి పీఠాధిపతిగా నియమించారు. ఆ మొదటి పీఠాధిపతి తరువాత కాలక్రమంలో ఇప్పటికి మరో ముగ్గురు పీఠాధిపతులు అయ్యారు. ప్రస్తుతం శ్రీసిద్ధేశ్వరానంద భారతీస్వామి (పూర్వాశ్రమంలో గుంటూరు హిందూ కళాశాల ప్రధాన ఆచార్యులైన, కవి – పండితులు డాక్టర్‌ ప్రసాదరాయ కులపతి) పీఠాధిపతి. ప్రకాశం జిల్లా ఏల్చూరులో జన్మించిన ఆయనది కవి నుంచి ఋషిగా, ఋషి నుంచి యతిగా, యతి నుంచి పీఠాధిపతిగా ఎదిగిన విశిష్ట చరిత్ర. వేల పద్యాల్ని ఆశువుగా చెప్పి, అవధానాలు చేసి, 100 పుస్తకాలు రాసిన ఆయన హిమాలయాల సహా పలుచోట్ల తపస్సు చేశారు.

సాక్షాత్తూ బృందావనేశ్వరి అయిన శ్రీరాధాదేవి కరుణ పొందారు. ఆమె దర్శనమిచ్చి, మంత్రోపదేశం చేయడంతో ఆధ్యాత్మిక సాధనలు చేసి, యోగి అయ్యారు. గుంటూరులో స్వయంసిద్ధ కాళీ పీఠం పెట్టి, మంత్ర సాధనలతో కాళి, కాలభైరవ దేవతల దర్శనం, అనుగ్రహం పొందారు. 14 ఏళ్ళ క్రితం సన్న్యాసం స్వీకరించి, అమ్మవారే చెప్పడంతో కుర్తాళం పీఠాధి పత్యం తీసుకున్నారు. మంత్రదీక్షతో భక్తుల సమస్యలకూ, వ్యాధులకూ పరిష్కారం చూపిస్తున్నారు. గుంటూరు, విజయవాడ, నెల్లూరు, విశాఖ, హైదరాబాద్‌లలో పీఠాలు నిర్వహిస్తూ, లోకకల్యాణం కోసం యాగాలు చేస్తుండడం కుర్తాళం పీఠాధిపతి ప్రత్యేకత. ఈ జనవరి 23న ఆయన 80 వసంతాలు నిండి, 81వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఆ రోజున స్వామి వారి జన్మదిన వేడుకలను భక్తులు ఒంగోలులో ఘనంగా జరపనుండడం విశేషం.
– డాక్టర్‌ రెంటాల జయదేవ

మరిన్ని వార్తలు